"నువ్వు బట్టలు కొనుక్కో.... నేను మళ్ళీ శుక్రవారం వస్తాను.... అప్పుడు నువ్వు కొత్తబట్టల్తో కనపడాలి, తెల్సిందా."
అప్పుడే స్టేషన్ లోకి బస్సొచ్చి ఆగింది.
"నేనీ బస్సెక్కి వెళ్ళిపోతాను- అలాగేనా...." ముందుకి నడిచాడు చయనులు.
ఏం మాట్లాడాలో వికాస్ కి తెలీలేదు.
బస్సెక్కాడు చయనులు మలుపు తిరిగేవరకూ ఆయన వికాస్ ని చూస్తూనే ఉన్నాడు.
కానీ-
ఆముదాలవలస వెళ్ళిన చయనులు, అక్కడ ఘోరమైన వార్త విన్నాడని చిన్నారి వికాస్ కి తెలీదు.
ఆ వార్త-
"వికాస్ తల్లి కామేశ్వరి చచ్చిపోయింది. ఆరు రోజులు అన్నం లేక చచ్చిపోయింది, చచ్చిపోతూ కొనవూపిరితో బాబీ... బాబీ.... అని చచ్చిపోయింది."
ఆ విషయం చయనులు, వికాస్ తో చెప్పలేకపోతున్నాడు.
ఇంకో విషయం-
ఆముదాలవలసలో పాతబాకీ వందరూఅపాయలు వసూలు అయిందని వికాస్ కి అబద్దం చెప్పాడు చయనులు.
హోటల్లో టిఫిన్ ఖర్చులుపోగా ఆ సమయంలో బస్ టిక్కెట్ కు కూడా వున్న డబ్బులు సరిపోవు.
తనని బస్ కండక్టర్ మధ్యలో బస్ నుంచి దించేస్తాడని చయనులుకి తెల్సి కూడా బస్సెక్కాడు.
నిజంగా అలాగే జరిగింది.
అర్దరాత్రి పదిమైళ్ళ దూరాన ఉన్న వూరు బస్సునుంచి తోసివేయబడ్డాడు చయనులు.
నడక సాగించాడు.
ఆ నడకకు ఇన్ స్పిరేషన్ చిన్నారి వికాస్!
ఆ విషయం చయనులు మనసుకు మాత్రమే తెలుసు!
ఒక్కసారి నిరాశా-నిరాశా కలిస్తే సామెతల్లా వృద్దాతరం ఉబుసులోని కబుర్లలా బూడిద రాలదు-
ఉత్తేజం ఉద్బవిస్తుంది.
* * * * *
చదువుతున్న పుస్తకాన్ని పక్కన పెట్టింది లిఖిత.
గుండెల్లో ఏదో చిన్న అలజడి, ఆ అలజడి పేరే 'ప్రేమ'.
ఊహ తెల్సిన దగ్గర్నించి ఎంతోమంది అబ్బాయిల మధ్య గడిపింది. లండన్లో థియేటర్ హౌసుల్లో, రిపార్టీల్లో ఎంతోమంది అబబయిలు.... స్నేహితులు....
వేలాదిమంది స్నేహితులున్న లిఖిత దగ్గరకు రావాలని, లిఖితతో పరిచయం పెంచుకోవాలని, లిఖిత కన్నెత్తి చూస్తే చాలు, జన్మ ధన్యమౌతుందని ఆరాధించే కుర్రాళ్ళ వేపు ఏనాడూ ప్రేమగా చూడలేదు లిఖిత.
కాలేజీలో లిఖిత ఎప్పుడూ నిప్పులు చెరిగే పువ్వు.
పువ్వు అందమైందే కానీ దగ్గరకు వెళ్తే జ్వాలలు.
కానీ....
వికాస్ ని చూసినప్పటి నుంచి, అతని కళ్ళని, అతని మాటల్ని, అతని దీక్షని, అనుకోకుండా తన ద్వారా వచ్చిన అతని దురదృష్టాన్ని తలచుకున్నప్పుడల్లా, ఆలోచనలో మునిగిపోతోంది లిఖిత.
వికాస్ ని ఒప్పించి, మళ్ళీ జింఖానా కంపెనీలో చేర్పించాలా? అతను చేరతాడా?
చేరకపోతే....
లక్ష్యాన్ని సాధించే ప్రయత్నంలో అతనికి సహకరిస్తే....
ప్రతి పురుషుడి వెనకా ఒక స్త్రీ.
రకరకాలుగా ఆలోచిస్తున్న లిఖిత, తన గురించి తను ఆలోచించుకుంది. తను తండ్రివేపు కాకుండా, వికాస్ వేపు మొగ్గు చూపుతోంది.
అంటే...
తను వికాస్ ని ఇష్టపడుతోందా?
ఆ ప్రశ్నను ఎన్నోసార్లు తన మనసును అడిగింది లిఖిత.
ఆ వయసులోని ఆడపిల్ల మనసు మూగది.... అందుకే ఆ మనసు ఆశ్చర్యంగా చూసింది తప్ప జవాబు చెప్పలేదు.
* * * * *
భానోజీరావు తన ఆత్మాభిమానాన్ని, ఆత్మ స్థయిర్యాన్ని కలిసి బంతిగా చేసి దురదృష్టానికి గురిచేసి విసిరాడు.
అంతకంటే రెట్టింపు పట్టుదలతో తను వెనక్కి వచ్చి అదృష్టాన్ని అందుకోవాలి.... తప్పదు.... కాని ఎలా?
చేతిలో చిల్లిగవ్వ లేదు. చెయ్యటానికి పని లేదు. తనిప్పుడు క్రాస్ రోడ్స్ మధ్య ట్రాపిక్ ఐలాండ్ లో నిలబడి తన భవిష్యథ్ ఏ బాటలోకి వెళ్తే బావుంటుందో ఆలోచించుకోవాల్సిన క్లిష్టమైన స్థితిలో ఉన్నాడు.
ఒకదారి: తిరిగి ఏదో ఒక ఆటోమోబైల్ కంపెనీలో అతి సాధారణ ఉద్యోగాన్ని సంపాదించుకొని గానుగెద్దుల బ్రతుకును ఈడ్చటం.
రెండో దారి : అవమాన భారాన్ని భరించలేక తాగుబోతు కావటమో....జులాయిగా మారటమో.... ఆత్మహత్య చేసుకోవటమో, అంటే బ్రతుకును చాలించటం.
మూడో దారి : ఆదరణ కందని, అర్ధం లేని.... ఆక్రోశం, ఉక్రోశం కలగలిపిన నినాదాలతో వ్యవస్థని, దేశాన్ని తిడుతూ విప్లవకారుడిగా మారటం, బ్రతుకును తెల్లార్చుకోవటం.
నాలుగో దారి : అవమానంలోంచి ఆత్మ విశ్వాసాన్ని, పరాభవం లోంచి పట్టుదలను, ప్రోది చేసుకొని తన జీవితాన్ని తనే శాసించుకుంటూ, రేపటి ప్రపంచాన్ని శాసించే స్థితికి ఎదగటం, బ్రతుకును శాసించుకోవటం.
బ్రతుకును ఈడ్చటం-అసమర్ధత...
బ్రతుకును చాలించటం-పిరికితనం....
బ్రతుకును తెల్లార్చుకోవటం-వ్యర్ధం....
బ్రతుకును శాసించుకోవటం-అర్ధవంతం....
ఆలోచిస్తున్నాడు తనలో మిగిలి ఉన్న సర్వశక్తుల్ని కేంద్రీకరించుకొని ఆలోచిస్తున్నాడు. జవసత్వాల్ని ప్రోది చేసుకొని ఆలోచిస్తున్నాడు...నడుస్తున్నాడు....ఆలోచిస్తున్నాడు... ఆలోచిస్తున్నాడు.... నడుస్తున్నాడు.
పోనీ ఏడన్నా వేరే వ్యాపారం చేద్దామా? అది తన నిజానికి పడదు. తనకు మరో రంగం గురించి, మరో వ్యాపారం గురించి ఓనమాలు కూడా రావు. సో... తనకు అవకాశాలున్నా, లేకున్నా, రాకున్నా తన మనః ప్రవృత్తికి నచ్చిన ఏకైక రంగం ఆటోమోబైల్ పరిశ్రమే.
ఏ మనిషి అయినా ఆలోచించవలసిన విధానం ఇదే.
తనకేం తెలుసు....? తను ఏ పనిని ఇష్టంగా చేయగలడు...? తనకు నచ్చి, తను మెచ్చి, ఇతరుల మెప్పు ఏ పని ద్వారా తను సాధించుకోగలడు? అనేది తొలుత నిర్ణయించుకోగలిగితే జీవితంలో సగం దూరాన్నిఅధిగమించినట్లే.
తను తన జీవితంలో కనీసం ఒక అడుగైనా ముందుకు వేయగలిగాడో లేదో తెలీదు కాని, నాలుగడుగులు వెనక్కి మాత్రం నెట్టబడ్డాడు.
తన జీవితానికి రెట్టింపు వేగాన్ని జోడించుకుంటే తప్ప తనేది సాధించలేడు.
కేవలం ఒక ఉద్యోగిగా తన జీవితాన్ని నెట్టుకెళ్ళగలడే తప్ప....సాధించేదేమీ లేదు... సాధించగలిగేది ఉండదు.
సో... తను ఆటోమోబైల్ పరిశ్రమకి సంబంధించిన వ్యాపారాన్నే చేపట్టాలి.
Are should aim high.
నిర్దేశించుకునే లక్ష్యం మొదటి మైలురాయి దగ్గరే నిర్ణయించుకోవాలి. అది పెద్దదై, గొప్పదై ఉండాలి.
కానుక తనేదైన మాన్యుఫాక్చరింగ్ నే ఎన్నుకోవాలి.
తనకు తెలిసినది కారు.... తెలీనది మిగతా ప్రపంచం. కారు తయారు చెయ్యాలి....?!! సాధ్యమా?
ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ ఆస్తులు కలిగి, ఎక్కువ టర్నోవర్ ని కలిగి ఉన్న వ్యాపార సంస్థ అమెరికాకి చెందినది జనరల్ మోటార్స్ దాని గురించి ఏషియన్ న్యూస్ ఇంటర్నేషనల్ మేగజైన్ లో ఇటీవల వచ్చిన వార్త సంగతేమిటి?
జనరల్ మోటార్స్ మూసివేత
(ఏషియన్ న్యూస్ ఇంటర్నేషనల్)
వాషింగ్ టన్, డిసెంబరు 19 : కార్ల తయారీలో ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థ అయిన జనరల్ మోటార్స్ కంపెనీ అమెరికాలో ఉత్పత్తి కార్యకలాపాలను నిలిపివేసింది. కంపెనీకి విపరీతమైన నష్టాలు రావడంతో యూనిట్ లను మూసివేసి 74వేళా మంది కార్మికుల్ని, ఉద్యోగులను తొలగించింది. అమెరికా కార్ల పరిశ్రమకే వెన్నెముకలాంటి జనరల్ మోటార్స్ కంపెనీకి రోజుకు 15 మిలియన్ డాలర్ల నష్టం వస్తోంది. అమెరికాలో వున్న 21 ఫ్యాక్టరీలను మూసివేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. అమెరికా ఇంకా తీవ్ర మాంద్యంలో ఉందని వైట్ హౌస్ నుంచి ప్రకటన వెలువడిన వెంటనే జనరల్ మోటార్స్ ఈ చర్య తీసుకుంది. జనరల్ మోటార్స్ నిర్ణయంపట్ల అమెరికన్ పారిశ్రామిక వర్గాలు విస్మయం వ్యక్తం చేశాయి. జపాన్ కార్ల ప్రభావం అమెరికాలో ఏవిధంగా ఉందో ఈ చర్యవల్ల బహిర్గతమయింది. అమెరికన్ ఆటోమోబైల్స్ పరిశ్రమ మొత్తం జపాన్ చేతికి పోతుందేమోనని ఆందోళన చెందుతున్నారు. అమెరికన్ కార్ల తయారీదారులు చాలామంది జపాన్ తో ఒప్పందాలు కుదుర్చుకునేందుకు తహతహలాడుతున్నారు. హెచ్చు ఇంధన సామర్ధ్యంతో నడిచే తక్కువ ఖరీదు గల కార్ల తయారీ కోసం అమెరికన్ కంపెనీలు జపాన్ ను ఆశ్రయించక తప్పని పరిస్థితి ఏర్పడింది.