Previous Page Next Page 
ఎర్ర సముద్రం పేజి 16


    "అతనే సత్యరాజు అనుచరులలో అతి భయంకరమైన వ్యక్తి.... దీపక్ రాజు....."
    మిగతా లెంప్ సభ్యులతోపాటు, దినేష్ కూడా ఓ క్షణంఉలిక్కిపడ్డాడు. అతనెవరో తెల్సినా ఆ క్షణం చర్యతీసుకోగలంత తేలికైనవాడు కాదని దినేష్ గ్రహించాడు.
    "థాంక్యూ మిస్టర్ యల్ " అంటూ ఎమ్ వేపు తిరిగి" బోర్డ్ లో ఉన్న భాగ్యరాజు డైరెక్టరు ఎవరు? ఏమైనా వివరాలు సేకరించారా?" విషయమా లోతుకు వెళుతున్నకొద్ది కొత్త కొత్త విషయాలు బయటపడి అది అంత తేలిగ్గా తీసుకోదగ్గదిగా అనిపించటంలేదు దినేష్ కి.
    "సారీ సార్.....అది  కనుక్కోవటానికి మరికొద్ది రోజులు పడుతుంది" అన్నాడు  మిష్టర్ ఎమ్ జంకుతూనే
    ఈ సమాధానం దినేష్ కి చికాకు కలిగించింది. అది పైకి కనిపించకుండా "మరికొద్ది రోజులు అంటే ఎన్నాళ్ళు?.....అప్పుడయినా ఎలా  కనుక్కోగలరు.....?" సూటిగా ప్రశ్నించాడు.
    "మొన్న మిమ్మల్ని ఒక హెల్ప్ అడిగాను- ఇటీవల జరిగిన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సమావేశాన్ని పూర్తిగా నాలుగువేపుల నుంచి రహస్యంగా వీడియో కెమెరాలు ఏర్పాటుచేసి, ఆ నాలుగు రికార్డింగ్ వీడియోక్యాసట్స్ ఇప్పించమని___" అంటూ అర్థోక్తిగా ఆగిపోయాడు మిస్టర్ ఎమ్.
    "ఎ సే స్___అవి రెడీగా  ఉన్నాయి- మీ ముందున్న టేబుల్  సొరుగులో ఉన్నాయి. తీసుకోండి" అన్నాడు దినేష్ చేతిలో ఉన్న చిన్న స్లిప్ ని విడదీస్తూ.
    "సార్.....మరొక్క విషయం____" అన్నాడు మిస్టర్ ఎల్  వినయంగా.
    "చెప్పండి" అన్నాడు  దినేష్ పొడిగా  చేతిలోని స్లిప్ ని పరిశీలనగా చూస్తూ.
    "త్వరలో టెక్స్ టైల్ పరిశ్రమలో అనూహ్యమైనరీతిలో సమ్మెప్రారంభం కావచ్చని నాకు అనుమానంగా ఉంది. తగిన ఆధారాలతోనే అంటున్నాను. ఇది మీకేమన్నా ఉపయోగపడవచ్చేమో......"
    "ఆర్ యూ షూర్?" అడిగాడు దినేష్ షాక్ అవుతూ.
    "ఖచ్చితంగా అన్నది మరో నెలలోగా నిర్థారించగలను. అయితే వస్తుందనే  అంచనాతోనే ముందుకుసాగటం మంచిడని నా అభిప్రాయం" అన్నాడు యల్ కూర్చుంటూ.
    దినేష్ ఆలోచనల్లో పడ్డాడు అనడానికి నిదర్శనంగా కుర్చీలో కూర్చుని తలవంచుకొని రెండుచేతుల చూపుడువేళ్ళతో నుదుర్ని రుద్దుకుంటున్నాడు.....
    మిష్టర్ యల్ సామాన్యమైనావాడు కాదు. ఒకటి జరుగుతుందని చెప్పాడంటే అది తప్పక జరిగి తీరింది గతంలో. కేవలం తమయూనిట్స్ లోనే చిచ్చు రాచుకుంటుందేమోనని ఆలోచిస్తూ తన ఆలోచనలకు గిరి గీసుకొన్న దినేష్ ఇప్పుడు వాటిని చెరిపేసుకుంతూనే ఓ నిర్ణయానికొచ్చాడు- ఈ విషయాల్ని తండ్రిదాకా తీసుకెళ్ళాలని.

    
                                                                 *    *    *


    సాయంత్రం 5-30 కావస్తోంది.
    జూజిలీ హిల్స్ లో ఉన్న సాహితి ఇండస్ట్రియల్ రికవరీ కార్పోరేషన్ గేటులోంచి సిబ్బంది బయటకు వస్తున్నారు.
    విశాలమైన ఆవరణలో, ఎత్తయిన ప్రహరీగోడ మధ్య ఆరుఅంతస్థుల సాహితీ కార్పోరేషన్ ఠీవిగా కనిపిస్తోంది. గొప్ప కళాత్మకంగా కానిపించే ఆ బిల్డింగ్ వాస్తుకళతో సింప్లిసిటీ కూడా స్పష్టంగా కనిపిస్తోంది. మధ్యాహ్నం రెండు గంటలకొచ్చి సాహితీ కార్పోరేషన్ చైర్ పర్సన్ పాయింట్ మెంట్ కోసం ఎదురుచూస్తూ ఆందోళనగా కూర్చున్నాడు వ్యక్తి.
    కరక్టుగా5 -45 కి కబురొచ్చింది.
    అతను అటెండరు చూపించిన హాల్లోకి అడుగు పెట్టాడు. ఒక్క సారి చల్లగా  తగిలిన  పెర్ ప్యూమ్ ఎయిర్ అతన్ని కొద్దిక్షణాల్లోనే సేదతీర్చగలిగింది.
    పొడవాటి హాలు.....హాలుకి ఆ చివర ఓ ఎగ్జిక్యూటివ్ చైర్-దాని ముందు నవాబుల కాలంనాటి పెద్ద టేబుల్....దాని కివతల వరుసగా ఓ పది కుర్చీలు వేసి వున్నాయి.....ఆమెను కల్సుకొనేందుకు వచ్చే వారి కోసం.
    ఎంతో మంచి అభిరుచి ఉంటే తప్ప-ఆ హాలుని అలా డెకరేట్  చేయటం అసాధ్యం అన్నట్లుగా వుంది.
    హాలంతా నిశ్శబ్దంగా ఉంది అయిర్ కండిషనర్స్ శబ్దం మెల్లగా వినిపిస్తోంది.
    కుర్చీ అటు తిరిగి ఉండటం మూలాన ఆమెను చూసే అవకాశం వెంటనే కలగాలేదు.
    ఆఖరుకు అతను గొంతు పెగల్చుకొని "గుడ్___డే____మేడమ్" అన్నాడు.
    అప్పుడు తిరిగింది చైర్ గుండ్రంగా.
    సీట్లో ఉన్న ఆమెవైపు చూసి ఆశ్చర్యపోయాడు. అతని ఊహలు క్రిందులయ్యాయి.
    ఆమె నిర్వహించే బిజీనెస్ బట్టి  ఆమెకో యాభైపైనే వయస్సు వుండవచ్చని ఊహించాడు.
    కాని వాస్తవంలో ఆమె యువతీ. ఇరవైఐదు. ఇరవైఆరుకి మించి వుండవు. అంటే దాదాపు తన వయస్సే. మధ్య వయస్కురాలనుకొని ఆ రేంజ్ లో మెంటల్ గా ప్రిపేర్ అయి వచ్చిన అతను   వెంటనే మాట్లాడలేకపోయాడు.

 Previous Page Next Page