వెంకటేశ్వర్లు తిరిగి తిరిగి ఒంటిగంట దాటాక యింటికి వచ్చాడు. అతనికి ఎక్కడా బియ్యం దొరకలేదు. ఇంక దొరకవనీ, తాను సంపాదించలేననీ తెలిసికూడా ఊరికే వెర్రిగా పిచ్చిగా అలా తిరిగాడు. ఆకలీ, నిస్పృహో శీతాకాలపు మధ్యాహ్నపు ఎండా - మూడూ అతన్ని విమూఢుణ్ని చేశాయి. ఆఖరికి ఓ బియ్యం కొట్టు వద్దకు వెళ్ళాడు. యాచించాలని అతని ఉద్దేశ్యం. కాని "బస్తా ఎంత" అని అడిగాడు. షావుకారు యితని వెర్రి వాలకాన్ని చూసి ఓక్షణం సందేహించి "ఎనభై రూపాయలు" అన్నాడు.
"ఓహో" అని వెనక్కి తిరిగాడు వెంకటేశ్వర్లు. దారిలో సత్రం అరుగుమీద కూచున్నాడు కాస్సేపు. ముష్టివాళ్ళు కుండల్లో అన్నం వండుకుంటున్నారు. వాళ్ళకేసి ఆశగా, ఈర్ష్యగా చూశాడు. అతనికి తెలియకుండా కన్నీళ్ళు వచ్చాయి. చిన్నప్పుడేడిస్తే అమ్మా, నాన్నా ఓదార్చేవారు. ఇప్పుడు పెళ్లాం తిడుతుంది. పిల్లలు తెల్లబోయి చూస్తారు. అతను ఆకలికే ఏడవలేదు. బియ్యం దొరకలేదని ఏడవలేదు. అతను నిస్సహాయుడై ఏడ్చాడు. చాతకానివాడై ఏడ్చాడు. అతని ఏడుపుకి బలంలేదు. గుండెల్నీ గాలినీ చీల్చుకొని కొండలలో ప్రతిధ్వనించే ఆక్రేశం కాదు, బురదలోవున్న వానపాముమీద అడుగేసినప్పుడు ఆ వానపాము గిలగిలలాడి నీరసంగా నిశ్శబ్దంగా చచ్చిపోవడం లాంటి ఏడుపు. అసమర్ధుడి అసహ్యమైన ఏడుపు.
కళ్ళు తుడుచుకొని అలా అలా నడిచి వంతెనదాటి కాలవ వొడ్డున కొంతదూరం నడిచి మళ్ళీ వెనక్కి తిరిగి ఊళ్లోకి అక్కడ నుంచి తిన్నగా యింటికి వచ్చాడు. భయం భయంగా ఇంట్లో అడుగుపెట్టాడు. వీళ్లందరికీ యేమని చెప్పడం? వీళ్ళందరూ - పెళ్ళామూ, అయిదుగురు పిల్లలూ యే ఆకలివల్లనో చచ్చిపోయి పడివుంటే అతనికి ధైర్యమూ కులాసా కలిగేది. వాళ్ళు బియ్యం తేలేదేమని అడగరు. నిందాగర్పితంగా కసిగా దీనంగా తనకేసి చూడరు. కాని వాళ్ళలాగ చచ్చిపోలేదు. నడవలో నేలమీద భార్య కొంగు పరచుకొని ఉంది. ఇతను రాగానే కళ్లు తెరచి శూన్యంగా చూసి మళ్ళీ మూసుకొంది. 'అమ్మయ్య' చంటివాణ్ని వేసుకొని కూర్చుంది. ఆమె వాసాలకేసి చూస్తోంది. తడిలేని పెదవులతోతక్కిన పిల్లలెక్కడున్నారో కనపడడం లేదు.వెంకటేశ్వర్లు కూతురికి కూడా కనపడకుండా పెరట్లోకి వెళ్ళాడు. నూతిలోంచి నీళ్లు తీసుకొని కాళ్ళూ ముఖమూ కడుక్కుని బాదం చెట్టు కింద చతికిలపడ్డాడు.
అతనికి వొంట్లో నీరసం ఎక్కువవుతోన్నట్టనిపించింది. ఒక్క క్షణం మాత్రం నుయ్యీ, బాదంచెట్టుమీద కాకి గుండ్రంగా తిరిగాయి. అలాగే ఎండుటాకులమీద మేనువాల్చాడు. అతనికి వొళ్ళు బిగుసుకుపోతూన్నట్టు చచ్చిపోతూన్నట్టు అనిపించింది. భయం వేసింది. చచ్చిపోవాలన్న ఆలోచన అతనికి చాలాసార్లు కలిగింది. కాని యిలాగ వార్నింగ్ లేకుండా చచ్చిపోవడం కూడా చాతకాని వాడిపని అనిపించింది. "నేను వెధవని, వెధవన్నర వెధవని, చచ్చు వెధవని" అనుకున్నాడు. అతని కళ్ళమ్మట బొటబొట నీళ్ళు కారాయి. "బాబూ పేదవాణ్ణి రెండు రోజుల్నుంచి తిండిలేదు. కొద్దిగా బియ్యం యిప్పించండి. బాబూ. కరుణించండి" అని బియ్యం కొట్టువాణ్ని వేడుకుంటే యిచ్చేవాడేమో! ఎందుకు తానాపని చెయ్యలేకపోతున్నాడు? తాను చాతకాని వాజమ్మ కాబట్టి. ముష్టివాళ్ళు బతుకుతున్నారు. కాకులూ, గాడిదలూ బతుకుతున్నాయి. తనే బతకలేక పోతుననాడు.
ఇంటికి రాగానే భార్య తనని తిడుతుందని అనుకున్నాడు. కాని ఆమె ఏమీ మాట్లాడలేదు. అతనికో అనుమానం కలిగింది. వీళ్ళందరూ ఎక్కడేనా బియ్యం సంపాదించి వండుకు తిన్నారా? మరి తనకి పెట్టలేదేం? ఎవరూ పిలవరేం? అతనిలో ఆశ కదిలింది. మెల్లగాలేచి వంట ఇంట్లోకి చప్పుడు గాకుండా వెళ్ళాడు. అన్నంగిన్నె మూతతీసి చూశాడు. లోపల అన్నం ఉంది. ఓ పక్కగా యింత ఏదో పచ్చడి కూడా వుంది. ఇటూ అటూ భయంగా చూసి పచ్చడితో అన్నం గబగబా కలిపి నోట్లో పెట్టుకోబోయాడు. గభాల్న తలుపు తోసుకుని అతని భార్య వచ్చి అతని రెక్కపట్టుకుని వెనక్కి లాగంది.
"ఉదయం అనగా బియ్యం తీసుకొస్తానని వెళ్ళావు. ఇప్పుడొస్తావా? నేనూ పిల్లలూ ఏమౌతామనుకున్నావు? పాపం పెద్దపిల్ల ఎన్ని కొంపలో తిరిగి ఓ అర్ధశేరు బియ్యం ఎలాగో తీసుకొచ్చింది. లేనిదే నిన్న రాత్రి తిండిలేక యిప్పుడూలేక నీ కళ్ళు చల్లగా పిల్లలు చచ్చివుండేవాళ్ళు. నీకేం ఎక్కడో యింత బొక్కి ఉంటావు. వెర్రివెధవ నాలుగోవాడు ఇన్ని మజ్జిగ నీళ్ళు ఎవరినేనా అడిగి తెచ్చుకుంటానని వెళ్ళాడు. అన్నం తినకుండా. వాడికోసం అట్టేపెట్టిన అన్నం దొంగలా వచ్చి కాజేద్దామనుకున్నావా? కన్నకొడుకు కడుపు కొడదామనుకున్నావా!?" ఆమెల చాలా గట్టిగాఆవేశంగా అరిచింది. అంతలోనే అక్కడే కూలబడి వెక్కి వెక్కి ఏడ్చింది. వెంకటేశ్వర్లు నరనరాలు పీక్కుపోయాయి. అతనికేదో అసహ్యం - నోట్లో ఏదో అశుద్ధం పెట్టినట్టు -కలిగింది. అతనిమీద అతనికి అసహ్యం కలిగింది. అతనికి పెళ్ళాన్ని చూస్తే జాలి కలిగింది. కాపురాని కొచ్చిన కొత్తలో ఆమె ఎంత మధురంగా ఉండేది. ఇప్పుడెందుకిలా అయిందో అతనికి తెలుసును. అతను ఓదార్చాలనుకున్నాడు. ఏదో చెప్పాలనుకున్నాడు. కాని అక్కడ నుంచి లేచి మళ్ళీ వీధిలోకి వెళ్ళిపోయాడు.