"కడుపులో ఏదోలా వుందంకుల్..." రమణయ్య మనసు బాధగా మూల్గింది.
వెంటనే రిక్షా దిగి ఒక షోడా తెచ్చిచ్చాడు రమణయ్య దాన్ని తాగి, ఆమె ఒకింత సేద తీరింది.
రిక్షా తిరిగిబయలుదేరింది.
టైమ్ రాత్రి 9-30 కావస్తోంది. సరీగ్గా అదే టైమ్ కి మాధుర్ మౌనిక ఎక్కి వెళుతున్న రిక్షాకు ఎదురుగా వస్తున్నాడు.
ఆ చీకట్లో రమణయ్య మాధుర్ ని గుర్తించలేకపోయాడు. తనక్కావల్సిన వ్యక్తి ప్రక్కనుంచే వెళ్తున్నా మౌనిక కేవలం ఆ రోడ్డెంట వెళుతున్న యువతుల్నే గమనిస్తోంది.
* * * * *
మౌనిక పరిస్థితి ఇక్కడ ఇలా వుంటే...
జె.జె. పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా వుంది.
దేశంలోని అన్ని ముఖ్య కేంద్రాలలో ఆయనకు వ్యాపారాలున్నాయి. అదీ ఒక రకమయిన వ్యాపారం కాదు.
"క్రికెటర్ కి ప్రతి మ్యాచ్, ప్రతి బాల ఒక లెసన్" అంటారు లిటిల్ మాస్టర్ సునీల్ గవాస్కర్.
"వ్యాపారవేత్తకి ప్రతి వ్యాపారం ఒక గేమ్" అంటారు జె.జె.
హెడ్డాఫీసులో కూర్చుని దేశంలోని నలుమూలలా తన వ్యాపారాన్ని ఎంతో పకడ్బందీగా నడుపుతున్న ఆయన జీవితం ఎం.బి.ఎ పోస్టుగ్రాడ్యుయేట్ స్టూడెంట్ కి రీసెర్చి చేయడానికి సబ్జక్టు అవుతుంది.
ఉదహరణకు ఒక కన్ స్ట్రక్షన్ యూనిట్ తీసుకుంటే...
స్టోర్స్ ఇన్ ఛార్జి ఏ రోజుకారోజు ఓపెనింగ్... క్లోజింగ్ స్టాక్ పొజిషన్ హెడ్డాఫీసుకి పంపుతాడు. స్టోర్ కీపర్ తో ప్రమేయం లేకుండా సెక్యూరిటీ ఇన్ ఛార్జి ఏ రోజుకారోజు గోడౌన్ లోకి వచ్చిన స్టాకు గోడౌన్ నుంచి బయటకు వెళ్ళిన స్టాకు, వెహికల్స్ వివరాలతో సహా తన స్టేట్ మెంట్ తాను పంపుతాడు.
ఇవిగాక ప్రొడక్షన్ సూపర్ వైజర్ ఆ రోజున ఎంతమంది వర్కర్లు పనిచేసిందీ... వారిలో దినసరి కూలీలు ఎంతమంది, నెలవారీ జీతగాళ్ళు ఎంతమందీ? ఏ రోజున ఎంత చెల్లించిందీ- తన స్టేట్ మెంట్ తాము పంపుతారు.
ఇవిగాక ప్రొడక్షన్ సూపర్ వైజర్ ఆ రోజున ఎంతమంది వర్కర్లు పనిచేసిందీ, ఎంత స్టాకు వాడిందీ, ఎంత పని జరిగిందీ.... తన స్టేట్ మెంట్ తాను పంపిస్తాడు.
అకౌంట్స్ డిపార్టుమెంటువారు ఏ రోజున ఎంతమంది వర్కర్లు పని చేసిందీ.... వారిలో దినసరి కూలీలు ఎంతమంది, నెలవారి జీతగాళ్ళు ఎంతమంది, ఏ రోజున ఎంత చెల్లించిందీ- తన స్టేట్ మెంట్ తాము పంపుతారు.
యూనిట్ మేనేజర్ అన్ని విషయాలూ క్రోడీకరిస్తూ తన స్టేట్ మెంట్ తాను పంపిస్తాడు.
ఇలా ఒకే విషయమై ఒకేచోటు నుంచి ఎవరి స్థాయికి తగ్గట్టుగా వారు తమ నివేదికలు ఏ రోజుకారోజు పంపుతారు. ఆ నివేదికల ఆధారంగా వర్కు ప్రోగ్రెస్.... ఫ్రాడ్ ఇత్యాదులన్నీ బేరీజు వేసి మేనేజింగ్ డైరెక్టర్ కి 'నోట్ పుటప్' చేయడం జరుగుతుంది.
ఇలా ఒక బ్రాంచి నుంచే గాక అన్ని బ్రాంచీలనుంచి ఏరోజుకారోజు పూర్తి సమాచారం అందుతుంది. ఒకే విషయమై వివిధ స్థాయిలలోని వారు తమ నివేదిక సమర్పిస్తున్నప్పుడు వారంతా కుమ్మక్కు కావడానికి... ఫ్రాడ్ జరగటానికి అవకాశం తక్కువ. ఒకవేళ అలా జరిగితే.... మరో యూనిట్ తో ఈ యూనిట్ ని బేరీజు వేసి పనితీరుపై వెంటనే దర్యాప్తు జరుపుతుంది. అసమర్ధులు, లంచగొండులకి వెంటనే ఉద్వాసన చెబుతారు. ఉద్యోగులకి అధిక జీతాలేగాక, అదనపు సౌకర్యాలు కూడా కల్పించడం జరుగుతోంది. అందువల్ల 'చిరు' సంపాదనలకు ఆశపడి వున్న ఉద్యోగాలు వూడగొట్టుకోవడానికి ఆ సంస్థలోనివారు సిద్దపడరు.
ఏ బిజినెస్ టైకూన్ అయినా జె.జె. నుంచి నేర్చుకోవాల్సిన అంశాలు మరో రెండు వున్నాయి. ఒక ఎగ్జిక్యూటివ్ కి ఉద్యోగం నుంచి ఉద్వాసన చెప్పాలంటే ఆయన అవలంభించే పద్దతి చాలా చిత్రంగా వుంటుంది....ఊస్టింగ్ ఆర్డర్స్ ఇవ్వవలసిన సమయంలో ఆయన ఎగ్జిక్యూటివ్ కి ప్రమోషన్ ఇస్తారు. జీతభత్యాలు అతడి శక్తి సామర్ద్యాలకు మించి పెంచుతారు. అప్పుడు అతనికి అసిస్టెంట్ గా అన్ని క్వాలిఫికేషన్స్ వున్న వ్యక్తిని చాలా తక్కువ జీతానికి తీసుకొచ్చి పెడతారు. తనకన్నా ఎన్నో రెట్లు తక్కువ జీతం తీసుకుంటున్న ఆ వ్యక్తి రేపటిరోజున తన కుర్చీకి వారసుడని అతడు కలలోనైనా ఊహించడు. ఫలితంగా చిన్న పని, పెద్ద పని- ప్రతి పనీ అప్పగిస్తాడు. క్వాలిఫికేషన్స్ దృష్ట్యా తన పై అధికారికి వున్న అన్ని క్వాలిఫికేషన్స్ తనకు వున్నా అవకాశం రాక నిరుద్యోగిగా మిగిలిపోయిన అతడు ఆ అవకాశం కోసం ఆబగా ఎదురుచూస్తుంటాడు. ముందు వర్కు నేర్చుకుంటాడు. ఆ స్థితిలో అతడికి ఒక ఫీలర్ అందుతుంది. పని విషయంలో తన సామర్ధ్యాన్ని నిరూపించుకుంటే ప్రమోషన్ లభించవచ్చునని. దానితో అతడు మరింత జాగ్రత్తగా వర్కోహాలిక్ గా మారతాడు. ఈ అసిస్టెంటు ప్రతి కదలికను జాగ్రత్తగా గమనిస్తున్న యాజమాన్యం అతడి వర్కింగు స్టయిల్ తో సంతృప్తి చెందితే అప్పుడు చదరంగంలో తన పావుల్ని కదిలించడం ప్ర్రారంభిస్తుంది.
ముందుగా ఆ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ని 'క్యాంప్సు' అని చెప్పి ఇతర బ్రాంచీలకు రోజులు- వారాలుగా పంపుతారు. ఆ వ్యవధిలో అసిస్టెంటు, ఇండిపెండెంట్ గా వ్యవహారాల్ని ఎంత చక్కగా సర్దుకొస్తుందీ గమనిస్తారు. అలా క్రమక్రమగా ఆ సీనియర్ ఎగ్జిక్యూటివ్ కి టూర్ ప్రోగ్రామ్స్ పెరుగుతాయి. అతడివద్ద జూనియర్ అన్ని పనులు నేర్చుకున్నాడు అనుకున్న రోజున సీనియర్ ఎగ్జిక్యూటివ్ ని ఒకే ఒక కలంపోటుతో నెలరోజుల నోటీసుతో బయటకు పంపుతారు. ఇప్పుడు అతడి స్థానంలో వచ్చిన జూనియర్ ఎగ్జిక్యూటివ్ కి ప్రమోషన్ చాలు. జీతం ఎంత అన్నది అంతగా పట్టింపు కాదు.
రెట్టింపు ఉత్సాహంతో ఒళ్ళు విరుచుకుని పనిచేస్తారు. అటువంటి జె.జె. ఇప్పుడు కంప్యూటర్ ముందు కూర్చుని వున్నాడు. అన్ని బ్రాంచీలలోని టాప్ ఎగ్జి క్యూటివ్స్ పని తీరును అతడు బేరీజు వేస్తున్నాడు.
ఆ క్షణాన కంప్యూటర్ కన్నా వేగంగా జె.జె. బ్రెయిన్ పనిచేస్తోంది.
మెరుపు కారుచీకట్లని ప్రారద్రోలుతోంది.
కుంభవృష్టిని కూడా కురిపిస్తుంది.
* * * * *
వస్తు ఉత్పత్తి ఎంత ముఖ్యమో మార్కెటింగ్ అంతకన్నా ముఖ్యం.
వస్తువుని చూపించి, నాణ్యత నిరూపించి, మార్కెట్లో అమ్మడం అన్నది లేటెస్ట్ టెక్నిక్!
ఆ వస్తు ఉత్పత్తి సంస్థ పేరు- వస్తువు పేరు చెప్పి మార్కెట్లో అమ్మడం అన్నది లేటెస్ట్ టెక్నిక్!
అమెరికావలె ఇండియాలో కూడా 'ఫాస్ట్ ఫుడ్స్' జనజీవన సరళిలో కొత్తదనానికి నాంది పలికింది.
పట్టణ జీవితంలో ఫాస్ట్ నెస్ పెరిగింది. టిన్డ్ ఫుడ్స్ డిమాండు పెరిగింది. మారుతున్న ప్రజల అభిరుచినీ, అవసరాన్ని గుర్తించి సకాలంలో సొమ్ము చేసుకున్నవారు 'వెంకీస్ ఫాస్ట్ ఫుడ్స్'. అలాగే స్వల్పకాలంలో అత్యధిక సర్క్యు లేషన్ పొందిన దినపత్రికగా గుర్తింపు పొందిన ఏకైక దినపత్రిక 'ఆంద్రజ్యోతి' హైదరాబాదు, తిరుపతి ఎడిషన్లు ప్రారంభ సమయంలో అవలంభించిన పబ్లిసిటీ టెక్నిక్ ఆంద్రజ్యోతి సంస్థకి, పత్రికకి వున్న ఇమేజ్ ఈ అసాధారణ విజయానికి దోహదకారి అయ్యాయి.
ఇదే విషయమై బొంబాయి, మద్రాసు వంటి నగరాలలోని యాడ్ క్లబ్బు సెమినార్లు నిర్వహించడం జరిగింది. 'ఆంద్రజ్యోతి' హైదరాబాదు ఎడిషన్ ప్రారంభ సమయంలో సినీనటి విజయశాంతిపై ఒక యాడ్ ఫిల్మ్ తీయడం జరిగింది. ఒక దినపత్రిక పబ్లిసిటీకి సినిమా స్టార్ ని మోడల్ గా ఉపయోగించడమన్నది నావెల్ థాట్ - అంతకుమించి కమర్షియల్ థాట్.
కారణం- తెలుగు నాట సినిమా తారలకున్న గుర్తింపు, క్రేజ్ మారుతున్న ప్రజల అభిరుచి కనుగుణంగా పబ్లిసిటీ టెక్నిక్ మార్చడంలోనే వున్నది.
అల్పపదాలతో అనల్పభావాన్ని స్ఫురింపజేస్తూ జనహృదయాలను తాకే లొకేషన్స్ ఇవ్వడంలో దిట్ట అనిపించుకున్నవారు చాలా కొద్దిమంది మాత్రమే.
-రచయిత.
* * * * *