రీలు తిప్పుతూ "ఆగండి, మరొకటి. ఈ తడవ బస్ట్ తీస్తా" అన్నాడు.
రెడ్డిగారు నుంచున్నారు.
"క్లిక్"
పక్కగా నుంచుని ఒక పోజు తీశాడు.
చేతులు కట్టుకొని మెట్లక్రింద నుంచున్న వాడిమీద పడింది రెడ్డిగారి దృష్టి."ఏమ్ర? ఏమో వచ్చినవు?" అని అడిగారు.
"కరణం దొర పంపిండు. పంతులు పట్నం పోయి ఏం తెచ్చిండట, పట్టుకి రమ్మన్నడు."
"పంతులు! ఆ సామాను ముంగల పంపు" అన్నారు రెడ్డిగారు.
"చిత్తం" అని ఎంకటిని తీసుకొని వెళ్ళిపోయాడు పాణి. ఒక సూట్ కేసు, ఒక వయోలిన్ కేసు కరణానికి పంపి, పెట్టెల ముందు కూర్చున్నాడు, ఎవరివి వారికి పంపించడానికి. గులాబీలబుట్టకనిపిస్తే వనజ కోసం చూచాడు. కనిపించలేదు. పిలిచాడు. గులాబి బుట్ట చూచి ఎగిరి గంతేసింది. బుట్ట పట్టుకొనిపరిగెత్తింది, పాణి పిలుస్తున్నది కూడా గమనించకుండా మంజరి దగ్గరికి.
"చూసిన్రా ఎన్ని గులాప్పూలో?"
వాటిని చూచి పొంగిపోయింది మంజరి. అన్ని గులాబీలు ఒక్కసారి ఏనాడూ చూళ్ళేదామె. "ఎంత బాగున్నయొ పూలూ! యాడివి?" అడిగింది.
"పంతుల్తెచ్చిండు పట్నం కెల్లి."
తనకు గులాబీ లిష్టమని పంతులు కెలా తెల్సో అర్ధం కాలేదు మంజరికి.
"తలలో ముడువవే తస్వీర్ల వస్త" వన్నది.
వనజ సూదీ దారం తీసుకొని దండ గుచ్చసాగింది.
పూలు దోసిల్తో తీసుకొని ముక్కుదగ్గర పెట్టుకొని వాసన చూచింది మంజరి. "అబ్బ! ఎంతబాగున్నయే" అన్నది. దండమీదనుంచి దృష్టి మరల్చి చూచింది వనజ. మంజరి ఒక్కొక్కపూవె తీసి వేళ్ళసందున పెట్టుకుంటూంది. తనలో తాను నవ్వుకుంది వనజ.
"ఇగొ పంతులు పంపిండు" అని ఒక దాసీది ఒక సూట్ కేసు మంజరి ముందుపెట్టి వెళ్ళిపోయింది.
మంజరి పూలను వదిలేసింది. ఆతురతతో సూట్ కేసు తెరిచింది. ఝుమ్మున పరిమళం వచ్చింది-వనజ సైతం దండ వదిలిపెట్టి వచ్చేసింది.
ఒక పెద్ద డబ్బా తీసింది మంజరి. అది యార్ డ్లీ పేస్ పౌడరుది. ముక్కుకు దూరంగా పెట్టుకొని వాసన చూచింది.
"వనజా ఇదేందే?" అడిగింది మంజరి.
వనజ కూడా అలాగే చేసింది. అర్ధం కాలేదు. బోర్లించింది. పౌడరు రాలింది.
"బూడిద! ఎంత వాసనున్నదీ!" అన్నది.
"ఓల్డుని బ్రిలియంటైన్" సీసా మూత తీసి వాసన చూచింది మంజరి. ఏమీ అర్ధం కాలేదు. అహి వనజ కందించింది. స్నో సీసా తీసింది. మూత తీసి వాసనచూస్తే చల్లని వాసన వచ్చింది.
"వెన్న" తనకు తెలియకుండానే అనేసింది.
ఈవినింగ్ ఇన్ పారిస్, చానలు నెం. 5, ఊటీ, తాజా సెంట్లు చూచారు. లేత సుగంధం హాయి అనిపించింది.
తరువాత లిప స్టిక్, నైలు పెయింట్ వగైరాలన్నీ చూచాడు. కాని ఇద్దరికీ ఏమీ అర్ధం కాలేదు.
"పంతుల్నడిగొస్త" అని డబ్బాలన్నీ పట్టుకొని పాణి గదిలో ప్రవేసించింది వనజ.
"వనజా! ఏం అలా పట్టుకొచ్చావ్?" అడిగాడు పాణి.
"ఇయన్ని ఏందో తెలవటం లేదట. ఏం చేయాల్నో అడిగి రమ్మన్నది చిందొరసాని"
"ఒహో అదా!" అని చేతులు దులుపుకొని కుర్చీలో కూర్చొని, వనజను కూర్చోమన్నాడు. వాటన్నింటిని ఒళ్ళో పెట్టుకొని కూర్చుంది వనజ.
ఒక్కొక్కటే తీసి దాన్ని గురించి చెప్పసాగాడు పాణి.
"ఇది బ్రిలియంటైన్. చూశావా వాసన?" అని వాసన చూసి "ఎంత బిరుసు జుట్టయినా చెప్పినమాట వింటుంది. అరచేతికి తీసుకొని నెత్తికి రాసుకోవాలి. జుట్టు ఎలా చెపుతే అలా వింటుంది."
"చిందొర్సానికి బిరుసు జుట్టుని మీ కెట్లెరిక?"
పాణి ఆశ్చర్యపోయాడు. "నాకు తెలీదు" అన్నాడు.
"మరిదెట్లతెచ్చిన్రు?"
"ఆడవాళ్ళంతా వాడ్తారు. మగవాళ్ళు కూడా వాడ్తారు. ఇదిగో, నేనూ తెచ్చుకున్నా."
మిగతావాటి విశేషాలన్నీ తెలియపర్చి, వాటిని వాడే పద్దతి చెప్పి వనజను పంపించేశాడు పాణి.
వనజ దూరంగా ఉండగానే అన్నది మంజరి - "వనజా! చూడు చీరెంత బాగున్నదో!" అని "అబ్బ నీలిరంగు నాకెంతో ఇష్టం" అన్నది రంగూన్ బ్యూటీ చీర చూపుతూ. "అంచు అసలే లేదు. అక్కడక్కడ మెరుపు చుక్కలున్నాయి. ఇది కట్టుకుంటే నేనెట్లుంటనో" అని చేతిమీద చీర వేసుకొని ముఖంలోకి చూస్తే వనజ ముఖంలోకి చూస్తే వనజ ముఖంలోని రక్తం దిగిపోయి ఉంది.
"ఏమొ అట్లున్నవు"
ఈలోకంలోకి వచ్చింది వనజ. "ఏంలేదు" అన్నది.
"చూడు ఈ చీర వాకెట్లుంటదో?" మళ్ళీ అడిగింది.
"కట్టుకుంటే మబ్బుల్ల మెరుపోలె ఉంటరు."
ఆ చీర అక్కడ పడేసి మరొకటి తీసింది. అది గులాబీ రంగుది. మొత్తం విప్పింది, తనకు చుట్టుకుంది.
"వనజా! చూడు ఈ లేతరంగెంత బాగున్నదో!"
లేని సంతోషాన్ని తెచ్చిపెట్టుకోడానికి ప్రయత్నించింది వనజ. "శాన బాగున్నది. నీలిచీరె యింకా బాగున్నది" అన్నది.
మంజరి చిన్నబుచ్చుకుంది. "అట్లయితే నువ్వే తీసుకో" అని వనజ మీద పారేసింది.
వనజ కేమీ అర్ధం కాలేదు. మంజరి ముఖం చూసింది. అందులో కోపమూ, ప్రసన్నతా రెండూ కనిపించలేదు.
"నాకెందుకండి, దాసిదాన్ని! మీకైతేనె బాగుంటుంది. చీరె గులాప్పూలల్ల ఏస్తే యాడున్నదో సుత కండ్లపడదు చూడురి" అని చీర గులాబీ పూలల్లో వేసింది.
"అవునే వనజా! పూలల్ల కల్సిపోయింది రంగు" అని గులాబీలనూ, చీరనూ చూసింది. ఆ చీర తీసి వనజ మెడలోవేసి "ఈ చీరె ఇనాం (బహుమతి) అన్నది మంజరి.
చకితయై చూచింది వనజ.
రామారెడ్డిగారు ఫోటో దిగిం తర్వాత దుస్తులు మార్చడానికి తన గదికి వెళ్ళారు. అద్దంలో చూచుకున్నప్పుడు మంజరి ఫోటో దిగుతానన్న మాట జ్ఞాపకం వచ్చింది. మంజరి ఫోటో ఎవరుతీస్తారు? దొరసాని ఫోటో? పాణిచేత తీయించరాదు. ఫోటో తీయించకుంటే మంజరి చిన్నబుచ్చుకుంటుంది. ఎలా కుర్చీలో కూలబడి ఆలోచించసాగాడు. పాణి ఫోటో ఎలాతీశాడు? కెమెరా మెడకు తగిలించుకొని 'క్లిక్' అనిపించాడు. తాను అలా చేయలేడా? ఆ అదేమంత కష్టం? కాని తానొక ప్రభువు. ఫోటో తీస్తాడా! ఆడవారికి ఫోటో తీయడం నేర్పుతే! ఎవరికి నేర్పాలి? వనజకు. వనజ దాసి. ఆడవారి ఫోటోలు తీస్తుంది. ఆహా ఆ తోలుపట్టా మెడకు తగిలించుకొని 'క్లిక్' మనిపించడంలో ఏదో తమాషా ఉందనిపించింది. తానే అనిపిస్తే సరి. కాని ఆ విషయం ఎవరికి తెలియనీయరాదు. రహస్యంగా ఉంచాలి. అవును, రహస్యంగా ఉంచాలి. తానే ఫోటోలు తీయాలి.
తామే ఫోటోలు తీయాలనే నిర్ణయం జరిగింతర్వాత పాణి గదికి వెళ్ళారు రెడ్డిగారు, పుస్తకం చదువుతూ మంచం మీద పడుకున్న పాణి రెడ్డిగారిని చూచి నుంచున్నాడు.
గదిలో అడుగుపెడుతూనే "పంతులూ, పెద్ద తిప్పలే (ఆపద) తెచ్చిపెట్టినవు గద" అన్నాడు.
సారంగపాణి సుమారు ఉలిక్కిపడ్డాడు. "ఏమైంది దొరవారు' అని అడిగాడు
"ఏం లేదుగని చిందొరసాని, పెద్దొరసాని తస్వీర్లు దిగుతమంటాన్రు. ఎట్లనా అని ఆలోచిస్తాన్న."
పాణి గ్రహించాడు. అంతఃపురంలోకి తాను వెళ్ళరాదు. వారికి ఫోటోలు కావాలి. ఆలోచించేదేముందండి, మీరు తీయండి.'
తన మనసులోని మాట గ్రహించాడనుకున్నాడు రెడ్డిగారు.
'నాకు తియ్యొస్తాది?'
'ఎందుకు రాదు?' అని కెమెరా దొరవారి మెడలోవేసి క్రింద గ్రౌండ్ గ్లాస్ లోకి చూడమన్నాడు పాణి.
'ఏం కనిపిస్తూంది?'
'కిటికీ'
'క్లిక్ మనిపిస్తే కిటికీ ఫోటో వస్తుంది' అని ఫోటో తీసే పద్దతంతా చెప్పాడు పాణి. తన ఫోటో సైతం తీయించుకున్నాడు. కెమెరా రెడ్డిగారికిచ్చి 'తీసికెళ్ళండి' అన్నాడు పాణి.
కెమెరా తీసుకొని వెళ్ళిపోతూ 'పంతులు! కరణంతో గిట్ట అనేవు నేను తస్వీర్లు తీస్తనని' అన్నారు.
'అబ్బే నాకెందుకండీ!'
'గడీల కూడ ఎవ్వరికీ తెల్వవద్దు'
'సరేనండి'
రెడ్డిగారు వెళ్ళిపోయారు. పాణి కరణం ఇంటికి బయల్దేరాడు. కరణం ఎవరితోనో మాట్లాడుతూ కూర్చున్నాడు సావిట్లో. పాణి చేసిన నమస్కారాన్ని అందుకొని "పంతులూ, వెంకట్రావును మరచిపోయినట్లున్నదే!" అన్నాడు.
'లేదండీ, రాగానే గాజుబిందెల గొడవ జరిగిందా?' అణుకువగా జవాబు చెప్పాడు పాణి.
"ఏందేంది? గాజుబిందెలేంది!' అడిగాడు కరణం. తెలిసీ తనచేత చెప్పించాలని చూస్తున్నాడు కరణం అని గ్రహించాడు పాణి. ముక్తసరిగా చెప్పేశాడు.
'లంజకొడుకులు. అంత ఖీమత్ (వెల) గల గాజు బిందెలు ఎహెత్యాలుగ (జాగ్రత్తగా) పట్టుకోవద్దు? మస్తి (పొగరు) కండ్లకెక్కింది గాడ్దికొడుకులకు. వానికి ఆయుస్సున్నది కాబట్టి బతికిపోయిండు. కోపమొస్తే దొర పులైతడనుకో. ఎంటపడి ఎందుక్కొట్టలేదో ఆశ్చర్యంగున్నది' అని సారంగపాణి వైపు చూచాడు. అతని వ్యాఖ్యానం ఆశిస్తూ.