Previous Page Next Page 
నాట్ నౌ డార్లింగ్ పేజి 16


    
     నేను కాస్త బయటికి వెళుతున్నాను పిండాకూడు వంటగందిలోవుంది. వెళ్ళి తిను బాబు అని సవతి తల్లి కనకం బుట్ట పుచ్చుకొని బయకిటి నడచింది.
    అభినయ్ కి మామూలే.
     సవతి తల్లకి అతనంటే అసలు గిట్టదు.
     బాగా ఆకలిగా వుంది.
     వంట గదిలోకి నడచి పళ్ళెం కడుక్కొని పీటమీద కూర్చున్నాడు. అతనికి సిద్ధార్థ గుర్తుకొచ్చాడు. వాడు భోజనం చేయలేదని ఇందిర చెప్పింది.
    అంతే గభాల్న లేచాడు అభినయ్.
     గిన్నెలోని అన్నాన్ని, కూరనీ పొట్లంకట్టి చేతితో పట్టుకొని బయటకి నడిచాడు అభినయ్.
                                     7
     దగ్గరగా వేసివున్న తలుపుని తోసుకుంటూ లోపల అడుగు పెట్టాడు అభినయ్.
     సిద్ధార్థ చాపమీద పడుకొని వున్నాడు.
     " సిద్దూ! అప్యాయంగా పిలిచాడు అభినయ్.
     సిద్ధార్థ కళ్ళు తెరిచి చూశాడు.
    అభినయ్ చిరునవ్వుతో నిలబడి వున్నాడు.
     లేచి కూర్చున్నాడు.
     అతని చెంపలమీద కన్నీటి చారలు  ఏర్పడి వున్నాయి.
     అభనయ్ కి గుండెలో చేయి పెట్టి కెలికినట్లయింది.
    " నువ్వీ పాటికి  కాలేజీకి వెళ్ళిపోయి వుంటావనుకున్నాను, గదిలో ఏం చేస్తున్నావు?" అడిగాడు అభినయ్.
     "మనసు  బాగోలేదు. కాలేజీకి వెళ్ళాలని లేదు" బొంగురు గొంతుతో  చెప్పాడు సిద్ధార్థ.
     అభినయ్ చిన్నగా నవ్వాడు.
    " నాకు అంతా తెలుసురా! వెళ్ళి మొహం కడుక్కొనిరా, భోజనం చేద్దూగానీ" అన్నాడు.    
     " నా భోజనం అయిపోయింది" అన్నాడు మెల్లగా
     " సిద్ధూ! ఆ మాట  నామొహంలోకి చూసి చెప్పరా?"
     సిద్ధార్థ తలవంచుకున్నాడు.
    "వారాలబ్బయిని. నాకు భోజనానికి తక్కువేమిట్రా!"  అన్నాడు సిద్ధార్థ.
    అభినయ్ అతని భుజంమీద చేయి వేశాడు.
      " నాకు ఇందిర అంతా చెప్పింది సిద్దూ. లే భోజనం చేద్దూగానీ!
    అభినయ్ తనపట్ల  కనబరుస్తోన్న వాత్సల్యానికి  ఆనందంతో కళ్ళనించి జలజలమని రాలింది.?
     ఒరేయ్  నా పరిస్థితి నాకు తెలుసు. మీ పిన్నకి తెలిస్తే..... నువ్వు తినకుండా నా కోసం తీసుకువచ్చావు కదూ!"
      " నీకు అవన్నీ అనవసరం. ముందు కదులు.... " కసిరాడు అభినయ్.
     " నువ్వుకూడా తినాలి."
    "తెచ్చిందే అర్ధం భోజనం రా సిద్ధూ! నా సంగతి వదిలెయ్యి, నేను తిండి లేకుండా నెలరోజులుండగలను. ఈశరీరాన్ని ఆవిధంగా తయారు చేసుకున్నాను. కానీ నువ్వు.... ఆకలికి తట్టుకోలేవు."
      "అభీ  ఇప్పటికే నా కోసం ఎన్నో చేశావు. నేనంటే నీకెందుకురా ఇంత అభి మానం?"
    "మాటలు తర్వాత ముందు భోజనం చెయ్యి" కసిరినట్లుగా అన్నాడు అభినయ్.
     సిద్ధార్థ మొహం కడుక్కొని వచ్చాడు.
     అభినయ్ పొట్లం  విప్పి అన్నం కలిపి  అతని నోటికి ముద్దని అందించాడు " దట్స్ గుడ్" అన్నాడు.
     సిద్ధార్థ కళ్ళల్లో నీళ్ళు తిరుగుతుండగా అతనూ  ఓముద్దని తీసి అభినయ్ నోటికి అందించాడు.
     అప్యాయంగా అతనకేసి చూస్తూ అభినయ్ అన్నాడు-  "సిద్దూ ఓ మాట చెప్పనా?"  అడిగాడు.
     " చెప్పు!"
      " ఎన్ని  కష్టాలు వచ్చినా,ఎటువంటి ఒడిదుడుకులకాయినా సరే కంట కన్నీరు పెట్టకూడదు. జీవితాన్ని ఎదిరించి, పోరాడి గెలవాలే కానీ చేతకానితనంతో ఓడిపోకూడదు ఓటమిని అంగీకరించకూడదు.
     సుఖాన్ని ,దుఃఖాన్ని కనుపాపల మరుగున ఇనుప  తెరల వెనుక బంధించాలే తప్ప వెలికి రానీయకూడదు."
     అభినయ్ కళ్ళల్లో అగుపించని భావ వీచికలు ఇంద్రధనుస్సులోని రంగుల్లా మెరసి మాయమౌతుండగా ఆర్తితో అతని చేతిని నొక్కి విడిచాడు సిద్ధార్థ.
     సరిగ్గా అదే  సమయంలో కమల్ లోపలికి వచ్చాడు.
    " సిద్ధూ నువ్వు ఫీజు కట్టలేదని పేరు కొట్టేశారు తెలుసా?" అన్నాడు కమల్.
     "తెలుసు" అన్నాడు సిద్ధార్థ.
     "మరి  నాకు చెప్పలేదే?" ఆశ్చర్యంగా చూశాడు అభినయ్.
     "ఇప్పటికే నీకు భారమై పోయాను అభినయ్. ఇది కూడా నేను చెప్పి నిన్ను బాధ పెట్టలేక చెప్పలేదు."
     అభినయ్  నవ్వాడు
      " మన పూర్ణగాడితో ఒక్క పందెం కడితేనే ఫీజు కట్టెయ్యొచ్చు" లేని నించుంటూ  అన్నాడు అభినయ్.
                                      8
    "నేనున్నానిక్కడ! ఛాలెంజ్" అన్నాడు పూర్ణా మోటార్ సైకిల్ మీద కూర్చుని.
     అభినయ్ చేతిని పైకెత్తి బొటనవేలిని చూపిస్తూ ' ఛాలెంజ్ అన్నాడు.
     అభినయ్ వెనక దాసు, కమల్, సిద్ధార్థ వున్నారు
     "లాభంలేదు. నువ్వీసారి ఓడిపోతావు" ఠీవీగా సిగరెట్ వెలిగిస్తూ అన్నాడు పూర్ణా.
     "నీ బొంద!  నువ్వెప్పడన్నా అసలు ఓ పందెం గెలిచి చచ్చావా? నీతో కట్టిన ప్రతి పందెం అభినయ్ గెలిచాడన్న సంగతి మరచిపోకు. ఆఖరికి  లెక్చరర్  రమాదేవిని పరీక్ష హాల్లో జేబులో చేయి పెట్టించి ఎలా టీజ్  చేశాడో మరచిపోయావా? అంతకంటే ప్రమాదకరమైందా  ఇప్పుడు నీ పందెం" కమల్ పరిహాసం అన్నాడు.
    పూర్ణ రోషంగా చూశాడు. మోటార్ సైకిల్ మీంచి కిందికి దిగాడు.
      " అయితే రెడీనా?" అడిగాడు.
     "రెడీ!" అన్నాడు అభినయ్.
    " నా షరతులు చెబుతాను విను. నువ్వు పందం గెలిస్తే వెయ్యిరూపాయలు ఇస్తాను ఓ వేళ నువ్వు ఓడిపోతే డబ్బలాగూ ఇచ్చి చావలేవు. కనుక నీతోపాటు ఈ సన్నాసులు కూడా నెలరోజులపాటు  విధిగా నేను చెప్పినట్లు  వినాలి."
    " అంటే మమ్మల్ని కబానిసల్లా వాడుకొందామనా?" అడిగాడుదాసు కోపంగా.
     "నా ఇష్టం వచ్చినట్లు వాడుకొంటాన్రా. అవసరం అయితే మా  ఇంట్లోగేదెలని కడిగిస్తాను మీచేత. లేకపోతే మీ భుజాల మీద ఎక్కి తిరుగుతాను."
    "ఓ కే. పూర్ణ! నీ  షరతులకి నేను అంగీకరిస్తున్నాను. మన  మిత్రుల తరపున కూడా నీకు  హామీ ఇస్తున్నాను " అన్నాడు అభినయ్ స్థిరంగా.

 Previous Page Next Page