Previous Page Next Page 
సంకల్పం పేజి 17

  

     అమెరికాలాంటి భాగ్యవంతమైన దేశంలో సయితం ఇంధనం ఖర్చుకు వినియోగదారులు భయపడిపోతున్నారు.
   
    అలాంటప్పుడు ఇండియాలాంటి దేశంలోని వినియోగదారులు భయపడటంలో వింతేముంది?
   
    ఇంధనం దిగుమతి మూలమగానే దేశ ఆర్ధిక వ్యవస్థ చిన్నాభిన్నమయి పోయింది. కొన్నివేల కోట్ల విదేశీమారక ద్రవ్యం ఇంధనం దిగుమతి కోసమే ఖర్చు పెట్టవలసి వస్తుంది. అందుకు అప్పులు కూడా చేయవలసి వస్తోంది. దేశంలో ఉన్న ఆయిల్ నిలవాలని వెలికి తీయగల సాంకేతిక పరిజ్ఞానం కాని, ఆర్ధిక స్తోమతగాని లేదు. భవిష్యత్ లో వస్తుందన్న ఆశలేదు.

    అంబాసిడర్ కారుని తయారుచేసే హిందూస్తాన్ మోటార్స్ గాని, ప్రీమియర్ (ఫియెట్) కార్లు తయారుచేసే ప్రీమియర్ ఆటోమోబైల్స్ కాని అంత సంతోషంగా లేవు. కొద్దిగలో కొద్దిగానైనా బెటర్ గా ఉన్న మారుతికార్ల కంపెనీ కూడా ఒడిదుడుకుల్ని ఎదుర్కొంటోంది.
   
                              ప్రీమియర్ ఆటోమొబైల్ లే ఆఫ్ కు సన్నాహాలు
   

    బొంబాయి, డిసెంబరు 23 : ప్రీమియర్ ఆటోమోబైల్స్ లిమిటెడ్ 'లే ఆఫ్' ప్రకటనకు సన్నాహాలు చేస్తోంది. బొంబాయిలో ఈ కంపెనీకి మూడు ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఈ మూడింటిలో కలిపి 7 వేలమంది కార్మికులు పని చేస్తున్నారు. వీరిని రొటేషన్ పద్దతిలో తాత్కాలికంగా పని నుంచే తొలగించడానికి పారిశ్రామిక వివాదాల చట్టంలోని సెక్షన్ '25 ఎం' కింద అనుమతి ఇవ్వవల్సిందిగా మహారాష్ట్ర ప్రభుత్వాన్ని అనుమతి కోరింది. 60 రోజుల్లోపు సమాధానం రానిపక్షంలో, కంపెనీ చట్టబద్దంగా 'లే ఆఫ్' అమలుకు చర్యలు తీసుకుంటుంది. 'లే ఆఫ్' కాలంలో కార్మికులకు సగం జీతాలే వస్తాయి. ఆటోమోబైల్ పరిశ్రమలో మాంద్యం నెలకొన్న విషయం పాఠకులకు విదితమే. అంబాసిడర్లు తయారుచేసే హిందూస్థాన్ మోటార్స్ కంపెనీ కూడా ఉత్పత్తిని 40 శాతం తగ్గించి వేసింది. గత ఏడాది ఏప్రిల్, అక్టోబర్ నెలల మధ్య 23,481 వాహనాలు విక్రయించిన ప్రీమియర్ ఆటోమోబైల్స్ అమ్మకాలు ఈ ఏడాది ఇదే ఏడునెలల కాలంలో 21,060 కి పడిపోయాయి. హిందూస్థాన్ మోటార్స్ అమ్మకాలు కూడా 12,843 నుంచి 9,901కి దారుణంగా పడి పోయాయి.
   
    ప్రభుత్వ రంగంలో మారుతి ఉద్యోగ సైతం మాంద్యాన్ని ఎదుర్కొంటుంది. వచ్చే ఏడాది అమ్మకాలు సగానికి సగం పడిపోతాయని కార్ల తయారీ కంపెనీలు ప్రభుత్వానికి సమర్పించిన విజ్ఞప్తి పత్రంలో పేర్కొన్నాయి. సకాలంలో తగు చర్యలు తీసుకొని ఆదుకొననట్లయితే అనుబంధ పరిశ్రమలు కూడా దెబ్బతినే ప్రమాదం ఉందని ప్రభుత్వాన్ని హెచ్చరించాయి.
   
    ఆలోచనలతో వికాస్ మెదడు వేడెక్కి పోయింది. బీచ్ రోడ్ లో ఉన్న చిన్న టీ బాంక్ ముందు ఆగాడు.
   
    సింగిల్ టీకి ఆర్డర్ ఇవ్వబోతూ ఒకక్షణం ఆగి - జేబులు తడుముకున్నాడు. ఆపైన ఒన్ రూపి కాయిన్ ని బయటకు తీశాడు. ఒకసారి తమాషాగా టాస్ చేసి గుప్పెటలో బంధించాడు.
   
    అప్పటికే టీ కొట్టువాడు వికాస్ కేసి విస్మయంగా చూస్తున్నాడు.
   
    టీ కప్పుకు టికానా లేని తను టిప్పు సుల్తాన్ లా కార్లను ఉత్పత్తి చేసే కోట్ల వ్యాపారాన్ని చేపట్టాలనుకోవటం వెర్రితనమా? కలా? భ్రమా? అవివేకమా? నవ్వుకున్నాడు ఒకసారి-కాయిన్ తీసి టీ కొట్టువాడికి ఇచ్చాడు.
   
    నిరాశా నిస్పృహలకి గురయిన సగటు భారతదేశపు యువకుడు ఆత్మాభిమానం, పౌరుషం వున్నవాడు కనుకే టీకి డబ్బులున్నాయో లేవో చూసుకుంటున్నాడు. అని ఒక్కక్షణం ఆలోచించిన టీ కొట్టు యజమాని గ్లాసు నిండా టీ నింపి ఇచ్చాడు.

    పోటెత్తిన నరాలు, ఆలోచనలు, మేధస్సు ఒక్క గుక్క వెచ్చటి టీ లోపలకు వెళుతున్న కొద్దీ సేద తీరి చురుగ్గా పనిచేయటం ప్రారంభించాయి.
       
    తిరిగి నడక ప్రారంభించాడు.
   
    ఆలోచనలు తిరిగి, సుడి తిరగటం ప్రారంభించాయి. క్షణాలు.....నిమిషాలు.... గంటలు... గంటలు... రోజు... రోజులు.... రోజులు....
   
    అసలు ఇంధనమే కదా అన్ని సమస్యలకి, బాధలకి, భయాలకి, ఖర్చులకి, మంద్యానికి హేతువు. అదే లేకుండా కారుని తయారు చేయగలిగితే? ?
   
    ఒకే ఒక్క రూపాయి నాణెం....
    నాలుగు గుక్కల టీని కొనిపెట్టగల నాణెం....
    ఒకింత చురుకుదనాన్నిచ్చిన నాణెం....
    ఒక అద్భుతమైన ఆలోచనకు నాంది...
    ఒక కొత్త శకానికి ఆరంధం...
    ఒక కొత్త ఒరవడికి అంకురార్పణం....
    ఒక కొత్త ఆర్ధిక వ్యవస్థకి ఊరితం...
   
    క్రమంగా వికాస్ మొఖం మీదకు నవ్వు... గజిబిజి ఆలోచనల మేధస్సులోకి జొరబడిన ఒక మెరుపు....
   
    అంతే.... తిరుగులేని నిశ్చయం అపారమైన మానసిక బలాన్ని ప్రోది చేసుకున్న సంకల్పం... అతి చిన్న విత్తనం సంకల్ప బలాన్ని సారవంతమైన భూమిగా చేసుకొని మొలకెత్త నారంభించింది.
   
                                *    *    *    *    *
   
    భీమిలి...
   
    వికాస్ భీమిలికి చేరుకొనే సరికి రాత్రి పదిగంటలయి పోయింది.
   
    ఆయనెక్కడుంటాడో తెలుసు...       
   
    కాని ఆయనేమంటాడో తెలీదు....
   
    అయినా తప్పదు....
   
    మొత్తానికి రాత్రి పదకొండు గంటలకు పాడుబడినట్లుగా వున్న ఒక పురాతన తోటలాంటి ఇంటిముందు ఆగి, మానసికంగా తనకు తను సమాయత్తం చేసుకొని లోనికి వెళ్ళాడు.
   
    వరండాలోనే ఎనభై ఏండ్లు వయసున్న ఒక వృద్దుడు వాలుకుర్చీలో కూర్చుని వున్నాడు. మేలుకునే ఉన్నాడన్నట్లుగా కాళ్ళను ఊపుతున్నాడు. ఇల్లంతా నిశ్శబ్దంగా, నీరసంగా రాజ్యమేలుతున్నట్లుగా వుంది. ఆయనే... ది గ్రేట్ సైంటిస్ట్... ప్రొఫెసర్ అప్పన్న దొర.
   
    డి.సి. సిస్టమ్స్, కంప్రెస్డ్ ఎనర్జీ, రాకెట్ ఇంధనం, బ్యాటరీలు, సెల్ఫ్ లు, లీడ్ ఎలక్ట్రోడ్స్, ఏసిడ్ సొల్యూషన్స్, జనరేటర్స్, సాంప్రదాయేతర ఇంధన వనరుల మీద అపారమైన కృషి చేసిన మేధావి- ధ్వని తరంగాల నుంచి కూడా శక్తిని రాబట్టగల జీనియస్.
   
    లేబరేటరీలకు, అబ్జర్వేటరీలకే తన జీవిత కాలాన్ని వెచ్చించి సాధారణ సుఖసంతోషాల్ని సయితం భవిష్యత్ తీరాల మానవాభ్యోన్నతికి త్యాగం చేసిన అతి గొప్ప శాస్త్రవేత్త విదేశాల పత్రికలచే, ప్రభుత్వాలచే పారిశ్రామిక ప్రపంచం చేత పొగడబడ్డ నోబుల్ ప్రైజ్ విన్నర్.
   
    ఆఖరికి పిల్లిగడ్డాలు పెంచుకొని మేం సైంటిస్ట్ లమని చెప్పుకొనేది సోకాల్డ్ ఇండియన్ సూడో సైంటిస్ట్ ల వెటకారానికి, దేశాన్ని పందికొక్కుల్లా దోచుకుతింటున్న భారతదేశపు రాజకీయ నాయకుల నిర్లక్ష్యానికి గురయి, తీవ్రమైన మనస్తాపాన్ని తోడు చేసుకుని ప్రపంచానికి ఒక మారుమూల ఉన్న తన స్వగ్రామం భీమిలిలో తన వృద్ద శరీరం పెడుతున్న బాధల్ని మందు మాటున దిగమ్రింగుకుంటూ ఆఖరి రోజుల్ని లెక్కించుకుంటున్న విగత జీవి.
   
    కొన్ని మిలియన్ల మెఘావాట్ల శక్తినే కాదు, కొన్ని మిలియన్ల గిగావాట్ల శక్తిని సయితం బ్యాటరీల్లో పొందుపరచ వచ్చని నిరూపించే ప్రయత్నంలో మూర్ఖుల అవహేళనకు గురయిన క్రియేటివ్ జీనియస్.
   
    సూర్యకాంతిలో, గాలివాలులో, సముద్రపు అలల్లో, నదీ ప్రవాహాలలో ఆఖరికి చెత్తాచెదారం, వ్యర్ధ పదార్ధాలలో సయితం ఎనర్జీ వుందని రుజువు చేసి పిచ్చివాడి క్రింద జమకట్టబడ్డ మేధావి.
   
    ఏవిధమైన గుర్తింపుకూ నోచుకోని అమానుష దండనకు గురైన మహా మనిషి...
   
    చాపుకున్న కాళ్ళదగ్గర క్వార్టర్ బాటిల్, సిగరెట్ ప్యాకెట్, అగ్గిపెట్టె, చుట్టుప్రక్కల చిందర వందరగా పడివున్న సిగరెట్ పీకలు, అగ్గిపుల్లలు...
   
    ఒక్కసారి వికాస్ కళ్ళు తడిదేరాయి.
   
    కొద్ది క్షణాలాగి, ఆపైన దగ్గరకు వెళ్ళి ఆయన కాళ్ళకు నమస్కరించాడు.

 Previous Page Next Page