"ఆపై బజారు నుంచి వస్తున్న మీ అయ్య కాలు యాక్సిడెంట్ లో చిన్నాభిన్నం అవుతుంది. అలాగే చిన్న చిన్న యాక్సిడెంట్స్ తో అయ్యా, అమ్మా కాళ్ళు, చేతులు కళ్ళు.....
"చాలు చాలు....." భయంతో అరిచినట్లే అంది అమల.
"మరి నా మాట వింటావా?"
"ఎప్పటికైనా చనిపోవలసిన వాళ్ళమే. నేను చస్తాను. ఆ వార్త విని మా అమ్మా, నాన్నా కూడా....." ఆపై వాక్యం పూర్తి చెయ్యలేకపోయింది అమల. గిర్రున కళ్ళలో నీళ్ళు తిరిగాయి.
"నా మాటంటే మాటే. నాది వుడుంపట్టు నీవు చచ్చినా ఆ వార్త మీ అమ్మా, నాన్నకి చేరదు. చేరేలోపలే నా పగ తీర్చుకోవడానికి నా మనుష్యుల ద్వారా వాళ్ళని నా దగ్గరకు చేర్చుకుని తిండి నీళ్ళు నిద్ర లేకుండా చేసి రోజూ వాళ్ళ శరీరంలో వక పార్టు ఎగరగొడుతూ.....
అమల దోసిట్లో ముఖం దాచుకుని ఏడవటం మొదలుపెట్టింది.
ఏడ్పు ఆగిందాకా భగవాన్ ఆగాడు.
"కన్నీళ్ళన్నీ కారిపోయాయి. యింక మనసు తేలికై వుంటుంది. ఊ..... ఇంక నీ నిర్ణయం చెప్పు! నా మాట వింటావా?"
"వింటాను కాని....." అంది అమల.
"భగవాన్ కళ్ళు మెరిశాయి.
"కానీలు అర్ధణాల గురించి ఆలోచించకు. నీ వెనుక నేను వున్నాను. యింక చెప్పు కాని అని ఎందుకన్నావో!"
"కృష్ణ నా గుట్టు కనుక్కున్నాడు."
"నిజమా!"
"నాకు పిచ్చీ లేదు వెర్రీలేదు అలా యాక్షను చేస్తున్నాను. కృష్ణ డాక్టర్ నన్ను చాలా ఈజీగా పట్టేశాడు."
"నీవు రోజావి కాదని అన్నాడా?" ఆతృతగా అడిగాడు భగవాన్.
అవును అని అమల అనేదే ఏ దైవమో అడ్డుపడినట్లు చటుక్కున సమాధానం చెప్పలేదు. వక్కసారిగా ఆలోచనలు ముసిరాయి. ఈ భగవాన్ గాడు కృష్ణ అవునో కాదో ఈ దెబ్బతో తేలిపోతుంది. అబద్ధం ఆడాలి అనుకుంది.
ఆ నిమిషాన అబద్ధం ఆడటం చాలా మంచిదన్న విషయం అమల ఎరుగదు. అలాగే ముందు ముందు ఈ చిన్న అబద్ధమే ఓ అద్భుత నాటకానికి నాందీ పలుకుతుందని తెలియదు.
"నేను రోజాని కాదని యింకా కృష్ణ అనలేదు. అనుమానించాడు. అతని చూపులు ప్రవర్తన ఈ విషయం నాకు తెలియకనే తెలియజేస్తున్నాయి. ఏదో ఒక దుష్ట సమయంలో బైట పడటం ఖాయం. అలా నేను బైటపడ్డనాడు నా గతి అదోగతేనని భయపడి యిహ పారిపోవటానికి తెగించాను. పారిపోబోతుంటే మీరు అడ్డుపడ్డారు."
"కృష్ణ నీకు అడ్డురాకపోతే ఫరవాలేదుగా!"
"కృష్ణ వల్ల నిజం బైట పడుతుందన్న భయం అంతే."
"అయితే యింక నీవు నిశ్చింతగా వుండు. అతను నీ మార్గానికి రాకుండా అడ్డు తొలగిస్తాను."
"చంపుతారా!" భయంగా అడిగింది అమల.
"అవసరమయితే మా మార్గానికి అడ్డువచ్చేవాళ్ళని చాలా తేలిగ్గా పై లోకాలకి పంపిస్తుంటాము. కాని యిప్పుడు అంత అవసరం లేదు. ఈ యింట్లోంచి పంపిస్తాను చాలుకదా?"