"నేను మూడేళ్ళక్రిందట బి.యే ప్యాసయ్యాను. (ఆశ్చర్యం) దొంగిలించిన డబ్బుతో చదువుకున్నా. (ఆశ్చర్యం) అమ్మని నాన్న చంపేశాడు 'ముండ'తో పోవద్దు అందనీ (షాక్!) మా అమ్మని దహనం చెయ్యటానికి వీల్లేక చెరువులో పారేశాను (అతని కళ్ళమ్మట నీళ్లు) నేను కొన్నాళ్లు వంటపని చేశాను. (జాలి) సినిమా దియేటరులో క్లీనరుని కొన్నాళ్ళు. (పాపం!) నాగపూర్ లో ఆంగ్లో యిండియన్ రెస్టారెంటులో పనిచేశాను. అప్పుడే తాగుడు అలవాటైంది..... గుంటూరులో ఒకరి ఇంట్లో వంట చేసి, ఆ యింటాయన కూతుర్ని పాడుచేశాను....యేం చెయ్యను. వయస్సు యొక్క ఉద్వేగం...... చివరికి నేను ఒక ఆమెని ప్రేమించాను. నేనూ ప్రేమించ గల్గుతాను. (చిత్రమే!) ఆమె నన్నూ ప్రేమించింది. ఆమెని పెళ్ళాడేశాను!" అని హఠాత్తుగా ఆగిపోయాడు.
"తర్వాత" అన్నాను.
"అదే తప్పుపని చేశాను. డబ్బులేనివాడు ప్రేమించకూడదు. అదే తప్పు" అంటూ వెళ్ళిపోయాడు. ఏం అర్ధమవలేదు నాకు.
సాయంత్రం ఏమీ తోచలేదు.
సినీమా మంచిది లేదు.
కాఫీ కూడా బావూలేదు.
సంజీవ్ వచ్చి కొన్ని పాటలు రాసి పెట్టమన్నాడు. అలాగే అన్నాను. రూమ్ కి వచ్చాను. ఆరుగంటలైంది. అతను హాలులో ఒక మూల పడుకొని అమితంగా దగ్గుతున్నాడు. నేను దగ్గరికి వెళ్ళి ఐదు రూపాయలతని కిచ్చి, 'తీసుకో మందు యిప్పించుకో' అన్నాను.
అతను ఆ నోటుతీసుకొని, చింపేశాడు. నాకు వొళ్ళు మండింది. "ఏరా ఫూల్ లా, చింపేశావు" అన్నాను.
"నా గుండె చీలిపోయాక, ఇదెందుకూ! ఐనా నా కిచ్చిన తర్వాత నా యిష్టం! నీ దాతృత్వం స్థిరపడిందిలే! ఇంకేం కావాలి" అన్నాడు. వాణ్ణి చంపివెయ్యాలన్న కోపంతో రూముకి వెళ్ళాను.
భోంచేశాను -సాంబార్ని ఆంధ్రాపుల్సు అంటూ. తొమ్మిది గంటలకు ఆ స్త్రీన్నీ, మరొహ పురుషుడు నా ప్రక్కగదిలోకి వచ్చారు.
నేను నిద్రపోయాను.
పన్నెండు గంటలకి మెలకువ వచ్చింది. తలుపు తెరుచుకొని దొడ్డికి వెళ్ళబోతూంటే - పక్కగదిలోంచి ఒకడు జారిన పంచెని సర్దుకుంటూ తొందరగా వెళ్ళిపోతున్నాడు.
తిరిగివచ్చి పడుకొనేసరికి ఆ గదిలోకి 'అతను' వెళ్ళాడు. ఏవో మూల్గులూ - ఏడ్పులూ......
నాకు నిద్రపట్టింది.
రెండు గంటలకి ఎవరో తలుపు తట్టారు. లేచి తలుపు తీశాను. అతను ఎర్రగా కళ్ళూ, చెదరిన జుట్టూ, కొట్టుకొనే గుండె!
"ఎవరితోనూ చెప్పకు సుమీ... ఆమె నా భార్య, ఆమె నేను ప్రేమించి పెండ్లాడిన భార్య.... (అతనిలో ఆయాసం ఎక్కువౌతోంది) ఆమె నాకోసం తన మా..న..ము మర్పించింది. ఆ ముగ్గురికీ అయిదు రూపాయలు బాకీ ఉన్నాను. ఆ వెధవలు నా భార్య అందానికి వశ్యులయ్యారు. 'మూడు రోజుల్లో అప్పు తీర్చకపోతే, నా భార్యని వారికివ్వాలన్నారు' ఆ షరతుకి ఒప్పుకొన్నాను. ఆకలికి తాళలేక..... ఇవ్వలేక పోతామా అని. చివరికి ఎవరూ ఇవ్వలేదు. నువ్వున్నూ!
ఆగి కన్నీళ్ళతో ఇలా అన్నాడు.
"ఆమె మానం పోయింది. నా కోసం సర్వస్వమూ అర్పించింది. ఇంక బ్రతకలేనంది -ఆమెకీ శీలమూ, అభిమానమూ వున్నాయి. చంపి వెయ్యమంది ఆలోచించాను. నాకూ నీతీ, ప్రేమా వున్నాయి. ఆమె సుఖం కోసం త్యాగం చేసిన ఆమెని కృతజ్ఞతా చిహ్నంగా చంపివేశాను" అని భోరుమంటూ ఏడ్చాడు.
నేను దిగ్ర్బాంతుణ్నయ్యాను. అతడు కళ్ళు తుడుచుకుంటూ వెళ్లిపోతూ "ఎవరితోనూ చెప్పకు! కానీ నీ దాతృత్వాని కిది చిహ్నం" అని చొక్కామీద ఆ చెయ్యి చరచి వెళ్ళిపోయాడు.
25-5-41
ఉదయం పోలీసులూ, జనమూ 'ఆ ముగ్గురూ' గది చుట్టూ చేరారు.
ఆమె పెదవులింకా ఎర్రగానే ఉన్నై? ఆమె గుండెల్లో బాకు పోటు ఉంది. ఆమె జుట్టు భూమిమీద ప్రాకివుంది.
పాపం!
మురళీధరుని హోటలుకి వెళ్ళాను. మునిమాణిక్యం వారు కనపడ్డారు.
"మనలో మార్పు రావాలండి. రష్యాలో వుండే రచనలూ , ప్రభుత్వం మనకి కావాలి." అన్నాను.
ఆయన నవ్వారు. సౌహార్దంగా ఆయనకీ పైకథ ఏం తెల్సు!
26-5-41
ఇంటికి వచ్చేశా! "ఎందుకు వెళ్ళావురా బందరు" అన్నారు.
అదే తెలియదు. ఐనా రక్తపు మరక పడిన చొక్కా దానికి నిదర్శనం.