అలెక్స్ కళ్ళు, కావలసిన వ్యక్తి కోసం గాలిస్తున్నాయి. అతను పావుగంట కష్టపడిన తరువాత ఓ వ్యక్తిని ఎన్నుకున్నాడు.
అలెక్స్ అతన్ని పరిచయం చేసుకొని మాటల్లో పెట్టాడు.
అతని పేరు బైరాగి, పేరుకు తగినట్లుగా ఉన్నాడు. అలెక్స్ వెంటనే విషయంలోకి రాలేదు. బైరాగితో చనువు పెరిగిందనుకున్న తరువాత అసలు విషయంలోకి వచ్చాడు.
"మీరు బయట ఓ పదినిమిషాలు వెయిట్ చేయకూడదూ. మనం బయట మాట్లాడుకోవచ్చు వివరాలు" చాలా తాపీగా సమాధానం చెప్పాడు బైరాగి.
విషయం అర్ధమైయింది తన నుంచి బైరాగి ఏదో ఆశిస్తున్నాడు. తనకి అతనందించే వివరాలే ముఖ్యం. అందువల్ల సరేనని ఒప్పుకున్నాడు అలెక్స్.
"ఎక్కడ వెయిట్ చేయను?" ప్రశ్నించాడు.
"బయట బస్ స్టాప్ వుంది, అక్కడ వెయిట్ చేయండి. నేనోచ్చేసరికి పది పదిహేను నిమిషాలన్నా పడుతుంది"
బయట వున్న ఆటోలో కూర్చుని వెయిట్ చేయసాగాడు బైరాగి కోసం.
బైరాగి చెప్పిన టైం కన్నా అయిదు నిమిషాలు ఆలస్యంగా వచ్చాడు.
బైరాగి ఆటోలో కూర్చున్న అలెక్స్ ని చూడలేదు.
అలెక్స్ ని చూసిన వెంటనే అతనే వచ్చి ఆటోలో కూర్చున్నాడు - అలెక్స్ బైరాగి ఆటోలో కూర్చోవటాన్ని రెండు కళ్ళు నిశితంగా గమనించాయి.
"మనం ఇక్కడ కన్నా ఇంకెటైనా వెళ్ళి మాట్లాడుకోవడం మంచిదేమో" అనుమానాన్ని వ్యక్తం చేశాడు బైరాగి.
"సరే. అలాగే"
అలెక్స్ ఆటోని ముందుకు పోనియ్యమని చెప్పటంతో ఆటో కదిలింది.
ఓ పది నిముషాల్లో తనకు తెలిసిన వివరాలన్నీ చెప్పాడు బైరాగి.
బైరాగి ఆటో ఆపమని సైగ చేసి దూరంగా కనిపిస్తున్న హాస్టల్స్ ని చేతితో చూపించాడు.
అతను అలా చూపించి మరికొన్ని వివరాలు చెప్పాడు.
బైరాగి చెప్పిన వివరాల్ని జాగ్రత్తగా విన్నాడు అలెక్స్. అతను అక్కడనుంచి నడిచి వెళ్లిపోతానని చెప్పటంతో రెండు పచ్చనోట్లని తీసి బైరాగి చేతిలో కుక్కాడు అలెక్స్. డబ్బుని చూసిన బైరాగి మరికొన్ని వివరాలు చెప్పటానికి సిద్ధపడ్డాడు.
"మీకింకా ఏవన్నా ఇన్ ఫర్ మేషన్ కావలసి వస్తే తెలుసుకుని ఓ గంటలో మీరున్న హోటల్ కి ఫోన్ చేసి చెబుతాను"
"సరే! అయితే ఫోన్ చేయి. నీకోసం వెయిట్ చేస్తుంటాను. ఒక హోటల్ పేరు రూమ్ నంబర్ చెప్పాడు. బైరాగి దగ్గర సెలవు తీసుకుని ఆటోని పోనియ్యమన్నాడు అలెక్స్. ఆటో సరాసరి ఒక స్టార్ హోటల్ ముందు ఆగింది. ఆటోకి డబ్బులు ఇచ్చేసి హోటల్లోకి అడుగుపెట్టాడు అలెక్స్.
అంతకు మునుపే కస్వప్ పేరు మీద రూమ్ బుక్ చేయటంతో అలెక్స్ కి రూమ్ నెంబర్ చెప్పి రూమ్ కీస్ ఇచ్చింది రిసెప్షనిస్ట్.
అతను రూమ్ కీస్ తీసుకుని ప్రక్కనే వున్న లిఫ్ట్ దగ్గరకు నడిచాడు. బటన్ నొక్కి లిఫ్ట్ కోసం వెయిట్ చేయసాగాడు. నిముషం తరువాత లిఫ్ట్ ఆగింది. అందులోంచి ఒక అందమైన అమ్మాయి దిగింది. ఆమె సౌందర్యం అతన్ని కదలనివ్వలేదు. ఆమె రాసుకున్న ఫ్రెంచ్ ఇంటి మోట్ అతన్ని మత్తెక్కించింది. రెప్పవేయకుండా రెండు నిముషాలు ఆమెను చూస్తూ నిల్చుండిపోయాడు. ఆమె కూడా ఓ క్షణం అతని వైపు చూసి వెళ్ళిపోయింది. అతడికి గనుక ఆ క్షణం ఎస్సైన్ మెంట్ ఏది లేకపోయి వుంటే ఆమెను అనుసరించే వాడే కాని అతనికి తన పని గుర్తుకొచ్చి లిఫ్ట్ లోపలికి అడుగువేశాడు.
రూమ్ లో అడుగు పెట్టేవరకు ఆమె గురించి ఆలోచిస్తూ గడిపాడు. నిజానికి ఆమె గురించి అతనికి ఏ మాత్రం తెలియదు. తెలిసుంటే అతడామెను అనుసరించి వుంటే అతని పని మరింత సులభమయ్యేది.
రూమ్ లోకి వెళ్ళిన తరువాత టైం చూసుకున్నాడు. ఒక బ్లాక్ టీ ని తెప్పించుకొని రాబోయే ఫోన్ కాల్ కోసం ఎదురు చూడసాగాడు. మధ్యమధ్యలో లిఫ్ట్ దగ్గర చూసిన అమ్మాయి గుర్తుకొచ్చింది. అతనికున్న వీక్ నెస్ అది. ఎంత ప్రయత్నించినా మానుకోలేకపోతున్నాడు.
అరగంట గడిచిన తరువాత అతనాసించిన ఫోన్ వచ్చింది.
"హలో..... కస్యప్..... నేను బైరాగిని" బైరాగి కంఠం వినిపిస్తుంది.
అలెక్స్ కి సమాధానంగా తన పేరు చెప్పడం ఇష్టం లేదు అందువల్ల సమాధానంగా.
"యస్ నేనే మాట్లాడుతున్నాను.... వివరాలు తెలుసుకున్నావా! ప్రశ్నించాడు అలెక్స్.
అవతలి వైపు నించి క్షణం సేపు నిశ్శబ్దం తరువాత బైరాగి కంఠం వినిపించింది.