"పోతావా, చంపేయనా?" అంది పెద్దగా అరుస్తూ అమల.
భుజంగరావు వెళ్ళమన్నట్లు చెయ్యి ఊపుతూ సంజ్ఞ చేశాడు.
సుందరమూర్తి కోపంగా వెళ్ళిపోయాడు.
అమల మళ్ళి భుజంగరావు వద్దకు వచ్చి గట్టిగా భుజంగరావుని వాటేసుకుంది. "ఇదిగో వీళ్ళెవరు? ప్రభను తీసుకురాకపోతే, నీవన్నా తీసుకురావాలి . లేకపోతే ఊరుకోను. ప్రభా, ఓ ప్రభా, రావా?" అంటూ మళ్ళి రాగం తీయటం మొదలుపెట్టింది.
భుజంగరావు "అలాగేనమ్మా" అని అమల భుజం నిమురుతూ కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు.
శంకరం కృష్ణను తీసుకుని వచ్చాడు.
అమల ఏడ్పుమాటలు చూచి నిర్ఘాంతపోయాడు కృష్ణ.
"ఏమయింది మామయ్యా?"
"నా తల్లి పిచ్చి ఈ పూట ఎక్కువయిందిరా. ఈ ఏడ్పు, ఈ హృదయాన్ని కదిలించే మాటలు వినలేకుండా ఉన్నారా? ఈ స్థితిలో వున్న రోజాని చూస్తూ చావలేక బ్రతకలేక వున్నారా కృష్ణా?"
"ఏమిటి మామయ్యా! పులిలాంటి నువ్వు యిలా మాట్లాడటమేమిటి? ఇప్పుడేమైందని, ఇంతగా అధైర్యపడతావు? రోజాని మామూలు మనిషిని చేస్తానని మాటిచ్చాను. నామీద నమ్మకం లేదా?"
కృష్ణ చరచర అమల వద్దకు వచ్చి అమల భుజంమీద చేతులువేసి తనవైపు బలవంతాన తిప్పుకున్నాడు. లాక్కెళుతున్నాట్లే తీసుకెళ్ళి మంచంమీద పడుకోబెట్టాడు. అమల చేతులు కదలకుండా తన చేతులతో గట్టిగా మంచానికి నొక్కిపట్టుకున్నాడు.
10
"రోజా వున్నట్లుండి విపరీతంగా ప్రవర్తించటానికి ఏదో కారణం వుంది. మీరంతా దూరంగా ఉండండి పరీక్ష చేయాలి" అన్నాడు గంభీరంగా కృష్ణ.
భుజంగరావు, శంకరం, అప్పుడే మేనేజర్ రామచంద్రతో వచ్చిన సుందరమూర్తి మంచంచుట్టూ గుమిగూడిన వాళ్ళు కృష్ణా మాటలతో దూరంగా పోయి నుంచున్నారు.
కృష్ణ తీవ్రంగా అమల కళ్ళల్లోకి చూశాడు.
అమల, కృష్ణ చూపుల్లో చూపులు కలపలేక కళ్ళు మూసుకుంది.
కృష్ణ కావాలని ఆదుర్దా నటిస్తూ, పల్స్ చూచి, అమలమీదకు వంగి తల నరం నొక్కి పరీక్ష చేయటం మొదలుపెట్టాడు.
"ఏం కావాలి రోజా?"
"ప్రభ....ప్రభ...... ప్రభా తొందరగా రా!" అంది.
అమల తలమీద పరీక్ష చేస్తున్నట్లుగా చెవి ఆనించాడు కృష్ణ.
"ఇడియట్. నిప్పుతో చెలగాటమాడుతున్నావ్? పిచ్చి లేని నీకు ఇంకా పిచ్చి ఎక్కువయిందే? మామయ్య హార్ట్ ట్రబుల్ పేషెంట్ అని చూస్తున్నాను. ప్రభ కాదు నీకు కావలసింది. మృత్యువు. పిచ్చిపనులు చేసి మామయ్య మనసు క్షోభ పెట్టకు. మరోసారి యిలా చేశావంటే సరాసరి యమపురికి పంపుతాను. జాగ్రత్త!" అతి నెమ్మదిగా అమలకు మాత్రమే వినిపించేటట్లు అన్నాడు కృష్ణ.
"ముందు నన్ను పంపు. నే వెళ్ళి నీకు అక్కడ సీటు రిజర్వ్ చేస్తాను," గొణిగింది అమల.
కృష్ణ కోపంగా అమల జబ్బమీద గిల్లాడు రక్తం వచ్చేటట్లు,