నలభై ఏళ్లు పైబడిన తాను, తన సభ్యతకీ, స్వభావానికీ విరుద్దమైన పనులన్నీ బతకడంకోసం చేశాడు. కాని దాని ఫలితంగా మరింత అవమానాన్ని,, దుఃఖాన్ని కొని తెచ్చుకున్నాడు. ఇంకా తనిలాగ ఎన్నేళ్ళు ఆకలితో బతకగలడు? తన కుటుంబానికి ఏం దారి చూపించగలడు? భయంకరమైన నిస్సహాయత అతన్ని చుట్టుకుంది. అతనికి చీకట్లోకి జారిపోతున్నట్లు చీకటి నీళ్ళలో పీకలోతు మునిగిపోతూన్నట్లు ఉంది. నీరసంవల్ల అతని కాళ్ళూ చేతులూ లాగుతున్నాయి. అతనికలా గోడనానుకుని ఆలోచించే వోపిక కూడా లేకపోయింది.
అలా మగతగా నిస్త్రాణగా వున్న అతనికి 'నాన్నా' అన్న పిలుపుతో మెలకువ వచ్చింది. కళ్ళుతెరచి చూశాడు. అతని పెద్దకొడుకు పదేళ్ళవాడు 'అమ్మ రమ్మంటోంది' అన్నాడు.
"ఏం?"
"తింటానికి"
"ఏం తింటానికి?"
"అట్లు"
కొడుకు వెనక్కాలే బయల్దేరి వెళ్ళాడు వెంకటేశ్వర్లు. భార్య అతని కోసం గడపదగ్గర నిరీక్షిస్తోంది."రండి నాలుగు అట్లుతిందురుగాని" అని ఎంతో ఉత్సాహంతో అంది. "సూరమ్మ నోము చేసుకుంది. పిల్లలం మేమూ అందరం వెళ్ళి తిన్నాము. ఇంక రేపటి వరకూ బాధలేదు. ఈ అట్లు మీకోసం చీర చెరగులో దాచేసి తీసుకొచ్చాను" అంది అట్లు పెడుతూ, "ఇంకా మొగుడనీ,వ ాడికి తిండిలేదనీ శుష్కించిన ఈ స్త్రీ ప్రాణిలో మమతా బాధా ఉన్నాయేఁ" అనుకున్నాడు వెంకటేశ్వర్లు. ఆ ఆదరణకే అతని కంఠం రుద్దమైంది. అట్లు నోట్లో పెట్టుకున్నాడు. అతనికి రుచి తెలియలేదు. ఆకలితో గిలగిల్లాడిన నాలిక ఎండిపోయింది. అయినా గబగబా అన్నీ బొక్కేసి మంచినీళ్ళు తాగాడు. చీకటి పడుతోంది. అతను పెరటి అరుగుమీద పడుకున్నాడు. బాదంచెట్టు కొమ్మల్లంచి రెండు నక్షత్రాలు కనబడుతున్నాయి. పక్కింటిలోంచి ఏదో పాట వినవస్తోంది. చీకటి నల్లని యిసుకలా రాలుతూ ఆ పాటతో కలిసి అతనికి వొళ్ళంతా గుచ్చుకుంటున్నట్టు ఉంది. అతనికి నిస్పృహలాంటి మూర్ఛలాంటి నిద్రపట్టింది.
కాస్సేపటికి భార్యవచ్చి అతన్ని కుదుపుతూంటే మెలకువ వచ్చింది. అతను లేచి కూర్చుని "ఏం" అన్నాడు.
"తొమ్మిదవుతోంది. జయా, రెండవదీ సాయంత్రమే ఎక్కడికో వెళ్లారు ఇంకా రాలేదు."
"ఉహూఁ" -తన కెందుకు చెపుతోందీ విషయం!
"ఉహూఁ అంటే చాలా! ఏమైపోయారో ఏమో? కన్న కూతుళ్లుకారా! ద్రాపిలాగ ఉహుఁ అంటావా!"
మళ్ళీ తిట్లు. ఎప్పుడూ తనకి తిట్లే. ఏదో ఒక క్షణం - క్షణంలో సగం - ఆమె కాస్త అనురాగం చూపిస్తుంది. ఆ తర్వాత ఎప్పుడూ కసరడం. తిట్టడం - అవును. ఇంతమంది పిల్లలు ఆకలితో ఆమెను రంపంలా కోతపెడుతూంటే తల్లిప్రాణం బాధతో కరుడుకట్టుకుని యజమాని అయిన తనమీద, తన చేతకానితనపు బండరాతిమీద తలకొట్టుకు ఏడుస్తుంది.
పెళ్ళాం కన్నీళ్లు పెట్టుకుంటూ చెపుతోంది.
"పదిహేడేళ్ళు వచ్చాయి. ఓ ముద్దూ ముచ్చటా ఎరగదు. వీళ్ళ ఇళ్ళకీ. వాళ్ళ ఇళ్ళకీ వెళ్ళి ఇదిలేదు అదిలేదు అని బతిమాలి ఏదో ఒక పూట కాకపోతే మరొక పూటయినా యింత తీసుకొచ్చి పడేస్తుంది. ఎదిగిన పిల్ల -పెళ్ళీ పెటాకులు యింకెక్కడ? తిండిలేకపోతే - పాపం తమ్ముళ్ళని చూసి బాదపడుతుంది. "నాన్న వెర్రివాడే. ఏమీ అనకే! పాపం ఏం చేస్తాడే" అని బాధపడుతుంది. జ్వరమొస్తే పిల్లల్ని ఆచారిగారి దగ్గరికి మోసుకెళ్ళి వైద్యం చేయిస్తుంది. ఇంట్లో ఉంటేనే దానికి ఏదో బాధ, నన్ను చూసినా, శ్మశానంలాంటి యిల్లు చూసినా, అందుకే ఇక్కడ అక్కడా కూర్చుని వస్తుంది. "ఏమి చెయ్యను చెప్పండి. నాకు వంట పని కూడా దొరకటంలేదు."
ఆమె వెక్కి వెక్కి ఏడుస్తుంది. అతనికి కడుపుమీద కత్తిపెట్టి సన్నగా నాజూకుగా చీలుస్తున్నట్టు వుంది. ఆమెకి చెపుదామనుకున్నాడు తను చచ్చిపోవాలనుకున్న నిర్ణయం. చటుక్కున ఆమె "పీడ వదుల్తుంది" అంటే -తను చచ్చిపోతూ కూడా సుఖపడలేడు.
అతను చాపమీద పడుకున్నాడు. పెద్దకూతురు, రెండవ కూతురూ వచ్చారు. ఆమె ఏడుపు ఆపి లోపలికెళ్ళింది. అతను చీకట్లోకి చూస్తూ ఆలోచిస్తున్నాడు. నిజమే. జయకి పెళ్ళి చేసేస్తే ఆమైనా సుఖపడుతుంది. కాని ఎవరు చేసుకుంటారు. ఎవరు పెళ్ళి చెయ్యడం! జయ అందమైనది కాకపోయినా అనాకారి కాదు. ఇంత దరిద్రంలోనూ బాధలోనూ యౌవనం విచిత్రంగా పరిపుష్టంగా ఆమెలోకి ప్రవేశించింది. ఎత్తయిన పిల్లేమో నదరుగా ఉంటుంది. అయితేనేం ఇంత పరమ దౌర్భాగ్యుడి కూతురికి పెళ్ళి ఎలా జరుగుతుంది! ఏ రెండో పెళ్ళివాడైనా మూడో పెళ్ళివాడైనా సరే.... ఓ పిడికెడు బియ్యం సంపాదించలేనివాడు పెళ్ళికొడుకుని తీసుకురాగలడా! తనకి ఓ గౌరవమా, ప్రతిష్ఠా ఎవడైనా ముసలివెధవైనా గుమ్మం తొక్కడానికి.....
ఏదో ఎలక అతని పక్కనుంచే పరిగెత్తినట్టు అతనికి తెలుసును. అంతే అతనికి నిద్రపట్టేసింది.