తను చేసిన పాపం తనని వెన్నంటి కాటందుకుంటుందనే బెదురు చేతా?
తను చేసిన పాపం గుర్తుకురాగానే, అతని గుండె ఎక్స్ ప్రెస్ రైలు బండిలాగా దడదడలాడటం మొదలుపెట్టింది.
ఆ వెనువెంటనే అతనికి గుర్తు వచ్చింది పదేళ్ళక్రితం తను చేసిన రైలు ప్రయాణం.
అది తలుచుకోగానే అతని తల గిర్రున తిరగడం మొదలెట్టింది. ప్రియంవద తలా, బార్బర్ తలా, డాక్టర్ తలా ట్రిక్ ప్రోటోగ్రఫిలా విడివడిపోయి , గాల్లో తేలుతూ తన తలచుట్టు తిరిగుతున్నట్లు భ్రాంతి కలిగింది. నెమ్మదిగా నిద్ర మెలుకువ కాని మగతలోకి జారిపోయాడు విశ్వనాధం.
ఆ మగతలోనే అతనికి గతానుభవాలు జ్ఞప్తికి రాసాగాయి.
* * *
దాదాపు పదేళ్ళక్రితం ,
పనిమీద పట్టణం వెళ్ళాడు విశ్వనాధం. పనిచుసుకుని తిరిగివస్తూ దారిలో ఒక మీల్సు హాల్టులో రైలు దిగాడు. ఆ స్టేషనులో పావుగంట ఆగుతుంది రైలు. భోజనాలు చెయ్యదలుచుకున్నవాళ్ళు అక్కడ చెయ్యవచ్ఘు.
భోజనం చెయ్యాలనే వుంది విశ్వనాధానికి. కడుపులో కరకరా ఆకలి వేస్తోంది.
కడుపులో ఆకలి వుంది గానీ, జేబులో డబ్బుల్లేవు. ప్రయాణానికి సరిపడా బొటాబొటిగా డబ్బు తెచ్చుకున్నాడు తను. ఎప్పుడూ అంతే. చాలీచాలనీ జీతం. ఎదుగూబొదుగూ లేని బతుకు. ఒక పెళ్ళాం - ఒక పిల్లాడూ, కానీ కష్టాలు మాత్రం కోకొల్లలు.
వెరసి ఇదీ తన గుమస్తా గానుగెద్దు జీవితం.
చిరాకు వేసింది విశ్వనాధానికి.
జేబులో నుంచి చిల్లర తీసి, కాఫీ తీసుకున్నాడు. కాఫీ తాగుతుంటే అతని దృష్టిని ఆకర్షించింది ఒక దృశ్యం.
ఎవరో ఒక పెద్దమనిషి , ఫస్టుక్లాసు కంపార్ట్ మెంట్ దగ్గర నిలబడి ఉన్నాడు. అతనికి వీడ్కోలు చెప్పడానికి వచ్చిన నలుగురు అతనితో ఏదో మాట్లాడుతున్నారు.
చాలా సౌమ్యంగా, మర్యాదగా మాట్లాడుతున్నాడు ఆమనిషి. మర్యాద, మన్నన కనబడుతోంది. అయన ప్రవర్తనలో. అయన పక్కన నిలబడి వున్న ఆ నలుగురూ కూడా ఆయనంటే చాలా శ్రద్ధాసక్తులు కనబరుస్తూ అయన చెప్పింది వింటున్నారు.
తన చేతిలో వున్న సూట్ కేసుని చూపిస్తూ, వాళ్లతో ఏదో అన్నాడు అయన.
అది వినగానే ఆ నలుగురి మొహంలోను అనందం కనబడింది. ఆయనవైపు హీరో వర్షిప్ తో చూశారు.
"ఏముంది ఆ సూట్ కేసులో?" అనుకున్నాడు విశ్వనాధం మంటగా. అతనికి ఈమధ్య ఎవరిని చూసినా అకారణంగా కసిపుడుతోంది.
దీన్నే అంటారా, ప్రేస్టేషన్ అని.
అన్ని చోట్ల అన్ని విధాల ఓడిపోయినవాడి మానసిక పరిస్థితి ఇలాగే మారిపోతుందేమో.
"ఏముంది ఆ సూట్ కేసులో" అనుకున్నాడు విశ్వనాధం. కట్టలు కట్టలుగా డబ్బు వుందా సినిమాల్లో చూపించేటట్లు!
ఉంటే, ఎవడి కడుపుకొట్టి సంపాదించి వుంటాడు వీడు ఆ కట్టలు, కట్టలు డబ్బు?
దస్తావేజులు, డాక్యుమెంట్లు , తనఖా పత్రాలూ వుంటాయా? ఎంతమందిని దారుణమైన దరిద్రంలోకి తోసేసి సంపాదించి వుంటాడు వీడు అంత డబ్బు?
న్యాయంగా పొతే, నాలుగు రూపాయలు వెనకేసుకోవడం కుదుర్తుందా అసలు ఈ రోజులలో!
డబ్బుతో ఎలా మెరిసిపోతున్నాడో చూడు!
ఒక క్షణం పాటు కళ్ళు మూసుకుని, తనే అతనయినట్లు ఉహించుకున్నాడు విశ్వనాధం.
తనే నిలబడి వున్నాడు ఆ ఫస్టుక్లాస్ కంపార్ట్ మెంట్ దగ్గర అచ్చం అతను వేసుకున్న ఖద్దరు సిల్కు సూటే వేసుకున్నాడు.
అతని సూటు తనకి వాడులయింది. లూజులూజుగా వుంది.
అవును మరి....అతనిది పాలూ, మీగడా తిని పెరిగిన శరీరం. తనది - అర్ధకాలితో అలమటించిపోతూ చిక్కిపోయిన బక్కశరీరం.
ఆ సూటులో తనని చూసి స్టేషన్లో వున్న జనం నవ్వ్తున్నారు. ఎవడో పెద్దగా విజిల్ వేశాడు.
ఉలిక్కిపడి ఆలోచనలలోంచి బయటపడ్డాడు విశ్వనాధం. పెద్దగా కూత పెడుతుంది రైలు. ఆ తరువాత నెమ్మదిగా కదిలింది.
కంగారుగా కప్పుని కౌంటర్ మీద పెట్టేసి రైలందుకోవడానికి పరిగెత్తాడు విశ్వనాధం. అతను ఎక్కిన కంపార్ట్ మెంట్ ఆ టీస్టాల్ కి చాలా దూరంలో వుంది. అది ఎక్కడ వుందో చూసుకుని ఎక్కడం అసంభవం ఇప్పుడు.
అందుకని, ఎదురుగా ఉన్న ఫస్టు క్లాసు కంపార్ట్ మెంట్ లోకి ఎక్కేశాడు విశ్వనాధం.
ప్రస్తుతానికి ఏదో ఒక కంపార్ట్ మెంట్ లోకి ఎక్కగలిగితే చాలు వచ్చే స్టేషన్ లో దిగిపోయి , తన కంపార్ట్ మెంట్ లోకి తను వెళ్ళిపోవచ్చు.
ఎక్కాక, అప్పుడు చూశాడు విశ్వనాధం తలుపు దగ్గరలో వుంది ఆ సూటు కేసువాలా సీటు.
తను లోపలికి వెళ్ళలేదు విశ్వనాధం. తలుపు దగ్గరే నిలబడి బయటికి చూడటం మొదలుపెట్టాడు.
నెక్స్ ట్ స్టేషన్ త్వరగా వచ్చేస్తే బాగుండు. తను తన కంపార్ట్ మెంట్ లోకి వెళ్ళిపోతాడు.
ఈలోపల ఏ టికెట్ కలేక్టరో వస్తే?
అప్పుడొక పెద్ద సీను క్రియేట్ అవుతుంది. తను ఉద్దేశపూర్వకంగా ఈ కంపార్ట్ మెంట్ లోకి ఎక్కలేదనీ గత్యంతరం లేక ఎక్కవలసి వచ్చిందనీ, తన పెట్టె బేడా ఫలానా కంపార్ట్ మెంట్ లో వున్నాయనీ నమ్మించాలి. ఈలోగా ఈ మోతుబరులందరూ తనని దొరికిపోయిన దొంగని చూసినట్లు చూస్తారు. ఆ సూట్ వేసుకున్న సూట్ వాలా నెమో.......
"లోపలికి రండి" అన్నాడు సూట్ కేస్ ఆసామి.
ఉలిక్కిపడ్డాడు విశ్వనాధం.
సూట్ కేస్ ఆసామి దయగా చిరునవ్వు నవ్వుతున్నాడు. "లోపలికి రావచ్చు మీరు. ఇక్కడ కూర్చోండి.......కంగారు పడకండి. ఏం జరిగింది."
"కాఫీ తాగుతుంటే ట్రెయిన్ కదిలిపోయింది. తప్పనిసరై ఈ కంపార్ట్ మెంటులో ఎక్కవలసి వచ్చింది. వచ్చే స్టేషన్ లో బండి ఆగగానే........"
"దిగిపోతారు......అవునా! ఇంత మత్రందానికి ఆదుర్దాపడవలసిన అవసరం ఏమిటి? టీ.సీ వస్తే నేను చేబుతాలెండి. మీరు కాసేపు సౌకర్యంగా కుర్చోవచ్చు."
అయన మాటలు వినగానే చాలా రిలీఫ్ కలిగింది విశ్వనాధానికి. వచ్చి, దాదాపు సీటు అంచుమీద జాగ్రత్తగా కూర్చున్నాడు.
"నా పేరు నారాయణ మూర్తి. వ్యాపారం వుంది నాకు. తమరి పరిచయం?" అన్నాడు ఆ పెద్దమనిషి.
"నా పేరు విశ్వనాధం" అని ఆగి, కుంచించుకుపోతూ చెప్పాడు విశ్వనాధం. "ఫలానా గవర్నమెంట్ ఆఫీసులో గుమస్తాని నేను."
"అలాగా" అన్నాడు నారాయణమూర్తి చాలా మాములుగా. తను ఒక గుమస్తానని చెప్పగానే అతను చులకనగా చూస్తాడేమో అన్న విశ్వనాధం అంచనా తలకిందులయింది. చాలా కలుపుగోలుగా మాట్లాడాడు నారాయణమూర్తి. అది తెచ్చి పెట్టుకున్న ప్రవర్తన కాదు. అతని స్వభావమే అంత.
కాసేపు రైల్వేల గురించి మట్లాడాడు నారాయణమూర్తి. కాసేపు రాజకీయాలు చర్చించాడు.
మాటల సందర్భంలో తెలిసింది విశ్వనాధానికి - తనకి ఒకే ఒక్క కొడుకయితే నారాయణమూర్తికి ఒకే ఒక్క కూతురుందని, ఆ కూతురంటే నారాయణమూర్తికి పంచప్రాణాలని.
మాట్లాడుతూనే, సూట్ కేస్ తెరిచాడు నారాయణమూర్తి. అందులోనుంచి తెల్లటి గ్లాస్కో లుంగీ తీశాడు.
లుంగీ తీస్తుండగా ఒక్కసారిగా విశ్వనాధం కళ్ళు జిగేలుమన్నాయి.
బట్టలకింద వున్నాయి కట్టలు కట్టలుగా నోట్లు కుప్పలు తెప్పలుగా........డబ్బు!