పాల్ ముందుకురికాడు. జానకి ఉరికింది. జనాన్ని అదుపులో పెట్టారు. ఒక పద్ధతిలో అందరినీ ఎక్కిస్తున్నారు. చైర్మన్ చూచాడు ఫాదర్ ను__ముకుందంగారిని. ఇద్దరినీ జతగా చూశాడు. జంటగా చూచాడు. ఆశ్చర్యపడ్డాడు. ఆనందపడ్డాడు. వారిద్దరినీ పిలిచాడు. మెట్లు ఎక్కించాడు. ఒక క్రమంలో అందరినీ ఎక్కించాడు.
వరద పెరుగుతూంది. వాన హెచ్చుతూంది.
వరండా జలమయం అయింది.
వారు ఎక్కిపోయారు.
మెట్లు మునిగాయి.
ఉరుములు పెళపెళ మంటున్నాయి.
మెరుపులు తళతళ మంటున్నాయి.
ప్రకృతి విలయతాండవం చేస్తూంది.
జలప్రళయంలా వుంది. నీరు తప్ప ఏమీ కనిపించడంలేదు.
మేడమీద జనం తొక్కుకుంటున్నారు. నుంచోడానికి స్థలం లేదు. ఫాదర్ జాన్ సరసన ముకుందంగారు_ఇద్దరూ ఒరుసుకొని నుంచున్నారు. రమాదాసి, ఏసుదాసు అందరినీ కూర్చోపెట్టే ప్రయత్నంలో వున్నారు. ఆడవాళ్ళ అరుపులు_పిల్లల కేకలు అయోమయంగా వుంది. కల్లోలంగా ఉంది. కాళరాత్రిలా ఉంది. అందరినీ సర్ది కూర్చోపెట్టారు. జాన్ పక్కన ముకుందం, ముకుందం పక్కన జాన్.
ఫాదర్ జాన్ వణికిపోతున్నారు. తడిశారు. చలిగా ఉంది.
జ్వరం కూడా వచ్చినట్లుంది. జానకి చూచింది. ఫాదర్ వళ్ళు వేడిగా ఉంది. కూర్చోగలిగేటట్లు లేరు. పడుకొమ్మంది. ఫాదర్ జాన్ ముకుందం వళ్ళో తల పెట్టారు. కాళ్ళు ముడుచుకున్నారు, పడుకున్నారు. డాక్టర్ పాల్ కు విరామం లేదు. చాలామంది వణికిపోతున్నారు. జానకి విసుగు లేకుండా అందర్నీ సర్దుతూంది. చైర్మన్ చూచాడు. ఫాదర్ వణుకుతున్నారు. చప్పున ఒక రగ్గు తెప్పించాడు. కప్పాడు. ఫాదర్ జాన్ చైర్మన్ ను చూచాడు. కృతజ్ఞతతో వారి కళ్ళు నిండిపోయాయి. ఫాదర్ జాన్ ముకుందంగారిని చూచాడు. ముకుందంగారు తడిసి ఉన్నారు. నీరసంగా ఉన్నారు. వణుకుతున్నారు. వారి ఒడిలో తాను పడుకున్నాడు.
"ముకుందంగారూ! శ్రమ కల్గిస్తున్నాను" అన్నారు.
"మనమంతా మనుషులం. ఇంకా మాకులం కాలేదు. బాధ పడకండి" ముకుందంగారన్నారు. "చూడండి, మీవాడు ఎంత బాధపడుతున్నాడో పాపం! అతను లేకుంటే మనం ఎక్కగలిగే వాళ్ళమే కాము."
"మీ అమ్మాయి ఎంత మంచిది! ఎలాంటి ఏర్పాట్లు చేస్తుందో చూడండి?"
"పిల్లలు మనకంటే బుద్ధిమంతులు" ఇద్దరూ ఏకంగా అన్నారు. పెద్దగా ఉరిమింది. గుండెలు అదిరిపోయేట్లుంది.
ఫాదర్ జాన్ అదిరిపడ్డాడు. లేచి కూర్చున్నాడు. చేతులెత్తి ప్రార్థించాడు. "మహాప్రభూ! నన్ను రక్షించు!" ముకుందంగారు చేతులు జోడించి ప్రార్థించారు. "మహాప్రభూ! నన్ను రక్షించు."
పాల్, జానకి చేతులెత్తి ప్రార్థించారు. "మహాప్రభూ, వీరందరినీ రక్షించు."
చైర్మన్ చకితుడైనాడు. ఫాదర్ జాన్ దగ్గరికి వచ్చాడు. వారిద్దరితో అన్నాడు: "చూశారా! మీ బిడ్డలు సర్వ జనుల కోసం ప్రార్థించారు. మీరు......"
"మా బిడ్డలు దొడ్డవారు" అన్నాడు జాన్.
తెల్లవారింది. చీకట్లు విడిపోయాయి. మబ్బులు విడిపోలేదు. వాన తాగలేదు, వరద తగ్గలేదు. హోరు వినిపిస్తూంది. ఏరు కనిపిస్తూంది. డాబా మీద ఒక క్రమం ఏర్పడింది.
ఒక బొర్ర షావుకారు ఒక మూల ఆక్రమించుకొన్నారు. భార్య, అతను కలిసి కోటగోడలా ఉన్నారు. మూలన స్టవ్ పెట్టారు, కాఫీ కాచుకుంటున్నారు. అది ఎవరికీ కనిపించడంలేదు. కాని, స్టవ్ చప్పుడు వినిపిస్తూంది. తెల్లవారడంతో పాపలు ఏడ్పు లంకించారు_పాలకోసం, ఫాదర్ జాన్ 'కాఫీ' అని పలకరిస్తున్నారు. ముకుందంగారు గుటకలు మింగుతున్నారు. రమాదాసి షావుకారు దగ్గరికి వెళ్ళింది. కాస్త పాలపొడి పెట్టమని అడిగింది. పిల్లలు అల్లాడిపోతున్నారన్నది. "అంత బాధపడేవారు తెచ్చుకోవాల్సింది. పాలపొడి ఇవ్వను పో" అన్నాడు.
జానకి షావుకారు దగ్గరికి వెళ్ళింది. "ఒక రోగి మూలుగుతున్నాడు. పసిపాపలు ఏడుస్తున్నారు. అట్లాంటప్పుడు ఒక్కరు కాఫీ త్రాగడం మంచిది కాదు. ఆ పాలపొడి ఇవ్వండి. అందరికీ అవుతుంది!" బ్రతిమలాడింది.
"ఎవరి జాగ్రత్త వారు పడాలి. మా పాలపొడి మీకెందుకిస్తాం?"
పాల్ దూరం నుంచి వింటున్నాడు. చైర్మన్ కూడా వచ్చేశాడు.
"మెల్లగా ఇస్తావా? లాక్కోమంటావా?"
"ఏం దౌర్జన్యం చేస్తావా? నేనివ్వను" స్టవ్ దగ్గరికి జరిగాడు.
"ఇదిగో ఇంతమంది ఏడుస్తుంటే నువ్వొక్కడివీ తాగడం న్యాయం కాదు. లాగండి పాల్ గారూ" చైర్మన్ అన్నాడు.
అందరూ "లాగండి_లాగండి" అని అరిచారు.
జాన్, ముకుందం కూడా అరిచారు.
బొర్ర షావుకారు లొంగాడు. స్టవ్ అప్పగించాడు. ఒక పొట్లం ఉంచుకొని మిగతావి ఇచ్చాడు.
"ఏమిటి దాస్తున్నావు? తే అదికూడా" జానకి లాక్కుంది. బొర్ర షావుకారు తెల్లబోయి చూచాడు.
మరి మాకూ కాఫీ" షావుకారిణి ఏడ్చినట్లు అడిగింది.
"అందరితోపాటు మీకు" చైర్మన్ అన్నాడు.
రమాదాసి, జానకి కలిసి పాలు తయారుచేశారు. చైర్మన్ పసిపాపలకు అందే ఏర్పాటు చేశాడు.
పాల్, ఏసుదాసు కాఫీ తయారుచేశారు. జానకి అందరికీ కాఫీ అందించింది_ఫాదర్ జాన్ కు అందించింది. అతడు ఆశీర్వదించాడు. తండ్రికి అందించింది. మెచ్చుకున్నారు. షావుకారుకు, షావుకారిణికి కాఫీ ఇచ్చింది రమాదాసి.
అందరూ కాఫీలు తాగుతున్నారు.
"ఇదే బాగున్నది. అందరితో మానం. ఎంత హాయిగా ఉంది" అన్నాడు షావుకారు. అంతా ఆశ్చర్యపడి చూశారు.
"నలుగురితో చావు పెళ్ళితో సమానం" అన్నాడు చైర్మన్.
"చాలా బాగా చెప్పారు చైర్మన్ గారూ!" అన్నాడు ముకుందంగారు.
"ఏమిటో?" అని ముకుందంగారిని చూశారు ఫాదర్ జాన్.
డాక్టరుకు చేతినిండా పని. ఒకరికి జ్వరం, ఒకరికి తలనొప్పి, ఒకరికి వాంతులు. జానకి, డాక్టర్ సతమతం అవుతున్నారు.
వంట ఏర్పాట్లలో ఉన్నారు. చైర్మన్, రమాదాసి, ఏసుపాదం సహాయం చేస్తున్నారు.
వంటలయినాయి.
భోజనాలయినాయి.
వాన తగ్గుముఖం పట్టింది. వరద గుంజుతున్నది.
సాయంకాలానికి తెరిపి ఇచ్చింది. వరద గుంజేసింది. ఇప్పుడు ఊళ్ళో వరద లేదు. ఏరు మాత్రం పారుతూంది. తుంపర సన్నగా రాలుతూంది. మబ్బు విడిపోతూంది. వేగంగా, దూదిపింజల్లా అదిరిపోతున్నాయి. గాలి వేగం హెచ్చింది. ఆకాశం ఒక దిక్కు నిర్మలం అయింది. నీలినీలి ఆకాశం కనిపిస్తూంది. ఎండపొడ తెల్లగా వచ్చింది. కొంతదూరం వ్యాపించింది. మాయం అయింది. మళ్ళీ వచ్చింది. దాగుడుమూతలాడుతూంది. నిజానికి ప్రాణ భయం తగ్గిపోయింది. ఇళ్ళు, వాకిళ్ళను గురించి ఆలోచన వచ్చింది. ఇళ్ళ కప్పులమీద జనం దిగారు. చైర్మన్ మేడమీద జనం కొందరు వెనకా ముందాడుతున్నారు, కొందరు దిగిపోతున్నారు.
ఫాదర్ జాన్ కొడుకును చూచాడు. వెళ్ళిపోదామా? అన్నారు. పాల్ జానకిని చూచాడు. జానకి అటు చూడ్డంలేదు. ఎటో చూస్తూంది. 'వెళ్ళొస్తాం' పాల్ అన్నాడు. జానకి విన్నది. అటు చూచింది. సరేనన్నట్లుంది ఆ చూపు. ఫాదర్ జాన్ లేచారు. పాల్ భుజంమీద చేయి వేశాడు. చైర్మన్ కుకృతజ్ఞతలు చెప్పారు. సాగిపోయారు-ఇద్దరూ తండ్రీకొడుకులు. ముకుందంగారు లేచారు. జానకి భుజంమీద చేయివేశారు. చైర్మన్ కు కృతజ్ఞతలు చెప్పారు. సాగిపోయారు ఇద్దరూ, కూతురూ తండ్రి. చైర్మన్ చూస్తున్నారు. వచ్చేటప్పుడు కలసి వచ్చారు. ఇప్పుడు విడిగా వెళ్ళిపోతున్నారు. ఆపదలు మనుషులను ఏకం చేస్తాయా అని ఆలోచించసాగారు. రామాదాసి, ఏసుదాసు కలసి కదిలారు. చైర్మన్ కు దండాలు పెట్టారు. సాగిపోయారు. వీరు వచ్చేటప్పుడు కలిసే వచ్చారు. వెళ్ళేటప్పుడు కలిసే వెళ్తున్నారు, అదేమిటి? ఆలోచించసాగాడు చైర్మన్.