"ఆ దొర్సాని యాడుంటున్నది?"
చెప్పాడు వంటమనిషి.
"బాగున్నదా?"
"ఏం బాగున్నది - పెన్మిటి చచ్చే - వలవల ఏడుస్తుంది."
"సర్లే పో వంట చేస్కో" పంపించేశాడు వంట మనిషిని.
విమలమ్మ వరవరరావుగారి మొదటి భార్య. వరవరరావు ఆ వూరికి కరణం. మంచివాడు. భక్తీ పరుడు. ఒకనికి చెడుపు చేసి ఎరుగడు. ఆతండటే ఆ ఊళ్ళో అందరికీ గౌరవం. ఎప్పుడూ పురాణాలు, సమారాధనలతో కాలం గడుపుతుండేవాడు. బోలెడు ఆస్తి వుంది. అలాగని గర్వపడేవాడు కాదు. పిల్లలు లేక వార్ధాక్యంతో మళ్ళీ పెళ్ళి చేసుకున్నాడు. కమలమ్మ సాద్వి. మంచి వయసులి ఉంది. ఆమెకూ చాలాకాలం పిల్లలు కలుగలేదు. ఈలోగా రజాకార్లు విరుచుకు పడ్డారు. ఊరు తగలబెట్టి వరవరరావుగారిని సజీవదహనం చేశారు. కమలమ్మను వీధిలో చెరిచారు. ఆమె ఆ రాత్రి బావిలో పడి ఆత్మహత్య చేసుకుంది. తల్లిగారి యింట్లో ఉన్నది విమలమ్మ. మాన ప్రాణాలు దక్కాయి. కానీ కనీసం భర్త శవాన్ని చూచుకోలేదు. కాలం కన్నెర్ర చేసింది. తల్లిగారిల్లూ బుగ్గి అయింది. ప్రస్తుతం ఒక్కతీ పట్నంలో తల దాచుకుంటుంది. ఆమెకు పల్లెలో లంకంత ఇల్లుంది. రాముడికి జానెడు జాగలేదు. ఆలోచించాడు రాముడు. విమలమ్మ ఇంటికి వెళ్ళాడు.
పిలుపు విన్నది విమలమ్మ. ధ్వని గుర్తించి గుమ్మంలోకి వచ్చింది. ఒక్క క్షణం దీక్షగా చూస్తే గాని రాముణ్ణి గుర్తించలేదు. గుర్తించగానే ఏనాటిదో దుఃఖం పొంగి వచ్చింది. ఏడ్చేసింది. స్థాణువై నుంచున్నాడు రాముడు. ఎందుకు ఏడుస్తున్నది అర్ధం కాలేదు. తరువాత అర్ధం చేసుకున్నాడు. వరవరరావు పోయిన్నాటి నుంచీ తాను కనిపించలేదు. చావు అందరికి వస్తుందని ఓదార్చాడు. నలుగురితో నుంచి అనిపించుకొని పోయాడు. మహానుభావుడన్నాడు. తన తల్లి పోయిందని చెప్పి కంటతడి పెట్టాడు. "పాపం! అమృతవాణి పోయినాది" అని రాముణ్ణి ఓదార్చింది తరువాత ఒక కుర్చీవేసి రాముణ్ణి కుర్చోమన్నది. తాను లోపలికి వెళ్లి చాయ్ కి నీళ్ళు పెట్టి వచ్చింది. చిరుచాప వేసుకొని తలుపుకు అనుకోని కూర్చుంది. పేరు పేరు వరుసన ఊళ్ళో వాళ్ళందరినీ అడిగింది. తెలిసినంతవరకు చెప్పాడు రాముడు. తన కధ కూడా కొంత చెప్పాడు.
"సరే గాని ఈ గడబిడ ఎప్పుడు తగ్గుత దంటావ్?" అడిగింది విమలమ్మ.
తగ్గకేం చేస్తదిగని . ఊళ్ళ పోలీసోళ్ళ మకాం పెట్టిన్రు. ఇగ తుపాకులోండ్లు ఊళ్ళకి బండ్ర్రైన్రు. అడువుల్ల గాలిస్తాను. పోలీసులు. ఇయ్యాల్న రేపో పట్టుపడ్తారు. పట్టుపడ్డనాడు ఖతమే ననుకోరి."
"ఎమె ! ఎమైతదో!! అంత అన్యాయంగున్నది. అయినోడు కాదోడు చస్తున్నడు."
"ఇనుముతోని నిప్పు కూడా దెబ్బతినాలే దొరసానీ ఊళ్ళకి వస్తామనుకుంటున్రా!"
"ఊరి కొచ్చి ఏం చెయ్యను రాముడూ! అయన తిరిగిన చోటూ, కూచున్న చోటూ చూసుకుంటూ ఎట్లుండ? మహారాజు మంచిగానే పోయిండు. దుఃఖం మూట నా నెత్తిన పెట్టి పోయిండు . ఈడనే 'రామా కృష్ణా ' అనుకుంటూ ఉంట. ఇంకెన్నళ్ళని? నేను కూడా కాటికి కాళ్ళు చాచుకొనే ఉంటిని."
"మరి ఇల్లెం చేస్తరు?"
"ఇల్లు కట్టినోదే పాయె. నేను చేసేదేందీ ? ఉంటది."
"ఏమనుకోకుంటే. దొర్శాని , ఒక్కటి అడుగుదమనుకుంటున్న."
"అడుగు నాయనా అనుకునే దేమున్నది?"
"ఊడ్చీ , చల్లి దీపం పెట్టుకుని మే ఇంట్ల ఉందమానుకుంటున్న ఎన్నాళ్ళని దొరతానుంట? మీరెప్పుడోస్తనంటే అప్పుడు వెళ్ళిపోత. చేయించి పెట్టమంటే భూములు కూడా చేయించి పెడ్తా. వచ్చిందాట్ల నాకింత మీకింత ఏమంటారు?"
"మంచిది అట్లనే చెయ్యి. ఎప్పుడన్న వస్తే ఉండేటందుకు ఒక అర్ర ఉంచు. గింజలు ఈడికే తెచ్చియ్యి. నువ్వన్న బాగుపడు. ఈరోజు వస్తే ఎవడు ఆపగలదు?"
"దొర్శానీ ఇంకొక్కమాట"
"ఊ" అని లేచిపోయి చాయ్ చేసి గ్లాసులో తెచ్చి కుర్చీకి దూరంగా పెట్టి 'చాయ్ తీసుకో" అని కూర్చున్నది.
గ్లాసు అందుకుంటూ 'మల్ల మీకు?"
"నా మొఖానికి చాయ్ కూడానా?తాగు నాయనా తాగు. ఏమో అడుగుతనంటిని?"
"అబ్కారీ పాటలు పాడ్తాను. నేనే తీసుకుందమనుకుంటున్న."
తీస్కో నన్నేడిగెడిదెంది?"
"నిన్ను అడగకుండ ఎట్లా చేస్త?" అని చేతులు పిసుక్కుంటూ "మీ పేరు మీద తీసుకుందమనుకుంటున్న. నిన్ను పైసడగను. వచ్చిందట్ల ఎకానోంతు మీకిస్త."
"ఇంత బతుకు బతికి ఇంటెనక బాయిల పడమంటావా?" కాస్త కోపంగానే అన్నది విమలమ్మ. "వరవరరావు పెండ్లం సార దుకాణం పెట్టుకున్నదని పేరు తెచ్చుకుందునా? నాకు ఏ ఎకానోద్దు , దో అనొద్దు."
లాగి లెంప మీద కొట్టినట్లయింది. రామునికి తల తిరిగిపోయింది. డబ్బు పేరు చెబితే లొంగుతుందనుకున్నాడువిమలమ్మ ఓడిపోయాడు. లేచి నుంచొని చేతులు జోడించాడు.
"దొర్శాని తప్పుకూసిన మన్నించండి. బుద్ది గడ్డి తిన్నది. పైకం దొరసానిచ్చిందని దొరతో చెప్పుతా. మీరు పైసియ్యద్దు. మాట సహాయం చెయ్యాలే. అంతే, దొర అడిగితె కాదనకండి. చాలు. నాలుగు పైసలు సంపాయించుకుంట. మీ దయ."
విమలమ్మకు ఆ మాటలు బాగునిపించలేదు. అసహ్యంగా కూడా అనిపించాయి. అయినా రాముడు బాగు పడడానికి అడ్డు రాదల్చుకోలేదు. "అట్లానేలే" అని లేచి నుంచుంది. అది ఇంక వెళ్లిపోవచ్చుననడానికి సంకేతం.
"ఈ మాత్రం దయ ఉంచుండి , నేను పోయ్యేస్త" అని వెళ్ళిపోయాడు రాముడు.
రాముడు అబ్కారీ కంట్రాక్టు తీసుకోవాలనడంలో అర్ధం ఉంది. భారత దేశానికి సవతంత్ర్యం ఇస్తూ బ్రిటీష్ వారు సంస్థానాదీశులకు కూడా స్వాతంత్యం ఇచ్చారు. నైజాం నవాబు మీర్ ఉస్మానలీఖాన్ స్వతంత్య ప్రభువును అయినానని భుజాలు ఎగురవేశాడు. ప్రజలను అణచి పెట్టి తన స్వాతంత్యం పరిరక్షించుకోవాలనుకున్నాడు. కాని ఒక ప్రజా వెల్లువ లేచింది. ఒక మహోద్యమం తలెత్తింది. రాజాకీయ పార్టీలన్న్నీ సహాయ నిరకరణం ప్రకటించాయి. తాడిచెట్లు కొట్టివేయడం, అబ్కారీ కంట్రాక్టులు తీసుకోకపోవడం. విద్యా సంష్టలను, ప్రభుత్వ కార్యాలయాలను బహిష్కరించటం ఆ కార్యక్రమంలో కొన్ని అంశాలు. అందువల్ల అబ్కారీ బందైంది. ఊళ్ళల్లో సారాయి దుకాణాలు లేకుండా అయినాయి. పోలీసు చర్య తరువాత సైతం సాయుధ పోరాటం కొనసాగినందున కాంట్రాక్టులు తీసుకోవడానికి భయపడ్డారు జనులు. వాస్తవంగా ఆ పల్లెలో మొదట్నుంచీ సారాయి దుకాణం లేదు. కాబట్టి చౌకగా దుకాణం సాధించవచ్చనుకున్నాడు రాముడు. ఎవరు తాగినా తాగకున్నా పోలీసులైతే ఉన్నారు. గిట్టుబాటు కాకపోదు అనుకున్నాడు. అబ్కారీ కాంట్రాక్టు రావడానికి బలరామయ్య తగు మాత్రం సహాయం చేశాడు. కాంట్రాక్టు వచ్చేసింది. దానికీ ఒక చిన్న ప్రారంభోత్సవం చేయించదలచుకున్నాడు రాముడు. బలరామయ్య గారితో విన్నవించాడు. గాంధీ జయంతి వస్తూనే ఉంది. ఎలాగూ గాంధీజీ విగ్రహ ప్రతిష్టాపన జరగాల్సే ఉంది. కాబట్టి ఆనాడే చేయింతామన్నాడు. రామునికీ ఆ మాట నచ్చింది. అందుకు ఏర్పాట్లు చేయడానికి పల్లెకు పంపాడు రాముణ్ణి బలరామయ్య.