ఆవిడ కళ్ళల్లో ఆనందం తాండవించింది.
"వనజా! మంజరి ఎంత మంచిది! నిన్ను పూర్తిగా తామరపూవును చేసింది. జుట్టెలా ఉందో తెలుసా!"
కళ్ళు పెద్దవిచేసి చూసింది.
"తుమ్మెదల్లా."
తలవంచుకుంది. "సర్లేరి. అన్నం తినురి."
కుర్చీ జరుపుకొని కూర్చున్నాడు. "ఏమిటిది యిన్ని పిండి వంటలు! తినగాలనా?' అన్నాడు.
"ఇగ దినాం పిండొంట లొస్తయి. దొర చెప్పిండు. ఇయ్యి తినలేరా? మా అమ్మ అనేది-వయస్సులున్నోరు రాళ్ళు తిని రాళ్ళు అరిగించుకోవాల్నని" అని గిన్నెడు నెయ్యి గుమ్మరించింది వనజ.
కమ్మని వాసన గుప్పుమన్నది. తలెత్తి చూశాడు పాణి. చిలిపితనం కనిపించింది వనజ కళ్ళల్లో. ఒక్కొక్కటే వేసి అన్నీ తినిపించింది వనజ ఆ మాటా ఈ మాటా చెప్పి. తనకు తెలియకుండానే అన్నీ తినేశాడు పాణి. చేయి కడుక్కుని తాంబూలం అందుకుంటూ వనజను కుర్చీలో కూర్చుండబెట్టి 'తాయారు ఏమందో తెలుసా? మంజరి నల్లగా కాకిలా ఉంటుందని' అన్నాడు.
'కుంటిది- ఓర్చలేదు. మంజరి పురమేసిన బంగారుమోలే ఉంటది. ఎంత మెచ్చుకున్నదనుకున్నరు నిన్ను.'
'ఎందుకు'
"మబ్బురంగు చీర తెచ్చినందుకు. ఆ చేరె కట్టుకుంటే మబ్బుల్ల మెరుపోలె ఉన్నదనుకోరి చిందొరసాని."
"ఫోటోలు చూశారా?"
"అంటే?"
"తస్వీర్లు."
"ఓ. చూసినం. చిందొరసానైతే అయ్యిపట్టుకొని జింకోలె ఎగిరిందనుకోరి."
"వనజా! ఒక్క మాటడగనా?"
"అడుగున్రి." ఆతురత కనబర్చింది.
"మంజరి కళ్ళలో నీ పోలిక లెందుకున్నాయి?"
వనజ తడబడింది. ఉత్సాహం చచ్చింది. గుండె దడదడలాడింది. కళ్ళులోంచి రక్తం దిగిపోయింది. కొత్త గులాబీ చీరమీద బాష్పబిందువులు టపటపా రాలాయి.
అలా అడిగి తప్పుచేశా ననుకున్నాడు పాణి. అతని మనస్సు బాధపడింది వనజను బాధ పెట్టినందుకు. "పోనీ వనజా! నీ కన్నీరు చూడలేను" అన్నాడు.
పెద్దగా ఏడ్పు వచ్చింది వనజకు. పైటకొంగు నోట్లో పెట్టుకొని గదిలోంచి పరిగెత్తింది.
"వనజా!.....వనజా!...." అంటూ మెట్లదాకా వెళ్ళాడు పాణి. కాని వనజ అందలేదు.
సారంగపాణి బాధ ఆశ్చర్యంగా పరిణమించింది. మంజరిని గురించి అడుగుతే వనజ కెందుకో దుఃఖం! వనజ దాసీది. మంజరి దొరకూతురు. వీరిద్దరి పోలికల సామ్యం ఏమిటి? ఇందులో ఏదో రహస్యం ఉంది. బైట పెట్టరాని, విడదీయరాని రహస్యం యేదో ఉంది. అంతా విచిత్రం!
రాజభవనాలు కుట్రలకు ఆలవాలాలు. అవినీతికి ఆకారాలు. అక్కన్నుంచే నీతీ, శాసనమూ పుడ్తాయి.
సీజరు భార్యను శంకించడానికి వీల్లేదు!
10
పట్నం నుంచి ఎవరో వచ్చారని చెపుతే బయటికి వచ్చారు రామారెడ్డిగారు.
అప్పటికి సాయంకాలం అవుతూంది.
వచ్చినతను తనను తానే పరిచయం చేసుకున్నాడు, ముందు రెడ్డిగారికి నమస్కరించి -
"నా పేరు నరేందర్. హైదరాబాద్ లో ఆర్యసమాజంలో పనిచేస్తుంటాను. బహదూర్ యార్ జంగ్ మతాంతీకరణం చేసి రాజ్యమంతా తురకల్తో నింపేయాలనుకున్నాడు. అలా తురకలైన వారందర్నీ శుద్దిచేసి తిరిగి హిందువులుగా చేయాలని ఆర్యసమాజం నిర్ణయించింది. వారి ఆదేశం మేరకు నేను బయల్దేరాను. పెద్దవూరు, చిన్నవూరు, వావిలపల్లి, నర్సాపురం, ఆలేరు మున్నగు ప్రాంతాలకు వెళ్ళి మతం మార్చుకున్నవారినందర్నీ హిందువులను చేశాను. మీ గ్రామంలో బహద్దూర్ యార్ జంగ్ స్వయంగా వచ్చి మతం మార్చాడని తెలిసి ఇక్కడికి వచ్చాను. మీరు నాతో సహకరించాలి, హిందూమతాన్ని రక్షించాలి."
ఉపన్యాసం విని సుమారు ఉక్కిరిబిక్కిరైనారు రెడ్డిగారు. ఏమనాలో తోచలేదు ముందు. బుర్ర గోక్కున్నారు. చుట్ట వెలిగించారు.
"హిందూమతం అతి సనాతనం అయింది. పశ్చిమదేశాల ప్రజలకు బట్ట సహితం కట్టుకోవడం తెలియని కాలంలో ఆర్యావర్తమైన ఈ దేశంలో గొప్ప నాగరికత వెలిసింది. అపౌరుషేయమైన వేదం కంటే మిన్న అయినా గ్రంధం లేదు. మన మతాన్నీ, మన ధర్మాన్నీ వదిలి మనం భ్రష్టులం అవుతుంటే - వాటితో విదేశీయులు లాభం పొందుతున్నారు. మనం మేల్కొనకుంటే మన మతం ఈ రాజ్యంలో లేకుండా పోతుంది. కాబట్టి, మీరు ఈ విషయంలో నాతో సహకరించాలి. వేద మతాన్ని కాపాడాలి."
రెడ్డిగారు ఆయన చెప్పిందేమీ విన్నట్లు లేదు.
"అచ్చా! మీరేం చేస్తరు?" అడిగారు.
"శుద్ది చేస్తాం."
"అంటే!"
"హోమంచేసి తురకలుగా మారినవారిని మళ్ళీ హిందువుల్ని చేస్తాను"
"ఊహు. అయితే ఏం లాభమైతది"
అలాంటి ప్రశ్నను ఎదుర్కోవడానికి సిద్దంగా లేడు నరేంద్రజీ. లాభమంటే ఏమిటో అతనికి అర్ధంకాలేదు. కాస్త ఆలోచించి "దొరవారూ! తరకలు కాకుండా వుంటేనే ఈ మాల మాదిగలు మీ చేతుల్లో ఉంటారు. తురకలైతే రాజులమైపోయామనుకుంటారు. మీ మాట వినరు, వెట్టిచేయరు. ఆ విధంగా మీకు నష్టం కలుగచేస్తారు" అన్నాడు.
"హు. మీకు రామారెడ్డి సంగతి ఎరికే లేనట్లున్నది. నా పేరు చెప్పితే ఉచ్చపడ్తది లంజకొడుకులకు. ఇంక నా మాట ఇనరనుకుంటాన్నారు? వాండ్లు తురకోండ్లయిన, బాపనోండ్లయిన, నేను ఎట్ల దున్కమంటే అట్లు దున్కాలే - ఎరికేనా?" అన మీసం మెలేశారు రెడ్డిగారు.
'మీ అధికారం తక్కువగా ఉన్నదని కాదు నేననడం. ఇవ్వాళ నీ బాంచను, నీ కాల్మొక్తనని చేసేవాడు, రేపు మీకు భయపడి చేస్తాడు. మీరొక దెబ్బ కొట్టినా, తన్ను తన్నినా పోలీసుల వద్దకు వెళ్ళాడనుకోండి. వాడిమాటే వింటారు పోలీసులు కాని, మీమాట వినరు. అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి. మీ అధికారానికి భయపడి ఈ కొత్త తురకలిలా ఉన్నారు కాని వేరే చోట్లలో ఎన్ని మోరాలు చేస్తున్నారో తెల్సునా! తురకలు కాగానే బావులు ముట్టుకుంటున్నారు. ఊళ్ళోవాళ్ళేమైనా గడిబిడిచేస్తే బాపుల్లో ఆవు మాంసం వేస్తున్నారు. చచ్చిన జంతువుల్ని మేం తీసెయ్యమంటే బ్రాహ్మణులు తీసుకోవాల్సి వస్తున్నది.
"సత్యాపురం వెళ్ళాను, మహబూబ్ రెడ్డిగారి దగ్గరికి. వారు పూర్వపు మాదిగవాణ్ని పిలిపించారు. వాడు వచ్చి, ఎందుకు పిల్చారని అడిగాడు. చచ్చినగొడ్డును తీసికెళ్ళమన్నారాయన. వాడేమన్నాడో తెలుసునా? "ఏమయ్యో రెడ్డాయన! చచ్చినగొడ్లం తీస్కపోవడాన్ని తురకల్ల కల్సినమనుకున్నావా? సర్కారు మాది, ఎరికెనా నీకు?" అని.
"మహబూబ్ రెడ్డిగారు కొద్దిగా కోపంచేస్తే, "ఏం చేస్తవయ్యానువ్వు? నేనేం మాదిగోన్ననుకున్నావా? తురకోన్ని" అని వచ్చి మా పక్కనే కుర్చీమీద కూర్చున్నాడు. మహబూబ్ రెడ్డిగారు ఎంత పెద్ద జమిందారో మీ కెరుకే కదా? అంతవాడూ ఏమీ చేయలేకపోయాడు. తెగబడ్డవాణ్ని ఏం చేస్తాం చెప్పండి? అలాంటి వారందరికీ నచ్చచెప్పి హిందువుల్ని చేశాను. ఇప్పుడు రెడ్డిగారెలా చెపితే అలా వింటున్నారు పనిపాటలవాళ్ళు" అని రెడ్డిగారు ముఖంలోకి చూచాడు నరేంద్రజీ.
మహబూబ్ రెడ్డిగారి పేరు విని కొద్దిగా కరిగారు రామారెడ్డిగారు.
"సరేగాని, మీరేమో జంధ్యమేసి, మంత్రంచెప్పి, బాపన్లను చేసి నెత్తికెక్కించుకుంటరట కద?"
"అదేం లేదు. వారిని శుద్దిచేసి వారి పూర్వపు పేర్లు వారికి పెట్తాను అంతే."
"అచ్చ. అట్లయితే సరేగాని ఏం కావాల్నంటరు?"
"హోమంచేయడానికి స్థలం కావాలి. సమిధలు, నెయ్యి కావాలి."
"ఇదిగో చూశిన్రా, ఈడ జాగెవ్వడియ్యడు. నెయ్యి ఎవ్వడియ్యడు. అవ్వేమిలేకుండ చేస్తమంటరా -రేపొద్దుగాల చేసి గమ్మున బైటపడురి. గడీల కొచ్చినట్లు ఎవ్వరికి ఎరికే కావద్దు. రాత్రికి వంటకు గుళ్ళ ఇంతేజామ్ చేసుకోరి. మీ ఇష్టం."
"మంచిదండీ. అలాగే ఏర్పాటు చేసుకుంటా, మరి శలవా?"
"అచ్చా. పోయిరాండ్రి, ఈడకొచ్చినట్లు ఎవరికన్న ఎరికే కానిచ్చేరు. ఖాస్కర్ (ముఖ్యంగా) కరణాన్కి" అయింది. చంద్రుడు ఉదయించాడు కూడ. ఆయన స్వయంగా వెతుక్కుంటూ పుల్లయ్య గుడిసెకు చేరి పిలిచాడు. అతడు గూడానికి రావడమే ఆశ్చర్యమనిపించింది అందరికీ. అందరూ దర్వాజాల్లో వచ్చి నుంచొని చూడసాగారు. పుల్లయ్య బైటికి వచ్చాడు. నేలకు తల ఆనించి దండం పెట్టాడు. నరేంద్రజీ రాకకుగల కారణం తెలియజేశాడు.
"దొరా! నువ్వు దేవునోలె వచ్చినవు. మా దొరతో చెప్పినం నిన్ను పిలిపించమని. మమ్మల్ను కులంల కలుపురి, నీ బాంచను" అని మళ్ళీ దండం పెట్టి "మా గూడెంల కొచ్చిన్రు ధర్మదొరలు. మంచమేస్తె కూర్చుంటారా? జర సేపట్ల అందర్ని పిల్చుకొస్త" అన్నాడు.
"పుల్లయ్యా! నేను బ్రాహ్మన్ని. అయినా, మనమంతా ఒకటే. ఒకే మతానికి చెందినవాళ్ళం - హిందువులం. మీ మంచంమీద కూర్చోవడం కాదు, మీ ఇంట్లో తింటాను. దప్పికగా వుంది కాసిన్ని నీళ్ళివ్వు. తరవాత మంచం వెయ్యి. కూర్చుంటా. అందర్నీ పిలువు - ఈ రాత్రికి మిమ్ములను హిందువులనుచేసి వెళ్ళిపోతా" అన్నాడు నరేందర్ జీ.