కేరింతల, పులకరింతల, గిలకరింతళ, హోరింతల మధ్య__
పరమానందం ముందుగా......
మగ స్టూడెంట్స్ చీటీల డబ్బావేపు నడిచాడు.....ఆ డబ్బాను చేతిలోకి అందుకుని, బాగా గిలకరించి__
"ఓ ప్రేమాయ నమః" అని అని, తన కుడిచేతిని ఆ డబ్బాలో పెట్టాడు.
రెండే రెండు క్షణాలు......
వందలాదిమంది స్టూడెంట్స్ ఉత్కంఠగా చూస్తున్నారు.
ఒక్కసారి చీమ చిటుక్కుమనేటంత నిశ్శబ్దం నెలకొందక్కడ.
చేతికి అందిన ఒక చీటీతో పరమానందం డబ్బాలోంచి తన కుడి చేతిని బయటకుతీసి, తన చేతిలోని చీటీని, స్టూడెంట్స్ అందరికీ కనిపించేటట్టుగా చూపించి, అల్లరిగా విజిల్ వేశాడు.
ఆయన్ని అనుసరిస్తూ ఆడపిల్లలు కూడా జయ్ జయ్ మంటూ విజిల్స్ వేసారు.
"ఓపెన్ ఇట్ ఓపెనిట్" అరుస్తున్నారు స్టూడెంట్స్.
పరమానందం చిద్విలాసంగా నలువైపులా చూస్తూ నెమ్మదిగా చేతిలోని పేపర్ మడతల్ని విప్పి__
మోతీలక్ష్మి చేతిలో పెట్టాడు. ఆ పేపర్ ని న్దుకొని, అందులోని పేరును చూసి__
"ది సెలక్టడ్ లవ్ బాయ్ ఆఫ్ ద డే మిస్టర్ ఎ. నారాయణరావ్" గోల గోలగా అరిచి చెప్పింది మోతీలక్ష్మి.
తన పేరు వినబడగానే ఉలిక్కిపడ్డాడు నారాయణరావు.....హోరెత్తుతున్న చప్పట్లమధ్య అందరూ తనవైపు చూస్తుండడంతో గర్వంగా ఫీలయ్యాడు కాసేపు.
"లవ్ బాయ్.....నారాయణ్రావ్......హిప్ ప్.....హుర్రే..... హుర్రే హుర్రే హిప్ .....హిప్....." ఇంతట్లో రెండో డబ్బాలోంచి, రెండో చీటీ తీసి, మోతీలక్ష్మి చేతిలో పెట్టాడు పరమానందం.
"ద సెలక్టడ్ లవ్ గర్ల్ ఆఫ్ ద డే మిస్ టి.సంధ్య......." అప్పటి వరకు ఎటో చూస్తున్న సంధ్య ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
"సంధ్యా....స్టేజీ మీదకు రావాలి......రావాలి" అమ్మాయిలందరూ ఆమెను ముందుకు తోసారు.
"పేరొచ్చిందేవిటి.......అసహ్యంగా....." చికాగ్గా మొహంపెట్టింది సంధ్య. సుత్తితో కొడితే, బుర్ర ఎలా అయిపోతుందో, కాసేపు ఆమె బుర్ర అలా అయిపోయింది.
మోతీలక్ష్మి స్టేజ్ దిగి, సంధ్యను వేదికమీదకు లాక్కెళ్ళింది.
అయిదు నిమిషాలసేపు....అదేదో జాతరలా విద్యార్ధులు కేరింతలు కొట్టాక పరమానందం__ నారాయణరావుకి, సంధ్యకి షేక్ హేండిచ్చి, కిందకు దిగిపోయాడు.
కళ్ళమీద డైరెక్ట్ సన్ లైట్ పడితే, ఎలా చూస్తారో, అలా చూశాడు నారాయణరావు, సంధ్యవేపు.
"ఇవాల్టినుంచీ నేనీ ఏబ్రాసిని ప్రేమించాలా......చచ్చినా ప్రేమించను" తనకు తానుగా నిర్ణయించుకుంది సంధ్య.
అదే సమయంలో మోతీలక్ష్మి.......
స్టేజికి ఆ చివర, ఈ చివర వున్న నారాయణరావు, సంధ్యల్ని చెరో చేత్తో పట్టుకుని స్టేజి సెంటర్ కు తీసికొచ్చి__
"మైడియర్ ఫ్రెండ్స్.....ప్రేమలేని ప్రపంచంలేదు.....ప్రేమ విలువ తెలీక, మన పెద్దలు, సదరు వివాహాల్ని వ్యతిరేకిస్తున్నారు......దాని ఫలితంగా ఎన్నో ట్రాజడీల్ని మనం చూస్తున్నాం.....ప్రపంచం ప్రేమమాయం కావాలనే సత్ సంకల్పాన్ని, మనం ఇక్కడ ఆవిష్కరణ పలికాం.
చాలామంది పెద్ద మన లవ్ టెస్ట్....ఏదో ఒక ఆకతాయి వ్యవహారంలా కనిపించొచ్చు.....కానీ__ ప్రేమ జంటగా మనం ఎన్నిక చేసిన నారాయణరావు, సంధ్యలు మన ఆశయాన్ని, చిత్తశుద్దితో నెరవేర్చడానికి ప్రయత్నిస్తారని నేను నమ్ముతున్నాను.
ఎదురయిన అడ్డంకులన్నీ ఎదిరించి, వారిద్దరూ వెళ్ళి జంటగా ఏకం కావాలని, ఈ మధ్య కాలంలో వారికి ఎలాంటి సహకారం కావాలన్నా మన విద్యార్దులందరూ అందచేస్తారని హామీ ఇస్తూ ముందుగా మన నారాయణరావును 'ప్రేమప్రతిజ్ఞ' చేయమని కోరుతున్నాను"
అంతవరకూ ఎంతో ధీమాగా ఉన్న నారాయణరావుకి, సరిగ్గా ఆ సమయంలోనే సినిమా తెరమీద సూపర్ ఇంపోజ్ ఎఫెక్ట్ లో కేరక్టర్లు కనబడ్డట్టు - వాళ్ళబామ్మ కళ్ళముందు ఠంగ్ మని కదలాడింది. ఆ తరువాత మేనమామ కనబడ్డాడు. మేనమామ కూతురు.
"బావా బావా బంతీపూవా.....పండక్కి వచ్చి నా బండెక్కవా" టైపులో పాట పాడుతూ మరి కన్పించేసరికి కించిత్ విషాద ముఖుడై పోయాడతను.
స్వేద గ్రంధుల్లోంచి ఒక్కసారిగా చెమట బిందువుల తళతళ్ళాడాయి.
"ఆ గాడ్.....కడు నిర్ధయుడు__లేకపోతే ఈ ప్రేమ వ్యవహారంలో నన్ను ఇరికించడమేమిటి" అని స్వగతంలో చింతాక్రాంతుడయ్యాడు.
"ఇది మూగప్రేమకాదు బహిరంగ ప్రేమ......ముందు ప్రతిజ్ఞ చేసి, తర్వాత ప్రేమను పెళ్ళివరకూ ఎలా తీసికెళతాడో......చెప్పు" అడిగింది మోతీలక్ష్మి.
అందరివేపూ ఒకసారి చూశాడు నారాయణరావు. ఆ పైన-
ఏదో మాట్లాడబోయాడు.....ఫెవికాల్ తో పెదవులు, అతుక్కుని పోయినట్టుగా అతుక్కు పోయాయి. ఎట్టకేలకు మాట్లాడ్డానికి ఉపక్రమించాడు.
"మై.....మై.....డియర్ ఫ్రెండ్స్__ఈ ప్రేమబండ.....నామీద పడుతుందని నేననుకోలేదు.....కానీ.....ప్రేమను, అందరూ ప్రేమిస్తున్నారు కాబట్టి, వేలాదిమంది విద్యార్ధినీ, విద్యార్ధులు నాకు అప్పగించిన బాద్యతను చిత్తశుద్దితో నెరవేరుస్తానని, ప్రేమకోసం ఆజన్మాంతం జీవిస్తానని పరమానందంగారి సాక్షిగా హామీ ఇస్తున్నాను" ఆవేశంగా నారాయణరావు చెప్పగా, అంతకన్నా ఆవేశంగా చప్పట్లు కొట్టారు స్టూడెంట్స్."
"మైడియర్ స్టూడెంట్స్.....ఈ క్షణం నుంచీ సంధ్యను.....సంధ్యను.....సంధ్య" సంధ్యవేపు చూసి గుటకలు మింగుతున్నాడు నారాయణరావు.
"చెప్పవయ్యా బాబూ.....సంధ్యను నేను ప్రేమిస్తున్నాను.....ఎట్టి అవాంతరాలు ఎదురయినా, పెళ్ళి చేసుకుంటాను......ఆ పిల్లని మన విద్యార్ధుల సమక్షంలో జరుపుకుంటానని చెప్పు" మోతీలక్ష్మి చెప్పింది.
ఆ విధంగానే చెప్పి సంధ్యవేపు చూశాడతను.
సంధ్య అతని వేపుగానీ, ఎవరి వేపుగానీ చూడడంలేదు. నారాయణరావుని, నేను ప్రేమించడమేమిటి....అనే సబ్జెక్టుమీద సీరియస్ గా ఆలోచిస్తోంది. అయినా లాటరీలో ఈ బుద్దావతారం పేరొచ్చింది గనక ప్రస్తుతానికి ప్రేమ ప్రతిజ్ఞ మామూలుగా చేసేసి, ఆ తర్వాత ఎలా గయినా సరే.....నేను సంధ్యను ఇష్టపడడంలేదు, నేను సంధ్యను ప్రేమించడంలేదని చెప్పించేస్తే ఎలా వుంటుందనే విషయాన్ని ఆమె ఆలోచిస్తోంది.
"సంధ్యా.....నువ్వు ఇప్పుడు ప్రతిజ్ఞ చేయాలి" మోతీలక్ష్మి అనగానే సంధ్య ముందుకొచ్చి స్టూడెంట్స్ అందరివేపూ చూసింది. ఆమె ఏమి మాట్లాడుతోందని అందరూ ఎదురు చూస్తున్నారు. ఆమె నెమ్మదిగా పెదవి విప్పింది.
"మైడియర్ ఫ్రెండ్స్.....లవ్ ఆమె వస్తువు ఈనాటిది కాదనే విషయం మీకు తెలుసు.....మేడమ్ ఈలవ్ లు లవ్ లో పడ్డాకే మనం భూమ్మీద పడ్డావని మీకందరకూ స్పెషల్ గా చెప్పక్కరలేదు. అంటే లవ్ అంటే సడన్ గా జరిగిన ఒక లవ్లీ యాక్సిడెంట్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు."
డేవిడ్. దివ్యల మరణంతో విద్యార్ధులందరూ పెద్దలకు బుద్ది చెప్పాలనుకోవడం న్యాయమా....లాటరీలో నేను వచ్చినందుకు ఆనందిస్తున్నాను....కానీ స్నేహమైనా, విరోధమైన సమానస్థాయి అనేది వుండాలని పెద్దలు చెపుతుంటారు.