Previous Page Next Page 
మానవత పేజి 14


    పాల్ సైకిలు పట్టుకొని జానకి వచ్చేదారిలో నుంచున్నాడు. అంతా వెళ్ళిపోయారు. జానకి రాలేదు. చాలాసేపు నుంచున్నాడు. జాడ కనిపించలేదు. ప్రతి అలికిడినీ గమనించాడు. అన్ని దిక్కులూ చూచాడు. అందరినీ పరీక్షించి చూచాడు.
    జానకి జాడలేదు.
    జానకి ఎక్కడా కనిపించలేదు.
    ఉత్సాహంగా వచ్చాడు. ఉరుకులు పెడ్తూ వచ్చాడు.
    నిరుత్సాహంగా వెళ్లిపోయాడు. మెల్లగా సాగిపోయాడు. తోవలో కనిపిస్తుందనుకున్నాడు, కనిపించలేదు. ఆస్పత్రికి వస్తుందనుకున్నాడు. రాలేదు.
    ముకుందంగారికి జ్వరం తగ్గలేదు. ఎక్కువైంది. బాధపడి పోతున్నాడు. జానకి రమాదాసిని పంపింది డాక్టరు దగ్గరికి. రమాదాసి వివరించి చెప్పింది. డాక్టరు మాత్ర ఇచ్చాడు. జానకి తండ్రికిచ్చింది. ముకుందంగారు అడగలేదు ఎక్కడివని, అయినా మింగారు. నీళ్ళు తాగారు. మూడు రోజులకు జ్వరం కాస్త తగ్గుముఖం పట్టింది. బాగా నీరసించిపోయారు. లేచి కాస్త అటూ ఇటూ తిరుగుతున్నాడు.


                                                             11


    చీకటి రాత్రి, ఊరు నిద్రపోతూంది. ఉరుములు, మెరుపులు మొదలయినాయి. ఆకాశంలో కారుమబ్బులు కమ్ముకున్నాయి. చుక్కల వెలుగును మింగేశాయి. చిటపట చినుకులు మొదలైనాయి. క్షణంలో చినుకులు ధారలైనాయి. ఆకాశానికి చిల్లు పడింది. హోరున వాన సాగింది, దొంగలు పడ్డట్టు కురిసింది వాన, వీధుల్లో వరదలు సాగాయి. ఏరు పొంగ సాగింది. పొంగడానికి ఇక్కడి వాన అక్కరలేదు. ఈ వాన కూడా దోహదం చేసింది. ఏరు పొంగింది. గట్లు దాటింది. ఊళ్ళోకి సాగింది చీకటి! నీరు కనిపించలేదు. చల్లగా ఎదిగి వస్తూంది. ఊరు నిద్రపోతూంది.
    ఫాదర్ జాన్ కు మెలకువ వచ్చింది. నీరు కనిపించింది. దిగ్గున లేచాడు. హోరు వినిపిస్తూంది. పాల్ నిద్రపోతున్నాడు. లేపారు ఫాదర్.
    "వాన, వరద, మనం మునిగిపోతున్నాం లే."
    పాల్ లేచాడు. చూచాడు. ప్రళయంలా ఉంది. చప్పున బ్యాన్ అందుకున్నాడు. "నాన్నా నడవండి ప్రళయం వస్తున్నది. ఊళ్ళో ఒకటే మేడ ఉంది. అది చైర్మన్ ది. వెళ్దామా? వస్తారా? అది మనవాళ్ళది కాదుమరి. క్రైస్తవులది కాదు. నీరు ముంచుకొని వస్తూంది. ఏమంటారు?"
    ఫాదర్ జాన్ ఉలకలేదు, పలకలేదు. పాల్ వెంట బయల్దేరాడు. ఏదీ జ్ఞాపకం రాలేదు. గొడుగు, టార్చీ మాత్రం అందుకున్నాడు. గుమ్మం దాటాడు. మెరుపు మెరిసింది. వెలుగు వెలిగింది. వెలుగులో చర్చి కనిపించింది. చర్చి చుట్టూ నీరు చేరింది. చర్చిలోకి జొరబడుతుంది. బొళ బొళా పోతున్నది. ఫాదర్ జాన్ చూపు తిప్పుకున్నారు. ఫాదర్ నీరసంగా ఉన్నారు. ఆరోగ్యం బావుండలేదు. కొడుకుతో కదిలారు. కాస్త తూలారు. డాక్టర్ పట్టుకున్నాడు. కన్ను పొడుచుకున్నా కనిపించడం లేదు. అంతా జలమయంగా ఉంది. ఫాదర్ కు భయంగా ఉంది. ఏరు హోరు వినిపిస్తూంది. అంతా లేచినట్లున్నారు. ఫాదర్ అనుకున్నాడు, తనకు స్థలం దొరుకునా? అంతా నిద్రలోనే ఉంటే బాగుండును, తాను ఒక్కడే వెళ్తే విశాలమైన స్థలం దొరికేది. జబ్బుగా ఉన్నాడు తాను. అసలు చైర్మన్ రానిస్తాడా? తాను ఎన్నడూ సహించలేదు వాళ్ళను. తానే ఎక్కువనుకున్నాడు "చైర్మన్ రానివ్వకుంటే" అడిగేశాడు. పాల్ జవాబు చెప్పలేదు. అతని ఆలోచన మరోవైపు వుంది. జానకి లేస్తుందా? మెలకువ వస్తుందా? మునిగిపోతుందా? భయంకరంగా ఉంది వరద! జానకి మునిగిపోతే? తానేం కావాలి? వరద బాగానే ఉంది. తాను మునగలేడూ! కాదు, జానకిని లేపాలి. రక్షించాలి! వాన. వరద. తడిసిపోతున్నారు. తండ్రిని తీసుకొని సాగిపోతున్నాడు పాల్ జానకి ఇంటివైపు.
    జానకి నిద్రలో వుంది. ఏదో కేక వినిపించినట్లయింది. పాల్ ధ్వనిలా వుంది. దూరం నుంచి కేక వేస్తున్నాడు, పిలుస్తున్నాడు. తననే. అది ఆలాపన. అసలేం లేదు, అయినా మేల్కొంది జానకి. లేచి కూర్చుంది. ఇంకా ఆలాపన వినిపిస్తూనే ఉంది. వినడానికి ప్రయత్నించింది. ఏమీ వినిపించలేదు. హోరు వినిపించింది. కిందికి చూసింది. మంచం కిందికి నీరు వచ్చేసింది. గాభరా పడిపోయింది. "నాన్నా" అని కేక పెట్టింది. కేక వినిపించలేదు ముకుందంగారికి. వారు నిద్రలో ఉన్నారు, ధ్యాసలేదు. గాఢ నిద్రలో వున్నారు. జానకికి భయంగా వున్నది. హోరు! చీకటి! వరద! మంచం దిగింది. తండ్రిని కుదిపింది, లేపింది. ముకుందంగారు కళ్ళు తెరిచారు. చూచారు, అయోమయంగా చూచారు. అర్థంకానట్లు చూచారు. "వాన! వరద! ఇల్లు మునుగుతున్నది." జానకి గాభరాగా అనేసింది. దిగ్గున లేచారు, కూర్చున్నారు. హోరు వినిపిస్తూంది, వరద వినిపిస్తూంది. నీరు కనిపిస్తూంది. ఎలా? ఏం చేయాలి? వణికిపోతున్నారు ముకుందంగారు. "చైర్మన్ మేడ మీదికి నడవండి, త్వరగా." యంత్రవత్తుగా నడిచారు ముకుందంగారు. చీకటి, ఏమీ కనిపించడంలేదు. గుమ్మం వైపు సాగుతున్నారు. గోడ కూలింది. ఆ చప్పుడు వినిపించింది. "దేవుని గది కూలినట్లుంది. విగ్రహాలున్నాయి. ఎట్లా? తెత్తునా?" జానకి అడిగింది. ఖస్సుమన్నారు ముకుందంగారు "నడువ్ జీవన్భద్రాణి పశ్యతి" అన్నారు ముకుందంగారు. తడుముకుంటూ గుమ్మం దగ్గరికి చేరారు. ఎదుట ప్రళయం విలయనృత్యం చేస్తూంది. వానలో సాగిపోవాలి. వెలుగు లేదు.
    "జానకిగారూ!" కేక వినిపించింది. ధ్వని డాక్టర్ పాల్ ది. జానకి ఆశ అంకురించింది.
    వెలుగు పడ్డది. టార్చి వెలుగు. ముకుందంగారి ప్రాణం లేచి వచ్చింది.
    "ముకుందంగారూ! గొడుగు కిందికి రండి" పాల్ అరిచాడు.
    "ముకుందంగారా? మా గొడుగు కిందకి వస్తారా?" ఫాదర్ జాన్ గునిశాడు. ముకుందంగారు వినిపించుకోలేదు. గొడుగు కిందకి చేరారు. ముకుందంగారూ, ఫాదర్ జాన్ కలిసి సాగారు. ఒకరి భుజాల మీద ఒకరు చేతులేసుకున్నారు. జానకి, పాల్ తడుస్తున్నారు. సాగిపోతున్నారు ఒకరి పక్క ఒకరు.
    వాన కురుస్తున్నది. మెరుపు మెరిసింది.
    రెండు జతలు కనిపించాయి.
    గొడుగులో జాన్, ముకుందం! వానలో జానకీ, పాల్.
    కష్టాలు మనుషుల్ని ఏకం చేస్తాయా? మరి సుఖాలు???
    రమాదాసి గుడిసె కురుస్తుంది. మెలకువ వచ్చింది, లేచింది, చూసింది. వరద కనిపించింది. వానలో బయటికి వచ్చింది. ఏసుదాసు గుడిసె వైపు నడిచింది. ఏసుదాసు నిద్రపోతున్నాడు. తడిక తీసింది, లేపింది, లేచాడు, రమాదాసి కనిపించింది. ఆమె చేయి పట్టుకున్నాడు. "వాన, వరద, లోకం మునుగుతున్నదిలే. లే, ఉరుకుదాం" దిగ్గున లేచాడు ఏసుదాసు. ఇద్దరూ బయటికి వచ్చారు. వాన, తడుస్తున్నారు. "డాక్టరయ్య ఎట్లున్నడో? వాండ్లింటికి పోయొస్త." అన్నాడు దాసు. "జానకమ్మ ఎట్లున్నదో? వాండ్లింటికి పోయొస్త" అన్నది దాసి. ఇద్దరూ విడిపోయారు. జానకి ఇంటి దగ్గర కలుసుకోవాలనుకున్నారు. ఏసుదాసు వెళ్ళాడు. పాల్ లేడు. ఫాదర్ లేడు. ఇల్లంతా వెదికి చూచాడు. వానలో బయల్దేరాడు. రమాదాసి వెళ్ళింది. జానకి లేదు. ముకుందం లేరు. ఇల్లంతా వెతికింది. గుమ్మంలో నుంచుంది. ఏసుదాసు వచ్చాడు. చెప్పాడు. రమాదాసి చెప్పింది. నిలువెల్లా తడిశారు. వాళ్ళు వణకడం లేదు. చైర్మన్ ఇంటివైపు వెళ్తున్నారు.
    వాన కురుస్తున్నది. మెరుపు మెరిసింది.
    రెండు జతలు కనిపించాయి.
    గొడుగులో జాన్, ముకుందం! వానలో జానకీ, పాల్!!
    వారు ఆశ్చర్యపడ్డారు ముందు. ఆనందపడ్డారు వెనుక. ఇద్దరూ ఉరికారు. వారిని కలుసుకున్నారు.
    చైర్మన్ ఇంటిముందు సమ్మర్ధంగా ఉంది. సుమారు ఊరు సాంతం అక్కడే చేరింది. కొందరు పేదలు, పాటక జనం ఇళ్ళ కప్పులమీద ఎక్కారు. చీకట్లో కనిపించడం లేదు. వరండాలోకి చేరారంతా. లైట్లు ఏర్పర్చాడు చైర్మన్. జనం తోక్కిసలాడుతున్నారు. మెట్లు ఇరుగ్గా ఉన్నాయి. అందరూ ఎక్కాలని ప్రయత్నం. ఎవరూ ఎక్కలేక పోతున్నారు. చైర్మన్ వారితో సతమతమవుతున్నాడు. వరండాలోకి నీళ్ళు వచ్చేశాయి. నీటిమట్టం పెరుగుతుంది. జనం వణికిపోతున్నారు. ప్రాణాలకై పరితపిస్తున్నారు. ఫాదర్ చూచారు స్థితి. ముకుందం చూశారు పరిస్థితి. ఇద్దరూ అనుకున్నారు తాము ఎక్కలేమని. వరద వస్తుందని_ముంచేస్తుందని.

 Previous Page Next Page