Previous Page Next Page 
ప్రేమ తరంగం పేజి 15

కుటుంబరావుగారు క్లబ్బు సెక్రటరిని కలిసి శ్రీహర్ష మెంబర్ షిప్ గురించి మాట్లాడారు, సాధ్యమైనంత వరకూ ప్రయత్నిస్తానన్నాడతాను.
తొమ్మిదయిపోతోంది.
క్లబ్బులో హడావుడి తగ్గకపోగా ఎక్కువయింది. బాగా పొద్దుపోయే దాకా ఆఫీసుల్లో పనిచేసిన పెద్ద పెద్ద ఉద్యోగులందరూ భార్యలతో సహా విమానాల్లాంటి కార్లలో దిగుతున్నారు. లీటర్ల కొద్ది స్కాచ్ విస్కీ మెత్తగా గొంతుల్లోంచి జారుతోంది. యదేచ్చగా తాగుతున్నారు. అదా మొగ , మర్యాదకు తాగేవాళ్లు కొందరు, మొహమాటానికి తాగేవాళ్లు కొందరు, తాగుడికి బానిసలై తాగేవాళ్ళు కొందరైతే, గొప్పకి తగేవాళ్ళు కొందరు. నువ్వు బ్లాక్ డాగ్ గానీ, జానీ వాకర్ గానీ తాగితే తప్ప నువు జీవితంలో సాధించిన విజయాలు ఎదుటివాడికి అర్ధం కావు. కొన్ని సంవత్సరాల క్రిందట, మోగాళ్ళు గ్లాసుల్లో విస్కీ నింపుకుంటే , భార్యలు తమ గ్లాసుల్లో కోకాకోలా ఓంపుకుని తాగుతూ కంపెని ఇచ్చేవారు. ఇప్పుడలా కాదు.  మిస్టర్ వైట్ హార్స్, తాగితే, మిసెస్ కట్టి సార్క్ కావాలి.
నాగరికత!
అంతా చూశాడు శ్రీహర్ష. అతనికి వాతావరణం నచ్చలేదు. అయితే పరిచయాలు కావాలంటే, కుటుంబరావుగారు చెప్పినట్లు ఇంతకంటే సులభ మార్గం లేదు.
"ఇంక వెళ్దామా?" అంటూ వచ్చింది లావణ్య.
"ఇంకొక్క పెగ్గు. వన్ ఫర్ ది రోడ్" అంటున్నారు కుటుంబరావుగారు.
"ఇంకేం వద్దు. పదండి వెళ్దాం" అంది లావణ్య.
ఆ మాట కోసమే ఎదురు చూస్తున్నట్లు చటుక్కున లేచి నిలుచున్నాడు శ్రీహర్ష. అతనికక్కడ ఊపిరాడ్డంలేదు.
బయటికి నడుస్తుంటే, "మళ్ళీ ఎప్పుడు కలుస్తారు?" అంది లావణ్య శ్రీహర్షతో.
"మళ్ళీ సోమవారం వస్తాడు. మెంబర్ షిప్ సంగతి కనుక్కునెందుకు" అన్నారు కుటుంబరావుగారు.
"లావణ్యా! ఇవాళ నువ్వు నాతో టెన్నిస్ ఆడనేలేదు" అన్నాడు రాజేష్ నవ్వుతూ.
"నువ్వు రాగానే బాటిల్ పట్టుకు కూర్చుండిపోయావ్. ఇంక నాతో టెన్నిస్ ప్రసక్తి ఎక్కడుంది?"
"మళ్ళీ ఎప్పుడొస్తావని నన్నడగవేం?"
"నువ్వు రోజు వస్తావు. క్లబ్బుకి రాకపోతే నీకు తోస్తుందేమిటి. అసలు రోజు ఇంటికెళతావా? భోజనం నిద్ర కూడా క్లబ్బులోనేనా" అంది లావణ్య నవ్వుతూ.
"నేను వస్తాను" అన్నాడు శ్రీహర్ష చేతులు జోడించి అందరికి నమస్కారం పెడుతూ.
"మీ ఇంటిదగ్గర డ్రాప్ చెయ్యమంటారా?" అంది లావణ్య.
"అబ్బే! వద్దండి! ఆటోలో వెళ్ళిపోతాను."
"అసలయినా మీ జీప్ తేలేదెం?"
"గారేజీ కెళ్ళింది."
"అవును మరి! మీ జీపు గారేజ్ కెళితే ఆశ్చర్యం లేదు. రోడ్డు మీద పరిగేడితేనే వింత."
నవ్వుతూ శెలవు తీసుకున్నాడు శ్రీహర్ష.
"మీతో తర్వాత సావకాశంగా మట్లాడాలి- చాలా విషయాలు" అన్నాడు రాజేష్, శ్రీహర్ష ఆటోలో ఎక్కుతుండగా.

                                               * * *

ఆ తర్వాత కుటుంబరావుగారి కుటుంబంతో సాన్నిహిత్యం పెరిగింది. అయన భార్య వసుందర మాత్రం అదో మోస్తరు. చాలా నిక్కచ్చిగా, మ్,ముక్తసరిగా మాట్లాడుతుందావిడ. 'మాకు బోలెడంత డబ్బుంది. మేం చాలా గొప్పవాళ్ళం' అన్న భావం ఆమె ప్రతి చర్యలో గోచరిస్తూ ఉంటుంది.
అది ఆమె స్వభావం. తెచ్చి పెట్టుకున్నది కాదు. శ్రీహర్ష మొదటిసారి కుటుంబరావుగారింటికెళ్ళినప్పుడు ఆమె ఏదో మహిళా మీటింగ్ కెళ్ళింది.
మళ్ళీ సోమవారం వాళ్ళింటికి వెళ్ళాడు శ్రీహర్ష.
ఆమె ఇంటిముందు తోటలో గులాబీ మొక్కల దగ్గర నిలబడి పరీక్షగా చూస్తోంది. ఆవిడ ఏదో చెబుతోంటే నర్సయ్య ఆ ప్రకారం పాదులు సరిచేస్తున్నాడు.
వసుంధరని చూడగానే లావణ్య పోలిక కొట్టొచ్చినట్లు కనబడిపోతోంది. అదే సూటిగా ఉన్న ముక్కూ, పెద్ద కళ్ళు, అక్కడక్కడ నెరసిపోయినా ఒత్తుగా , పొడుగ్గా వున్న జుట్టూ, నలభై ఒకటి, నలభై రెండూ మధ్య ఉండొచ్చు వయసు. అయితే ఆమెకి ఏళ్ళు కనబడవు. ముప్పై ఐదేళ్ళ దాన్లాగా, లావణ్యకి అక్కలాగా కనబడుతుంది.
మనిషిని చూడగానే పలకరింపు, మోహంలో నవ్వూ రావామెకు. నిర్లిప్తంగా ఒక్క చూపు చూస్తుండి. వచ్చినవాళ్ళే మొదట పలకరించాలి. తర్వాత ఒక అయిదు నిమిషాలు గడిచాక క్రమక్రమంగా మాములు మనిషవుతుంది ఆమె. తూచి తూచి మాట్లాడుతుంది. ఎదుటివాళ్ళు ఒక్క అక్షరం పొరబాట్న మాట్లాడితే వెంటనే పట్టేస్తుంది. బయట పెట్టేస్తుంది కూడా.
"నమస్కారమండి!" అన్నాడు శ్రీహర్ష.
ఒక్కసారి తల పంకించి ఊరుకుంది.
"కుటుంబరావుగారు లేరా?"
"బయటి కెళ్ళారు."
'లావణ్య ఉందా?' అని అడగడం చేతకాక, "ఇంకెవరూ లేరా" అన్నాడు.

 Previous Page Next Page