Previous Page Next Page 
రేపల్లెలో రాధ పేజి 16


    అతను వసారా మెట్లు దిగుతుండగా వెనుకనుండి తూనీగలాగా వచ్చిన పిల్ల ఒకత్తి, "ఇదిగో కిళ్ళీ .... ఇచ్చిరమ్మంది" అని మాధవ్ చేతిలో పెట్టింది.
    
    "ఎవరు?" అడిగాడు మాధవ్.
    
    "కిటికీ!" అని కిసుక్కున నవ్వి ఆ పిల్ల తుర్రున పారిపోయింది.
    
    'కాబోయే పెళ్ళాంమీద ప్రేమ తెలుస్తుందనీ!' అన్న శాంతమాటలు మననం చేసుకుని నవ్వుకుంటూ అడుగులేశాడు మాధవ్.
    
    రాత్రి పెద్దనాన్న పడుకున్నాడనుకుని అద్దంలో నాలిక చూసుకుంటున్న మాధవ్ తో "అయితే .... తాంబూలాలవరకూ వచ్చేసిందన్నమాట! ఇంకేం, మీ అంతట మీరే పెద్దలయిపోయారూ!" అన్నాడు ఓరకంట గమనిస్తున్న సీతారామయ్య.
    
    మాధవ్ సిగ్గుపడి "ఎర్రగానే పడిందని వాళ్ళతో చెప్పు పెద్దనాన్నా" అన్నాడు.
    
    ఆ చమత్కారానికి "ఓరి భడవా!" అని సీతారామయ్య భళ్ళున నవ్వాడు.
    
    మాధవ్ కి జీవితపు గుబురులో పూసిన కోరిక మొగ్గ ఒకటి విరిసి పుష్పమై పరిమళాలు వెదజల్లినట్లుగా తోచింది.
    
    ఆ రాత్రి మరో శివరాత్రి అయింది.
    
    "నీతో మాట్లాడాలి, త్వరగా గదిలోకిరా" సుబ్బారాయుడు వంటిల్లు సర్దుతున్న భార్యతో చెప్పి వెళ్ళాడు.
    
    "వదినా! రాధా గోరింటాకు రుబ్బింది. కాస్త నా చేతులకి పెట్టి వెళ్ళవూ" అడిగింది వంటింట్లోకి వచ్చిన ప్రమీల.
    
    "శాంతిని అడగకపోయావూ!" అంది పార్వతమ్మ.
    
    "చిన్న వదిన నడుం నొప్పిగా వుందని ఎప్పుడో మంచం యెక్కేసిందిగా" అంది ప్రమీల.
    
    "సరే, రా!" అని కింద కూర్చుంది పార్వతమ్మ.
    
    గదిలో సుబ్బారాయుడు పట్టెమంచం చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ భార్యకోసం ఎదురుచూస్తున్నాడు. అతనికి తన మనసులో ఊహలన్నీ భార్యతో ఆ నిమిషంలోనే పంచుకోవాలన్నంత ఉత్సాహంగా వుంది. కాలు ఓచోట నిలవడం లేదు.
    
    ప్రమీల చేతులకి గోరింటాకు పెడుతూండగా పిల్లలంతా వచ్చి చుట్టూ చేరారు. "పెద్దమ్మా! నాకూ..... నాకూ" అన్నారు.
    
    "మగపిల్లల కెందుకర్రా! అవతలకి పొండి.." అంది పార్వతమ్మ.
    
    శాంత చిన్నకొడుకు వెంటనే రాగం అందుకుని సుబ్బారాయుడి దగ్గరకు పరుగెత్తాడు.
    
    వాడంటే ఆయనకి వల్లమాలిన అభిమానం.
    
    "ఒరే ... ఒరే .... ఒరే ....ఎందుకురా యేడుస్తున్నావు? అమ్మ కొట్టిందా?" వాడిని ఎత్తుకుంటూ అడిగాడు.
    
    "కాదు, పెద్దమ్మ తిట్టింది!" అన్నాడు వాడు.
    
    "ఎంత ధైర్యంరా మీ పెద్దమ్మకి! రానీ చెప్దాం! ఆఁ" అని వాడిని ఊరడించాడు.
    
    పార్వతమ్మ ప్రమీల కూతురికి కూడా గోరింటాకు పెట్టి లేస్తుండగా, "పార్వతీ! ఓమారిలా వచ్చిపోవే!" అని దోమతెరలోంచి అత్తగారు కేకపెట్టింది.
    
    "వస్తున్నా, అత్తయ్యా!" అంటూ అటు నడిచింది పార్వతమ్మ.
    
    సుబ్బారాయుడు గోపీగాడికి కథ చెప్తూ మధ్యమధ్యలో "ఇంకా ఏం చేస్తోందిరా మీ పెద్దమ్మ?" అని విసుక్కుంటున్నాడు.
    
    "నేను చూసిరానా, పెద్దనాన్నా?" అడిగాడు వాడు.
    
    "ఊఁ.... నేను చప్పున రమ్మన్నానని కూడా చెప్పు" అన్నాడు కాస్త కోపంగా సుబ్బారాయుడు.
    
    వాడు వెళ్ళిన రెండు నిమిషాలకి రయ్యిన వచ్చి, "బామ్మకి నడుం నొప్పిట. తైలం రాస్తోందిగా! నన్నెళ్ళి నీ పక్కన పడుకోమంది" అన్నాడు.
    
    సుబ్బారాయుడు కోపంగా పళ్ళు కొరుక్కుని, "పగలల్లా చేసిన చాకిరీ చాలలేదు కామోసు! నా గురించి తప్ప అందరి గురించీ పట్టించుకుంటుంది" అని సణుక్కున్నాడు.
    
    అత్తగారు నిద్రపోయిందని నిర్దారించుకున్నాక పార్వతమ్మ అక్కడనుంచి లేస్తుంటే, సూరమ్మ గదిలోంచి సన్నగా ఏడుపు వినిపించింది. ఆదుర్ధాగా అటువేపు వెళ్ళింది.
    
    సూరమ్మ గణపతిని తిట్టిపోస్తోంది "పనికిమాలిన వెధవా! ఆ పరీక్షకి కట్టమంటే వినవు! ఏ పనీ పాటా చూసుకోవూ! పై పెచ్చు నీ జేబు ఖర్చొకటీ దండుగ! మావయ్య ఒక్కడే ఇంటికోసం రాత్రీ పగలూ కష్టపడుతున్నాడని కూడా లేదా నీకు? వచ్చిన ప్రతి సినిమా టౌనుకెళ్ళి చూడకపోతే చచ్చిపోతావా? ఆడెవడో నీ అభిమాన హీరోనా.... వాడి సినిమా మొదటిరోజు చూడాల్సిందేనా.... నే ఛస్తే కానీ నీకు నీ బతుకేమిటో తెలిసిరాదురా!" అని కొంగు ముక్కుకి అడ్డు పెట్టుకుని ఏడుస్తోంది.
    
    పార్వతమ్మ లోపలకు వెళ్ళి, ఏమిటిది వదినా? ఇప్పుడేమైందనీ ఈ ఏడుపు?" అంది.
    
    "వీడికి బాధ్యత ఎప్పుడు తెలుస్తుందే పార్వతీ? నే ఛస్తే వీడి గతేమిటీ?" తల కొట్టుకుంటూ అంది సూరమ్మ.
    
    "అశుభం మాటలెందుకు వదినా? గణపతీ ...! అన్నం తిన్నావా?" అడిగింది.
    
    తల వంచుకుని పెట్టెమీద కూర్చున్న గణపతి.....! అన్నం ఎందుకులే, కడుపు నిండిపోయిందిగా!" అన్నాడు.
    
    "ఒక్కరోజు తినకపోతే ఏం మించిపోయిందిలే..... రేపు ఇట్లాంటి వెధవలకి తినడానికి తిండే దొరకదేమో ఎవరు చూడొచ్చారూ?" కోపంగా చేతులు తిప్పుతూ అంది సూరమ్మ.
    
    "కన్నతల్లి రొష్టు పెట్టకూడదు. ఊరుకో! పద, గణపతీ! అన్నం తిందువుగాని...." అని మేనల్లుడిని జబ్బ పట్టుకుని లేవదీసింది పార్వతమ్మ.
    
    వంటింట్లోకి నడుస్తూనే "నే తిననత్తా! ఒక్క సినిమా చూస్తేనే ఇంత గొడవ చెయ్యాలా?" అన్నాడు గణపతి.
    
    అది విని, గదిలోంచే "భారం మోసేవాడికి తెలుస్తుంది! వాడు రెక్కలు ముక్కలు చేసుకుంటుంటే ఇంతమందిమి కూర్చుని తింటున్నాము. ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావా?" అంది సూరమ్మ.
    
    "గణపతీ! నువ్వు అమ్మ మాటలు పట్టించుకోకు, పద అన్నం తిందువుగాని!?" అని వంటింట్లోకి తీసుకెళ్ళి పీట వాల్చి, కంచం పెట్టి, ఆదరంగా వడ్డిస్తూ అంది "నేనూ నీ తల్లిలాంటిదాన్నేరా, గణపతీ! మా అందరి దిగులూ నువ్వు ఆకతాయి మూకతో అల్లరిచిల్లరిగా తిరుగుతున్నావనే! కాస్త పెందలాడే ఇంటికొచ్చి ఆ పరీక్షలకి చదివి పాసవకూడదూ! అమ్మకి నువ్వంటే పగా చెప్పు? నీమీద ప్రేమతోనేగా అంటోందీ" అనునయంగా చెప్పింది పార్వతమ్మ.
    
    అన్నం తింటూ తల గబగబా ఊపేశాడు గణపతి.
    
    "మావయ్యకి కాస్త సహాయంగా ఉండకూడదూ... నువ్వు తప్ప మాకెవరున్నారు చెప్పు!"

 Previous Page Next Page