నాకిక్కడ ఆ స్థాయి కల్పించలేదు. ఏ స్థాయీలేని ఒక అనామకున్ని నేను ప్రేమించడమేమిటి? అతగాడి ప్రేమకు నేను అర్రులు చాచాడమేమిటి? నాన్సెన్స్......అయామ్ సారీ......నేను విత్ డ్రా అవుతున్నాను" రోషంగా నారాయణరావువేపు చూస్తూ చెప్పింది.
ఆ మాటకు నారాయణరావుకి ఒక్కసారిగా ఊపిరి ఆగిపోయినట్టుగా అయిపోయింది.
"నాకొ స్థాయి లేదా? నేను అనామకుడ్నా.....నాన్సెన్స్....ఈ పిల్లకు ఎంత పొగరు. ఆడపిల్లకే ఇంత పొగరుంటే మగవాడ్ని నాకెంత పొగరుండాలి___ఆ పోగారుకు తగ్గ పవరుండాలి" కుతకుత లాడిపోతూ మనసులోనే అనుకున్నాడతను.
సంధ్య స్టేట్ మెంట్ కి విధ్యార్దిలోకం నివ్వెరపోయింది.
"మళయాళ సినిమాలో హీరోయే విలనైనట్టు, స్టోరీయేమిటి__మొదట్లోనే అద్దం తిరిగింది" ఆశ్చర్యంగా అనుకుంది మోతీలక్ష్మి.
"యూ ఆర్ రాంగ్ మిస్ సంధ్యా__విద్యార్ధులు చేసిన తీర్మానం మేరకు సదరు మగ క్యాండిడేట్ ఎలాంటి వాడయినా నువ్వు ప్రేమించాలి తప్పదు" సీరియస్ గా అంది మోతీలక్ష్మి.
"అవును.....లవ్వాడాలి....అందరికీ తెలిసేటట్టుగా డ్యూయట్లూ అవీ పాడుకోవాలి. పెద్దవాళ్ళను ఎదిరించాలి" అన్నాడు వాసుదేవ్.
"అవును__అవును__సంధ్య, నారాయణరావును ప్రేమించాలి తప్పదుగాక తప్పదు" విద్యార్దులందరూ ముక్తకంఠంటో అరిచారు.
"ఓకే.....ఓకే.....విద్యార్ధులు చేసిన నిర్ణయానికి నేను కట్టుబడి వుంటానుగానీ, ఆ ఆదిమానవుడు చేసే నిర్ణయానికి నేనెట్టి పరిస్థితుల్లోనూ కట్టుబడి వుండను. అతగాడు న వ్యక్తిత్వం పట్ల, ఎప్పుడయినా చులకనగా గానీ, ఆకతాయిగాగానీ ప్రదర్శించే పక్షంలో.....లవ్ కాంట్రాక్టు నుంచి నేను వైదొలగగలనని చెపుతున్నాను" అని సీరియస్ గా చెప్పేసి అంతకంటే సీరియస్ గా నారాయణరావు వేపు చూసి, గబగబా స్టేజీ దిగిపోయి ఆ ఆడిటోరియంలోంచి బయటకు వెళ్ళి పోయింది సంధ్య. ఆమెను కొంతమంది లేడీ స్టూడెంట్స్ అనుసరించారు.
ఒక అరగంట తర్వాత సభ చాలించి, విద్యార్ధినీ, విద్యార్దులందరూ ఋషుల్లా చెట్లకింద, పుట్లకింద చేరారు. ఎక్కడ చూసినా, ఇదే డిష్కషన్ పరుగెడుతోంది.
* * * *
అరుదయిన ఈ లవ్ టెస్ట్ కు యూనివర్సిటీ ప్రతినిధిగా సెలక్టయిన నారాయణరావు గౌరవార్ధం క్యాంటీన్ వాడు, వచ్చిన స్టూడెంట్స్ అందరికీ ఫ్రీగా టీలు పోస్తున్నాడు.
"నాకేం నచ్చలేదురా" ఉక్రోషంగా ఏడుపు ముఖంపెట్టి అన్నాడు నారాయణరావు. సరదాపటేల్, జుత్తులజిన్నా, మహమ్మదాలీ, షక్తీ కఫూర్ తదితర మిత్రబృందమంతా చుట్టూ వున్నారు.
"అవున్రా....ఈ క్యాంటీన్ టీ ఎప్పుడు బాగుంది చెప్పు" షక్తీ కపూర్ అన్నాడు.
"నేను టీ గురించి మాట్లాడడంలేదు.....స్నాధ్య గురించి మాట్లాడుతున్నాను" అదోలా ముఖం పెట్టాడు నారాయణరావు.
"అవున్రా.......వ్యక్తిత్వం గురించి ఏవో డైలాగులు చెప్పిందేవిటి నువ్వుకూడా ఆ పిల్లకు సీరియస్ గా జవాబు చెప్పాననుకున్నాను"
"ఆడవాళ్ళతో గొడవ పడితే మన ప్రెస్టేజి ఏమిట్రా" జుత్తుల జిన్నా అన్నాడు.
"ఒరేయ్.....ఆ పొగరుబోతు పిల్లను......నేను ప్రేమించను.....కావాలంటే....మళ్ళీ లాటరీ తియ్యమను.....ఇంకెవరినయినా....ప్రేమిస్తాను."
"లాభం లేదు నాన్నా..... విధి లిఖితం గీతను పొడవుగా ఆ పరమానందం, ఆ మోతీ లక్ష్మీ ఇద్దరూ కలిసి గీసేసారు......తప్పదు......నువ్వు ఈ క్షణం నుంచీ ఆ సంధ్యను తప్పకుండా ప్రేమించవలయును....." అదేదో గిరిజన నృత్యంలా- నృత్య భంగిమతో అన్నాడు మహమ్మదాలీ.
"ప్రేమిస్తాను...... కానీ ఒక షరతు..... మొదట రెస్పాన్స్ ఆ అమ్మాయి నుంచే రావాలి..... అంతే.... ఆ అమ్మాయి నుంచి రెస్పాన్స్ రాకపోతే మాత్రం నేను ప్రేమించను గాక ప్రేమించను అంతే......తర్వాత మీ ఇష్టం....."
సర్రున లేచి క్యాంటీన్ లోంచి బయటకొచ్చి యూనివర్శిటీ లైబ్రరీ వేపు పరుగు తీసాడు నారాయణరావు.
"అద్భుతమైన అదృష్టం వెంటపడితే వీడిలా పరుగులు తీస్తాడేమిటి?" విస్తుపోయాడు మహమ్మదాలీ.
"వ్యక్తిత్వాన్ని గౌరవించని వాడిని నేను ప్రేమించనని ఆ పిల్ల. అమ్మాయి నుంచి రెస్పాన్స్ వస్తేనే తప్ప నేను ప్రేమించనని వీడు మొండికేసి కూర్చుంటే ఎలాగరా....." షక్తికపూర్ క్వశ్చన్ మార్క్ లా ముఖం పెట్టి అడిగాడు.
"అవును..... ఎలా....." ఆశ్చర్యార్దకంలా ముఖం పెట్టాడు జుత్తులజిన్నా.
"ఏం లేదు..... వాళ్ళిద్దర్నీ..... మనం మొదట దార్లో పెట్టాలి.....అంచేత..... మనం పది ప్రేమ సూత్రాల పధకాన్ని ఆచరణలో పెట్టాలిరా" మహమ్మదాలీ అన్నాడు.
"ఏవిటా పధకం....." అప్పుడే అక్కడ కొచ్చిన మోతీలక్ష్మి అడిగింది.
"అదే.... నెంబర్ వన్.... ఒకరంటే ఒకరికి ఎందుకు పడదో మనకు తెలీదు.... అంచేత ముందు వాళ్ళిద్దరూ ఒకటయ్యేటట్టు మనం చెయ్యాలి"
"ఇష్టం లేకపోతే.....మనమెలా కలపగలం....."
అదే సమయంలో వాసుదేవ్ అక్కడకొచ్చాడు.
"ఒరే చిట్టి తండ్రులూ, ప్రపంచం ఒక మాయాబజార్ నాన్నా...... ఆ మాయాబజార్లో ప్రధాన ఘట్టం ప్రేమం___ కాబట్టి__ ఆ సంధ్య, ఆ నారాయణరావు ఇద్దరూ గాఢాతిగాఢంగా ప్రేమించుకునేటట్టు..... మనం చేయాలని..... మన లేడీ యూనియన్ కూడా ఇప్పుడే తీర్మానం చేసింది.... ఇకనుంచీ మనం..... ఆ ఏర్పాట్లలో ఉందాం....సరేనా....." చెప్పాడు వాసుదేవ్.
"అయితే ప్రోగ్రామ్ ని ఎక్కడనుంచి ప్రారంభించాలో చెప్పండి" అడిగింది మోతీలక్ష్మి.
ఒక్కరొక్కరూ తమ అయిడియాలను యివ్వడం ప్రారంభించారు.
* * * *
యూనివర్సిటీ లేడీస్ హాస్టల్__
కిటికీలోంచి సర్రుమని సముద్రపు గాలి దూసుకుని రావడంతో, ఎవరో తట్టినట్లు మెలుకువ వచ్చింది సంధ్యకు.
రాత్రి వార్డెన్ కు తెలీకుండా దొంగచాటుగా లీలామహల్లో నైట్ ఐస్ సినిమాకు వెళ్ళొచ్చిన మిత్రబృందం జానకి, లీల ఒక మంచం మీద గాఢంగా నిద్రపోతున్నారు.
ఎప్పుడూ రాత్రివేళల్లో బయటకు వెళ్ళడానికి సంకోచించే జానకి కూడా క్రితం రాత్రి తొమ్మిది గంటలకు లీలతో కల్సి బయటకు వెళ్ళడం ఆశ్చర్యమనిపించింది- రెండు గంటల తర్వాత వాళ్ళు రూమ్ కి రావడం విచిత్రంగా అనిపించింది.
"ఇంగ్లీషు సినిమా గంటన్నరే కదా..... ఇత లేటయిందేం" అని అడిగిన ప్రశ్నకు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని జవాబు చెప్పడం జ్ఞాపకాని కొచ్చింది సంధ్యకు.
"ఫోర్టీస్ రీల్స్ పిక్చర్ కదా....అందుకు......" ఆ జవాబుకు ఆశ్చర్యంగా వాళ్ళవేపు చూసింది సంధ్య.