ఎనిమిదవ ఖండము
ఋషులు :- 1. శ్యావాశ్వుడు. 2,3 నాహుష యయాతి. 4. సాంవరణ మనువు. 5,8. అంబరీష, ఋజిష్వానులు. 6,7. రేభసూన, కాశ్యపులు. 9. ప్రజాపతి.
1. మిత్రులారా! పురోజిత సోమమును అభిషవించండి. దానిని అత్యంత మాదకము చేయండి. సాగిన నాలుక గల కుక్క నుండి రక్షించండి.
2. పోషక, పూజనీయ, ధన ప్రద సోమము శుద్ది చేయబడి, కలశమున చేరుచున్నది. సకల ప్రాణులను పాలించు సోమము ద్యావాపృథ్వులను తన తేజమున ప్రకాశింపచేయుచున్నది.
3. సోమము మధురము. మాధకము. పవిత్రము నుండి సాగిఇంద్రుని కొరకు క్షరితమగుచున్నది. సోమమా! మాదకమగు నీ రసము ఇంద్రాది దేవతలకు చేరును గాక.
4. సోమము సన్మార్గదర్శి. మిత్రము. ప్రఖ్యాతము. పాపరహితము. ధ్యానము ఏర్పరచునది. స్వర్గము కలిగించునది. దీపించునది. అట్టి సోమము మా వద్దకు చేరుచున్నది.
5. సోమమా! నీవు దీప్తిమంతవు. నిన్ను వందల మంది అభిలషించుచున్నారు. నీవు వేలమందిని పోషించుచున్నావు. అనంత అన్న, యశములు గల నీవు తేజస్వివి. బల ప్రదవు. మాకు పుత్ర ధనమును ప్రసాదించుము.
6. గోవు పుట్టిన దూడను నాకును. అట్లే ద్రోహమెరుగని ఇంద్రుడు తనకు ప్రియమగు సోమమును సేవించును.
7. అందరిచే కోరబడునదియు, శత్రుంజయము అగు సోమము కొరకు శూరులు ధనుష్టంకారము చేయుదురు. ప్రథమ పూజార్హులగు విప్రులు సోమమును పూజింతురు. బలము కలిగించు తెల్లనిపాలను కలుపుదురు.
8. అందరు అభిలషించు హరిత, బభ్రువర్ణ సోమము సకల దేవతలకు ఆనందము కలిగించుటకు సాగును.
9. ప్రసిద్దమగు సోమ వచనములను యజ్ఞ విఘ్నకారకులు వినకుందురుగాక. దక్షిణ లేని యజ్ఞమును భ్రుగువులు తొలగించినట్లు కుక్కను తొలగింతురుగాక.
తొమ్మిదవ ఖండము
ఋషులు : 1-3, 5,6. కవి. 4. ఋషిగణుడు. 7. రేణు. 8. భార్గవ వేనుడు. 9. వసువు. 10. వత్సప్రి. 11. అత్రి. 12. పవిత్రుడు.
1. సోమము సేవన యోగ్యము. హితకరి. అది సకల జలములందు లభించును. జలములందు పెరుగును. అట్లు వర్ధిల్లిన మహా సోమము విశ్వమును దర్శించుటకు సూర్యుని మహారథమును అధిష్టించును.
2. ప్రేరణ అక్కరలేని, హరితవర్ణ, సుప్రసిద్ధ సోమము అనేక దేవతాయుక్త యజ్ఞమున లభించునుగాక. అదాతలగు మా శత్రువుల అన్నమును హరించి ఆరగించును గాత. మా స్తుతులను దేవతలకు చేర్చును గాక.
3. ఇంద్రునకు బలము వజ్రము. ఆ వజ్రమునకు బీజ రూపము సోమము. అది రసమయమై ద్రోణ కలశమున ధ్వనించును. యజ్ఞ ఫలమును వర్షము వలె కలిగించు సోమము పాడియావు వంటిది అగును.
4. సోమము ఇంద్రుని విశిష్ట ఉదరమున విశేషముగా ప్రవేశించును. ప్రవేశించిన సోమము ఇంద్రునకు మిత్రము అగును. మిత్రుడగు ఇంద్రుని ఉదరమును బాధించదు.
యువకులు యువతులను కలిసినట్లు సోమము జలమును కలియును. అవి సహస్రధారలుగా దశాపవితరము నుండి కలశమున చేరును.
5. సోమము ధర్త, శోధనయోగ్య రసరూప దేవతలకు బల ప్రదాత. స్తుతియోగ్య హరితవర్ణ. అది దశా పవిత్రము నుండి శుద్దియై వచ్చును. నరులచే సిద్దము చేయబడిన అశ్వము వలె సోమము అనాయాసముగ జల ప్రవాహమున చేరును.
6. సోమము విజ్ఞులకు కల్పకము. విశేషద్రష్ట. ఉషస్సును, పగటిని పెంచు సూర్యుని వర్ధిల్లచేయునది. పారుచున్న ఈ సోమము జలపూర్ణమై, స్తోత్రయుక్తమై ఇంద్రుని హృదయమున చేరగోరి ధారలుగా కలశమున పడుచున్నది.
7. శ్రేష్ఠ యజ్ఞమున నిలిచిన ఈ సోమము కొరకు ఇరువది యొక్క గోవులు పాలిచ్చును. ఈ సోమము యజ్ఞము నందు వర్ధిల్లి వసతీ వరీ మున్నగు జలమును పవిత్రము చేయుటకు మంగళ స్వరూప అగును.
(12 నెలలు + 5 రుతువులు + 3 లోకములు + 1 ఆదిత్యుడు = 21 కలిసి గోవునందు పాలు కలిగించుచున్నవి.)
8. సోమమా! చక్కగా అభిషుతవగుము. ఇంద్రుని కొరకు సకలదిశల రసమును స్రవింపచేయుము. వ్యాధులు, రాక్షసులు దూరమగుదురు గాక. సత్యాసత్యములు పలుకు పాపులకు నీ యొక్క రసము గణమివ్వకుండును గాత. నీ యొక్క రసములు యజ్ఞములందు మాకు ధనములు అగును గాక.
9. కాంతివంతము, వరదము, హరితవర్ణ సోమము సముపార్జించబడినది. అది రాజు వలె దర్శనీయ అగును. అది జలములందు చేరి రసము పిండునపుడు ధ్వని చేయును. తదుపరి పవిత్రమై ఉన్ని పాత్రను దాటి శ్యేనము వలె తన స్థానమునకు చేరును.
10. మధుమంతమగు సోమము దూడలకు పాలిచ్చు ఆవుల వలె, యజ్ఞమందు అంబారావములు చేయుచు పాలు రాల్చుగోవుల వలె ఇంద్రుని కొరకు పాత్రలందు నిండును.
గోవులు శుద్ద దుగ్ధ రూప సోమమును ఇంద్రుని కొరకే ధరించి ఉన్నవి.
11. ఋత్విజులు సోమమును పాలతోను, వ్యంజనములతోను చక్కగా కలుపుదురు. దేవతలు అట్టి సోమమును ఎంతో ఇష్టముగా సేవింతురు.
దేవతలు సోమమును మధువుతోను, నీటితోను కలుపుదురు. ధారగా పైనుండి పోయుదురు. బంగారముతో శుద్దము చేయుదురు. అప్పుడు దానిని ద్రష్టనుగా సేవింతురు.
12. బ్రాహ్మణస్పతి సోమమా! పవిత్రమగు నీవు సర్వత్ర వ్యాపించి ఉన్న సామ్రాట్టువు. నిన్ను పానము చేసిన వానికి చైతన్యము కలిగింతువు. తపము లేక పరిపక్వత లేదనియు, అది లేకున్న చైతన్యము కలుగదనియు విశ్వవిదితాము. తపము వలన పరిపక్వత చెందిన వాడే చైతన్యవంతుడు అగుచున్నాడు.
పదవ ఖండము
ఋషులు :- 1,11. అగ్నిశ్చాక్షుషుడు. 2. చక్షుర్మానావుడు. 3,4,9,10. పర్వత నారదులు. 5. త్రితుడు. 6. మనువు. 7. అగ్ని. 8,12. ద్వితుడు.
1. సోమము సద్యోజాత పాత్రలందు రాలునది. సర్వజ్ఞ. హరితవర్ణ. అభిషుత. ఇది వరదుడగు ఇంద్రుని చేరును గావుత.
2. సోమమా! నీవు జాగరణశీలవు. పాత్రలందు నిండుము. ఇంద్రుని కొరకు నాలుగు దిశల నుండి పాత్రలను పూరింపుము. స్వర్గము దీప్తము. దాని శత్రువులను శోషింపచేయు జలమును ప్రసాదించుము.
3. మిత్రులారా! కూర్చోండి. సోమమును గూర్చి సామగానములు చేయండి. తండ్రి బిడ్డను అలంకరించినట్లు సోమమును శోభిల్లచేయుటకు యజ్ఞములచే అలంకరించండి.
4. మిత్రులారా! మత్తు కొరకని సోమమును స్తుతించండి. శిశువు వంటి హవిస్సులతోను, స్తుతులతోను స్వాదిష్టము చేయండి.
5. యజ్ఞమును పూర్తి చేయించునదియు, పూజనీయమును, జలముల శిశువును అగు సోమము యగ్నపు ప్రకాశమునాకు తన రసముతో ప్రేరణ కలిగించును. సకల హవిస్సులను పరివ్యాప్తము చేయును. సోమము ద్యావాపృథ్వులందుండును.
6. సోమమా! దేవతల సేవనమునకును, వారికి బలము కలిగించుటకును పాత్రలందు నిండుము. మధుమంత రసవంతమగు నీవు మా కలశమందు నిలువుము.
7. పవిత్ర స్తుతులకు అగ్రగామియైన సోమము మాటిమాటికి శబ్దము చేయును. పవిత్ర సోమము ధారలుగా ఉన్ని పాత్రలనుండి పయనించును.
8. పవిత్ర, కర్మల విధాత సోమాపు స్తుతులు ఉచ్చరించండి. స్తుతులకు ప్రసన్నమగు సోమమును సేవకుని ధనమిచ్చి ప్రసన్నుని చేసినట్లు గొప్పగా స్తుతించండి.
9. బలశాలి సోమమా! అభిషుతమైన నీవు మమ్ము గోమంతులను, అశ్వవంతులను, ధనవంతులను చేయుము. పవిత్రము, పరిశుద్దమగు రసము మాకు పాడియందు లభించునుగాత.
10. ధనదాత సోమమా! మాకు దానాదులు అందించమని నిన్ను సకల దిశలందు స్తుతించుచున్నాము. నీ యొక్క రసమునందు పాలు మున్నగు వానిని కలుపుచున్నాము.
11. ఇష్టపడదగిన హరిత సోమము వంకర పవిత్రములనుండి సాగును. సోమమా! స్తోతలకు పుత్రులను, కీర్తిని ప్రసాదించుము.
12. పవిత్ర సోమము మధురిమ కురిపించుచు కలశమున చేరుచున్నది. ఈ సోమమును ఋషులు సప్త చందములచే స్తుతించుచున్నారు.
పదకొండవ ఖండము
ఋషులు :- 1. గౌరివీతి. 2. ఊర్ధ్వసద్మ. 3,8. ఋజిష్వ. 4. కృతయశ. 5. ఋణ్వ. 6. శక్తి. 7. ఉరు.
1. సోమమా! నీవు మధురిమవు. ఫల ప్రదవు. పూజనీయవు. పరమదీప్తవు. హర్షదాయకవు. ఇంద్రునకు మాదకమవై క్షరితమగుము.
2. అన్నస్వామి సోమమా! నిన్ను దేవతల స్తుతులతో కీర్తించుచున్నాము. మాకు దీప్యమగు కీర్తిని, అన్నమును ప్రత్యక్షముగ ప్రసాదించుము. ఆకాశము నందలి మేఘమును వర్షింపచేయుము.
3. సోమము అశ్వము వంటి వేగవంతము. స్తుతియోగ్య, ఆకాశ జల ప్రేరకము. తేజస్సు కలిగించునది. జలము నుండి సాగునది. ఋత్విజులారా! అట్టి సోమమును స్తుతించండి. నీటితో తడపండి.
4. ఋత్విజులారా! మదచ్యుతము, సహస్ర ధారాయుతము, వరదము, విశ్వ ధన సహితమగు సోమపు ఫలములను పితుకండి. సాధించండి.
5. ధనములను, దుగ్దాదులను, భూములను, శ్రేష్ఠ మానవులను తెచ్చు సోమమును ఋత్విజులు అభిషవించుచున్నారు.
6. పవమాన సోమమా! నీవు దీప్తివంతవు. దేవతలజన్మలు తెలిసినదానవు. వారి అమృతత్వమునకు ఋత్విజులచే ఘోషింపచేయుచున్నావు.
7. హర్షదాయక సోమము జలతరంగములవలె ఇటునటు క్రీడించును. అభిషుత సోమము ఉన్ని పాత్ర నుండి ధారగా కలశమున ప్రవేశించును.
8. స్రవించు సోమము అంతరిక్షమునందలి మేఘములను భిన్నము చేసి వర్షము కలిగించును. సోమము అసురులు హరించిన గోవ్రజమును, అశ్వ సమూహములను విడిపించును.
అరి భయంకర సోమమా! కవచ ధారి వలె అసురులను హతమార్చుము.
(1. ప్రాణోవైపవమానః అయం వాయుః పవమానః అని శాఠ్యము. 2. పవమాన ఏవ భూత్వా పశ్చాద్వాతి అని తైత్తిరీయము. 3. ఆత్మావై యజ్ఞస్య సవమానః అని తాడ్యము. 4. సోమోవై పవమానః అని శతపథము. 5. పవమానోక్ధం వా ఏతద్వద్వైశ్వ దేవమ్ అని కౌషీతకి సోమావై పవమానః అనునదే ఈ కాండకు వర్తించును.)
దాశరథి రంగాచార్య విరచిత
శ్రీమదాంధ్ర వచన సామవేద సంహిత
యందలి పవమానకాండ సమాప్తము.