Previous Page Next Page 
ఎర్ర సముద్రం పేజి 15


    ఓ నెల క్రితం ఎల్, ఎమ్ అందించిన సమాచారమే భూపతిరావును హెచ్చరించింది.
    లెంప్ సభ్యులు నల్గురూ దినేష్ ఆర్డర్స్ కోసం ఎదురు చూస్తున్నారు.
    చాలా సేపటినుంచి ఆవేశంగా పచార్లుచేస్తున్న దినేష్ 'ఎల్' దగ్గరకు వచ్చి ఆగిపోయి అతనివేపు సాలోచనగా చూసాడు. అది గమనించిన 'ఎల్ ' లేచి నిలబడ్డాడు.
    "మిస్టర్ ఎల్! మరోసారి వివరంగా ఆ విషయాలు చెప్పు" అన్నాడు తనలో పెల్లుబుకుతున్న ఆవేశాన్ని బలవంతాన అణచుకుంటూ.

                                            8

    ఎల్, వినయంగా లేచి నిలబడి  ఈసారి దినేషివేపు చూసి "చాలా  కాలంగా నాకు ఓ  వ్యక్తిమీద అనుమానంగా వుంది. అతనెవరో అప్పట్లో తెలియదు. మన వర్కర్స్ లంచ్ అవర్లో ఫ్యాక్టరీ గేటుకి ఎదురుగా  ఉన్న దర్భార్ రెస్టారెంటుకి వెళ్తుంటారు. నేను వారితో కలిసి వెళుతుండే వాడ్ని. ఓ రోజు ఆ వ్యక్తి వచ్చాడు. అతనెప్పుడూ గతంలో నేను చూడలేదు. విచిత్రంగా వున్న అతని కదలికలు నన్ను తనవైపుకి తిప్పుకొనేలా చేసాయి....."
    ఎల్ చెప్పుకుంటూ వెళుతున్నాడు.....
    అప్పటికే దినేష్  ఆ వ్యక్తి ఎవరయివుంటారని తీవ్రంగా ఆలోచిస్తున్నాడు.
    లెంప్ లోని మిగతా ముగ్గురు సభ్యులు కూడా ఆసక్తిగా  వింటున్నారు.
    "ఆ వ్యక్తి మన వర్కర్స్ లో  ఇద్దరితోనే మాట్లాడి వచ్చిన  ఐదు నిముషాల్లోనే వెళ్ళిపోయాడు. ఉన్న ఐదు నిముషాల్లో అతనేదో మాట్లాడాడు. ముందు వారికి అతను ఫ్రెండయి ఉండవచ్చుగదా అని అంతగా ఆసక్తి  కనపర్చకపోయినా___వారు మాట్లాడుకుంటున్న తీరు కాస్తంత అనుమానాన్ని రేకెత్తించింది. వెంటనే నేనున్నా చోటునుండి లేచి వారికి అనుమానం రాకుండా ఏదో పనున్నట్లు అటుగా వెళ్ళాను. సరిగ్గా నేను వారి టేబుల్ పక్కనుంచి పాస్ అవుతుండగా  నాకు వినిపించిన మాటలు ఇటీవలే రిలీజయిన సినిమాల గురించి!
    ప్రపంచ యుద్ధం వస్తుందా అన్నంత ఆతృతతో టేబుల్ మీదకు వంగి ముగ్గురి తలల్ని బాగా దగ్గరగా చేర్చుకొని సినిమాల గురించి మాట్లాడుకుంటున్నారని నేను విన్నప్పుడు నా అనుమానం మరింత బలపడింది.
    ఆ వ్యక్తి రోజూ సరీగ్గా  లంచ్ అవార్ కి రావటం, వారితో కాసేపు మాట్లాడం- తిరిగి వెళ్ళిపోవటం జరిగింది"
    యల్ ఒకింతసేపు ఆగాడు- అప్పుడు ఏర్పడిన మౌనంలో దినేష్  గుప్పిళ్ళు బిగుసుకున్నాయి. ఆవేశంగా ఓ అడుగువేసి "ఎవరా ఇద్దరు?" అన్నాడు-దినేష్ కంఠంలో తొంగిచూసిన కోపానికి లెంప్ సభ్యులు కొద్దిగా కంగారుపడినా అంతలోనే తిరిగి సర్దుకున్నారు.
    "సత్తెయ్య....."
    "సత్తెయ్యా......?!!" దినేష్ కంఠంలో కోపంతో ఆశ్చర్యం కలిసి పోయింది.
    స్వతహాగా దినేష్ మహాకోపిష్టి.....దాన్ని భూపతిరావు చిన్నప్పటి నుండి కంట్రోల్ చేసుకుంటూ రావటం మూలంగా కొంత  తగ్గినా, అది  అప్పుడప్పుడు బయటపడి ఎదుటవున్న వార్ని భయపెట్టేలా చేస్తుంది.
    "చెప్పు......" అన్నాడు దినేష్  ఆవేశంగా పచార్లు చేస్తూనే.... అప్పుడు రాత్రి ఒంటిగంట కావస్తోంది; లెంప్ సభ్యులుదినేష్  ని కలుసుకొనే ఆ బిల్డింగ్ చుట్టుపక్కల చీకటి, నిశ్శబ్దంలో స్నానం చేస్తోంది.
    అటు ఫ్యాక్టరీకి, ఇటు కార్మిక పురానికి మధ్యనున్న ఆ చిన్న బిల్డింగ్ లోనే భూపతిరావు పారిశ్రామిక సామ్రాజ్యపు చిరు కదలికల్ని కూడా రికార్డ్ చేసే ప్రమాదకరమైనా వ్యక్తులున్నట్లు, అప్పడప్పుడు వార్తక్కడే  సమావేశ మవుతారని ఆ సామ్రాజ్యపు అధినేతకు కూడా తెలియకుండా కాపాడుకోస్తున్న రహస్యం.
    "ఆ వ్యక్తే ఉంచితే.....సత్తయ్య ప్రవర్తనలో మార్పు వచ్చింది ఎప్పుడూ చార్మినార్ సిగరెట్స్ మాత్రమె కాల్చే సత్తెయ్య ఫిల్టర్  సిగరెట్స్  తో కనిపిస్తున్నాడు......అప్పుడప్పుడు బార్ లో చూటా అతనుధరించే బట్టల్లో కూడా మార్పు వచ్చింది. చాలా ఖరీదైనా స్పన్, పోలియస్టర్ బట్టలతో పాటు ఖరీదైన కోహినూర్ చెప్పల్స్ వేనుకుంటున్నాడు.
    వీటన్నిటిని బట్టి ఓ నిర్ణయానికి వచ్చిన నేను సత్తె'య్యనే నీడలా వెంటాడ్డం మొదలెట్టాను.
    ఓ రోజు మన టెక్స్ టైల్ యూనిట్ లోని డైయింగ్ సెక్షన్ ఇంజనీర్  తో కలిసి ఓ బార్ నుంచి బయటకొస్తూ కనిపించాడు సత్తెయ్య.
    సత్తెయ్య కేవలం క్లాస్  ఫోర్ వర్కర్  అతనితో ఎగ్జిక్యూటివ్ కేడర్ లో ఉన్న డైయింగ్ సెక్షన్ ఇంజనీర్ అంత చనువుగా ఉండటం మరింత ఆశ్చర్యమేసింది.
    ఏం చేయ బోతున్నరన్నది నిర్దుష్టంగా తెలియక పోయినా, ఏదో  ప్రమాదకరమైన కూప్ ఒకటి ఓ స్పష్టమైన రూపం సంతరించుకోబోతోందని పసిగట్టాను." ఆ వ్యక్తి ఎలా ఉంటాడు......?" దినేష్ నోటివెంట బుల్లెట్ లా వచ్చిందా ప్రశ్న.
    దినేష్ కోపతాపాలు తెల్సిన లెంప్ సభ్యులు నల్గురు ఓ క్షణం అసంకల్పితంగా ఉలిక్కిపడ్డారు.
    "సన్నగా, పీలగా, ఊపిరి పీల్చుకోటానిక్కూడా ఓపికలేని వాడిలా ఉంటాడు చూట్టానికి చాలా అమాయకుడిలా కనిపిస్తాడు. కాని చాలా ప్రమాదకరమైనా వ్యక్తిగా అతన్ని నేను అంచనా వేసాడు."
    మిస్టర్ ఎల్ హ్యుమన్ సైకాలజీలో దిట్ట. మొదటి చూపులోనే ఎదుటివాడి అంతరంగాన్ని అంచనా వేయటం అతనికి వెన్నతో పెట్టిన విద్య.
    అకలిని భరించలేక డబ్బు 'లేకుండానే ఏదో ఒక మాయచేసి హొటల్ లో భోంచేయాలని వచ్చేవాడి చూపులు, కదలికలు- అదే హొటల్ లో ఓ  ప్రమాదకరమైన  కూప్  తయారు చేసేందుకు వచ్చే వ్యక్తి చూపులు ప్రాధమికంగా ఒకేలా కనిపించినా, పరిశీలనలో లోతుకువెళ్తె ఎవరేమిటో తెలుస్తుంది. అది ఎల్ కి బాగా తెలుసు కాబట్టే భూపతిరావు అతన్ని ఎన్నిక చేసుకున్నాడు.
    "అంటే నెల క్రితం నాన్నగారి దగ్గరకు వచ్చి బెదిరించిన వ్యక్తి ఇతను ఒకరేనా?" సడన్ గా అడిగాడు దినేష్.
    "కావచ్చు సార్"
    "ఇంతకీ అతనెవరు.......?"

 Previous Page Next Page