Previous Page Next Page 
రీవెంజ్ పేజి 16

       "మీరడిగిన కొన్ని వివరాలు తెలిపాయి."

    "అతను వుండేది యూనివర్శిటిలోని ఇంజనీరింగ్ హాస్టల్, బ్లాక్ నెంబర్ రెండులో రూమ్ నెంబర్ నలభై ఒకటి, అతని పేరు చంద్రశేఖర్."

    "అతను...." ఇంతలో లైన్ కట్టైన చప్పుడు అలెక్స్ కి ఏమైంది అర్ధంకాక పదిహేను నిమిషాల వరకు ఎదురు చూశాడు.

    బైరాగి నుంచి మళ్ళీ ఫోను రాలేదు.

    బహుశ ఎవరైనా గమనిస్తూతన లైన్ కట్ చేశాడేమో అనిపించింది. గంట గడిచినా మరల ఫోన్ రాకపోవడం అతని కేదో జరిగివుంటుందని ఊహించాడు.

    వెంటనే యూనివర్శిటికి వెళ్ళి ఏం జరిగింది తెలుసుకోవాలనుకొన్నాడు అలెక్స్. ఇంతవరకూ తనకు బైరాగి ఇచ్చిన ఇన్ ఫర్ మేషన్ చాలు తన పనికి ఉపయోగపడటానికి. అనవసరంగా అటువెళితే లేనిపోని చిక్కులెదురవచ్చనిపించి అతను చెప్పిన వివరాల్ని మరోసారి మననం చేసుకుని హోటల్ బయటికి అడుగు పెట్టాడు అలెక్స్.


                                                          *        *        *


    ఆగది చీకటిగా ఉంది.

    కరెంట్ లేకపోవటం వల్లకాదు, ఆమెకు చీకటంటే ఉన్న ఇష్టం వల్ల. చీకటిగా ఉన్న ఆ గదిలో "మిల్ తీ హై జిందగీమే మొహబత్ కభీ, కభీ" అనే లతామంగేష్కర్ పాట మంద్రంగా వినిపిస్తోంది.

    గ్లాస్ విండోస్ తీసి ఉంచటం వల్ల రూమ్ లోకి చల్లనిగాలి ప్రవేశిస్తుంది. గాలికి కర్టెన్స్ అలలు అలలుగా కదులుతున్నాయి. ఆ రూమ్ లో మెయిన్ డోర్ కి అడ్డంగా ఒక చైర్ వేసివుంది. అక్కడి నుంచి చూస్తే రోడ్డు మీద వున్న జనం స్పష్టంగా కనపడతారు. ఆ రూమ్ మేడ మీద ఉండటం వల్ల దూరంగా వున్న ప్రదేశం కూడ కనపడే అవకాశం వుంది.

    చైర్ లో కూర్చుని రోడ్డుమీద ఉన్న జనాన్ని చూస్తుంది ఆమె.

    ఆమె పేరు సౌందర్యరేఖ.

    బుజాల వరకు కత్తిరించబడిన జుట్టు. స్వచ్ఛంగా కనపడే కళ్ళు. చిన్న పెదవులు. ప్రత్యేకించి సన్నగా మృదువుగా అనిపించే మెడ. ఆ మెడ క్రింద నున్నగా ఉన్న బుజాలు మాటలకందని సౌందర్యం.

    ఆమె పోస్ట్ గ్రాడ్యేషన్ ముగించిన తరువాత ఒంటరి జీవితాన్ని గడుపుతుంది.

    ఆమె చాలామందికి ఓ కొచ్చన్ మార్క్.

    కృష్ణవేణి అపార్ట్ మెంట్స్ ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటే ఆమె నెలకి పదిరోజులు మాత్రమే అక్కడ కనిపిస్తుంది. మిగతా రోజుల్లో ఎక్కడుంటుందో ఆమె ఏం చేస్తుంది ఎవరికీ తెలియదు.

    ఆమె అందంగా మాట్లాడగలదు. కాని ఎదుటి వ్యక్తితో వీలయినంత తక్కువగా మాట్లాడుతుంది అవసరానికి మించి మాట్లాడదు.

    మ్యూజిక్ ఆగిపోవటంతో లైట్ వేసి క్యాసెట్ తిప్పి పెట్టి లైటార్పి మరల కుర్చీలో వచ్చికూర్చుంది.

    ఆమె అలా కూర్చోని అప్పటికి మూడు గంటలు కావస్తుంది.

    ఆమె ముఖ్యమైన వ్యక్తికోసం ఎదురు చూస్తుంది. అందువల్ల అలా కూర్చోవటం బోరనిపించలేదు.

    ఆమె మరోగంట ఓపికగా వెయిట్ చేసిన తరువాత ఆటో ఒకటి అపార్ట్ మెంట్స్ ముందు ఆగింది. ఆటో లోపలినుంచి ఓ భారీ ఆకారం దిగింది. ఆ ఆకారం చుట్టూ ఓసారి పరికించి ఫస్ట్ ఫ్లోర్ వైపు కదిలింది. పైనుంచి వస్తున్న వ్యక్తిని చూసి కుర్చీలోంచి లేచి తలుపు తెరవటానికి సిద్ధమైంది సౌందర్యరేఖ.

    కాలింగ్ బెల్ మ్రోగిన చప్పుడికి తలుపు తెరిచింది ఆమె.

    వచ్చిన వ్యక్తిని చూసి ఆప్యాయంగా కౌగిలించుకొని అంకుల్ అందామె.

    రూమ్ లోని లైట్స్ వేసి తలుపులు మూసిందామె.

    ఆమె కళ్ళనుంచి జరుతున్న కన్నీటి బిందువుల్ని సుతారంగా వేలితో పక్కకు తొలిగించాడా వ్యక్తి.

    ఆమె అంతవరకు ఎదురు చూసిన వ్యక్తి పేరు బలరామ్.


                    *        *        *


    మిత్రా ఛేజ్ చేస్తున్న కారు దగ్గరయ్యే టెన్షన్ గా ఫీలయ్యాడు.

    కారుని సమీపించి ఆత్రుతతో కారులో వున్న వ్యక్తిని చూసి నీరు గారిపోయాడు మిత్రా. డెబ్భైకి పైబడ్డ ముసలివ్యక్తి కారు వెనక సీట్లో కూర్చుని తాపీగా భగవద్గీత చదువుకుంటున్నాడు. మిత్రాకి ఒక్కసారిగా నీరసం ముంచుకు వచ్చింది. చేసిన తప్పు అర్ధమైంది. హడావుడిలో పడి చుట్టు పరిసరాల్ని అతను సరిగా గమనించ గుండావచ్చేసాడు. అతను సరిగా గమనించలేదు గాని ఆ సమయంలో రైన్ కోటు వ్యక్తి వెహికల్ లోనూ ఎక్కలేదు. మిత్రాకొక ఆలోచన వచ్చింది. ఇంతవరకు చూసిన ప్రదేశం చుట్టుప్రక్కలే ఆ వ్యక్తి ఉంటాడేమో అనిపించటంతో మళ్ళీ వెనకకు తిరిగాడు.

    సరిగా అతను అంతక్రితం రైన్ కోటు వ్యక్తిని చూసిన స్పాట్ కి వచ్చాడు.

    ఆ ప్రదేశం ఊరికి కొంచెం దూరంగా ఉండటం వలన నెమ్మదిగా అప్పుడే డెవలప్ అవుతోందక్కడ.

    మిత్రా ఉన్న ప్రదేశంలో ఎదురుగా ఓ చిన్న బట్టలషాపు పక్కనే ఓ వైన్ షాపు ఉన్నాయి.

 Previous Page Next Page