Previous Page Next Page 
శుభోదయం పేజి 16


    "అబ్బబ్బ రాధా... మీ చెల్లెలుగారి పోరు తప్పాలంటే యిల్లు ఖాళీ చెయ్యాల్సిందే... కాని... కాలేజికి దగ్గిరగా ఈ మాత్రం యిల్లు మళ్ళీ దొరకదని ఆలోచిస్తున్నాను" అనేవాడు.
    "అబ్బ, వుందురూ... ఏదో కాస్త విసిగించినా రేపు మనకి ఎంతో ఆసరాగా వుంటారు.." రాధ సిగ్గుపడుతూ అంది నవ్వి.
    "మైగాడ్... ఏమిటి... అప్పుడే... నెలకే..." మాధవ్ గాభరాగా అన్నాడు.
    "ఎందుకంత భయం?" చిలిపిగా నవ్వింది.
    "నిజం చెప్పు రాధా!" గాభరాగా అడిగాడు.
    "లేదులెండి... యివాళ కాకపోతే రేపు పిల్లలు పుట్టరా? పుడితే ఎంచక్కా అమ్మమ్మ. పిన్ని లేని లోటు తీరుస్తారు. నిశ్చింతగా వాళ్ళమీద వదలి కాలేజికి వెళ్ళచ్చు. పాపం ఏదో వెర్రివాగుడు వాగుతుంది తప్ప చాలా అభిమానం వుందండి."
    "అయితే ముందే ప్లాన్ వేసి రెడీమేడ్ పిన్నిని తయారుచేసి వుంచావన్నమాట. పిన్నమ్మ వుందికదా అని పిల్లని కంటాననకు అప్పుడే... 'నాడా దొరికిందని ఘోడా' కొన్నట్టుంటుంది. యింకా మనం సెటిల్ అవలేదు. ఒక ఏడాది పిల్లల పర్వం వాయిదావేద్దాం. ఇన్నాళ్ళు యింట్లో వుండేవాడిని ఒక్క వస్తువు కొనుక్కోలేదు. నీవు యింకా పర్మనెంట్ అవలేదు. యీ ఏడాది ఒకరి జీతం యింటి ఖర్చుకి, మరొకరి జీతం యింట్లో వస్తువులకి ఖర్చుపెట్టి అన్నీ సమకూర్చుకున్నాక తీరిగ్గా కందాం పిల్లల్ని. నయమే, జ్ఞాపకం చేశావు... యివాళే టాబ్లెట్స్ తెస్తా."
    "వద్దండి..." రాధ అయిష్టంగా అంది.
    "నెలరోజులకే నామీద యింటరెస్ట్ పోయిందన్నమాట. అప్పుడే పిల్లమీదకి మనసు పోతుందన్నమాట. అయితే మీ ఆడవాళ్ళు... యీ ప్రేమలు అన్ని క్షణికాల్" హాస్యంగా నిష్టూర్యం ఆడాడు.
    "వద్దు మాధవ్. అలా ఎప్పుడూ మాట్లాడకు. చూడు నా గుండెలు చీల్చిచూడు, నీరూపే కనిపిస్తుంది. నా నరనరాల్లో నీ పేరే వినిపిస్తుంది. ఈ శరీరంలో ఏ భాగాన్నయినా చీల్చిచూడు. ప్రతి అంగుళంలో నీమీద ప్రేమ, కృతజ్ఞత కనిపిస్తుంది" రాధ ఆవేశంగా అంది.
    "యూ సిల్లీ... ఏమిటంత ఎమోషనల్ గా మాట్లాడుతున్నావు. హాస్యానికంటే" రాధని దగ్గిరకు లాక్కుని అన్నాడు. రాధ కళ్ళు ఎందుకో చమర్చాయి.
    "మాధవ్! నేనంటూ వున్నన్నిరోజులు నీమీద ప్రేమ పోదు. దుమ్ములో పొర్లాడవలసిన పూవుకి నీ హృదయంలో చోటిచ్చావు. అందుకు కృతజ్ఞతైనా చూపనా మాధవ్! ఈ ప్రపంచంలో నీవు, నీ ప్రేమవుంటే నాకింకేం అక్కరలేదు" మైమరపుగా అంది. మాధవ్ రాధని గట్టిగా గుండెలకి హత్తుకున్నాడు. ప్రేమించడంలో కంటే, ప్రేమించబడటంలో ఎంతో గర్వం, ఆనందం ఉంటుంది అనుకున్నాడు.


                         8


    వారిద్దరిమధ్య ప్రేమానురాగాలు శాశ్వితమని, ఒకరికొకరం అనుకుని మురిసే జంటకి_ అనుకున్నట్లంతా అయితే యింక నా ఉనికిని మీరు విస్మరిస్తారు. మీ జీవితాలు మీ చెప్పుచేతల్లో లేవు నా చెప్పుచేతల్లో వున్నాయి సుమా_ అని నిరూపించడానికన్నట్టు వారిద్దరి జీవితాల్లో మాధుర్యాన్ని హరించి, యిద్దరి జీవితాలమీద విధి దెబ్బ తీసింది.
    ఆరోజు... వాళ్ళ రెండో వెడ్డింగ్ ఏనివర్సరీ! ఆరోజు యిద్దరూ యింట్లో వంట చేసుకోకుండా హాయిగా పెద్దహోటల్లో భోజనంచేసి రెండో ఆట సినిమాకి వెళ్ళి రావాలని ప్లాన్ చేసుకున్నారు.
    తెల్లటి జరీచీర బహుమతిగా తెచ్చాడు మాధవ్. ముత్యాలహారం, ముత్యాల దిద్దులు పెట్టుకుని మెరిసిపోతూంది రాధ తెల్లచీరలో. మాధవ్ కి తెల్లటి పైజమా, లక్నో కుర్తా కొని తెచ్చింది రాధ. ఇద్దరూ కొత్తబట్టలు కట్టుకునీ... పౌర్ణమినాటి ఆ వెన్నెలలో హోటల్లో భోంచేసి స్కూటర్ పై వెళ్ళి సినిమా చూశారు. ఆ ఇద్దరి ఆనందానికి చిన్న కొరతలా వారు కావాలనుకున్నా ఏడాదిగా రాధ కోరిక తీరడంలేదు. "ఒక ఏడాది వద్దన్నారు. చూశారా కావాలన్నప్పుడు పుట్టడానికి మనచేతుల్లో వుందా, వద్దనుకోవడానికి వీలుంది కాని కావాలనుకోవడం మనచేతుల్లో లేదని అర్థమైందా" అంటుంది ఎన్నోసార్లు నిరాశగా.
    మాధవ్ కీ ఇప్పుడు ఇంట్లో పసిపాప కావాలని ఎంతో అన్పిస్తూంది. అనవసరంగా వద్దనుకుని ఆలస్యం అయింది అని అన్పిస్తూంది అతనికీ...రెండేళ్ళు నిండిన ఆ రోజు యిద్దరూ ఎంతో సంతోషంగా తిరుగుతున్నా ఆ వెలితి యిద్దరి మనసుల్లో పూడ్చలేనంతగా అన్పించింది.
    అర్థరాత్రి పన్నెండు అయింది సినిమా విడిచిపెట్టేసరికి_పుచ్చపూవులాంటి వెన్నెల... చల్లటి గాలి వీస్తూంటే స్కూటర్ మీద అతని నడుంచుట్టూ చేయి బిగించి వీపుమీద తల ఆన్చి... "మాధవ..." అంది మత్తుగా.
    "మైగాడ్... నన్ను స్కూటర్ నడపనిస్తావా... యింటికెళ్ళేవరకన్నా ఆగలేవా?" అన్నాడు కొంటెగా.
    "ఛీ... ఫో..." వీపుమీద ముద్దు పెట్టింది రాధ.
    "ఏయ్... ఇది రోడ్డు, ఏమిటా సరసం..."
    "చూడడానికి ఎవరూ లేరులే. మాధవ్... ఈ వెన్నెల, ఈ చల్లగాలి, నీవు... స్వర్గం యింకెక్కడో లేదు మాధవ్..."
    "అబ్బో అమ్మాయిగారికివాళ కవిత్వం వస్తుందే... ఓ... ఓ.. మైగాడ్..."
    స్కూటరు టైరు పంక్చరయి గాలి పూర్తిగా పోయి... యిటుఅటు వూగింది. బ్రేక్ వేసి కాలు ఆన్చి. "హెల్ విత్ ది టైర్... టైరు పంక్చరయింది అమ్మగారూ. దిగండి. దిది వెన్నెలలో విహారం చేస్తూ కవిత్వాలు అల్లండి... మేం స్టెపెనీ వేసేవరకు."
    "అబ్బ అర్థరాత్రి ఏం గొడవ... అసలే నిద్రవస్తుంటే యిదో గొడవ, ఛా.. అదేదో త్వరగా కానీండి..." అంది రాధ.
    మాధవ్ స్టెపినీ తీసి టైరు తీసి మార్చే ప్రయత్నంలో పడ్డాడు. నిర్మానుష్యంగా వున్న రోడ్డులో అక్కడికి కొద్ది అడుగుల దూరంలో కానామీద కూర్చున్న ముగ్గురు మనుష్యులని వీళ్ళు చూడలేదు కాని వీళ్ళని వాళ్ళు చూశారు. లేచి స్కూటర్ వైపు నడిచారు. స్కూటర్ స్టెపినీ బిగిస్తున్న మాధవ్ తనముందు మూడు నీడలు పడడం చూసి తలెత్తాడు. చడీచప్పుడు లేకుండా ఒక్కసారిగా నీడపడేసరికి ఉలిక్కిపడి తలెత్తాడు.
    రాధ కూడా చప్పుడుకి అప్పుడే అటు చూసింది.
    "ఏమయింది?" అందులో ఒకడు అడిగాడు.
    "టైరు పంక్చరయింది. మారుస్తున్నాను" మాధవ్ జవాబిచ్చాడు.
    "సహాయం కావాలా... మీరు లెండి, మేం మారుస్తాం."

 Previous Page Next Page