"ఏమయింది? ఏమయింది?" గాభరాపడుతూ మంచం వద్దకు పరుగున వచ్చాడు భుజంగరావు?
"ఏం కాలేదు మామయ్యా! కలలో ప్రభాకర్ వచ్చి వుంటాడు. విపరీతంగా తలలో నరాలు చిలిస్తున్నాయి. అందువల్ల ఇలా ప్రవర్తిస్తుంది. మామయ్యా, రోజాని నాల్గురోజుల్లో అసలు మనిషిగా నీ ముందు పెడతాను," అన్నాడు కృష్ణ మంచం మీద నుంచి లేస్తూ.
"నీ మీద నాకా నమ్మకం ఉందిరా కృష్ణా!" అంటూ భుజంగరావు, అమల మంచంమీద కూర్చున్నాడు.
"నాకు సీటు రిజర్వు చేస్తుందా? తేలిపోయింది. నా అనుమానం నిజం అయింది. రోజా కాదు ఇది.....ఇది..... మాయలాడి" కృష్ణ అనుకున్నాడు.
"రక్తం వచ్చేటట్లు గిల్లుతావా? ఈ పిచ్చి వేషంలో నీ రెండు జబ్బలు కండలూడి వచ్చేటట్లు గిల్లకపోతే చూసుకో," అనుకుంది అమల.
అమల వైపు చూస్తూ కూర్చున్నాడు భుజంగరావు.
11
రాత్రి పన్నెండు గంటలు దాటింది.
అమావాస్య రోజులు కావటం వల్ల బైటంతా చీకటిగా వుంది. భుజంగరావు ఇంట్లో అందరు నిద్రపోతున్నారు. ఆ ఇంటి మొత్తం మీద అమల ఒక్కతే నిద్ర మేల్కొని వుంది.
అమల చప్పుడు చేయకుండా మంచం దిగింది. ఏ మాత్రం చప్పుడు కాకుండా గదిలోంచి మెల్లిగా అడుగులు వేస్తూ బయటకు వచ్చింది. నలువైపులా ఓసారి చూచి వరండా దాటి బైటకు వచ్చింది. పరుగులాంటి నడకతో, దొడ్డి గోడ పక్కకు లాక్కొచ్చాయి.
"ఎవరు నన్ను పట్టుకుంది? వదలండి" అంది అమల పెనుగులాడుతూ.
"నా పేరే భగవాన్! ఎక్కడికి వెళుతున్నావ్ నా కళ్ళు గప్పి?" భగవాన్ కఠినంగా అడిగాడు.
"ఆరి భగవంతుడా? నీ కళ్ళు కప్పి పారిపోవటం......"
"అసాధ్యం. తిరిగి లోపలికి వెళ్ళు" భగవాన్ అన్నాడు చాల కఠినంగా.
"ఉహూ. నేను వెళ్ళను," మొండిగా అంది అమల.
"వెళ్లవన్న మాట!" భగవాన్ సాలోచనగా చూస్తూ అన్నాడు.
"వెళ్ళను...... వెళ్ళను...... వెళ్ళను."
"ఓ నిర్ణయానికి వచ్చావన్న మాట.
"ఆ......"
ఏం చేద్దామని?"
"నన్ను వెళ్ళనిస్తే నా దోవన నేను వెళతాను."
"వెళ్ళనివ్వకపోతే?"
అమల మాట్లాడలేదు.
"వెళ్ళనివ్వకపోతే?" రెట్టించాడు అదే మాటని భగవాన్.
"వెళ్ళనివ్వకపోవటం అంటూ ఏముంది? చంపుతారు అంతేగా! చంపండి. అన్నింటికీ రెడీ" అంది అమల.
"హూ.... చాలా బాగా ఆలోచించావు. అంతకన్నా చక్కటి నిర్ణయానికే వచ్చావు. నేను యింత పధకం పన్ని నిన్ను యింత దూరం లాక్కోచ్చింది చంపటానికి కాదు."
"నేను అరిచి గోలచేసి వాళ్ళతో చెపితే ఏమిచేస్తారు. మహా అయితే చంపుతారు లేక నానా బాధలూ పెట్టి ఆపై చంపుతారు. క్షణం క్షణం ఈ నరకం కన్నా అదే నయం. చావే నయం."
భగవాన్ పక పక నవ్వాడు.
అమల కోపంగా చూసింది.
"అరిచి గోల చేసి వాళ్ళతో చెప్పు. నేను తెరవెనుక వుంటా కాబట్టి నన్ను ఎవరూ పట్టుకోలేదు. నీవు వాళ్ళతో నిజం చెప్పిన మరుక్షణం అక్కడ మీ అమ్మగారి కుడి చెయిటక్కున తెగనరకబడుతుంది......