"రామ .... రామ.....!" చెవులు మూసుకున్నాడు సీతారామయ్య.
"పిల్లలిద్దరూ చదువు సంధ్యలు లేకుండా ఇష్టం వచ్చినట్లు తిరుగుతున్నారు. అదేమంటే పిన్నిని ఎదిరిస్తున్నారు. ఇదీ గోవిందరావు బాబాయ్ పరిస్థితి!" అన్నాడు.
"ఈ కుటుంబాలెందుకిలా అయ్యాయీ?" అన్నాడు బాధగా సీతారామయ్య.
"కుటుంబంగా ఉండకుండా కుటుంబాలుగా మారడం వలన! ఎవరికి వాళ్ళే పెద్దలు. ఒకరి మాట వినాల్సిన పనిలేదు. అడిగేవాళ్ళూ, ఆపేవాళ్ళూ లేరు. ఇక మా ఇంటి విషయానికొస్తే అమ్మకి డబ్బే ప్రపంచం! ఎవరితో స్నేహం చెయ్యాలన్నా వారి ఆస్తీ అంతస్తూ వివరాలు వాళ్ళ ఆడిటర్ ని కన్సల్టు చేసి మరీ స్నేహం చేస్తుంది. నాన్నమాట ఏవీ చెల్లదు. ఆయన 'కీ టాయ్!" అన్నాడు.
"అందుకే నేను వాడు రమ్మని అడిగినా ఈ ఊరు వదిలి రాలేక పోయాన్రా! ప్రపంచాన్ని జయించాజూసిన అలెగ్జాండర్ కూడా మన దేశాన్ని చూసి, ఇట్స్ ఎ నైస్ ప్లేస్ టు విజిట్.. టు లివ్..... బట్ నాట్ టు డై! అన్నాడు. ఎవడికైనా తన ఊళ్లోనే చావాలనిపిస్తుంది. నాకూ అంతే!" అన్నాడు సీతారామయ్య.
"కానీ ఈ ఒక్కసారికీ నువ్వు నాతో రావాలి పెద్దనాన్నా! నువ్వే గాదు, అందరూ రావాలి! మళ్ళీ నా చిన్నప్పటి రోజులు తిరిగి రావాలి. అమ్మ ఓ రూమ్ లో....నాన్న ఓ రూమ్ లో .... నేనోచోటా ఆ పెద్దింట్లో ఏ మూలనో ఉండి సెల్ ఫోన్ల ద్వారా మాట్లాడుకునే పద్దతి నాకు వెగటుపుడుతోంది. నాలుగు రోజులపాటు అందరం కలిసి మెలసి గడుపుదాం. ఆ తర్వాత ఎవరికీ వారే యమునా తీరే!" అన్నాడు మాధవ్.
"నీకోసం ఒప్పుకోవాలనిపిస్తోందిరా!" అన్నాడు సీతారామయ్య.
"మా పెద్దనాన్న మంచివాడు!" ఆయన చేతులు పట్టుకుని ఊపుతూ అన్నాడు మాధవ్.
కోవెల గంటలు గణగణమని మోగాయి.
* * *
మాధవ్ కి ఊరిపి సలపడంలేదు.
అనురాగంలో ఊరేసి ఆప్యాయతతో వడ్డించడం వల్లనేమో, ఆవకాయ గూడా తియ్యగా అనిపిస్తోంది.
"పూర్ణాలు నేను చేశాన్రా, మరో రెండు వేసుకో!" నాటో సూరమ్మా, "గారెలు నే వండాను, తినకపోతే ఒట్టే...!" అంటూ శాంతా.
"పులిహోర ఎలా కుదిరిందో చూసి చెప్పు బాబూ!" అంటూ పార్వతమ్మా, "నే వేసిన అరిటికాయ బజ్జీలు వదిలిపెడ్తే బావుండదు! ఆఁ!" అంటూ ప్రమీలా అతన్ని వడ్డనతో ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నారు.
అంతలోనే ఏచెరువుగట్టునుంచో, ఏ పున్నాగ చెట్టునుంచో తప్పించుకొని వచ్చిన చల్లటి పిల్లతిమ్మెర ఒకటి అతన్ని చుట్టుకుని తన ఊపిరితో అతని చెవిలో వేణువూదింది. జడ ముందుకు పడేటట్లు ఒంగి కూర్చుని, "నేతి బొట్టు లేకుండా పూర్ణాలు తినకూడదు!" అంది రాధ.
ఆమె ... చేతిలో నెయ్యిగిన్నెతో జగన్మోహినిలా కనిపించింది. మాధవ్ రెప్పవాల్చకుండా ఆమెనే చూస్తున్నాడు. వెలుగు కరిగిన ఉదయపు ఎరుపులా వుంది ఆమె నొసట అద్దిన కుంకుమ. పసుపు కలిసిన పాలమీగడ ఎరుపులా ఉంది ఆమె పలుచని చెక్కిలిరంగు వెన్నెల్లో తామర పూవు ఎరుపులా ఉంది ఆమె చేతి గోరింట మెరుపు. కోపంగా అరిచి ఎర్రబడ్డ చిలుకముక్కులా ఉంది ముక్కు చివరి ఎరుపు. పారిజాతం కాడ దగ్గర ఎరుపుతో ఉన్నాయి ఒంపు తిరిగిన పెదవులు. మగ్గిన జాంపండు ఎరుపులా ఉంది మెడక్రింద ఉబ్బెత్తుగా ఉన్న ప్రదేశపు ఛాయ అన్నింటినీ మించి ఆ కంటి చూపులో వాడి ... ఎంత ఎరుపో.
"ఆ ... ఆఁ ... అదేంపనే? మావాడికి తీరని దాహంతో ఈ రాత్రి శివరాత్రి చెయ్యాలనా నీ ఉద్దేశ్యం?" అన్న సీతారామయ్య మాటలకి ఇహలోకంలోకి వచ్చాడు మాధవ్.
గిన్నెలో నెయ్యంతా అయిపోవడంతో కొంటెగా "అతను ఆపమనందే ఎలా ఆపడం మావయ్యా?" అంది రాధ.
"రాత్రి దహమతో శివరాత్రే నాకు!" ఆ కళ్ళలోతుల్లోని రహస్యాన్ని ఛేదించటానికన్నట్లు తీక్షణంగా చూస్తూ అన్నాడు మాధవ్.
అసలే ఎర్రని పిల్ల ఇంకా ఎర్రబడి లేచి లోపలకు వెళ్ళిపోయింది.
"సీతమ్మగారింటినుండి జున్నుపాలు తెప్పించావుగా" అన్నాడు సుబ్బారాయుడు.
"నా మతిమండా.... జున్ను పట్టుకొస్తానుండు, బాబూ!" అని పార్వతమ్మ లేస్తుంటే! "రెండుచేతులూ జోడించలేనుగానీ, అర్ధం చేసుకుని ఈ పూటకి నన్ను వదిలెయ్యండి..... ప్లీజ్!" అని బతిమాలుకున్నాడు మాధవ్.
"మరీ అన్నప్రాశనలా అదేం తిండిరా?" అని బాధపడింది తాయారమ్మ.
పిల్లల దగ్గరనుంచి పెద్దల వరకూ అతని చుట్టూ చేరి కురిపిస్తున్న ఆత్మీయతకి అతనికి ఎప్పుడో కడుపు నిండిపోయింది.
"అయిపోయిందా-అయితే పక్కకి జరుగు!" అన్నట్లు చూపులు కురిపించే సిటీల్లోని బఫేలు గుర్తొచ్చాయి.
భోజనాలై పెరట్లోకి వచ్చి చేతులు కడుక్కోగానే సన్యాసిరావు తుండు తీసుకొచ్చి అందించాడు.
వెండి పళ్ళెంలో ఆకులు, వక్కలూ, సున్నం ఉంచి సిద్దంగా ఉంచారు.
సీతారామయ్య ఆకులకి ఈనెలు తీస్తూ, "వేసుకుంటావేమిట్రా?" అన్నాడు.
"వద్దు!" అన్నాడు మాధవ్.
"వేసుకోవయ్యా! కాబోయే పెళ్ళాంమీద ఎంత ప్రేముంటుందో తెలుస్తుందీ?" ఆటపట్టిస్తూ అంది శాంత.
మాధవ్ కిటికీవైపు చూశాడు. ఓరగా కిటికీ రెక్కలు వేసి మధ్య నుంచి చూస్తున్న రాధ పట్టుబడిపోయింది.
"వెళ్ళొస్తాం... పొద్దుపోయింది" అంటూ సీతారామయ్య చేతికర్ర కోసం తడుముకున్నాడు. దాన్ని తను పట్టుకుని తన చేతిని అందించాడు మాధవ్.
"నేను నడుస్తాలేరా .... ఎప్పటికీ నువ్వు తోడుంటావా?" అంటూ కర్ర అందుకున్నాడు సీతారామయ్య.
అందరికీ నమస్కారం పెట్టి సెలవు తీసుకుని, కిటికీవైపు చూసి చెయ్యి ఊపాడు మాధవ్.
"అక్కడెవరున్నారు మావయ్యా?" ప్రమీల కొడుకు అడిగాడు.
"కిటికీ" నవ్వుతూ చెప్పాడు మాధవ్.