"ఎవరన్నా అట్ల చెబితే నువ్వు నమ్ముతావా తమ్మీ?"
"సర్కార్ ఈల్ల దగ్గిర పైసలడగదా ఉస్తాద్?"
"పైసా ఉన్న వాడి దగ్గర పైసలడగాలంటే సర్కారుకి భయం తమ్మీ!"
"మరి లీడర్లు ఎందుకున్నారు సాబ్? వాళ్ళెం చెయ్యరా?" అన్నాడు యాకూబ్ అమాయకంగా.
"ఏ లీడరయినా చేసే పని ఒక్కటే తమ్మీ! నువ్వు పదవిలో నుంచి దిగు! నేను పదవి కెక్కుతా?" అని లొల్లిచెయ్యడం!
నువ్వు దిగు! నేనేక్కుతా!
నువ్వు దిగు! నేనేక్కుతా!
సింగల్ పాయింట్ రాజకీయాలు ఇయి! నువ్వు దిగిపో! పవర్ నాకు ఇచ్చేయ్! అల్లు ఈళ్ళని కాదే! ఎవరయినా అంతే!
"మరి పబ్లిక్?"
"అరె తేరీ పబ్లిక్ గోలీమారో! పబ్లిక్ సంగతి కావాల్రా?"
"అయితే ఈ లీడర్లకి చెప్పే వాళ్ళెవరు లేరా సార్!"
అసిస్టెంట్ యాకూబ్ అలా అడుగుతుండగానే ఫిష్ ప్లేట్లు తొలగించి ఉన్న స్పాట్ ని దాదాపు సమీపించింది ఎక్స్ ప్రెస్.
చేతులు విరిగిపోయెలా ఉపూతు ఎర్రజెండా లాంటి షర్టుని చూపిస్తూ డేంజర్ సిగ్నల్ ఇస్తున్నాడు రాజా. ఇంజన్ డ్రైవర్ తన సిగ్నల్ ని అందుకోలేదని అతనికి ఇప్పుడు అర్ధం అవుతూనే వుంది.
ఇంజన్ డ్రైవర్ గంగారాం అన్నాడు. "చెప్పాలా తమ్మీ! లీడర్లు అందరిని కూకోబెట్టి అల్లర్లు, మానేసి దేశం సంగతి చూడమని పెద్దోళ్ళు ఎవరైనా చెప్పాలి తమ్మీ!"
"మరి ఎందుకు చెప్పరు సాబ్?"
"అందులో మతలబు మనకి తెలీదు తమ్మీ!"
"ఈ పెద్దోళ్ళుగాక" ఇంకెవ్వరు లేరా ఉస్తాద్!
"ఉన్నారు తమ్మీ! ఇంకొంతమంది అన్నలూ, తమ్ముళ్ళు ఉన్నారు - ఎక్కడికేల్లాల్లో మంజిల్ తెలుసు వాల్లకి - కానీ ఎట్ల వేల్లాలో రాస్తా మంచిగ తెలియదు - పరేషాన్ ల బస్సులు తగలబెడతారు - స్టేషన్లు బ్లాస్ట్ జేస్తారు - రైళ్ళు పడగొడతారు. ఎక్స్ చెంజీలు......"
గంగారాం మాట పూర్తిగాకుండానే ఒక్కసారిగా గావుకేక పెట్టాడు యాకూబ్.
"ఉస్తాద్! రోకో! రోకో! ఎర్రజెండా కనబడ్తున్నది!"
"హయ్రాం!" అని సడెన్ బ్రేకు వేశాడు గంగారాం.
రైలు చక్రాలు దొర్లడం మానేశాయి!
కానీ -
ఆ స్పీడుకి రైలు మాత్రం ఆగకుండా పట్టాలమీద కర్ణకరోరమైన శబ్దం చేస్తూ చక్రాల దొర్లకపోయినా జారుతూ ముందుకు వెళుతూనే వుంది.
"చచ్చింది గొడ్డు!" అన్నాడు గంగారాం కంగారుగా.
కీచుమని శబ్దం చేస్తూ పట్టాల తాలూకు ఫిష్ ప్లేట్లు తొలగించివున్న స్పాట్ కి చేరుకుంది రైలు ఇంజను - దాన్ని దాటేసి ముందుకెళ్ళిపోయింది కూడా!
ఫిష్ ప్లేట్లు తీసేసి వుండడం వల్ల పట్టాలు పక్కకి జరిగిపోయాయి - మెలికలు తిరిగిపోయాయి.
దాంతో పట్టాల మీద నుంచి కేందకి వచ్చేసింది ఇంజను - మట్టిని దున్నేస్తున్నట్లు ముందు కెళ్ళిపోతోంది - దాని వెనకే అడ్డదిడ్డంగా వచ్చేస్తున్నాయి బోగీలు. వేగంగా ముందుకెళ్ళిపోతూ అక్కడికి సమీపంగానే ఉన్న ఒక భవంతి వైపు పోయింది రైలు.
డైమండ్ రాజా తన రక్తంతో తడిసిన షర్టుని ఎర్రజెండాలాగా చూపకపోతే, యాకూబ్ దాన్ని చివరి క్షణంలో చూడకపోతే అతని గావుకేక విని గంగారాం సడెన్ బ్రేకు అప్లయి చెయ్యకపోతే ,
అస్పాట్ లో ఆ సూపర్ ఎక్స్ ప్రెస్ కి అతి భయంకరమైన ప్రమాదం జరిగి వుండేదే!
వందలమందికి ప్రాణాపాయం కలిగి ఉండేది!
రాజా "ఎర్రజెండా' చూపడం వల్ల ట్రెయిన్ స్పీడు చాలావరకూ తగ్గి ప్రమాదం తప్పింది!
రైలు పట్టాలు తప్పగానే ఆ కుదుపుకి ఏసీ కంపార్ట్ మెంటులో పడుకుని నవల చదువుకుంటున్న అలివేలు ఉరఫ్ అయేషా ఒక్కసారిగా గాల్లోకి ఎగిరి , డోర్ లో నుంచి మిరాక్యులస్ గా బయటికి వచ్చేసింది.
"గా ........వ్....డ్!" అని ఆ అమ్మాయి ఇంగ్లీషులో దేవుణ్ని స్మరించుకునే లోగానే -
మన్మధుడిపూలబాణంలా దూసుకొచ్చి, రాజా చేతుల్లో పడింది మిస్సిండియా - అయేషా!
* * *
అక్కడ -
దేశ్ పాండే బంగళాలో బందీ అయివున్న మీనాక్షి కోసం కాఫీ పట్టుకు వచ్చాడు దేశ్ పాండే అనుచరుడయినా రాంనారాయణ్.
"ఏమిటది?" అంది మీనాక్షి కటువుగా.
"కాఫీ!" అన్నాడు రాంనారాయణ్.
"నాకొద్దు!" అంది మీనాక్షి. అసహనంగా నవ్వాడు రాంనారాయణ్.
"సతీ సావిత్రి, సీత మాయ్ పద్దతులు ఈ కాలంలో నడవ్వు మేడమ్!"
"ఏమంటున్నావు?" అంది మీనాక్షి ఆగ్రహంగా.
"నువ్వు పరాయి మగాడ్ని తాకకుండా పరమపవిత్రంగా ఉంటే ఈ లోకం మెచ్చుకుని నీకు మెడలు ఇస్తుందా, మేక తోలు కప్పుతుందా మేడమ్?
"షటప్!"
సానుభూతిగా అన్నాడు రాంనారాయణ్.
"నేను చాలా లోకం చూశాను! ప్రపంచం పూర్తిగా మారిపోయింది! ఒకప్పుడు పర్ వర్ షన్స్ అనుకునే వికృతచేష్టలు ఇప్పుడు కామన్ అయిపోయినాయ్! ఉత్త అదా మగా సంబంధాలేకాదు - అడా-ఆడా మగా- మగా - మనుషులు జంతువులూ -శాడిజం- మాకోయిజమ్, ఇవన్ని చాలా కామన్ అయిపోయాయి మీనాక్షి! ఇప్పుడు మిగిలింది ఒకేఒక్క పర్ వర్ షన్! అది ఏమిటో తెలుసా?"
అతన్ని అసహ్యంగా చూస్తోంది మీనాక్షి.
"ఇప్పుడు మిగిలిన ఒకే ఒక వికృత చేష్ట ఏమిటంటే - శీలవతిగా బతకలనుకోవడం! " అని పెద్దగా నవ్వి, మీనాక్షి భుజం మీద బలంగా చెయ్యి వేశాడు రాంనారాయణ్.
మీనాక్షి పెనుగులాడడం మొదలెట్టింది.
* * *
రాణీపూర్ పాలెస్ లో - ట్రాప్ లో పడ్డ ఎలుగ్గోడ్డులా అసహనంగా అటూ ఇటూ పచార్లు చేస్తున్నాడు సుందరం. అతను వేసుకున్న తెల్ల ప్లానేల్ సూటు నల్లటి అతని ఆకారానికి ఏమాత్రం సూట్ కాలేదు!
మతి స్థిమితం తప్పిన వాడిలాగా తనలో తనే గొణుక్కుంటున్నాడు సుందరం.
"ఓరి వీడి తస్సా చెక్కా! మిత్ర ద్రోహం అంటే ఇదేగదా! దోస్త్ దోస్త్ నా రహ! పార్టనర్ నా రహూ! ఈ లెక్కన డైమండ్ రాజాగాడు పాలెస్ కి వచ్చి తీరేటట్లే ఉన్నాడు! వచ్చీ రావడంతోనే సద్గుణంగాడి కూతురు ఆ రాజాగాడి వెంట పడాలి - వాళ్ళ ప్లాన్ ప్రకారం! కానీ దాని అదృష్టం చూడు! ఉళ్ళోకి రాకముందే సరిగ్గా వాడి చేతుల్లోనే పడింది! ఇంక ఆస్తి అంతా సద్గుణం గాడి చేతుల్లో వుంటుంది. ఇదంతా నా ఖర్మ!
డైమండ్ రాజా- అయేషా!
డైమండ్ రాజా- అయేషా!
వారేవా! ఏం కాంబినేషన్! ఏడ్చి మొత్తుకున్నట్లుంది!
నాకే గనక ఓ కూతురుంటెనా - దాన్ని ఈ రాజాగాడి వెనక వదుల్దును! ఖర్మ! కొడుకు పుట్టాడు!
అతను అలా అనుకుంటుండగానే అతని బుర్రలో ఓ ఫ్లాష్ వెలిగినట్లయింది!
తనకి కూతురు లేకపోతేనేం-
చెట్టంత కొడుకు ఉంటేనేం గాక -
ఏం చెయ్యాలో తనకి తెలుసు! వండర్ మీద దండర్!
భలే ఐడియా తట్టింది.
వారెవ్వా!
ఇంతలో -
కిచెన్ దగ్గర ఏదో కలకలం గమనించాడు సుందరం.
ఆటే వెళ్తున్నాడు వంటవాడు భీంసెయిన్.
"భీంసెయిన్!" అని పిల్చాడు సుందరం. తలమీద పొడగాటి కాగితం టోపీ పెట్టుకుని ఉన్న భీంసెయిన్ వచ్చి వినయంగా నిలబడ్డాడు.
"ఏమిటి హడావుడి?" అన్నాడు సుందరం.
"బడాఖానా చేస్తున్నాం సార! దావత్!"
"ఎవరి కోసం?"
"డైమండ్ రాజా గారికోసం స్పెషల్ డిన్నర్ అరేంజ్ చెయ్యమని ఎస్టేట్ మేనేజర్ జస్వంతరావు సాబ్ దగ్గర్నుంచి మెసేజ్ వచ్చింది సాబ్!" అంటూ కిచెన్ లోకి వెళ్ళిపోయాడు భీంసెయిన్"
పళ్ళు పటపట కొరుక్కున్నాడు సుందరం.
కిచెన్ లో డజను మంది వంటవాళ్లు రకరకాల పిండివంటలు చేసేస్తున్నారు - వాటివైపు మురిపెంగా చూశాడు భీంసెయిన్ .
ఈలోగా -
విక్రమదేవరావు "ఆస్థాన గాయకుడు" అయన తాన్ సెయిన్ ఒక్కసారి అటువచ్చి వంటింట్లోకి తొంగి చూశాడు.