Previous Page Next Page 
మధుకీల పేజి 16

    దగ్గరగా వచ్చాడతను. బస్టాండు చాలా రద్దీగా వుంది- క్యూ కొండవీటి చేంతాడంత వుంది? ఎండ కొద్ది కొద్దిగా మాడ్చేస్తుంది ముఖంపై పడుతున్న చెమటని - కర్చీప్ తో తుడుచుకుంటూ ఎప్పుడెప్పుడు తన బస్ వస్తుందా అని ఎదురు చూస్తుంది వసంత. ఆమెకి సుధాకర్ పిలుపు చిరాకుగా వుంది.
    "పిలిస్తే పలకటంకూడా చిక్కుగానే వున్నట్టుందే? కాలేజీ ఎప్పుడూ వుండేదే! ఈ రోజుకీ రేపుకీ అందులో మార్పు లేదు- ఎంజాయ్ చెయ్యటంలోనే హాయ్ వుంది - బ్రహ్మాండమైన పిక్చర్ రిలీజవుతుంది 'షోలే' వస్తావా?"
    వసంత అతని ముఖంలోకి చూసింది.
    "ఓ మెహబూబా! మెహబూబా! ఆ పాట వింటే చాలు మనసు పరవశిస్తుంది. ఎంతెంత దూరాన్నించో జనం పరిగెత్తికెళ్ళి హైద్రాబాద్ లో సినిమా చూసివచ్చారు, మనం వున్న వూరుకి వచ్చినా చూడకుండా సినిమావాళ్ళు యేడ్చిపోరూ!"
    "నిజం!"
    "నిజం వసూ! సినిమావాళ్ళంతా మనల్ని నమ్ముకునే సినిమాలు తీస్తారు? ఉద్యోగస్తులకీ తీరిక చిక్కదు- ఫ్రీగా చూడాలనుకుంటారు - ముసలాళ్ళకి పట్టదు ఆడాళ్ళ క్లాసు చిక్కదు. ఇక సినిమావాళ్ళకి రాజపోషకులం మనమే? చూడు అలాటి మనమే చదువనీ, కాలేజీ అని సినిమాలు చూడకపోతే ఎలా? పరీక్షలంటే మనకోసం సంవత్సరానికి రెండుసార్లు మార్చి-సెప్టెంబర్లలో వస్తున్నాయ్, ఎందుకు తెలుసా? పాపం వీళ్ళు సినిమాలనీ అవనీ ఇవినీ టైం వేస్టుచేసి-యస్ అన్నట్టు మనం టైం వేస్తే చేస్తున్నాం-సినిమాకి టైం కావచ్చింది, నీవు వూ అంటే ఆటోని కేకేస్తా అదిగో ఆటో! ఏయ్ అటో!"
    ఆమె కాస్త జంకింది. తెలిసిన ముఖాలు ఏమైనా వున్నాయా అని చూసింది- క్యూను వదలి ముందుకు కదిలింది. ఇంతవరకూ తనకుతప్ప పక్కవాడికి కూడా వినిపించనంత మెల్లిగా మాట్లాడుతున్న అతని చాతుర్యాన్ని మెచ్చుకుంది.
    ఆటోలో వసంతని తన పక్కకి ఆహ్వానించాడు సుధాకర్.
    "వెర్రిపిల్ల! ఎంత ఆలస్యం చేశావో చూడు, ఒక్కోబుద్ధి అంతే! అరగంట లెక్చర్ యిస్తే కానీ తలూపరు అదే ప్రేమ అయితే కనుబొమ్మ కదలికకే కదలి వస్తుంది."
    "ఏమో! నాకు భయ!"
    "ఎందుకు?"
    "ఎవరైనా చూస్తే?"
    "చూస్తే ఏం? నీవేం దొంగతనం చేస్తున్నావా? లేక..."
    "కాలేజీ వదలి సినిమాలకి వెళ్ళటం తప్పుకాదా? అందునా..."
    "పరాయి కుర్రాడితో..."
    తలూపింది.
    "నేను పరాయివాడినా? క్లాసుమేటుని - వీధి మేటుని- ఊరి మేటుని..."
    నవ్వింది వసంత.
    "అలా అయితే ఇక అమ్మాయిలు కాలేజీకి వెళ్ళాల్సిన అవసరమే వుండదు. ఎప్పుడూ ఓ వొకరో పిలుస్తూనేవుంటారు."
    "వెళుతూ వుంటావా?"
    "నో! నో! షోలేకి నీవు పిలుస్తున్నావని వస్తున్నాను."
    "థాంక్స్!" అని ఆమ నడుంమీదుగా చేయివేశాడు. కాస్త ఇబ్బందిగా కదిలింది వసంత. అంతలో ధియేటరు వచ్చింది మీటర్ చార్జిపై ఒక రూపాయి యెక్కువిచ్చి కదిలేడతను.
    గేటుదాటి వెళ్ళగానే వెక్కిరిస్తున్నట్టుగా హవుస్ ఫుల్ బోర్డు కనిపించింది. మూడుక్లాసులూ అయిపోయాయి. బ్లాకులో కూడా ఎవరూ అమ్మిందిలేదు. వెళ్ళి మేనేజర్ని కలిశాడు సుధాకర్. జస్ట్ రెండు టిక్కెట్లంటూ 'సారీ' అన్నాడతను చిత్రంగా ముఖంపెట్టి. పైగా మరోవారంవరకూ ఎడ్వాన్స్ బుకింగ్ వుందంటూ చెప్పాడు.
    ఉస్సురని నిట్టూర్చి వసంత దగ్గరికి వచ్చాడు.
    "సారీ వసంతా ఉయ్ ఆర్ లేట్! నో యూజ్"
    "మరి ఏం చేద్దాం"
    "ఏదయినా మరో సినిమాకి వెళదామా?"
    "ఫ్చ్! నా కిష్టంలేదు"
    "మరి"
    "కాలేజీకి వెళదాం"
    "నో! నో! డిసప్పాయింటెడ్ మనసుతో వెళితే ఒక్క ముక్కకూడా బుర్రకెక్కదు. అనవసరంగా మూడుగంటలు వేస్టే చేయాల. పోనీ ఓ పని చేద్దామా-
    భయం భయంగా చూసింది ఆమె.
    "నో ఫియర్స్..."
    "నో థాంక్స్! నేను కాలేజీకి వెళతాను"
    "వసంతా! నా మాటవిను లైఫ్ ఎంజాయ్ చేయటానికే వుండేది? ఊరికే ముసలమ్మలా పురాణం చెప్పకు... కమాన్"
    "సుధాకర్! ఏమిటి నీ ఉద్దేశ్యం?"
    "ఉద్దేశ్యం! నథింగ్... జస్ట్ ఫర్ ఫన్నీ... సినిమాకి వచ్చాం టికెట్టు దొరకలేదు. ఈ ఎండలో నడుస్తూనో బస్సులోనో కాలేజీకి మళ్లా వెళ్ళాలి, ఎనిహౌ వుయ్ ఆర్ లేట్ ఇద్దరం కలిసి ఆలస్యంగా వెళ్ళాలి... అదో న్యూసెన్స్. అందుకే కాలేజీ పేరెత్తకుండా మరో విధంగా కాలం గడుపుదామన్నాను."

 Previous Page Next Page