12. ఇది సోమము. విశేష జ్ఞానమయము. శుద్ది చేయబడినది. పాత్రలందున్నది. జలములందు పుట్టినది. అన్నదాత. అందరు ఎరింగినది.
13. సోమమా! మా కొరకు స్రవించుచున్నావు. ధనార్ధము కలశమున పడుచున్నావు. అయాస్యుడనను నేను నీ ధారలచే దేవతలను యజించుచున్నాను.
14. సోమమా! శత్రువులను వధించుచు, అదాతలను రాల్చుచు, ఇంద్రుని స్థానమునకు చేరి, అచట నుండి స్రవించుము.
అయిదవ ఖండము
ఋషులు :- 1,2. భరద్వాజుడు. 3. అత్రి. 4,5,6,8. విశ్వామిత్రుడు. 7,11,12. వసిష్ఠుడు. 9. కశ్యపుడు. 10. జమదగ్ని.
1. సోమమా! నీవు పావకమవు. జలములను కప్పుకొని, ధారగా కలశమునకు చేరుదువు. రత్న దాతవగు నీవు యజ్ఞ స్థానమునాకు చేరుదువు. దీప్తవై ప్రవహించుచు దేవతలకు హితకారివి అగుదువు.
2. ఏ సోమము దేవతలకు శ్రేష్ఠ హవి యగునో ఏది మానవ హితకారి యగునో, ఏది జలాంతర్గతమై సాగునో, దేనిని రాళ్ళతో దంచి పిండుదురో అట్టి సోమమును ఇచట నీటితో తడపండి.
3. సోమమా! నీవు శిలలచే పిండబడి రక్షణలు కలిగించుచు మా ఎదుట కలశమున పాడుచున్నావు. హరిత వర్ణ సోమము - నగరమునాకు నరుడు ప్రవేశించినట్లు - కలశమున ప్రవేశించును. సోమము కర్రపాత్రలో ప్రవేశించును.
4. సోమమా! నీవు దేవతల పానమునకు గాను సముద్రము వంటి వసతీ నదీ జలములందు వర్ధిల్లుదువు. ప్రస్తుతము మాధకము, జాగ్రుతమగు నీవు తీవల జలము నుండి మధుర రసముగా ప్రవహించుచు కలశమున చేరుచున్నావు.
5. సోమము పిండి రసము తీయబడినది. రోమములచే శుద్ది చేయబడినది. అశ్వము వంటి వేగవంతమగు హరిత సోమధార ఆనందదాయకమై వచ్చుచున్నది.
6. సోమమా! నీవు మిత్రమవు. నీ వెంట నిత్యము సుఖింతును గాత. అనేకులగు రాక్షసులు నన్ను హింసించుచున్నారు. వారిని హతమార్చుము.
7. సోమమా! నీవు సుందర అంగుళులచే చేయబడినదానవు. పవిత్రము చేయబడిన దానవు. కలశమున శబ్దము చేయుదానవు నీవు పిశంగ వర్షపు. బహుజన ఆరాధ్యవు. స్తోతలకు ధనములను ప్రసాదించుము.
8. సోమము గమన శీలము. మానవ ప్రియము. మాదకము. అది మధుర రస బిందువులను రాల్చుచు సమస్త దిశలనుండి నదులు సముద్రమునందు వలె కలశమున పడుచున్నది.
9. సోమమా! నీవు అప్రమత్తమవు. ప్రియమవు. ఆజరోమ దశా పవిత్రము నుండి బిందువులుగా రాలుదువు. నీవు అంగిరస శ్రేష్ఠవు. బుద్దివర్దకమవు. పితరల నేతవు. నీవు మా యజ్ఞమున మధుర రసముజ కురిపించా నపేక్షింతువు.
10. సోమము ఆనందకరము. అభిషుతము. మరుత్తులతో కూడిన ఇంద్రుని కొరకు పాత్రమున నిండును. అది సహస్రధారలై అజరోమముల నుండి వడకట్టబడి మానవులచే శుద్ది చేయబడును.
11. సోమమా! నీవు విశేష అన్నములు ప్రసాదించుదానవు. స్తోత్రములన్నియు నీవైపు ప్రవహించుచున్నవి. దేవతలకు మత్తు, తృప్తి కలిగించుచు యజ్ఞములందు దేవతల కొరకు స్రవింపుము.
12. మరుత్వంతములు, మాదకములు, ఇంద్ర సంబంధస్తులు యజ్ఞము వైపు పయనించినట్లు పవమాన సోమ ధారలు పావనములై స్రవించుచున్నవి.
ఆరవ ఖండము
ఋషులు :- 1,9. ఉషనుడు. 2. అసితుడు. 3,7. పరాశరుడు. 4,6. వసిష్ఠుడు. 5,10. ప్రతర్దనుడు. 8. ప్రస్కణ్వుడు.
1. సోమమా! త్వరత్వరగా పరుగెత్తి రమ్ము. కలశమున నిలువుము. ఋత్విజులు నిన్ను పవిత్రము చేయుదురు. నీవు యజమానికి అన్నము ప్రసాదించుము. బలశాలిని అశ్వమును వలె నిన్ను మార్జనము చేసిన అధ్వర్యులు తమ అంగుళులతో నిన్ను యజ్ఞమునకు చేర్చెదరు.
(అంగుళులతో అనగా చేతితో అని అర్ధము. వాస్తవముగా అంగుళులే పనిచేయును. చేయి వ్రేళ్ళకు ఆధారము మాత్రమే అగును.)
2. ఉశనఋషి వలె స్తోత్రములు వచించు స్తోతలు ఇంద్రాది దేవతల గుణగణములను వర్ణింతురు. బహుకర్మలదియు, తేజోవంతమును, పాపములను శుద్ది చేయునదియునగు పగలు సముపార్జించిన సోమము ధ్వని చేయుచు పాత్రలందు చేరును.
3. హవి సమర్పించు వారు ఋగ్యజుస్సామ స్తుతులను ఉచ్చరింతురు. మహా సోమమును మంగళ వచనములచే నుతింతురు. ఆబోతు వద్దకు ఆవు పోయినట్లు స్తోతలు సోమము వద్దకు చేరుదురు.
4. సోమము హిరణ్యమున పవిత్రమగును. ఆసోమపు దివ్య రసము దేవతలకు చేరును. పిదప అభిషుతమై ఉన్ని పాత్రల నుండి సాగి హోత పశు సహితముగ యజ్ఞమున ప్రవేశించినట్లు పాత్రలందు ప్రవేశించును.
5. బుద్దికి మూలమగునదియు, ద్యులోకమును ప్రకటింపచేయునదియు, పృథివిని పోషించునదియు, అగ్నిని ప్రకాశింపచేయునదియు, ఆదిత్యుని తృప్తి పరచునదియు, ఇంద్రుని ఆనందింపచేయునదియు, విష్ణువునకు పుష్టి కలిగించునదియునగు సోమము పాత్రలందు చేరుచున్నది.
6. సోమము మూడు సవనములు కలది. కోరికలు తీర్చునది. పెద్ద శబ్దము చేయునది. స్తుతులు అట్టి సోమమును అభిలషించును. నీటి కప్పు కలది, నీటిని పారించునది, వరుణుని వలె రత్నదాతయగు సోమము ధనములను ప్రసాదించును.
7. సోమము జలములను ప్రవహింపచేయునది. యజ్ఞములను రక్షించునది. కోరికలు తీర్చునది. అది అభిషుతమై జలదములున్న విశాల అంతరిక్షమున ప్రాణులను సృష్టించుచు అందరిని మించుచున్నది.
8. అభిషుతము, హరితవర్ణము, తేప తేప నినదించు, పరిశుద్దము చేయబడిన సోమము ద్రోణ కలశమున చేరి శబ్దము చేయును. ఋత్విజులు సోమమును దుగ్దాదులతో కలిపి, పాత్రలందు చేర్చి, దేవతలకు హవి అర్పించి, స్తుతించుచున్నారు.
9. ఇంద్రా! వరదుడవగు నీ కొరకు ఈ మధుర సోమము వాన చినుకుల వలె దశా పవిత్రమున రాలును. సహస్రద, శతద, బహుదయగు బలశాలి సోమము సనాతన యజ్ఞమున ప్రతిష్టితమైనది.
10. సోమమా! నీవు మధురతరమవు. వసతీ నదీ జలమును కప్పుకున్నదానవు. ఉన్ని పాత్రలకు స్రవింతువు. పిదప మాదకమవై, ఇంద్ర పాన యోగ్యమవై, ఆనందదాయకవై, జలయుక్తవై ద్రోణ కలశములందు ప్రత్యక్షమగుచున్నావు.
ఏడవ ఖండము
ఋషులు :- 1. ప్రతర్దనుడు. 2. పరాశరుడు. 3. వాసిష్ట ఇంద్ర ప్రమతి. 4. వసిష్ఠుడు. 5. వాసిష్ఠ మృడీకుడు. 6. నోధ 7. గౌరకాణ్వుడు. 8. వాసిష్ఠమన్యు. 9. కుత్సుడు. 10. పరాశరుడు. 11. కశ్యపుడు. 12. ప్రస్కణ్వుడు.
1. సోమము సేనాని శూర. అది యాజమానులకు పశువులను ఇవ్వగోరును. రథముల ముందు నడుచును. ఈ సోమసేన ప్రసన్నమగును. ఇంద్రుని ఆహ్వానించు వారికీ శుభములు కూర్చును. ఇంద్రుని వేగముగా రప్పించుటకు తెల్లని వస్త్రము వంటి పాలను ధరించును.
2. సోమమా! నీ ధారలు మధురములు. అవి జలమున పవిత్రములగును. ఉన్నిని దాటి పాత్రలందు ప్రవేశించును. తదుపరి పాలతో కలిసి రుచికరమావాగుదువు. అప్పుడు నీ తేజస్సు సూర్యుని వంటిది అగును.
3. స్తోతలారా! సోమపు స్తుతి గీతలు పాడండి. మేము దేవతలను పూజించుచున్నాము. మహాధనము కొరకని సోమాభిషవము చేయండి. రుచికర సోమమును ఉన్ని మీద నుంచి పారించండి. అట్టి దివ్య సోమము దీప్తివంతమై ద్రోణ కలశమున ప్రకాశించునుగాత.
4. సోమము అధ్వర్యుల ప్రేరణ కలది. ద్యావాపృథ్వుల స్రష్ట. అన్నదాత. ఆయుధములను పదను పెట్టుచు, చేతులందు ధనముతో ప్రత్యక్షమగునుగాత.
5. కాంతివంతమగు సోమము స్తోతల వాణిని సంస్కరిమ్చును. యజ్ఞమున సవనముల అగ్రగామి అగును. అప్పుడు సోమము శ్రేష్ఠమై, దేవతలకు సేవనీయమై, కలశమున నిలుచును. అప్పుడు దానిలో పాలు పిండుటకు గోవులు సాగును.
6. అంగుళులు కలిసి పనిచేయునవి. కర్మకారులు సోమమును పిండును. శుద్దము చేయును. ఆ దశాంగుళులు దేవతల కొరకని సోమమునకు ప్రేరణ కలిగించును. అప్పుడది సూర్యుని సకల దిశలకు పరుగులిడును. ఆ సోమము అశ్వము వలె ద్రోణ కలశమున చేరును.
7. అశ్వమును కడిగినట్లు, ఉదయ సూర్యుని కిరణములు వెలిగించినట్లు, సోమమును పరిశుభ్రము చేయుచున్నాను. తదుపరి నీట మునిగిన సోమము స్తోతలను అభిలషించుచు గోపాలుడు గోష్టమువలె ద్రోణ కలశమున ప్రవేశించుచున్నది.
8. సోమము క్షరణశీలము. బలశాలి. వేగంవంత ఇంద్రునకు బలకర పానీయమగునది. ధనదాత. బాల ప్రభువు. మాదకమై పాత్రలో ప్రవేశించుచున్నది. అది సకల దిశల రాక్షసులను హతమార్చును. శత్రువులను వధించును.
9. సోమమా! ధారగా పారుము. ధరములను వర్షించుము. శుభ్ర జలములందు చేరుము. సూర్య, వాయువుల వంటి వేగమును సంతరించుకొనుము. మహా బుద్దిశాలియైన ఇంద్రుని యందు చేరుము.
10. మహా సోమము మహాత్కార్యములు చేసినది :-
సోమము జలగర్భ అయినది. దేవతలను భజించినది. ఇంద్రునకు బలము కలిగించినది. సూర్యునకు ప్రకాశము కలిగించినది.
11. దేవతలను ఆనందమున మునకలు వేయించునదియు, స్తోత్రములందు శబ్దాయ మానమగు సోమము స్తోత్రసహితయై - రథము యుద్దము నందు వలె - యజ్ఞమున ప్రవేశించుచున్నది. పదిచేతి వేళ్ళు సోమము గల ఉన్ని పాత్రను ఉన్నత స్థానమున స్థాపించుచున్నవి.
12. ఋత్విజులు నీటి అలల వంటి స్తుతులను సోమము వైపు పంపుదురు. ఆ స్తుతులు నమస్కరించుచు అభిలషించుచు సోమపు దరి చేరి, సోమమున కలసి, లీనమగును.