Previous Page Next Page 
మధుకీల పేజి 15

    జవాబు చెప్పలేదు సుందర్రావు.
    'అయినా నీకేమయ్యా జమా జెట్టీల్లాంటి కుర్రాళ్ళిద్దరు వున్నారు. బంగారు బొమ్మలాంటి కూతురుంది. దేవతలాటి భార్యవుంది. నీ బాధ బాధే కాకుండా చూసుకోగలరు'
    'అదంతా ఒట్టి ఆశ పాపయ్యగారూ! ఎంత బంగారమయినా తగినవాడికిస్తేనే జీవితం శోభించేది. మా అమ్మాయిని మా చెల్లెలి కొడుక్కి ఇవ్వాలనుకుని ప్రయత్నం చేశాను- దానికి మా మధు చాలా చిక్కు తెచ్చిపెట్టాడు.'
    'మీ మధా! కుర్రాడు మంచివాడేనే!'
    'ఏం మంచో! చాలా మంచి! ఆ అమ్మాయిని చేసుకోరా అంటే వినలేదు.'
    'ఎందుకట?'
    'ఎవర్నో ప్రేమించాడుట?'
    'మరి ప్రేమిస్తే ఆ అమ్మాయిని కాదనటం తప్పుకదా'
    'తండ్రి ఇచ్చిన మాట నిలుపొద్దా?'
    'సుందర్రావు! నీదంతా చాదస్తమయ్యా! ఈ కాలం కుర్రాళ్ళంతా అంతేనయ్యా, తలిదండ్రులకి చిక్కులేకుండా జోడు వాళ్ళే వెతుక్కుంటున్నారు. మా అమ్మాయీ అంతే.'
    'మీ అమ్మాయా! ఆమెకేమండీ బుద్ధిమంతురాలు. చదువుకుంది. చక్కగా వుద్యోగం చేస్తుంది.'
    'మీరో మాట అన్నారంటే నిజమేననుకోండి. కానీ మా అమ్మాయి ఓ కుర్రాడిని ప్రేమించి రిజిష్టర్ మేరేజ్ చేసుకుంది. పైగా ఇప్పుడు మూడునెలల గర్భవతి.'
    సుందర్రావు మౌనం వహించాడు.
    మళ్ళీ పాపయ్యే అన్నాడు.
    'ప్రేమించింది, మనసిచ్చింది! బావుంది. అంతటితో ఆగకుండా శరీరమూ అర్పించింది అతన్ని నమ్మి. పాపం ఆ కుర్రాడూ బుద్ధిమంతుడే- పరువు నిలిపేందుకు పెళ్ళి చేసుకున్నాడు. ఇక వున్నదల్లా అ అబ్బాయి తలితండ్రుల విషయమే'
    'ఇంతకీ ఎవరండీ ఆ అబ్బాయి!'
    'ఇదిగో సుందర్రావు. ఈ జిత్తులన్నీ నా వద్ద పారవు. నేను నీ ఇంటికి ఎన్నడయినా వచ్చానటయ్యా ఇన్నేళ్ళ సర్వీసులో! ఈ రోజు ఎందుకొచ్చానంటావు. అన్నీ తీరిపోయినా ఒకమాట అనాలికదా అని వచ్చాను.'
    'పాపయ్యగారూ!'
    'అవునయ్యా! మీ అబ్బాయి మధునిగురించే వచ్చాను. మా అమ్మాయిని ప్రేమించిన కుర్రాడు మీ ప్రబుద్ధుడే! యే మాటకామాటే చెప్పుకోవాలి. ప్రేమించి పరిస్థితుల్ని పరాకాష్ఠకి తెచ్చినందుకు నాకు పని కల్పించకుండా పెళ్ళి చేసుకున్నారు. ఆ ఇప్పుడు చెప్పు ఇంకా అబ్బాయికి పెళ్ళి ప్రయత్నాలు చేస్తావా? చెప్పు- జైలుకు వెళ్ళే ఇష్టముంటే కానివ్వు-'
    "పాపయ్యా!"
    "పాపయ్యగారూ అను నీ కొడుక్కి నా కూతుర్నిచ్చినంత మాత్రాన నా స్టేటస్ తగ్గలేదు గుర్తుంచుకో. మరియాదగా కొడుకునీ కోడల్నీ ఇంటికి తెచ్చుకుంటే సరి- లేదా వాళ్ళిద్దరూ వేరు కాపురం పెడతారు లేదా నా వద్దే వుంటారు. నాకు మాత్రం ఇంకెవరున్నారు అమ్మాయి తప్ప"
    సుందర్రావుకి గొంతు పెగల్లేదు.
    పాపయ్య లేచాడు.
    "ఇదిగో సుందర్రావూ! మీ ఇంట్లో వాళ్ళకి చెప్పు. ఇక గింజుకుని ఫలితంలేదు. అన్నట్ట వారం రోజుల్లో రిసెప్షన్స్ ఏర్పాటుచేసి ఆ మూడు ముళ్ళూ వేయిస్తాను. ఇష్టంవుంటే వచ్చి నాలుగక్షింతలు వెయ్యి లేదా ఇక ఇంతే" అని వెళ్ళిపోయాడతను.
    దిగాలుపడిపోయి కూర్చుండి పోయాడు సుందర్రావు.
                         *        *        *
    "హాయ్! వసంతా!"
    ఉదయం తొమ్మిదిగంటలు దాటి వుంటుంది- కాలేజీకి వెళ్లాలని బస్ స్టాపులో నుంచుంది వసంత. ఆమె సుధాకర్ క్లాస్ మేట్. ఉదయమే మార్నింగ్ షో తో ప్రారంభం కాబోతున్న ఓ సినిమా చూడటానికి వెళుతున్నాడు అతను. తోడెవ్వరూ దొరకలేదతనికి.
    "సినిమా ఒంటిగా చూడటంలో ఓ హాయి వుంది. ఏదైనా కొత్త స్నేహం దొరకొచ్చు? జీవితంలో బాగా అనుభవం సంపాదించుకున్న చేయి దొరకవచ్చు? లేదా కొత్తగా రుచి చూడబోయే కమలాంగి దొరకవచ్చు? కానీ అదంతా లక్ మీదా ఛాన్స్ మీదా ఆధారపడి వుంటుంది. అయితే ఒక్కోసారి చెడును కొట్టొచ్చు, గడుగ్గాయి యెవరయినా తిరగబడి అల్లరి చెయ్యొచ్చు ఇంకా కాస్త కారం తిన్న సరుకైతే చేయి చాచేవరకూ రావచ్చు.
    అందుకే ముందుగానే తోడు తీసుకుని వెళితే ఏ చిక్కు లేదు. ఆడ ఫ్రెండ్ లేనప్పుడే మగాడిజత అవసరం? అదీ తన ఖర్చుమీద తీసుకెళ్ళే ఫ్రెండ్ అయితేనే మంచిది లేకపోతే అంతాక్షవరమే! సినిమాకీ, కిళ్ళీలకి, సోడాలకీ, సిగరెట్లకీ అంతా మనల్నే గొరుగుతారు! ఖర్చుచేసిన గాజులచేతికి ఖర్చు చేస్తే సుఖం వుంది? ఓ కోకాకోలా అందించినా ఓ కిళ్ళీ అందించినా ఆ హాయి వేరు? ఆ తృప్తి వేరు" ఇది సుధాకర్ పాలసీ.
    చురుకుగా చూసింది వసంత.

 Previous Page Next Page