కాలేజిలో చేరగానే ఒక నెలజీతం అన్నా తీసుకోకముందు , చీరలు, నగలు ఎక్కడనించి వస్తాయి?"
"అలా అని నాకేం తెలుసు....ఈ కాలం ఆడపిల్ల అంత సింపుల్ గా వుండటం ఆశ్చర్యంతో పాటు కుతూహలం కల్గించింది. నీ అందం అంతా నీ కళ్ళు, నీలో వున్న సెక్సీనెస్ అంతా నీ పెదవులవంపు అని చుసిన క్షణంలో గుర్తించాను సుమా.....ఆ క్షణంలోనే మనసు పారేసుకున్నాను."
"ఆ పారేసింది నేను వెతికి జాగ్రత్త పరుచుకున్ననుగా....."రాధ నవ్వింది అతని మెడ చుట్టూ చేతులు బిగించి "మాధవ్.....నాకు దొరికిన ఈ హృదయం నానుంచి ఎప్పుడూ తీసికెళ్ళిపోకు.....ప్రామిస్...." ఆర్తిగా అంటూ అతని మెడవంపులో మొహం దాచుకుంది.
"యూ సిల్లీ .....కావాలని కోరి చేసుకుంది నీకు దూరం కావడానికా?"\
"ఏమో.....ఈ పెళ్ళి మీ వాళ్ళెవరికీ యిష్టం లేదు. అందరినీ కాదని ఎదిరించి చేసుకున్నావు. నాకెందుకో భయం."
"రాధా.....మా తల్లిదండ్రులే కాదు, యింకో తల్లిదండ్రులు మాత్రం జాతి, మతం, కులం తెలియని అనాధ అమ్మాయిని పెళ్లాడడానికి వప్పుకుంటారా? మనం వాళ్ళ వీక్ నెస్ అర్ధం చేసుకోవడానికి ప్రయత్నించాలి. అందులో మా వాళ్ళ చంధసులు.....వంశం, పరువు , ప్రతిష్ట వదులుకోవాలంటే వాళ్ళకీ బాధేగా...."
"అదే నా బాధ....ఈ పెళ్ళితో వాళ్ళు అన్నింటితో పాటు నీకు దూరంయ్యారనే .. నా ఆవేదన. నా అన్నవాళ్ళు లేకుండా పెరిగిన నేను అత్తలో అమ్మని, మామగారిలో తండ్రిని , నీ అన్నదమ్ముల , అప్పచెల్లళ్ళని తోబుట్టువులుగా చూసుకోవాలని మురిశాను."
"ఆ....ఆ....కబుర్లు చాలించు , ఎవరూ లేరని పెద్ద కబుర్లు. నిజంగా వుంటే మీ ఆడవాళ్ళు మూతులు తిప్పుతారు. ఇంతకీ ఈ రాత్రంతా ముచ్చట్లతోనే గడుపుదామా...." మీదకి లాక్కున్నాడు.
"ఏమిటంత గాభరా? ఆర్నెల్లు అగినవారు అరగంట ఆగలేరా" రాధ కోపం నటించింది.
"అరక్షణం కూడా ఆగను...." అంటూ రాధ పెదాలు అందుకున్నాడు.
7
"అక్కయ్యయ్ .....ఓ అక్కయ్యా .....ఏడు గంటలయిపోయింది లేవరేమిటి?' తలుపులు బాదుతూ అరిచింది శారద. ఏ తెల్లవారుజాము మూడు గంటలకో నాల్గుగంటలకో మాధవ్ , రాధ నిద్రలోకి జారి ఆదమరిచి నిద్రపోతుండగా శారద కేకలకి మెలకువ వచ్చింది. ఆరోజు ఆదివారం, కాలేజి లేదు. కొత్త దంపతులని హాయిగా నిద్రపోనీకుండా తలుపులు బాదిన శారద మీద విసుగు కోపం వచ్చాయి ఇద్దరికీ.
"ఊహు....తలుపు తీయకు" అంటూ మళ్ళీ రాధని దగ్గిరకు లాక్కున్నాడు మత్తుగా.
"ఓ అక్కయ్యా....." అంటూ మళ్ళీ బాదింది.
మాధవ్ కోపంగా "ఈవిడగారెందుకు ఉదయమే అలా తలుపులు బాదుతుంది." అంటూ విసుకున్నాడు. రాధ తప్పక లేచి చీర సవరించుకుని , జుత్తు వేళ్ళతో సవరించుకుని తలుపు తీసింది.
"ఎమిటక్కయ్యా .....యింత పొద్దెక్కినా ఆడవాళ్ళు పడుకుంటే యింటికి దారిద్రమంట తెలుసా? చూడు, నేనేప్పుడే స్నానం చేసేశాను. ఏరి బావగారు యింకా పడుకున్నారా!' అంటూ లోపల చొరపడ్తున్న ఆ అమ్మాయిని చూస్తూ విస్తుపోయింది రాధ. నలిగినా పక్క, అడ్డదిడ్డంగా పడుకున్న మాధవ్..... చప్పున ఆమె కంటే ముందు బెడ్ రూము దగ్గిరకి వెళ్ళి తలుపులు చేరేసి "మీ బావగారు యింకా నిద్రపోతున్నారు విసుక్కుంటారు లేపితే...." అంటూ వంట ఇంటివైపు వెళ్ళింది రాధ.
"కాఫీ నే చేసేస్తా అక్కయ్యా! నీవు మొహం కడుక్కురా...." అంది చనువుగా శారద.
ఆ అమ్మాయి చనువు, కలుపుకోరుతనం యింకో అప్పుడైతే రాధకి బాగుండేదేమో కాని, కొత్తగా పెళ్ళి చేసుకుని , మొదటి రోజున తన యింట్లో ఇంకో అమ్మాయి కాఫీ చెయ్యడం ఏమిటి అన్పించింది. ఉదయమే వచ్చిందేమిటి యిలా.....అన్పించి మనసులో విసుక్కుంది. ఏమనలేక ఏమనాలో తెలియక రాధ గాభరా పడింది.
"కాఫీ అది నేను చేసుకుంటా గాని, నేను బాత్ రూమ్ అది వెళ్ళాలి ...." అలా అంటే వెళ్ళిపోతుందేమోనని చూసింది.
అదేం గుర్తించకుండానే "నీ కెందుకక్కయ్యా , నీవు బాత్ రూమ్ లోకి వెళ్ళివచ్చేలోగా నే చేసేస్తాగా" అంది.
నిస్సహాయంగా చూస్తూ రాధ బాత్ రూమ్ లోకి వెళ్ళింది.
ఆ అమ్మాయిని చూడగానే మొదటిసారే రాధ ఆమెకి శరీరం పెరిగినంతగా మెదడు పెరగలేదన్నది గుర్తించింది. పాతికేళ్ళు పైబడిన ముడురుమొహం, వయసుకి మించిన శరీరం, జుత్తులో నేర్సిన వెంట్రుకలు , వేషం మాత్రం రెండు పిలక జడలు, పరికిణి పల్లెవాటు పదహారేళ్ళ పిల్ల ముస్తాబు ......ముద్దులు గునుస్తూ మాట్లాడ్డం.....ప్రతిదానికి అవసరం లేకపోయినా వెకిలి నవ్వు .....ఎప్పుడు ఏది మాట్లాడాలో , నలుగురిలో ఎలా ప్రవర్తించాలో తెలియదని, ముందు రోజే గ్రహించింది రాధ. ఈ వెకిలి పిల్లకి తెలియకపోతే తల్లి చెప్పకూడదూ , అలా ఇంకోరి యింట్లోకి , అందులో కొత్తగా పెళ్ళయిన దంపతుల మధ్యకి వెళ్ళకూడదని అనుకుంది. పార్వతమ్మ గురించి ముందుగానే కొంత చెప్పాడు మాధవ్. ఆవిడ భర్త నాలుగేళ్ళు కాపురరం చేసి ఈవిడకి చెప్పా పెట్టకుండా తన ఆఫీసులో పనిచేసే తోటి గుమస్తా అమ్మాయిని తీసుకొని ఏ వూరో పోయి దేశాలు పట్టి మరి రాలేదని అంతా అనుకుంటారు. ఎడ్డిమడ్డిగా అమాయకంగా వుండే భార్యని , రెండేళ్ళ కూతురిని వదిలిపోయిన ఆ మహానుభావుడు పోతూ పోతూ తండ్రి కట్టించిన యిల్లు, ఓ ఐదువేల రూపాయలు వదిలి పోయడట. పార్వతమ్మ కొన్నాళ్ళు నెత్తినోరు మెత్తుకుని చేసేదేం లేక పిల్లని పెట్టుకుని రెండు గదులలో తానుండి , మిగతా పెద్ద భాగం అద్దె కిచ్చి ఆ అద్దె డబ్బులతో గుట్టుగా సంసారం లాక్కోస్తుందిట. ఈ కూతురు - భారీ శరీరం, వెకిలి ప్రవర్తన చూసి ఎవడూ పెళ్ళాడడానికి ముందుకు రాకపోవడంతో కూతురు పెళ్ళి బెంగతో ఆవిడ సతమతమవుతుంది. ఒకత్తే పిల్ల, భర్త లేకపోవడంతో ఆ పిల్ల ఆడింది అట పాడింది పాటగా పెరిగింది. సెకెండ్ ఫారం ఫేలయి యింక చదవనని యింట్లో కూర్చుని యిక్కడా అక్కడా తెచ్చిన పుస్తకాలు చదువుకుంటూ , వచ్చిన సినిమా అల్లా చూస్తూ చిరుతిళ్ళు తింటూ శరీరం పెంచుకుంటూ హాయిగా తిరుగుతుంది.