చెప్పకుండా వచ్చే వర్షాకాలపు మేఘంలా వూడిపడ్డాడు మేనమామ.
"ఒరేయ్.... అల్లుడూ ఎలా వుందిరా ఉద్యోగం."
ఆ సమయంలో వికాస్, ఓ కారుని కడుగుతున్నాడు. మేనమామని చూడగానే అమ్మని చూసినట్టనిపించింది.
"మామయ్యా..." చేతిలోని పనిని వదిలేసి, పరుగు పరుగున వెళ్ళి చెయ్యి పట్టుకున్నాడు.
సీనియర్ మెకానిక్ తో చెప్పి మేనమామతో బయటికొచ్చాడు వికాస్.
"సరిగ్గా అన్నవయీ తింటున్నావా.... బెంగెట్టుకున్నావా.... పడకా అవీ షెడ్ లోనేనా...?" వరుసగా ప్రశ్నలు.
జవాబు చెప్పాడు వికాస్.
"ఆ మధ్య మీ నాన్న కలిశాడు బస్సులో... నీ గురించి ఫికరు లేదని చెప్పాను....జీతవేమైనా అందితే పంపించమన్నాడ్రా.... సిగ్గులేని మనిషి. నీకొచ్చేదే పదిరూపాయలు.... దాంతో నువ్వే బతుకుతావా.... ఇంటికి పంపిస్తావా?"
మేనమామ తిన్నగా ఓ హోటల్ కి తీసికెళ్ళాడు. తిండి పెట్టించాడు.
"డబ్బులు పంపించమన్నాడా...? నాన్న...." మళ్ళీ అడిగాడు వికాస్.
"ఉన్నాయేటి.... వుంటే ఇవ్వు.... తీసికెళ్ళిస్తాను" హోటల్ నించి బయటికొస్తూ అన్నాడు మేనమామ.
జేబులన్నీ వెతికితె రెండు రూపాయలున్నాయి.
అమ్మెలా వుందో.... అక్కలెలా వున్నారో... ఎలాగైనా డబ్బులు సంపాదించాలి. ఎలా సంపాదించాలి?
"నేనైనా సర్దుదామంటే.... ఈ నెల మరీ బొటా బొటీగా వుంది వ్యవహారం..."
నాలుగురోడ్ల కూడలిలో చెట్టుకింద నిలబడుతూ అన్నాడు మేనమామ.
"జరూరు పనిమీద ఆముదాలవలస వెళ్తున్నాను.... వెళ్ళేటప్పుడొస్తాను.... ఈలోపుగా ఏదో ఒక ఆలోచన చెయ్యి.... చేతనైతే చెత్తలోంచే డబ్బు సృష్టించొచ్చు" ఆ మాట అంటున్న సమయంలోనే బస్సొచ్చింది.
"వస్తాన్రా!" మేనమామ వెళ్ళిపోయాడు.
ఎలాగైనా అమ్మకి డబ్బు పంపించాలి.
అమాయకంగా 'ఒరే బాబీ' అనే అమ్మ... సహనం తప్ప వంట్లో మరేమీ లేని అమ్మ.... పస్తులుండడం తప్ప మరేమీ తెలియని అమ్మ.... అమ్మ...అమ్మ....
నడుస్తున్నాడు వికాస్.
చేతనైతే చెత్తలోంచి డబ్బు సృష్టించొచ్చు- సృష్టించొచ్చు-సృష్టించొచ్చు-నడుస్తున్న వికాస్ కళ్ళు రోడ్డు ప్రక్క చెత్త కుప్పమీద కెళ్ళాయి.
చిన్నప్పట్నించీ మేనమామ చయనులు మాటంటే వికాస్ కి గురి.
నిరంతరం మేనమామ ఏదో ఒకటి చేస్తూనే వుంటాడు.
అవును.
నిజంగా చయనులు ఒక శ్రమ ప్ప్రవాహం.
ఆగకుండా తిరిగే చైన్, చయనులు.
చెత్తకుప్ప మీద ఏవో సీసా మూతలు కన్పించాయి వికాస్ కి.
అన్నీ లెక్కపెట్టుకుంటూ ఏరాడు- పాతికయ్యాయి- గబగబా మెకానిక్ షాపుకెళ్ళాడు. వాటిని సీనియర్ మెకానిక్ కి చూపించాడు.
"పెంటమీద మూతలన్నీ మోసుకొచ్చావ్? ఏం చేస్తావురా?" ఏదో పనిచేస్తూ అడిగాడు ఆ సీనియర్.
"ఈ మూతలు ఎవరైనా కొంటారా?" ఆ ప్రశ్నకు జవాబు కావాలి వికాస్ కి.
"ప్రతీదీ ఎవడో ఒకడు కొంటాడు. అయితే కొనేవాడ్ని వెతకాలి."
ఒక వ్యాపార సూత్రాన్ని అలవోకగా చెప్పాడు ఆ సీనియర్ మెకానిక్.
అదొక వ్యాపార సూత్రమని వికాస్ కి తెలీదు.
వికాస్ కి ఆ క్షణంలో తెల్సిందొక్కటే.
ఆ మూతలు పనికొస్తాయి.
"కర్రల మార్కెట్లో ఇనప దుకాణాలున్నాయి. అక్కడకెళ్ళి వెతుకు" సీనియర్ మెకానిక్ మళ్ళీ అన్నాడు.
"అయితే... ఇవాళ.... పనిలోకి రాను...."
వికాస్ కళ్ళంటే ఇష్టం.... ఆ మెకానిక్ కి. అంతంత విశాలంగా వున్నా ఆ కళ్ళ వేపు చూస్తూ-
"పోరా... పో...." ఎస్వీరంగారావు స్టయిల్లో అన్నాడు.
వికాస్ ఆ మాట వినగానే ఒకటే పరుగు.
పాత గోనె సంచీ ఒకటి వెతికి సంపాదించాడు. ఊళ్ళో వున్న చెత్త కుప్పలన్నీ తిరిగాడు.
మధ్యాహ్నం మూడుగంటలకు వికాస్ ఏరిన మూతలతో గోనెసంచీ సగానికి నిండింది.
దాన్నిమోయలేక, ఈడ్చుకుంటూ వూరి మధ్యలో వున్న ఇనప దుకాణాల దగ్గర కెళ్ళాడు.
అలాంటి మూతల్ని కొనే షాప్ అక్కడుంది. ఒక యాభైఏళ్ళ స్త్రీ ఆ దుకాణం దగ్గర కూర్చుని వుంది!
"మూతల్ని కొంటావా?" ముద్దుగా అడిగాడు వికాస్.
ముచ్చట పడింది ఆవిడ.
తూకం వేసింది. తూకం వేస్తూ-
"ఊళ్లోకి కొత్తగా వచ్చావా?" అని అడిగింది. తన అవసరాన్ని చెప్పాడు వికాస్.
"అమ్మకు డబ్బు పంపించాలా?"
ఆ తల్లి కళ్ళల్లోంచి రెండు కన్నీటి చుక్కలు ఉబికాయి.
తూకం వేసిన మూతల ఖరీదు రెండున్నర రూపాయలు.
కానీ-
ఇరవై రూపాయలిచ్చిందావిడ.
"దొరికిన మూతల్ని తెచ్చిస్తూ ఉండు-" అభిమానంగా చెప్పిందావిడ.
వికాస్ ఆనందానికి అవధులు లేవు.
ఆ చిన్నారి మనసు నిండా ఎన్నెన్నో సీతాకోక చిలుకలు! రండు రంగుల సీతాకోక చిలుకలు. రకరకాల సీతాకోక చిలుకలు.
అక్కడ నుంచి ఒకటే పరుగు.
బస్టాండ్లో నిలబడ్డాడు మేనమామ కోసం.
అయిదు గంటలు.
ఆరుగంటలు.
ఏడు గంటలు.
ఎనిమిదిగంటలు.
చీకట్లో, ఒక్కడూ బిక్కుబిక్కుమంటూ వికాస్...
ఆ చిన్నారి చేతి మడతల్లో ఇరవై రూపాయలు.
ఓ బస్సొచ్చింది. అందులోంచి దిగిన మేనమామని చూడగానే పాలను చూసిన పసిపాపలా పరిగెత్తాడు వికాస్.
చయనులు మేనల్లుడిని చూసి ఆశ్చర్యపోయాడు.
వాడు ఇరవై రూపాయలు ఎలా సంపాదించాడో, తెల్సి మరీ ఆశ్చర్యపోయాడు.
చయనులు కళ్ళవెంట ఎప్పుడో తప్ప కన్నీళ్ళు రావు.
నిజంగా కన్నీళ్ళొచ్చినా, లోక వ్యవహారం తెల్సినవాడు గనక ముఖాన్ని అరువు నవ్వుతో నింపేస్తాడు.
అలాంటి చయనులు కళ్ళవెంట ఎప్పుడో తప్ప కన్నీళ్ళు రావు.
నిజంగా కన్నీళ్ళొచ్చినా, లొక వ్యవహారం తెల్సినవాడు గనక ముఖాన్ని అరువు నవ్వుతో నింపేస్తాడు.
అలాంటి చయనులు కళ్ళవెంట ధారాపాతంగా కన్నీళ్లు.
"మావయ్యా.... ఎందుకేడుస్తున్నావ్?" అమాయకంగా అడిగాడు వికాస్.
"ఏమీ లేదురా.... ఏమీ లేదు..." ఆ మాటంటూ కళ్ళు తుడుచుకుని-
"ఒరేయ్ బాబీ.... మీ అమ్మ స్థయిర్యం గొప్పదిరా.... నువ్వు మహర్జాతకుడివి అవుతావురా..... పెంటకుప్పల మీద మూతల్ని ఏరి అమ్మి, ఆ డబ్బుని తల్లికి పంపించే, మీ మమకారం ముందు.... నీకంటే పాతికేళ్ళు పెద్దవాణ్ణి.....నేన్నీకు కాళ్ళు మొక్కాలిరా...." అని ఆగి, బీడీ తీసి వెలిగించుకుని ముందుకు నడిచాడు.
హోటల్లోకి తీసికెళ్ళాడు.
ఇద్దరూ టిఫిన్ తింటున్నారు.
"ఒరేయ్ బాబూ! జీవితంలో అతి ప్రమాదకరమైంది దుఃఖం.... దాన్ని దిగమింగడం నేర్చుకో.... ఇంకా భయంకరమైనది నిరాశ.... దాన్ని అసలు పట్టించుకోకు. ఇంకా నీచమైంది అసూయ... దాన్ని ఏమాత్రం లక్ష్యపెట్టకు. నేను బతికున్నా, చచ్చిపోయినా ఈ మూడు విషయాలు మాత్రం గుర్తుంచుకో గుర్తుంచుకుంటావు కదూ?"
ఇద్దరూ బయటకొచ్చారు.
చయనులు ఒక్కక్షణం వికాస్ కళ్ళల్లోకి చూశాడు.
"నేనివాళ ఆముదాల వలస వెళ్ళనా.... అక్కడో పాతబాకీ వంద రూపాయలొచ్చింది. అమ్మకి డబ్బు నేనిస్తాలే. నువ్వు సంపాదించిన డబ్బు నువ్వుంచుకో" అని జేబులోంచి ఆ డబ్బు తీసి వికాస్ చేతిలో పెట్టాడు.