మాధవ్ రాదని పెళ్ళాడడానికి నిర్ణయించుకుని, తండ్రితో ఘర్షణ పడ్డాక వేరే యిల్లుకోసం వెతికి ఈ యిల్లు అద్దెకు తీసుకున్నాడు. తామిద్ధరికి కాలేజీకి దగ్గిర. తామిద్దరూ యింట్లో వుండరు కనక యింటి సాయానికి, పాలు అవి పోయించుకోవడానికి, ఏ సలహాకన్నా పెద్దావిడ పార్వతమ్మ అండగా వుంటుందని వెంటనే అంగీకరించి, పెళ్ళికి ముందే ముఖ్యంగా కావాల్సిన సామానంతా కొని వుంచాడు. అతనూ శారదని చూసి ఏమిటీ అమ్మాయి యిలా వుంది అనుకున్నాడు గాని అప్పుడంతగా పట్టించుకోలేదు.
పెళ్ళిరోజు తల్లీ కూతుళ్ళ అభిమానం చూసి మంచివాళ్ళు, చాలా సహాయంగా వున్నారని మురిసింది రాధ. "చూశావమ్మా రాధా! మా శారద సంబరం, ఇన్నాళ్ళకి దానికి తోడు దొరికావని పిచ్చిది ఎలా సంబరపడి పోతూందో చూడు. ఇన్నాళ్ళు ఎవరో ముసలివాళ్ళు, లేకపోతే చిన్నపిల్లలున్న వాళ్ళు తప్ప, దాని ఈడు వాళ్ళెవరూ లేరు. అందుకే దానికింత సంతోషం.... అంది పార్వతమ్మ. రాధా శారద తోడుగా వుంటుందని సంతోషించింది. కాని ఆ ఒక్కరోజులోనే శారద సంగతి గుర్తించి ఈ అమ్మాయిని ఈ వాగుడుని రోజూ భరించాలా అనుకుంది.
"అక్కయ్యా.....కాఫీ చేసేశాను, బావగారి కిచ్చేయనా..." రాధ బాత్ రూము లోంచి రాగానే యెదురు వచ్చింది శారద.
రాధ చటుక్కున కప్పులు అందుకుని "నే నిస్తాలే, నీవింక యింటికి వెళ్ళమ్మా, నీకు పని వుండదూ, మీ బావగారు మొహమాట పడ్తారు నీవుంటే.....తను చెప్పకపోతే తెల్సుకోలేదని చెప్పింది.
"ఫో - అక్కయ్యా.... యింటికెళ్ళేం చేస్తాను? నీకు పని సాయం చేస్తా కూరలు తరగనా, ఏం టిఫిను చేస్తావు. అవునూ బావగారూ నీవూ నేనూ టిఫిను తిన్నాక పేకాడుదామా ఆదివారంగా యివాళ..."
ఆ పిల్లని యింకేం చెయ్యాలో తెలియక నిస్పృహగా మాధవ్ కి కాఫీ అందించింది. కాఫీ కప్పుతో వెళ్ళి అతన్ని లేపాలని, అతడు కళ్ళు విప్పకుండానే తనని ఒడిలోకి లాక్కుంటాడు, ఇద్దరూ ఒకే కప్పులో తాగేవారు..... ఆమె ఊహలు, ఆశలు చెదిరిపోయాయి.
ఆ రోజే కాదు, తరువాత చాలాసార్లు - చాలా రోజులు, చాలా నెలలు....ఎన్నో యిబ్బందులు కలిగాయి శారదవల్ల.
ఒక్కక్షణం ఇద్దరూ ఏకాంతంగా కూర్చుంటే, "అక్కయ్యా" అంటూ వచ్చేసేది. శలవరోజువస్తే మధ్యాహ్నం హాయిగా పడుకుంటే పేకముక్కలు తీసుకువచ్చి లేపేసేది. వంటింట్లో వుంటే నేను పచ్చడి రుబ్బుతా, కూర వేపుతా- అంటూ వెనకపడేది. హాయిగా మాధవ్ తను కబుర్లు చెప్పుకుంటూ ఈ పని ఆ పని చేసుకోవాలంటే తోకలా వెంటపడే శారదాని చూసి ఏం చెయ్యాలో తెలిసేది కాదు యిద్దరికి. శారద రాగానే మాధవ్ మొహం చిట్లించి పడక గదిలోకి వెళ్ళిపోయేవాడు. "అబ్బ, ఆ అమ్మాయిని అస్తమానం యింట్లోకి రానిస్తావెందుకు?" అంటూ రాధమీద విసుక్కునేవాడు. "అబ్బబ్బ బాలాకుమారిని అనుకుంటుందేమిటి? ఆ పరికణి ఏమిటి, ఆ రెండుజడలేమిటి?" చీదరించుకునేవాడు.
"అదేమిటి మీ చెల్లాయి నన్ను కొరుక్కుతినేటట్లు చూస్తుందేమిటి? ఆ చూపులేమిటి బాబూ" అనేవాడు ఒక్కొక్కసారి హాస్యంగా.
"పాపం పాతికేళ్ళున్నా పెళ్ళిలేదేమో, ఆ అమ్మాయికీ కోరికలుంటాయి గదా, తెలివి తక్కువది కనుక అంతా మొహంలోనే కన్పిస్తూంది...." రాధ సానుభూతిగా అనేది.
ఎంత పని సహాయం అన్నా చేస్తుంది. రోజూ మర్చిపోకుండా సాయంత్రం పూలదండలు గుచ్చిస్తుంది. అక్కయ్యా అంటూ అభిమానంగా వెనక తిరిగే శారదని చూస్తే ఒకోసారి పాపం పిచ్చిపిల్ల అనుకునేది. మరీ ఒక్కక్షణం వదలకుండా, మాధవ్ తో దొరికే ఏకాంత ఘడియలలో ఇద్దరిమధ్య వచ్చే శారదపట్ల కోపం, విసుగు వచ్చేది. సున్నితంగా, చూచాయగా చెప్పినా అర్ధం చేసుకొనేదికాదు. "చూడమ్మా, అలా మేం పడుకుంటే లేవకూడదు. మీ బావగారికి కోపం వస్తుంది. శారదా! బావగారున్నప్పుడు అలా బెడ్ రూములోకి వెళ్ళకూడదమ్మా. చూడు కాలేజినుంచి యింటికి రాగానే చిరాగ్గా వుంటుంది. అలాంటప్పుడు ఎవరన్నా వస్తే చిరాగ్గా వుంటుంది. ఆ టైములో రాకు. మాకు దొరికేది ఆదివారం ఒక్కటే. మధ్యాహ్నంపూట వచ్చి నీవు మాట్లాడితే ఆయన విసుక్కుంటారు. "ఈ కాస్త పనికి నీ సయం ఎందుకు" అంటూ ఎన్నోవిధాల చెప్పినా ఆ పిల్ల తలకెక్కేది కాదు. అటు మాధవ్ విసుక్కోవడం యిటు శారద తెలివితక్కువతనం మధ్య రాధ యిబ్బంది పడేది. ఆఖరికి యిద్దరూ సినిమాకి వెడుతున్నా "అక్కయ్యా, నేనూ వస్తానక్కయ్యా" అంటూ వెంటబడేది. మొదట ఒకటి రెండుసార్లు పార్వతమ్మ ఏం అనుకుంటుందోనని కాదనలేక మొహమాటపడి యిష్టం లేకపోయినా తీసికెళ్ళారు. పెద్దావిడ ఆవిడన్నా కూతుర్ని వాళ్ళిద్దరి మధ్య నీవెందుకే అని మందలించనందుకు యిద్దరికీ కోపంవచ్చింది. "పిచ్చిది, సినిమాలంటే ప్రాణం, నేనా సినిమాలు చూడను. ఒక్కతే వెళ్ళాలంటే దానికి తోచదంటుంది. ఏదో మీరు వెళ్ళినప్పుడు కాస్త దాన్ని తీసుకెల్లండి నాయనా" అంది పైగా, సినిమాకు వేడుతున్నట్లు తెలిస్తే వెంటపడుతుందని ఏ స్నేహితులి యింటికో, బజారుకో అనిచెప్పి వెళ్ళారు కొన్నిసార్లు. "నన్ను తీసికెళ్ళకుండా వెళ్ళిపోయేరే అమ్మా" అంటూ ఒకసారి తెలిసి ఏడ్చినంత పనిచేసింది. "ఎక్కడికెళ్ళినా యిద్దరూ స్కూటర్ మీద వెళ్ళకుండా మధ్య యీవిడెందుకు మనకి" అని విసుక్కునేవాడు మాధవ్. "పాపం, ఒక్కర్తీ వెళ్ళాలట పోనీ రానీండి, ఆటోలో వెడదాం" అని రాధ రెండుసార్లు తీసికెళ్ళింది.
"ఇదిగో ఆ బాలాకుమారి వస్తే నేను రాను. నీవూ ఆవిడా వెళ్ళండి" అనేవాడు మాధవ్ ఆఖరికి. అప్పటినించి దొంగతనంగా వెళ్ళడం ఆరంభించారు యిద్దరూ. తలుపులు తీసివుంటే లోపల జొరబడుతుందని తలుపులు మూసుకుని నిద్రపోతున్నట్టు చడీచప్పుడు లేకుండా పనులు చేసుకునేవారు. ఒకసారి నిద్రపోతుండగా పిలిస్తే రాధ విసుక్కుందని ఏడుపుమొహంతో తల్లికి చెప్పింది.
"అయ్యో, పిచ్చిమొద్దమ్మా అది! మనిషి కనపడితే ప్రాణం పెడుతుంది. ఏదో ఈడుదానీవని నీచుట్టూ తిరుగుతూంది, దాని రాత సరిగా ఏడిస్తే ఈపాటికి పెళ్ళిఅయి పిల్లలతో కాపురం చేసుకునేది. యిలా తోచక వీళ్ళవెంట వాళ్ళవెంట ఎందుకు పడుతుంది" అంటూ నిష్టూరంగా మాట్లాడింది. రాధ ఏదో తప్పు చేసింతలు తలదించుకుంది. అప్పటినించి ఏమన్నా అనాలన్నా భయం. మాధవ్ విసుక్కున్నప్పుడల్లా ఇదెక్కడి బాధ అత్త, ఆడబిడ్డలపోరు లేదనుకుంటే ఈ బెడద ఏమిటనిపించేది.