Previous Page Next Page 
తిలక్ కథలు పేజి 16

   
    అతను తిరిగి సత్రంవద్దకు వెళ్ళి అరుగుమీద ఓ మూలగా కూర్చున్నాడు. ముష్టివాళ్ళు కొందరు అరుగుమీద పడుకుని కబుర్లు చెప్పుకుంటున్నారు. ఎవరి తాలూకు కుండలూ బట్టలు వాళ్ళ దగ్గర ఉన్నాయి. మాసిపోయిన చీలికలైన బట్టలూ, సంస్కారంలేని జుట్టూ, సిగ్గూ, సభ్యత లేకుండా కనపడే దుమ్ము కొట్టుకుపోయిన వొళ్ళూ - మురికి కాల్వల్లో గుంపులు గుంపులుగా కూడే ఓ రకం పురుగుల్లా ఉన్నారు. తననీ తన బట్టల్ని చూసుకున్నాడు. వాళ్ళకీ తనకి ఎంతో తేడా కనబడలేదు. అయితే వాళ్ళు బతుకుతున్నారు. ఎలాగో అలాగ బతుకుతున్నారు. ఇంత అసహ్యంగా ఎందుకు బతకడం? బతుకుమీద యింత మమకారం ఎక్కడ నుంచి పుట్టుకొస్తుంది? కాళ్ళూ కళ్ళూ లేకపోయినా రోడ్లవార డేకుతూ  "అమ్మా కబోదిని" అంటూ అరుస్తూ ఆక్రోశిస్తూ చస్తూ ఎందుకు బతుకుతారు? ఈ బతకడంలోని ఆకర్షణలో ఉన్న దగా అతనికి చటుక్కున తెలిసినట్టనిపించింది. ఇది పచ్చిమోసం. వెదవల్ని చేసి చేపల్ని చేసి గాలానికి కట్టి ఒక్కొక్కసారి నీటిలో ముంచుతూ ఆశపెడుతూ ఎవడో ఇంతమంది మనుష్యుల్ని కొంచెం కొంచెం చంపేస్తున్నాడు. ఏడిపిస్తున్నాడు. చిత్రవధ చేస్తున్నాడు.

    వెంకటేశ్వర్లు దీర్ఘంగా నిట్టూర్చాడు. అతను చచ్చిపోవాలని నిశ్చయించుకున్నాడు. బతకడంకన్న బరువైన బాధైన దింకొకటి లేదనిపించింది. తాను బతకలేడు. తన కుటుంబాన్ని బతికించలేడు. తాను చేతకానివాడు. తనలాంటి నిర్భాగ్యుల్నీ నిరుపాయుల్నీ దేవుడెందుకు పుట్టించాలి. సత్రం గోడనానుకుని కళ్ళుమూసుకుని తన జీవితాన్ని పర్యావలోకనం  చేసుకున్నాడు వెంకటేశ్వర్లు.

    తనకీ కష్టపరంపరలు తన ఉద్యోగం పోవడంతో ప్రారంభమయ్యాయి. ఎలిమెంటరీ స్కూల్లో మేష్టారై ఉన్నన్నాళ్ళూ ఏదోవిధంగా తిండిగడిచిపోయేది తనకీ తన కుటుంబానికీ , కాని తాను తెలివితక్కువవాడు. వెర్రివెధవ. లేనిదే స్కూళ్ళ ఇన్స్పెక్ట్రస్ కొంగుపట్టుకు ఎందుకు లాగుతాడు? తనకేం దుర్బుద్ధి లేదని అంటే ఎవరు నమ్ముతారు? ఆవిడ రెండురోజులూ ఇన్ స్పెక్షనుకు వచ్చి తనతో హాస్యం చేస్తూ ఎందుకు మాట్లాడింది? తననీ తన క్లాసునూ పరీక్షిస్తూ ఎందుకు అలా నవ్వేది? తన యింటికి రమ్మనమని అన్ని పనులు ఎందుకు పురమాయించేది? తనంటే యిష్టం తనంటే సదభిప్రాయం ఉందనుకున్నాడు. ఆఖరిరోజు తన క్లాసులోకి వచ్చేసరికి తాను నిద్రపోతున్నాడు. నిజానికి అప్పుడే కునుకుపట్టింది.

    ఆమె తన్ని చెడామడా తిట్టింది. పిల్లల్ని ప్రశ్నలువేస్తే అందరూ తెల్లబోయి నుంచున్నారు. ఆమె రౌద్రాకారం తాల్చింది. తక్కిన మేష్టర్లందరూ చూస్తుండగా  "ఇదేం దూడల్ని కాయడం కాదు వెంకటేశ్వర్లుగారూ, మీకు బ్లాకుమార్కు వేస్తున్నాను" అని చెప్పి వెళ్ళిపోతోంది. తనకి భయం వేసింది. ఆమె వెనకాలే రోడ్డుమీదకు పరుగెత్తాడు.  "మేడమ్ మేడమ్" అంటూ ఏమిటో కంగారుపడిపోయాడు తను. వినిపించుకోకుండా వెళ్ళే ఆమె కొంగు పుచ్చుకుని  "మేడమ్" అంటూ లాగాడు. ఆమె పైట వూడిపోయింది. అందరూ ఫక్కున నవ్వారు. ఆమె  "బ్రూట్ బీస్ట్" అని నిప్పులు కురిపించి వెళ్ళిపోయింది. అంతే ఉద్యోగం ఊడిపోయింది.- ఆమె పైటకన్న బహిరంగంగా; అంతకన్న శాశ్వతంగా.

    అలా పైట. పట్టుకోవడం, లాగడం ఎంత తప్పో తనకి తెలియక కాదు. తన కంగారులో తనేం చేసినదీ తెలియదు. ఆమెను నిలబెట్టి ప్రాధేయపడాలనే అతని ఉద్దేశ్యం. కాని తాను దురద్రుష్టవంతుడు. అందుకే పెళ్ళాం దగ్గర్నుంచీ తనని వెధవకింద వాజమ్మ కింద చూస్తారు.

    తర్వాత ఏవో ట్యూషన్లు కుదుర్చుకున్నాడు. కాని ఏవీ నిలబడలేదు. తనలో లోపం ఏమిటో ఒక్కొక్కరే తన దగ్గర మానివేశారు. ఎన్నో ఉద్యోగాలకోసం ప్రయత్నించాడు. దొరకలేదు. దొరికినవి నిలుబడలేదు. తాను అభిమానాన్ని చంపుకున్నాడు. సినిమాగేటుదగ్గర టిక్కట్లు అమ్మాడు. ఆ ఉద్యోగమూ ఊడిపోయింది. సంచిలో అప్పడాలూ, సాంబారు పొడుమూ వేసుకుని యింటింటా తిరిగి అమ్మేవాడు. ఎవరూ తన దగ్గిర కొనేవారు కాదు. తనకి అమ్మజూపే చాకచక్యంలేదు. ఆఖరికి తన భార్య యిక్కడా అక్కడ వంటకి కుదిరి పిల్లల్ని పోషిస్తూ బతికిస్తూ వచ్చింది. తనని నలుగురూ తిట్టేవారు గడ్డిపెట్టేవారు. 


   "ముష్టెత్తు -దొంగతనం చెయ్యి - అంతేకాని ఆడదాన్ని వీధిలోకి తోస్తావా?" అనేవారు. తాను పొరుగూళ్ళు వెళ్ళాడు. యాచించాడు. కానీ అందరూ అతన్నీ, అతని యాచించే వైఖరినీ సందేహంగా చూసి,  "పోవయ్యా పో" అనేవారు. ఇంక దొంగతనం చెయ్యాలనుకున్నాడు. రైలుస్టేషను దగ్గర తారట్లాడేవాడు. ఎలా దొంగతనం చెయ్యాలో తెలిసేదికాదు. ఒక రోజున ధైర్యంచేసి రైలు పెట్టెదగ్గర తోసుకుంటూన్న జనంలో ఒకడి లాల్చీ జేబులో చెయ్యి పెట్టాడు. ఆ లాల్టీ మనిషి అతని జుట్టు పట్టుకున్నాడు. నలుగురూ గబగబా నాలుగు దెబ్బలు వేశారు. తన నెరుగున్న మాష్టరొకతను వచ్చి " ఇందులో ఏదో పొరపాటు ఉంది, అతను అలాంటివాడు కాదు" అని నచ్చచెప్పాడు కాబట్టి కాని లేనిదే తనని చంపేదురు.
   

 Previous Page Next Page