"అక్కా! రాతియుగంలో జీవించే వాళ్ళకున్న తెలివి కూడా నీకులేదు. అందుకే బావ నీ మెతకదనం కనిపెట్టి ఆటలాడిస్తున్నాడు. బెదిరిస్తున్నాడు. మీ బావకి నా మీద ఎంత ప్రేమో! క్షణం వదిలి వుండరు. అనే దానివే. ఇప్పుడిదేమిటి? పిల్లలు పుట్టరని వదిలేస్తున్నాడా? నీపై ప్రేమ ఎక్కువయి వదిలేస్తున్నాడా? నన్ను పెళ్ళాడాలని నాటకాలు పోతున్నాడా? నిజమైన ప్రేమ భార్యభర్తల మధ్య వుంటే, నిన్నిడిచి పోతానని భర్త, నిన్నిడిచి పోతానని భార్య బెదిరించుకుంటూ కాపురాలు చేయరు. రోగాలు బాధలు వచ్చాయని విడనాడరు. ఇదివరకు బావ నీపై చూపిందంతా కపట ప్రేమ. ఆ శ్రీ కృష్ణమూర్తికి ఊళ్ళో గోపికలు తక్కువయారు నామీద పడ్డాడు. నీవు గట్టిగా ఎదురు తిరుగు. ఈ సమస్యకు పరిష్కారం నే చూస్తాను."
"నీకేం చాతనవునని ఏం చూస్తావే, ఆయనసలే మొండి మనిషి. ఇప్పటికిప్పుడు ఎవతినన్నా పెళ్ళాడి తీసుకు రాగలరు. ఆనక ఏమనుకుని ఏం ప్రయోజనం వుంది. నా గతేం కావాలి?"
"బావ మొండి అయితే నువు జగమొండిగా మారు. అంతేగాని ఇలా శోకాలు పెట్టకు. బావ మొండవాడు. నీవు మెతకదానివి. అందుకే ఆటలు సాగుతున్నాయి, బావకన్నా మొండిదాన్ని నేను. నన్నేం చేయలేక నీమీద ఎగిరిపడుతున్నాడు. అన్ని విషయాలలోనూ ఆడది మన్ను తిన్న పాములా పడివుండటం, గంగిరెద్దులా బుర్ర ఊపటం, ఎప్పుడు మానేస్తుందో అప్పుడు గాని సంసారాలు సౌఖ్యప్రదం కావు. సందర్భాన్ని బట్టి తలవంచాలి. సమయం చూసి తల ఎత్తాలి. ముందది నువ్వు నేర్చుకో. బావకి గుణపాఠం నేర్పి నీ కాపురం నే చక్కబరుస్తా."
"నువ్వం చేయగలవే!"
"అదే వద్దన్నాను. ఏం చేయలేనో చెపితే, ఏం చేయగలనో చెపుతాను."
లలిత అయోమయంగా తల్లి వేపు చూసింది. "దీప చెపుతున్నది కదా! నువ్వూరుకో. అంతా అది చూసుకుంటుంది. చిన్నదయినా దాని పాటి తెలివి దైర్యం మనకి లేకపోయె" అంది ఆదిలక్ష్మమ్మ. ఈ మధ్య దీప సంసారాన్ని చక్కదిద్దే తీరు తెన్నూ చూసి, దీప ఏమయినా చేయగలదనే ధైర్యం ఏర్పడింది.
"నీ ఇష్టం ఏం చేస్తావో" అంది లలిత.
"ఏం చేస్తానో చూస్తావుగా! తొందరెందుకు" అని ప్రయివేటుకి బైలుదేరింది దీప. వెళుతూ మధుసూదనం రాసిన లెటర్ దాచి వెళ్ళింది.
దీప దోవ పొడుగూతా ఆలోచిస్తూనే వుంది. ఎన్నో ఆలోచనలు వస్తున్నాయి పోతున్నాయి. "ఏం చేస్తానో చూస్తావుగా?" అనయితే అందిగాని ఏం చేయాలన్నది తెలియలేదు. పార్వతమ్మ ఇల్లు వచ్చిందాకా ఆలోచిస్తూనే నడిచింది.
పార్వతమ్మ దీపని చూస్తూనే "మొహం అలా పీక్కుపోయిందేమే దీపా!" అంది.
"సమస్యలు తగ్గాల్సింది పోయి, కొత్త సమస్య లొచ్చి పడుతున్నాయి" అంది దీప తెచ్చిపెట్టుకున్న చిరునవ్వుతో.
"మీ బావ ఊరు నుంచి ఊడిపడ్డాడేమిటి?" అక్కడే వున్న అనిల్ నవ్వుతూ అడిగాడు.
"బావ ఊడి పడలేదు, ఆయనగారు రాసిన ఉత్తరం ఊడిపడింది" అంది దీప.
దీప చెపుతుందని అనిల్ ఊరుకున్నాడు. తల్లి కొడుకు ఇరువురిలో ఎవరైనా అడిగితే చెప్పొచ్చని ఊరుకుంది దీప.
"ఇంట్లో అన్నీ సక్రమంగా ఉన్నాయికదా" అంది పార్వతమ్మ.
"ఇంటి విషయాలేం ఫరవవాలేదత్తయ్యా! నాకు తోడుగా మీ అబ్బాయి నిలబడి చాలాభాగం మా సమస్యలు పరిష్కారం చేశారు. నాలుగు గదుల్లో మేం సర్దుకున్నాము. తతిమ్మా ఆరు గదులు రెండు భాగాలుగా చేసి అద్దెకిచ్చాము. అమ్మ మొదట ఒప్పుకోలేదు తర్వాత ఊ అందనుకో. రెండు భాగాలుకి ఎనభై రూపాయలు అద్దెవస్తున్నది. గేదెని బేరం చేస్తున్నాము. రెండొందలు పోయినా మంచి గేదెనుకొంటే పాలు ఎక్కువగా ఇస్తుంది. పాలు హోటల్ కి గాని పాల వ్యాన్ కి గాని అమ్మొచ్చు. ఇటు ఇల్లు గడుస్తుంది. అటు డబ్బు వస్తుంది. సంసారం గడిచిపోతుంది. నాన్న చేసి పోయిన అప్పులు తీర్చటం ఎలా అన్నది అప్పుడప్పుడు కష్టంగా తోస్తుంది. నాన్న ఉండగా పొలం అమ్మలేదు. అదో అదృష్టం. తిండి గింజలకి లోటులేకుండా ఏడాదికేడాది గడిచిపోతుంది. ఇప్పుడు గేదెని కొనడానికి అప్పుచెయ్యాలా? అది తీర్చాలా?"
పార్వతమ్మ మధ్యలో అడ్డు తగిలింది. "మేమేం పరాయివాళ్ళమంటే దీపా! డబ్బు సంగతి అనిల్ చూసుకుంటాడు కదా!" అంది.
"అప్పుచేసి తీర్చేకన్నా ఆ డబ్బుంటే ఎంత బాగుండేది?" అంది దీప.
"తొందరేం లేదు, నీ దగ్గర డబ్బు పోగయిం తరువాతే ఇద్దువుగాని దీప!" అన్నాడు అనిల్. మళ్ళీ వెంటనే "ఇవ్వకపోయినా ఫరవాలేదు. నేను, అమ్మ ఏమీ అనుకోము" అనేశాడు వెంటనే నాలుక కొరుక్కున్నాడు.
"మీకు రుణపడమంటారా?" చివ్వున తలఎత్తి అనిల్ కళ్ళల్లోకి తీవ్రంగా చూస్తూ అంది దీప.
"అంత భాగ్యం కూడానా! నీవు ఎవరికి రుణపడవు దీపా"
అనిల్ సూటిగా దీపని చూడటంతో అనిల్ చూపుల్లో దీప చూపులు కలిశాయి. టక్కున కనురెప్పలు దించుకుంది దీప.
"సుందరమ్మగారు పెద్దదయిపోయింది. ఆవిడకి వంట్లో బాగుండటం లేదని తెలిసింది. ఓసారి అలా వెళ్ళొస్తాను. ప్రయివేటు అయిన తరువాత అటువస్తేరా దీపా!" అని పార్వతమ్మ వెళ్ళిపోయింది.
దీప పుస్తకాలు తెరచింది. అనిల్ నిన్న చెప్పిన పాఠాలు పరిశీలించి కొత్తపాఠం మొదలు పెట్టాడు. దీప మనస్సు పాఠం మీద లగ్నం కావటం లేదు. బావ రాసిన ఉత్తరం మీదే వుంది.
"దీపా! ఏమిటా పరధ్యాన్నం! పరీక్షలు దగ్గరకొస్తున్నాయి. శ్రద్ధగా పాఠం వినటంలేదు." అన్నాడు అనిల్ చెపుతున్న పాఠం ఆపుజేసి.
"పరధ్యాన్నమా! అబ్బే నాకేం లేదు. పాఠం వింటున్నాను."
"ఆ కంగారు దేనికి?"
దీప మాట్లాడలేక పోయింది.
"దీపా! సమస్యలు ఎప్పుడూ ఉంటాయి. వాటినే పట్టుకుని బుర్ర వేడెక్కించుకుంటే చదువు ఎలా వంటపడుతుంది? మొహమాట పడకు దీపా! నన్నేమన్నా చేయమంటావా!"
"ఇప్పటికే చాలా సహాయం చేశారు. నేనొంటరిగా ఏమిచేయగలను. మీరు తోడుగా నిలిచి ఎప్పటికప్పుడు నే అడిగిన వాటికి సలహాలిచ్చి నన్ను ప్రోత్సహించి మా సంసారాన్ని నిలబెట్టారు. అదే బావ కూకటివేళ్లతో చెట్టునే పడదొయ్యాలని చూస్తున్నాడు."
"మీ బావ దగ్గరనుంచి ఉత్తరం ఊడి పడిందన్నావుగా, అదేమిటో చెప్పు దీపా!"
వివరంగా చెపుదామా వద్దా అని సంశయంగా ఆలోచిస్తూ వుండిపోయింది దీప.
"అడిగినా చెప్పవులే దీపా! నీదంతా గుట్టు. ఆప్తుడిగా అడుగుతున్నాగదా, చెప్పటానికేమిటి? లేక అంత చెప్పకూడని విషయమా? నావద్ద ఊరికే చదువు కుంటున్నానని ఇది ఏ జన్మ రుణమని పాతబాకీ వసూలు చేసుకుంటున్నానా! ఇలా అని అమ్మతో అంటుంటావు చాలాసార్లు విన్నాలే. రుణం, బాకీ, సహాయం ఇలాంటి మాటలు ఉపయోగిస్తుంటావు గాబట్టి ఇప్పుడు కూడా నీ సమస్య ఏదో చెప్పు...చెప్పి" ఆగిపోయాడు అనిల్.