ముందుగా వాళ్లు చూపించిన రైన్ కోటు వ్యక్తిని వెదికి వీలైనంత తొందరగా అతన్ని మట్టుపెట్టాలి.
ఇంతకీ ఆ వ్యక్తి ఎక్కడున్నట్లు ...?
ఏం చేస్తున్నట్లు ...? ఆలోచనలకి స్వస్తి చెప్పి బైక్ ని స్టార్ట్ చేసి మెయిన్ రోడ్ మీదుగా పోనిచ్చాడు మిత్రా.
వర్షంలో కూడా మిత్రా వేగంగా నడుపుతున్నాడు అతని హోండా మోటార్ సైకిల్ ని. అతని దృష్టి ప్రస్తుతం అజ్ఞాత వ్యక్తి మీద వుంది. కళ్ళు వేగంగా కదులుతున్నాయి పరిసరాలని గమనిస్తూ.
ఎవరైనా రెయిన్ కోటులో కనిపిస్తే మాత్రం స్లో చేసి చూస్తున్నాడు.
వర్షం నెమ్మదిగా తగ్గసాగింది. జట్లగా కురుస్తుంది.
మిత్రాలో టెన్షన్ చోటు చేసుకుంది. వర్షం కురుస్తుండగా మాత్రమే ఆ రెయిన్ కోటు వ్యక్తి రెయిన్ కొటులో వుంటాడు. లేకపోతే అతన్ని పట్టుకోవటం మరింత కష్టమవుతుంది.
మిత్రా దాదాపు ఆ ప్రాంతాలంతటిని పూర్తిగా వెదికేశాడు అతనికి కావలసిన వ్యక్తి మాత్రం దొరకలేదు.
ఇద్దరు ముగ్గురు రెయిన్ కోట్ వేసుకువెళుతున్న వ్యక్తుల్ని మిత్రా గమనించాడు కాని వాళ్లు అతను వెతికే వ్యక్తి కాకపోవటంతో తన ప్రయత్నాన్ని తిరిగి ప్రారంభించాడు మిత్రా.
మిత్రాకి రెయిన్ కోటు వ్యక్తి బాగా గుర్తున్నాడు. అతను ఎవర్నీ అంత తేలికగా మర్చిపోడు.
భారీగా వుండే పర్శనాలిటి. ప్రత్యేకించి దూరానికి కూడా కొట్టొచ్చినట్లు కనపడే స్పోటకం మచ్చలు, నడకలో కూడా వేగం వుంటుంది, ఆ వేగంలో అదో రకమైన స్టయిల్.
అతనేక్కడున్నా గుర్తుపట్టవచ్చు అనుకున్నాడు మిత్రా.
మిత్రా రెండు గంటలు విరామం లేకుండా వెదికిన తరువాత అతని కృషి ఫలించింది.
మిత్రా ఎవరికోసం వెతుకుతున్నాడో ఆ వ్యక్తి దూరంగా రోడ్డికి కొంచెం వారగా ఒక బట్టల షాప్ ముందు నిలబడి వున్నాడు. అతను ఎవరి కోసమో ఎదురు చూస్తున్నట్టు కనిపించాడు.
మిత్రాకి అంతదూరంలోను అతని మోహంలో మొరటుతనం కనిపించింది ఈ వ్యక్తినా తను చంపబోయేది అనుకొని కాస్త జంకాడు. దూరంగా బండి మీద నుంచే ఆ వ్యక్తిని చూస్తూ కూర్చున్నాడు మిత్రా. ఆ వ్యక్తిని ఎలా పలకరించాలో తెలియలేదు మిత్రాకి. వర్షం తగ్గటం వలన నెమ్మదిగా జన సంచారం మొదలయింది.
రెయిన్ కోటు వ్యక్తి మిత్రావైపు రెండు మూడుసార్లు చూడటంతో అతనికి అనుమానం కలగకుండా ఉండటం కోసం ప్రక్కనే ఉన్న టీ స్టాల్ లో దూరి, ఓ కప్పు టీ ఆర్డరిచ్చి నాలుగు చుక్కలు సిప్ చేశాడు. చలి దిగిపోయి నరాలు కాస్త వేడెక్కాయి. త్వరగా బిల్ పే చేసి బయటికి వచ్చేసరికి.
రెండు క్షణాల్లో అతను మాయమయ్యాడంటే....? ఛ-డా-మి-ట్.... తనంత దురదృష్టవంతుడు ప్రపంచంలో మరొకడు వుండడనిపించింది మిత్రాకి. చేసేది లేక వెళుతున్న వెహికిల్స్ వైపు చూశాడు మిత్రా. కనుచూపు మేరలో ఒక కారు వెళుతుంది. కారుకన్నా ముందు రెండు లారీలు, ఒక నాలుగైదు స్కూటర్లు, మోటార్ సైకిళ్ళు కనిపించాయి.
కొంపతీసి, వెళ్ళే వెహికల్స్ లో వెళ్ళిపోలేదు కదా ఆనుకుని వెళుతున్న కారులోకి దృష్టి సారించాడు మిత్రా.
వర్షం కారు అద్దాలమీద పడటం వలన లోపల ఏమిటున్నది సరిగా తెలియటం లేదు. దూరానికి మాత్రం లోపల ఎవరో కూర్చున్నట్లు అనిపించింది. ఒకవేళ అజ్ఞాత వ్యక్తి ఏ స్కూటర్ మీదో వెళ్ళినట్లయితే తనకి కనిపించేవాడు. అతని వాలకం చూస్తుంటే లారీల్లో వెళ్ళే అవకాశం లేదు.
ఖచ్చితంగా కారులోనే వెడుతుండాలి అనుకొని బైక్ ని స్టార్ట్ చేసి వేగంగా పోనిచ్చాడు మిత్రా.
అంత వేగంతో వెళ్ళటం వలన కారుని కలుసుకోవటానికి మూడు నిముషాలకి మించి ఎక్కువ పట్టదు.
* * *
అలెక్స్ ఎక్కిన ఆటో యూనివర్సిటీ కేంపు ముందు ఆగింది.
ఆటో డ్రైవర్ని తనోచ్చేవరకు వెయిట్ చేయమని చెప్పి యూనివర్సిటీ కేంపలోకి అడుగుపెట్టాడు.
అక్కడ వాతావరణం ప్రశాంతంగా వుంది.
స్టూడెంట్స్ ఎంతోమంది లేరు. వున్న పదిమందిలో ఇద్దరు ముగ్గురు కలసి ఒక గ్రూప్ గా చేరి ఏదేదో మాట్లాడుకొంటూ వాళ్ళ ధ్యాసలో వాళ్లు వున్నారు.
అలెక్స్ కి కావలసింది కూడా అదే.
అక్కడ తనకు కావలసిన వ్యక్తి దొరకకపోవడంతో యూనివర్సిటీ లోపలకు అడుగుపెట్టాడు.
లోపల నిశ్శబ్దంగా వుంది. అసలు మనుషులు అలికిడి లేదు. అక్కడక్కడా వున్న స్టూడెంట్స్ ఎవరి పనుల్లో వాళ్లు బిజీగా వున్నారు.