తర్వాత పడుకోవడానికి ఉపక్రమించింది__
స్టూడెంట్స్ లవ్ గేమ్ కి తామిద్దరూ సెలక్ట్ కావడం చాలా ఆశ్చర్యంగా ఉందామెకు.
ఈ లవ్ గేమ్ కంటెంట్ గురించి ఆమె తండ్రికి గానీ, అన్నయ్యకు గానీ తెలిస్తే?
తండ్రిని ఎలాగైనా మేనేజ్ చెయ్యొచ్చు. అన్నయ్య అసలే మొండివాడు. అతడ్ని ఎలా మేనేజ్ చెయ్యాలో అర్ధం కావడం లేదు ఆమెకు.
సంధ్య అన్నయ్య పేరు దాదా- అందరూ సిరిపురం దాదా అంటారు. అతనికి ఈ విషయం తెలిస్తే అంతెత్తున లేస్తాడు__ ఇది ఉత్తుత్తి లవ్ గేమ్ మాత్రమేనని......కొంపలేం మునగవని తన అన్నయ్య సిరిపురం దాదాతో చెప్పాలని నిర్ణయించుకుంది సంధ్య.
రాత్రి ఆలోచనను నెమరువేసుకుంటూ వరండాలోకొచ్చి నిలబడిన సంధ్యకు ఎదురుగా రోడ్ కు రెండో వేపు హాస్పిటల్ గోడల్ని చూడగానే ఉదయాన్నే తల తిరిగినంత పనయింది.
గబ గబా వరండా మీద నుంచి పరుగెత్తుకొని హాస్టల్ లాన్ లోకి వెళ్ళి ఆ గోడ వైపు ఉక్రోషంగా చూసింది.
"సంధ్యా, నారాయణరావు ప్రేమ వర్ధిల్లాలి......"
"నాడు ఒక అనార్కలీ, నేడు ఒక సంధ్య, నాడు ఒక సలీమ్, నేడు ఒక నారాయణరావు....."
ప్రేమ ఒక చిరంజీవి..... కావాలంటే..... సంధ్య, నారాయణ రావుల్ని చూడండి....."
"సంధ్య, నారాయణరావుల మతాతీత, కులాతీత ప్రేమకు మద్దతు నివ్వండి...... ఓట్ ఫర్ లవ్......లవ్ ఈజ్ ఎటర్నల్"
గబ గబా సంధ్య హాస్టల్ మెయిన్ గేట్ లోంచి బయటికెళ్ళి, హాస్టల్ కు అటూ ఇటూ ఉన్న గోడల వైపు చూసింది.
ఎటు చూస్తే అటు గోడల నిండా లవ్ స్లోగన్లే- ఆ గోడల ముందు మూగిన రోడ్డున పోయే జనం..... ఆసక్తిగా ఆ స్లోగన్లను చదువుతూ, నవ్వుతూ డిస్కషన్ చేసుకోవడంతో-
ఒళ్ళు మండిపోయింది ఆమెకు.
గోడల మీద రాతల్ని ఎవరు రాసుంటారు? ఎలాగయినా తనను కమిట్ చేయించాలని ఉద్దేశంతో ఆ నారాయణరావ్, తన గ్యాంగ్ తో ఈ కార్యక్రమానికి ప్లాన్ చేసుంటాడు.
ఎలాగయినా తనని ప్రేమించేటట్టు చేసుకోడానికి నారాయణరావ్ గోడల మీద రాతలకు దిగాడన్నమాట.
హమ్మ..... నారాయణరావ్.....చెప్తా.....ప్లాన్ లన్నీ..... నీ దగ్గరే ఉన్నాయా..... నా హెడ్ లో కూడా బోల్డు ప్లాన్లున్నాయి. వాటితో నిన్ను తిప్పికొట్టకపోతే నా పేరు......సంధ్యే కాదు. అని సీరియస్ గా అనుకొని, గబ గబా హాస్టల్ లోకి వచ్చేసి బాత్ రూమ్ లోకి దూరిపోయింది సంధ్య.
* * * *
ఆర్ట్స్ కాలేజీ పోస్టాఫీసులోంచి ఆదరా బాదరాగా బయటికి వచ్చిన జుత్తులజిన్నా అటూ ఇటూ చూస్తూ నడవడం ప్రారంభించాడు.
వాడికోసమే ఎదురు చూస్తున్న నారాయణరావు చెట్టు చాటున దాగున్న శ్రీరాముడి టైపులో బయటికొచ్చి ఒక్క ఉదుటున జిన్నా జుత్తును పట్టుకున్నాడు.
"భయ్యా నువ్వా..... నీ కోసమే నీ రూమ్ కొస్తున్నారా..... నువ్వేమిటీ ఇక్కడ ఉన్నావ్? సంధ్యా, నువ్వు మీట్ అవుతున్నారా ఇక్కడ" కొంచెం సీరియస్ నెస్ ను నటిస్తూ అన్నాడతను.
"నోర్మూయ్.....మీటింగూ లేదు షూటింగూలేదు___వాసుదేవ్ గా డెక్కడరా" అంతకన్నా సీరియస్ గా అడిగాడు నారాయణరావు.
"ప్రింటింగ్ ప్రెస్ లో ఉన్నాడు. రాత్రంతా వాళ్ళందరకూ కళ్ళమీద నిద్దర్లు లేవురా.....పాపం" అని చెప్పేసి నాలిక్కరుచుకున్నాడు జుత్తులజిన్నా.
"అందరూ ప్రింటింగ్ ప్రెస్ లో ఉన్నారా- నిద్దర్లు లేవా- ఇంతకీ గూడుపుఠాణీ ఏం చేసార్రా. అవును గానీ ఒరేయ్ మన ఒప్పందంలో లేనివన్నీ పెట్టి నా జీవితంతో ఆడుకుంటున్నార్రా.....ఇది ఘోరంరా" కొంచెం గాద్గదికమైన గొంతుతో అన్నాడు నారాయణరావు.
"ఒరేయ్ రావూ__ఉత్తుత్తినే అలా ఫీలై పోతావేట్రా.....ఇంతకీ ఏం జరిగిందిరా?"
"ఏం జరిగిందా.....మార్నింగ్ జగదంబా జంక్షన్ కి టీ తాగడానికొచ్చాను......జగదాంబా గోడలమీద, బస్టాప్ పైన....సిమెంట్ రోడ్లమీద, సిరిపురం జంక్షన్ లోనూ ఎక్కడ చూస్తే అక్కడ___సంధ్యమీద, నా మీద ఆ స్లోగన్ లేమిటిరా___అన్యాయంగా" బాధను వ్యక్తం చేశాడు నారాయణరావు.
"అవును....ప్రేమ స్లోగన్లు__మొన్న మన స్టూడెంట్స్ యూనియన్ చేసిన తీర్మానం మేరకు నిన్నూ___మా వదిన సంధ్యనూ కలపడానికే ఆ స్లోగన్లురా....అంతే దట్సాల్"
"ఆ అమ్మాయి నన్ను ప్రేమించిందనుకో.....నేను ఆ అమ్మాయిని ప్రేమ్నిస్తాను. ఆ ప్రేమ మా ఇద్దరి పర్సనల్ వ్యవహారం అంతే. మధ్యలో గోడలమీద ఈ స్లోగన్ లు రోడ్లమీద......రాతలూ.....ఇవన్నీ ఎందుకురా?"
"అరే భయ్యా___మీరిద్దరూ ఏవో కొన్ని కారణాలంటూ చెప్తూ, మేం ప్రేమించుకోం అని భీష్మించుకున్నారా లేదా___అందుకే నిన్నంతా మా జనరల్ బాడీ మీటింగ్ వేసి, అర్జంటుగా మీ ఇద్దర్నీ కలపాలని నిర్ణయం చేసుకుందిరా.....ఆ నిర్ణయం మేరకు" అసలు విషయాన్ని తాపీగా చెప్పాడు జుత్తులజిన్నా.
"ఇది నాకు నచ్చలేదురా.....ఈ గొడవలన్నీ ఈ వైజాగ్ వరకే పరిమితం కావాలిరా......ఏ మాత్రం ఈ ఊరుదాటి బయటికెళ్ళినా, ముఖ్యమ్గా మా బామ్మ కాంతమ్మకు మ మేనమామ సత్యనారాయణకు తెల్సినా......పెద్ద గొడవై పోతుందిరా" బేలగా ముఖం పెడుతూ అన్నాడు నారాయణరావు.
"వాళ్ళకెలా తెలుస్తుందీ.....కంగారు పడకు.....ఈ న్యూస్ ఊరుదాటి వెళ్ళకూడదని ఈ రోజు జనరల్ బడీ మీటింగ్ లో......ఒక రూలింగ్ ఇస్తాలే" అని ఏదో జ్ఞాపకం వచ్చి కెవ్వుమని అరిచాడు జుత్తులజిన్నా,
"ఏమైందిరా" కంగారుపడిపోతూ అడిగాడు నారాయణరావు.
"ఏం లేదు.....సిటీనుంచి, పల్లెటూళ్ళ వేపు వెళ్ళే బస్సులమీదకూడా ఈ స్లోగన్ లు రాయాలని.....నిన్న ఎవరో సూచించార్రా అది జ్ఞాపకం వచ్చి......"
దాంతో నారాయణరావు గుండెల్లో పెద్ద రాయి పడింది.
"రూరల్ ఏరియావేపు వెళ్ళే బస్సులమీద ఈ స్లోగన్ లు రాయాలని సూచించినవాడ్ని ఈ రోజే చంపి, రేపు జైలుకెళతా.....నాకసలే పట్టుదల ఎక్కువ" రాజనాలలా ఫేస్ ఫీలింగిచ్చాడు.
"అంతలా ఇదైపోకు__సమస్యను.....సామరస్యంగా పరిష్కరించుకోవాలి అండర్ స్టాండ్. నువ్వూ, ఆ సంధ్యా ఇద్దరూ భేదాభిప్రాయాలను విడిచిపెట్టేసి ఎట్టి పరిస్థితుల్లోనూ మేం ప్రేమించుకుంటాం.....అని మా జనరల్ బాడీకి చెప్పారనుకోండి-మరి గొడవలుండవుగా-ఈ గోడల మీద రాతలాగి పోతాయ్.....పోస్టర్లు కార్యక్రమం ఆగిపోద్ది ......" ఇంకా లిస్టును వరసగా చెప్పుకుపోతున్న జుత్తులజిన్నావేపు ఆశ్చర్యంగా, కోపంగా, నిస్సహాయంగా చూస్తూ వుండిపోయాడు నారాయణరావు.
"అంటే ఎక్కడ బడితే అక్కడ బానర్లూ అవీ కట్టి, ఊరేగింపులూ అదీ తీస్తున్నారా" గొంతు తడారిపోతున్న దశలో అడిగాడు నారాయణరావు.
"అవును.....జనరల్ బాడీ చేసిన సూచనను, మా స్టూడెంట్ సభ్యులందరూ తూ చా. తప్పకుండా ఆచరించాలి. తప్పదుకదా.....వస్తా" అప్పుడే వచ్చి ఆగిన సిటీబస్సు డోర్ పట్టుకుని డేగలాగ ముందుకెళ్ళి పోతున్న జుత్తులజిన్నావేపు కసిగా చూసి నిట్టూర్చి, వెనక్కి తిరిగాడు నారాయణరావు.