Previous Page Next Page 
చిల్లర దేవుళ్ళు పేజి 15

    పాణి జవాబు చెప్పలేదు.
    'పెట్టెటోడు కొడ్తె పడకుంట తప్పుతాదుండి!' అన్నాడు అక్కడున్న వారిలో ఒకడు.
    ఆ మాట నచ్చలేదు కరణానికి.
    'అచ్చ. మళ్ళరాండ్రి' అన్నాడు అక్కడున్న వారి నుద్దేశించి.
    లేచి నుంచున్నాడు కరణం.
    అంతా లేచి నుంచున్నారు. దండాలు పెట్టారు. వెళ్ళిపోయారు.
    "పంతులూ! ఏన్నొద్దులు పోయినవు?"
    "మూడురోజులే కదండీ!"
    "నీకట్లనే అనిపిస్తది. తాయా రెంత యాది చేసిందనుకున్నావ్?"
    "పంతుల్ను కదండీ"
    "ఏం పంతులువో ఏమో? ఆ మరచిన. తస్వీర్లు గుంజేపెట్టె తెచ్చినవట గద. తేకపోయినావు? మా తస్వీర్లు గుంజితే తప్పా?...."
    రెడ్డిగారు తీసుకున్నారనే మాట నోటిదాకా వస్తే మింగేసి "దాన్ని అన్లోడ్ చేయాలండీ" అన్నాడు.
    "అంటే?"
    "రీలు తీసి వేరే రీలు వేయాలి."
    "రేపు తెస్తవా? తాయారు తస్వీరు దిగుతదట."
    "అలాగేనండీ"
    కరణం జీతగాన్ని పిలిచాడు. పంతులు వచ్చాడని తాయారుకు చెప్పమన్నాడు. వాడు తిరిగివచ్చి "రమ్మంటాన్రు" అన్నాడు.
    ఇద్దరూ గదిలోకి వెళ్ళారు. తాయారు పాణి తెచ్చిన పసుపుపచ్చ చీర కట్టుకుంది. జ్యోతిలా బొట్టు పెట్టింది. గులాబీల పరిమళం గుప్పింది. అప్పుడనుకున్నాడు పాణి - దుస్తులు మనిషికి అందాన్ని తెచ్చిపెడతాయని.
    తాయారు నమస్కరించింది. పాణి ప్రతినమస్కారం చేసేప్పుడు తాయారు పెదవులమీద అణచిపెట్టుకుంటున్న చిరునవ్వు గమనించకపోలేదు.
    "ఇంకా స్తానం చెయ్యలేదు వస్త" అని వెళ్ళిపోయాడు కరణం.
    "తాయారు! చీర నచ్చిందా?"
    "మీకు పసందైతే నాకెట్ల పసందు కాదు?"
    "ఆడవాళ్ళను మెప్పించడం..."
    "ఈ చీరల ఎట్ల కొడ్త (ఎలా ఉంటాను) తలవంచుకొని అడిగింది.
    "అవిటి అనేగాని రంభలా ఉన్నావు."
    అవిటి అనేమాట తాయారును బాధ పెట్టిందనే విషయం గమనించిన పాణి మాట మార్చటానికి, "మిగతా సరుకులన్ని బాగున్నయా?" అని అడిగాడు.
    "శాన బాగున్నై. కాని మంజరి కేం చీర తెచ్చిన్రు?"
    "మంజరికా? ఆకాశం రంగుచీర, నీలంది."
    "మంజరి ఛాయకు అతికినట్లుంటది."
    "మంజరి ఏ ఛాయ?"
    "చూడనేలేదులే? అయినా దొరసానులు కండ్లబడ్తారు?"
    "మంజరి ఏం చాయో చెప్పావు కాదు?"
    "చామనచాయగుంటది. ఏలెడు జుట్టూ, అదీ, కండ్లు నెత్తినుంటయు దొరబిడ్డనని."
    "పాఠం చెప్పుకుంటావా కొత్త ఫిడేలు మీద?" విషయం మార్చడానికి అన్నాడు.
    "రేపు" అన్నది వంకర చూపు చూచి.
    "సరే వస్తా" అని లేచాడు పాణి.
    "జర లేపురి" అన్నది చేయి చాచి.
    చుర్రుమంది పాణికి. కాని అణచుకొన్నాడు. చెయ్యి ఊత ఇచ్చాడు. లేస్తూ కళ్ళలోకి చూసింది తాయారు. చూపు దించుకున్నాడు పాణి.
    దాసీదైనా వనజ ఇంతకంటే వేయిరెట్లు మేలు అనే ఊహ మెరుపు కొట్టినట్లయింది పాణికి.
    గదికి వెళ్ళేసరికి కెమెరా అక్కడ తగిలించి ఉంది. గబగబా రీలుతీసి డెవలప్ చేశాడు. ముందు మంజరి నెగెటివ్ కత్తిరించి చూచాడు. వనజ చెప్పింది నిజం. ఎంత దట్టంగానూ, చిక్కగానూ ఉన్నాయి. వెంట్రుకలు? చాలా పెద్దగా ఉన్నాయి కండ్లు. కోలముఖం. మాంసిలములైన కపోలాలు. కుడిచెక్కిలిమీద ఏదో మచ్చ. తుడిచి చూచాడు. అలాగే వుంది. చిన్న చుబుకం. పల్చని పెదవులు. ముక్కుకంటే కొద్దిగా పొడవుగా ఉన్న చెవులు, వాటికి ఏడురాళ్ళ దుద్దులు.
    ఎంత సొగసు!
    ప్రింటు చేశాడు. పూర్తిగా ఆరకముందే మళ్ళీ చూచాడు.
    ఎంత సోయగం ఉంది కళ్ళల్లో!
    అన్నింటిని ప్రింటు చేశాడు.
    వనజ ఫోటో తీసి చూశాడు.
    రెంటినీ ఒకచోట పెట్టి చూచాడు. పోల్చి చూచాడు!
    ఇద్దరి కళ్ళలోనూ సామ్యత కనిపించింది.
    అది ఆశ్చర్యం కలిగించిందతనికి.
    ఒక దాసీదానికీ, దొరబిడ్డకూ రూపంలో పోలిక లేమిటి? మంజరి మెడ పొడవు. వనజ మెడ కురచ. ఫోటోనుబట్టి చూస్తే మంజరి వనజ కంటే పొడుగ్గా వుండాలి. పుటాలు పెట్టిన బంగారంలా మంజరి ఉంటే - పుటం పెట్టని బంగారం లాంటిది వనజ. తాయారు గుర్తుకు వచ్చింది. చేయి ఊత ఇచ్చి లేపమనడం, కళ్ళల్లోకి చూడ్డం గుర్తుకు వొచ్చింది.
    "వట్టి ముడి ఇనుము" అనుకున్నాడు.
    తలుపు తట్టిన చప్పుడైతే ఆలోచనల దారం తెగింది. తలుపు తీసి చూస్తే రెడ్డిగారు!
    "ఏం పంతులు! తస్వీర్లు వచ్చినయా?"
    "రండి కూర్చోండి. కొద్దిగా తడిగా ఉన్నాయి. అయినా చూడొచ్చు" అని రెడ్డిగారి ఫోటో అందించాడు.
    దీక్షగా చూచారు రెడ్డిగారు. 'శాన బాగున్నది' అనే మాట స్వతహాగానే నోటినుంచి వచ్చింది.
    తనను పూర్తిగా పటంలోకి దించేసినట్లుంది. మళ్ళీ మళ్ళీ చూసుకున్నారు అద్దంలో చూసుకున్నట్లు. సాక్షాత్తు తన ప్రతిమ కాగితం మీదికి వచ్చింది. ఎంత విచిత్రం!
    "ఇదిగో, మీదే మరోపటం" అందించాడు పాణి.
    అది బస్టు - చాల చక్కగా వచ్చింది. చూచారు రెడ్డిగారు. రెండు పటాల్ని ఒకేచోట చేర్చి చూచుకున్నారు. మురిసిపోయారు. పెద్దతనం అడ్డురాకుంటే ఎగిరి గంతేసేవారే!
    "పంతు లెంత మంచివాడు! చక్కని సంగీతం వినిపిస్తాడు. మంచి గాజుబిందెలు తెచ్చిపెట్టాడు. ఎంత మంచి బొమ్మలు తీశాడు. ఇంకెన్నో కొత్త విషయాలు చెపుతాడు! చాలా తెలివైనవాడు. గడీలో ఉండదగినవాడు. వెళ్ళనీయరాదు" అనుకున్నారు.
    "ఇవికూడా చూడండి" అని మిగతా ఫోటోలు అందించాడు పాణి. ఒక్కొక్కటే తీసి చూచారు రెడ్డిగారు. వనజ ఫోటో చక్కగా వచ్చింది. లావుగా, పొట్టిగా, చిక్కుజుట్టు, చిన్నకళ్ళు కనిపించాయి. రోజూ చూస్తూనే ఉన్నాడావిన్ని. కాని పటంలో చూచేవరకు వయసు తిరిగివచ్చినట్లనిపించింది.
    "ఇంత చిన్నగున్నయి పెద్దగ కావా?" రెడ్డిగారు.
    "అవుతాయి కాని, నాకు చేయడం చేతకాదు. పట్నం పంపించాలి, పెద్దగై వస్తాయి."
    "అట్లనా! అయితే పంపు" అని కాస్త ఆలోచించి, "నాలుగు దివాలైనన్క పంపు, అందరూ చూస్తరు" అన్నాడు.
    "అవి మీరు చూడొచ్చు. పంపేవి వేరే వున్నాయి."
    "అట్లయితే సరి. దొరసాన్లకు చూపించుకొస్త" అని లేచి "కరణం మింటికి పోయినావా?" అని అడిగారు.
    "అవునండీ, వెళ్ళానండీ!"
    "తస్వీర్ల సంగతి గిట్ట ఎల్లిందా?"
    "అబ్బే, లేదండీ....." అని ఏదో చెప్పబోతుండగానే గది దాటి వెళ్ళిపోయారు రెడ్డిగారు.
    రెడ్డిగారు వస్తారని ఎదురు చూచాడు పాణి. చాలా రాత్రి అయింది. రెడ్డిగారు వచ్చే సమయం కూడా దాటిపోయింది. ఇక రారని నిశ్చయించుకొని ఫిడేలు శ్రుతిపెట్టి ఆలపించసాగాడు. వనజ భోజనపు పళ్ళెంతో ప్రవేశించింది.
    మెరుగులు పెట్టిన బంగారంలా కనిపించింది.
    గులాబీ రంగుచీర కట్టుకుంది. అది పాణి మంజరికోసం తెచ్చింది. కాటుక తీర్చటంలో కళ్ళు తూపులుగా మారాయి. అసలే ఎర్రని పదవులు మరీ ఎర్రగా కనిపించాయి. బొట్టులోకూడ ఏదో నవ్యత గోచరించింది. అది అతని కంట్లో వచ్చిన మార్పో, బొట్టులో వచ్చిన మార్పో చెప్పడం కష్టం.
    ఫిడేలు పట్టుకొని అలాగే లిప్తపాటు ప్రతిమగా మారిపోయాడు పాణి. తరువాత తేరుకున్నాడు.
    'వనజా! ఎంత అందంగా ఉన్నావో తెలుసా?' అన్నాడు మంచందిగుతూ.
    పళ్ళెం కావిడి పెట్టేమీద పెట్టింది.
    'పట్నంకెళ్ళి తెచ్చిం చీరే' అని కొంగుచూపి, 'చిందొరసాని ఈనాం ఇచ్చింది' అన్నది.

 Previous Page Next Page