Previous Page Next Page 
ప్రేమ పురాణం పేజి 15


    
    ఇంకో రెండు పంచవర్ష ప్రణాళికల తర్వాత ఆ నష్టాన్ని నాలుగుకోట్లకే దించి తీరతానని ఆయన పార్టీల్లో బాగా మందుకొట్టి, కిక్కెక్కినప్పుడు చెబుతుంటాడు.
    
    ఆయనకి ఒక కూతురూ, ఒక కొడుకూనూ.
    
    కొడుకు కెనడాలో వుంటున్నాడు.
    
    కూతురేమో మన షీలా నాయర్.
    
    ఆ అమ్మాయి బోల్డంత మంచిది.
    
    ఇంకానేమో చాలా బావుంటుంది.
    
    అప్పుడప్పుడు బుద్దికుదిరి చదివితే మంచి మార్కులు తెచ్చుకోగలదు కూడా.
    
    కానీ మహా 'మూర్ఖుణి' సితార మాటల్లో!
    
    ఎందుకని మూర్ఖిణీ?
    
    జెయ్ చంద్ర అంటే ఇంక అన్నీ మర్చిపోయి పైమీద బట్ట వుందా జారిపోయిందా అని కూడా గమనించకుండా వెంటబడి వెళ్ళిపోతుందిగనక.
    
    షీలానాయర్ కరుగుతున్న బంగారం రంగులో వుంటుంది.
    
    నల్లటి ఒత్తయిన వుంగరాల జుట్టు. 'ఛెమ్మీస్' (అంటే మళయాళంలో చేప) లాంటి కళ్ళు.
    
    చాలా బావుంటుంది షీలానాయర్.
    
    వాళ్ళ బంగళా బంజారాహిల్సు లో వుంది.
    
    షీలానాయర్ సంగతి అలా వుందా?
    
    ఇకపోతే-
    
    నిమ్మీ-
    
    నిమ్మీకపూర్!
    
    నిమ్మీవాళ్ళు పంజాబీలు.
    
    వాళ్ళ నాన్నకి పెద్ద బిజినెస్ వుంది.
    
    దానితో పాటు ఆటోమొబైల్స్ ఏజెన్సీ కూడా వుంది.
    
    కార్లు కొనడం, అమ్మడం నిత్యకృత్యం. బఠాణీలు అమ్మినట్లు కార్లని అమ్ముతాడాయన.
    
    ఆయనకి మొదట్లో రెండు లారీలు వుండేవి.
    
    వాటితో చేసే ట్రాన్స్ పోర్టు బిజినెస్ వుండేది.
    
    అదలావుండగా -
    
    లారీ డ్రైవర్ల అవసరాలు తీర్చడంకోసం నేషనల్ హైవేమీద రోడ్ సైడ్ డాబాలు వుంటాయి.
    
    అందులో చేసే పంజాబీ వంటకాలు ఫేమస్.
    
    హైరోడ్డు పక్కనే వుండే ఈ డాబాలలో ముందువైపు నాలుగైదు నులకమంచాలు వేసి వుంటాయి.
    
    కొన్ని టేబుల్సూ, కుర్చీలూ కూడా వుంటాయి.
    
    ఓ వైపున అప్పటికప్పుడు, అక్కడికక్కడే హాట్ హాట్ గా తినుబండారాలు తయారయిపోతూ వుంటే-
    
    మక్కీదీరోటీ, సరసోం కాసాగ్, లస్సీ, గన్నేకిరస్, వగైరా వగైరాలని చాయ్ తో లేదా మద్యాలతో కలిపి మహదానందంగా పుచ్చుకుంటూ వుంటారు లారీ డ్రైవర్లు. కావాలనుకుంటే కాసేపు అక్కడే నులకమంచాలమీద నడుం వాలుస్తారు కూడా.
    
    నిమ్మీకపూర్ పుట్టిన వేళావిశేషం కామోసు.    
        
    వాళ్ళ నాన్న జతిన్ కపూర్ కి బాగా కలిసి వచ్చింది.
    
    ఒక డాబా కాస్తా పది డాబాలయ్యాయి.
    
    డాబా ఇల్లు కాస్తా బంగళా అయ్యింది.
    
    డాబాలతోబాటు హోటల్సు కూడా పెట్టాడాయన. ప్రస్తుతం నిమ్మీస్ అనేపేరుతో ఓ త్రీస్టార్ హోటలు నడుస్తోంది.
    
    జతిన్ కపూర్ ఈజీ గోయింగ్ పెర్సన్.
    
    కష్టమేమిటో సుఖమేమిటో తెలిసినవాడు.
    
    కష్టనష్టాలూ, సుఖదుఃఖాలూ అన్నీ అనుభవించినవాడు.
    
    జీవితపు అట్టడుగుపొరలనుంచి వచ్చినవాడు.
    
    ప్రస్తుతం పాకిస్తాన్ లో వున్న లాహోర్ లో పుట్టాడు అతను.
    
    దేశవిభజన టైంలో కాందిశీకుడుగా ఇక్కడికి వచ్చాడు.
    
    దారిలోనే అతని కుటుంబం మొత్తం మతకలహాలకు బలైపోయింది.
    
    నా అన్నవాళ్లు లేకుండా, కడుపు చేత్తో పట్టుకుని హైదరాబాద్ చేరుకున్నాడు.
    
    మేడ్చల్ దగ్గర డాబా ఒకటి పెట్టాడు.
    
    డాబా నడుపుతూనే చిన్న ప్రేమాయణం కూడా అర్జెంటుగా నడిపేసి ఓ అనాధని పెళ్ళి చేసుకున్నాడు.
    
    వాళ్ళకు పుట్టిందే నిమ్మీ! నిమ్మీకపూర్!!
    
    జతిన్ కపూర్ యివాళ కోట్లకి అధిపతి.
    
    కానీ గతం మర్చిపోలేదు అతను.
    
    జాతి, మత, కుల, ప్రాంతీయ భేదాలు అతనికి క్షుద్రంగా కనబడతాయి.
    
    అతనికి తెలుసు-
    
    తన కూతురు నిమ్మీ జెయ్ చంద్ర అనే కుర్రాడిమీద మనసు పడిందని, వాళ్ళు పంజాబీలు - జెయ్ చంద్రేమో తెలుగు కుర్రాడు.
    
    జెయ్ చంద్రేకాదు.
    
    జాన్, జానీ, జనార్ధన్, జేవియర్, జంగయ్య-
    
    అలా ఎవరిమీద తన కూతురు మనసుపడి మనువాడతానని చెప్పినా అడ్డంపెట్టి వుండేవాడు కాదు జతిన్ కపూర్.
    
    అతని హృదయ వైశాల్యం వందకిలోమీటర్లు.
    
    ముందే చెప్పుకున్నాం గదా! అతను చాలా ఈజీ గోయింగనీ -
    
    ఎంతటి అవాంతరం వచ్చినా కూడా, చివరికి మిన్నువిరిగి మీదపడినా కూడా "అర్రె! చల్నేదో బాల్ కిషన్!" అని తేలిగ్గా తీసిపారేస్తాడన్నీనూ.
    
    సరే! నిమ్మీకపూర్ వృత్తాంతం యిలా వుండగా ఇకపోతే ముగ్గురు మూర్ఖిణులలో  మిగిలింది రచన.
    
    రచన!
    
    వాళ్ళనాన్న ఎడ్యుకేషన్ మినిష్టరు. కాదుకాదు. 'ఎడ్డుకేసన్ మినిట్టరు.'
    
    ఆయన నిశానీగాడు. అంటే వేలిముద్దర బాపతన్నమాట.
    
    చదువురాదు.
    
    సంతకం పెట్టడం కూడారాదు.
    
    కానీ భావిభారతపౌరుల విద్యావిధానాన్ని గురించి పాలసీ డెసిషన్లు తీసుకునే బాధ్యత మాత్రం ఆయనదే.

 Previous Page Next Page