పచ్చని ఆమె మోము ఛాయలో ప్రత్యేకమైన ఓ ఆకర్షణతో పాటు పెద్దరికం కూడా కనిపిస్తోంది. అది ఆమె సంతరించుకొన్నపరిపూర్ణతలోంచి వచ్చింది కావచ్చు.
మెరుస్తున కళ్ళు చురుకుగా, సూటిగా చూస్తున్నాయి. కొనదేరిన ముక్కు ఆమె తెలివితేటలకు నిదర్శనం అన్నట్లుగా వుంది. పల్చటి చెక్కిళ్ళు, వంపు తిరిగి, మధ్యలో సొట్టపడిన చుబుకం లేత తమల పాకుల్లా__దీన్ని మించిన అందం దేనిదో చెప్పలేనంత అందంగా ఉంది వీటన్నిటి వెనుక, ఎదుటి వ్యక్తికి వేరే ఆలోచన కలుగకుండా సెట్ రైట్ చేయగల గంభీరత__అంతకన్నా అంచనా వేయగల చూపుల కదలికలు___
ది లేడీ-ది సెలబ్రేటెడ్ లేడీ ఇన్ ది ఇండియన్ ఇండస్ట్రియల్ లైమ్ లైట్......?!!
ఆమె గురించి, ఆమె తెలివితేటల గురించి కథలు కథలుగా వినటం చదవటం ఓ ఎత్తయితే-ఆమెను ప్రత్యక్షేంగా చూడటం- చూసి స్థయిర్యంగా ఆమె ముందు నిలబడటం ఒక ఎత్తు.
జుత్తంతా వెనక్కులాగి ముడివేయటంతో పచ్చగా, విశాలంగా కనిపిస్తున్న నుదురు.
ఆమెలో కనిపిస్తున్న ఇన్ని అద్భుత అందాల వెనుక ఆమె ధరించిన దుస్తులు మాత్రం సాదాసీదాగా ఉన్నాయి.
కోట్లకు అధికారిణి.....మునిగిపోతున్న ఎన్నో సిక్కంపెనీలకు నీరుపోసి బతికించిన ది క్వీన్ ఆఫ్ ది ఇండస్ట్రియల్ వరల్డ్.....ఇంత సాధారణమైన చీరలో......మరెంతో నిరాడంబరంగా.....ఊహించనిపరిణామం-కనీసం కలలోనైనా__
కొన్ని క్షణాలు ఆమెమీంచి దృష్టి మరల్చుకోలేకపోవడంతో వెంటనే ఏం మాట్లాడలేకపోయి, లోలోనే కాస్త తడబడ్డాడు. కర్తవ్యం గుర్తుకొచ్చి వెంటనే తేరుకొని అలర్ట్ అయిపోయాడు.
ఆమె సూటిగా తనవేపే చూస్తోంది. ఓ చేతిలో పెన్, మరో చేతిలో గాగుల్స్......నెమ్మదిగా కదులుతున్నాయి. ఆమెకది అలవాటే గనుక వచ్చిన వ్యక్తి అంతరంగాన్ని అంచనా వేయగలిగింది. తనే కదిలించకపోతే అతను మరికొంత కాలాన్ని వృధాపర్చవచ్చని ఊహించి"చెప్పండి......ఏమిటి మీ పని........!" అని మంద్రస్వరాన ప్రశ్నించింది. శాసించగల మాడ్యులేషన్... స్పష్టమైన ఉచ్చారణ.
"నా పేరు ఆదిత్య. ప్రీమియర్ కంపెనీలో ప్రాసెసింగ్ సూపర్ వైజర్ గా పని చేస్తున్నాను" ఓ క్షణం ఆగి ఆమెవేపు చూసాడు.
టేబుల్ మీదకు కాస్త వంగిన ఆమె తీరు తను చెప్పేది శ్రద్ధగా వింటున్నట్లుగా అనిపించి తిరిగి చెప్పడం మొదలుపెట్టాడు.
"మా కంపెనీ1978లో ప్రారంభించబడింది. ఉత్పత్తిచేసే ప్రోడక్టు ఫ్లాస్టికు వెసల్స్, మధ్యతరగతి కుటుంబాల గృహిణులకు గృహొపయోగాలకు పనికొచ్చే వివిధ రకాలైన పాత్రలు, ప్లాస్టికు మగ్స్, బకెట్స్, ప్లేట్స్ లాంటివి మా కంపెనీ 1984 వరకూ లాభాల్లో నడిచింది. 1985 నుంచి మా కంపెనీ ఎన్నో ఒడుదుడుకులకు లోనవుతూవస్తోంది. ఒక్కమాటలో పరిస్థితుల్ని మదింపుచేసి చెప్పాలంటే కంపెనీ పరిస్థితి ప్రస్తుతం దారుణంగా ఉంది. కొన్ని యూనిట్స్ లో లాకౌట్ ప్రకటించింది యాజమాన్యం. దాంతో వర్కర్స్ పరిస్థితి మరీ దారుణంగా తయారయింది.
తోటల్ మేనేజ్ మెంట్ పూర్తిగా చేతులెత్తేసే పరిస్థితికి వచ్చింది! ప్రభుత్వం కంపెనీని నేషన్ లైజ్ చేసేందుకుగానీ, ట్రైల్ బేస్ మీద వర్కర్స్ కి అప్పగించేందుకుగాని సిద్ధపడుతోంది....."
ఇంకా చెప్పేవాడేమో కాని ఆమె అడ్డుపడటంతో ఆగిపోయాడు ఆదిత్య.
"ఇండస్ట్రియల్ రీ కన్ స్ట్రక్షన్ కార్పోరేషన్ అనేది ఒకటుందనుకుంటాను" అంది ఆదిత్యవేపే నిశితంగా చూస్తూ.
ఆమె ఇచ్చింది సలహానో.....సమాచారమో- లేక తన అయిష్టతో అర్థంకాలేదు ఆదిత్యకు. కాస్తంత స్థయిర్యాన్ని కూడదీసుకొని "వుంది కాని డానికి సంబంధించిన అధికారులు యాజమాన్యానికిచ్చే సపోర్ట్"___
__మాటల్ని సగంలోనే మ్రింగేశాడు.
"ఇప్పుడు నేను ఫైనాన్స్ చేస్తే మీ కంపెనీ నిలబడుతుందంటారు?"
"యస్ మేడమ్"
"మీ కేమిటి ఇంట్రస్ట్ ఇందులో?"
"నాలుగువేల వర్కర్స్ కుటుంబాల సంక్షేమం కోసం."
"ఈ కటింగ్ ఓసారి చూడండి" అంటూ తన ముందున్న ఫైల్ లోంచి ఓ ఇంగ్లీషు దినపత్రికలో కట్ చేసిన పీస్ ని తీసి అందించింది.
అది చూడగానే ఆదిత్య ముఖం పాలిపోయింది. ఆమెను చూడక ముందు తెలివికలదనే ఊహించాడు కాని,ఇంత కాలుక్యులేటెడ్ఇంటెలిజెన్స్ అని ఊహించలేదు.
ఆ కటింగ్ తను ఇంత క్రితం చూసిందే.
ప్రీమియర్ కంపెనీ నష్టాలకు ఆ కంపెనీ వర్కర్స్ ఏ విధంగా దుశ్చర్యలను పాల్పడ్డారో వివరించే ఆర్టికల్ అది.
అవమానంగా తలవంచుకున్నాడు ఆదిత్య.
"మీ కంపెనీ దేశంలోని పేద కుటుంబాలమీద వ్యాపారంచేసుకుంటోంది. మంచే దేశంలో 37.8 శాతం కుటుంబాలు సత్తుపాత్రలు స్టీలు సామానులు కొనలేని స్థితిలో వున్నారు. ముడిసరుకుల ధరలుపెద్ద పెరగలేదు కాని మీ కంపెనీ ఇప్పటికి ఏడుసార్లు ధర పెంచింది. యాజమాన్యానికి విపరీతంగా లాభాలు వచ్చాయి. మీరు మీ హక్కుల్లో భాగంగా 31డిమాండ్స్ అడిగి 24 తీర్చుకోగలిగారు. ఒక రకంగా మీరు కాస్తో, కూస్తో లాభపడ్డటే__సారీ___మీ కొచ్చేది లాభం కాకపోవచ్చు__ శ్రమకు తగిన ప్రతిఫలం. ఇంతవరకూ బాగానే వుందనుకుంటే మీ వస్తువులు కొనే పేద వినియోగదారులు మాత్రం తాము చేయని ఎక్కువ ధరలు చెల్లించాల్సి వస్తోంది. యామై రైట్.....?"
ఆమె విషయాన్ని ఎటువైపు లాక్కెళుతుందో అర్థమయిపోయింది ఆదిత్యకు.