'వద్దొద్దు! మీరొక్క పది నిముషాలు ఇక్కడే కూర్చోండి. ఈలోగా ఈయనతో మాట్లాడేసి వస్తాను. మీరు నాతో రండి మిస్టర్ రాధేశ్యాం!" అంటూ పక్క గదిలోకి దారి తీసింది వైశాలి. వెళుతూ వెళుతూ సెక్రటరీకి పురమాయించింది.
"సేట్ జీకి కాఫీనో కూల్ డ్రింకో ఏం కావాలో కనుక్కుని తెప్పించు" అని.
"నాకు కాఫీ!" అన్నాడు బదరీ నారాయణ్ వినయంగా.
సెక్రటరీ కాఫీ తెప్పించడానికి బయటకు వెళ్ళింది.
ఇప్పుడు గదిలో తను ఒక్కడే మిగిలాడు బదరీ నారాయణ్. నగల పెట్టెను టేబుల్ మీద పెట్టబోతూ వుంటే, టేబుల్ మీద వున్న ఒక రాయి లాంటిది అతని దృష్టిని ఆకర్షించింది. కళ్ళు చిట్లించి చూశాడు. అదేమిటో చూచాయగా అర్ధం అయినట్లు అనిపిస్తుంది అతనికి.
అప్పుడు హఠాత్తుగా అతని చూపులు ఆ రాతికింద వున్న పేపర్ కటింగ్ మీద పడ్డాయి. పెద్ద అక్షరాలతో హెడ్డింగ్ వుంది దానికి.
"భూగర్భంలో వున్న వజ్రాల ఉనికిని బయట పెట్టే చెట్లు!!"
గుండె గబగబా కొట్టుకోవడం మొదలెట్టింది సేఠ్ జీ కి. ఒకసారి అటూ ఇటూ చూసి, త్వరత్వరగా చదవటం మొదలెట్టాడు.
న్యూఢిల్లీ: భూగర్భంలో నిక్షిప్తంగా ఉన్న వజ్రాల ఉనికిని కనిపెట్టడానికి చెట్లు పనికి వస్తాయని కనుక్కొన్నారు శాస్త్రజ్ఞులు.
మాస్కోలో ఉన్న ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మినరాలజీ జియో కెమిస్ట్రీ అండ్ క్రిస్టిలో కెమిస్ట్రీ ఫర్ రేర్ ఎలిమెంట్స్, కొన్ని రకాల వృక్షాల తాలూకు కొమ్మలు, బెరడు, మొదలయిన చెట్లు భాగాలలో లోహపు ఛాయలు కనబడతాయనీ, వాటివల్ల వజ్రాల ఉనికిని కనిపెట్టవచ్చని నిర్ధారణ చేసింది.
కింబర్ లైట్ - దీనినే బ్లూ అర్త్ అని కూడా అంటారు - అనేది ఒక రకమైన రాయి. భూగర్భంలో ఉండే వజ్రాలు దొరికే రాళ్ళు భూమి ఉపరితలం మీద రసాయనికమయిన పొరలని సృష్టిస్తాయని చాలా కాలం క్రితమే శాస్త్రజ్ఞులకి తెలుసు. ఈ బ్లూ అర్తులో ఇనుము, నికెల్, టిటానియమ్, క్రోమియం లాంటి ఖనిజాలు కూడా మామూలు రాళ్ళలో వుండే దానికంటే పదిరెట్లు ఎక్కువగా వుంటాయి.
నీటివల్ల ఈ ఖనిజాలు రాతినుంచి బయటకు వస్తాయి. ఉపరితలానికి చేరుకుంటాయి. వీటివల్ల భూమి ఉపరితలం మీద కొంత భాగం కృంగిపోయినట్లు కనబడుతుంది. అక్కడ పెరిగే వృక్షజాతులు నీటితోబాటు ఈ ఖనిజాలని పీల్చుకుంటాయి. వజ్రాలగనులు ఎక్కడెక్కడ ఉన్నాయో, ఆ ప్రాంతాల చుట్టూ పెరిగే చెట్లలో ఇలాంటి లోహపుఛాయలు ఉంటాయి. చాలా సెన్సిటివ్ స్పెక్ట్రోమీటర్లని వుపయోగించి చెట్లలో వున్న ఖనిజాలని కొలిచి, వజ్రాలు దొరికే కింబర్ లైట్ రాళ్ళు ఎక్కడెక్కడ వున్నాయో కనుక్కోవడం ఇప్పుడు సుసాధ్యం!
హఠాత్తుగా మిస్టరీ వీడిపోయినట్లయింది సేఠ్ బదరీ నారాయణ్ కి.
వైశాలి....వజ్రాలు ఎక్కడున్నాయో చూపించే చెట్లు.... స్థలాలు కొని అమ్మే రియల్ ఎస్టేట్ ఏజెంట్! జియోలజిస్టు లాయరు - అంటే!
అంటే!
ఎగ్జయిట్ మెంట్ తో జ్వరం వచ్చినట్లయింది.
వజ్రాలగని ఏదో కనిపెట్టింది ఈ వైశాలి!
ఆ స్థలాన్ని కొనెయ్యాలని ఈ రియల్ ఎస్టేట్ ఏజంట్ ద్వారా ప్రయత్నిస్తోంది. అందుకే జియోలజిస్టూ, లాయరూ కూడా ఇక్కడికి వస్తున్నారు.
అంతవరకూ అర్ధమవుతూనే ఉంది.
కానీ తన ప్రత్యర్ధి మాణిక్ లాల్ కూడా వీళ్ళతో కలిసి ఎందుకు ఉంటున్నట్లూ?
కొంపదీసి వాడూ ఆ అమ్మాయికి పార్టనర్ అయిపోయాడా ఏమిటి?
అసూయ ఆవరించింది బదరీ నారాయణ్ మనసుని. అశాంతిగా ఫీలవుతూ అనుకున్నాడు.
వజ్రాల షాపు కాదు! వజ్రాల టోకు వ్యాపారం కూడా కాదు.
వజ్రాల గనులే! ఏకంగా!
అందులో ఈ వైశాలికి ఆ మాణిక్ లాల్ గాడు పార్టనరా?
అతనలా ఆలోచిస్తూ ఉండగానే కాఫీ తెచ్చింది సెక్రటరీ. అతను కాఫీ తాగడం ముగించేసరికి వైశాలి తిరిగి వచ్చింది రియల్ ఎస్టేట్ ఏజెంట్ తోబాటు.
"సాధ్యమయినంత చౌకలో సెటిల్ అయ్యేటట్లు చూడండి" అంది ఏజెంటుతో.
"తప్పకుండా మేడమ్!" అంటూ వెళ్ళిపోయాడు రియల్ ఎస్టేట్ ఏజెంట్!
"ఊ! ఇప్పుడు చూపించండి నగలు!" అంది వైశాలి.
అన్యమనస్కంగా నగలు బయటికి తీసి చూపించడం మొదలుపెట్టాడు బదరీ నారాయణ్. అన్నీ చూసి చప్పరించేసింది వైశాలి. "చాలా స్పెషల్ గా ఏమీ లేవు మామూలుగానే ఉన్నాయి. స్పెషల్ గా ఏమన్నా వచ్చినప్పుడు చూపించండి! తప్పకుండా తీసుకుంటాను" అంది.
ఆమె కంటికి చాలా స్పెషల్ నగలు తప్ప అనవనడంలో సందేహం ఏమీ లేదని నమ్మకం ఏర్పడిపోయింది బదరీ నారాయణ్ కి.
అందుకని తల ఊపి లేచి నిలబడి, ఏదో చెప్పదలచుకున్నట్లు గొంతు సవరించుకున్నాడు.
"ఏమిటి?" అన్నట్లు చూసింది వైశాలి.
ఏదో చెప్పబోయిన బదరీ నారాయణ్ మనసు మార్చుకొని వందనం చేసి బయటకు నడిచాడు.
షాపుకి వెళ్ళీ వెళ్ళగానే తఃక్షణం రియల్ ఎస్టేట్ ఏజెంటుకి ఫోన్ చేశాడు అతను.
లైన్ లోకి రాగానే బదరీ నారాయణ్ ని గుర్తుపట్టాడు స్థలాలు కొనుగోలూ, అమ్మకాలూ చేసే ఆ రియల్ ఎస్టేట్ ఏజంట్.
ఏం సేఠ్ జీ! కొత్త బంగళా ఏదన్నా కట్టాలనుకుంటున్నారా ఏమిటి?" అన్నాడు నవ్వుతూ "అలాంటి ప్లానేమన్నా వుంటే చెప్పండి. మంచి మంచి ప్లాట్లు చాలా వున్నాయి మన దగ్గర."
"అక్కడా ఇక్కడా ఎందుకూ? మన వైశాలిగారు ఎక్కడకొంటే నేనూ అక్కడే కొనదలుచుకున్నాను. పెద్దవాళ్ళతో కలిసి ఉంటె మనమూ బాగుపడతాం కదా?" అన్నాడు బదరీ నారాయణ్ లౌక్యంగా. "వైశాలిగారు ఎక్కడ కొంటున్నారు స్థలం?"
"సారీ! వివరాలు వెల్లడించడానికి నాకు పర్మిషన్ లేదు" అన్నాడు రియల్ ఎస్టేట్ ఏజెంటు ముక్తసరిగా.
కంగారుగా "సరే! సరే!" అన్నాడు బదరీ నారాయణ్. అని "సాబ్! మీకేమయినా మంచి నగలు కొనాలనుకుంటే మా షాపుకి రండి. డబ్బు కోసం వెనకాడవద్దు. తర్వాత నిదానంగా సర్దుబాటు చేసుకోవచ్చు. మంచి స్థలాలు ఎక్కడన్నా ఉంటే మాత్రం చెప్పండి. మీ రుణం ఉంచుకోను" అన్నాడు అర్ధవంతంగా.
నవ్వి ఫోన్ డిస్ కనెక్ట్ చేశాడు రియల్ ఎస్టేట్ ఏజెంట్.
కుడిచేతిలో పడ్డ ఎలుకలా అయింది బదరీ నారాయణ్ పని. అత్యాశతో అతనికి మతిపోయేటట్లుంది. విచక్షణా జ్ఞానం పూర్తిగా నశించినట్లయింది. కళ్ళు తెరిచినా, మూసినా వజ్రాల గనులే కనబడుతున్నాయి.
అతనికి గట్టిగా అనిపించింది.
వైశాలి ఏదో గొప్ప నిధినే పట్టేసింది. అందుకే అంత హడావుడి! అందులో సందేహం లేదు.
కానీ -
ఏమిటా నిధి?
ఎక్కడుంది?
సాయంత్రం దాకా అలజడిగా ఆలోచిస్తూ ఆగిపోయాడతను. ఆరోజు తొందరగా దుకాణం మూసేసి ఇంటికెళ్ళిపోయాడు. రాత్రంతా నిద్రపట్టక పక్కమీద అశాంతిగా అటూ ఇటూ పొర్లాడు.
తెల్లారగానే ఇంక ఉండబట్టలేక వైశాలి వున్న గెస్ట్ హవుస్ కి వెళ్ళాడు సేఠ్ జీ.
అతన్ని గుమ్మం దగ్గరే ఆటకాయించింది వైశాలి సెక్రటరీ.
"మేడమ్ ని కలుసుకోవాలంటే అపాయింట్ మెంట్ ఉండాలి. ఆమె చాలా బిజీ పర్సన్!" అంది స్థిరంగా.
చాలా విధాలుగా ఆమెని బతిమాలి భంగపడ్డాడు బదరీ నారాయణ్.
అరగంట తర్వాత, అతనిమీద దయతలచినట్లు లోపలికి పంపించింది సెక్రెటరీ.
అతను లోపలికి వెళుతుంటే, లోపలనుంచి అతని ప్రత్యర్ధి మాణిక్ లాల్ బయటకు రావడం కనపడింది. ఈర్ష్యతో మాడిపోయింది సేఠ్ బదరీ నారాయణ్ మొహం.
అతను లోపలికి వెళ్ళేసరికి తలంటి పోసుకున్న పొడుగాటి జుట్టుని హెయిర్ డ్రయర్ తో ఆరబెట్టుకుంటోంది వైశాలి.
ఈసారి ఆమె అతన్ని చూసి కనీసం పలకరింపుగా నవ్వనుకూడా లేదు. "ఏమిటి?" అన్నట్లు చిరాగ్గా చూసింది.