Previous Page Next Page 
జనపదం పేజి 14


    రాముడు ఆ రోజు తిండి తినలేదు. తిన్నాననిపించాడు. ఏదో పాపం చేసినట్లు కుమిలి పోసాగాడు. నిజమే తానూ పాపం చేశాడు. ఈ సొమ్ము కోసం దొంగతనంగా పారి పచ్చాడు. వీరభద్రంతో పోట్లాట పెట్టుకున్నడు. వీరభద్రం ఎంత మంచివాడు! పేదల బాధల్ని గురించి చెప్పాడు. దొరల దౌర్జన్యాన్ని గురించి చెప్పాడు. తనను మనిషిని చేసాడు. నాయకుణ్ణి చేశాడు. నమ్మాడు అతనికే ద్రోహం తలపెట్టాడు తాను.  పాపం మూట కట్టుకున్నాడు . పాపం! పాపం! పాపం!
    రాముడు మళ్ళీ ఆలోచించాడు. పాపం, పుణ్యం ఎక్కడున్నాయి? ఇవన్నీ మాటలు బాపలు కనిపెట్టిన అసత్యాలు. లోకం డబ్బు మీద ఆధారపడి ఉంది. అది ఉంటె పాపం పుణ్యం అవుతుంది. అది లేకుంటే పుణ్యమే పాపం అవుతుంది. తన దగ్గర డబ్బుంది. ఇక దాన్ని వదులుకోడానికి వీల్లేదు. వదులుకుంటే నాశనం అయినట్లే. రెంట చెడ్డ రేవడి అవతాడు. అది నిజమే కాని ఈ బుగులు , ఈ దిగులు ఎట్లా?
    రాముడు అనుకున్నాడు పల్లెలో పాపం దాగదు. పట్నంలో పాపం అనేది లేదు. అక్కడ ఎవరిదారి వారిది. పల్లె వదిలేయ్యలనుకున్నాడు. ఇక్కడ తనకేం ఉంది? పాత వాసనలు, దాసీ పుత్రుడు పట్నంలో తాను దొరనన్నా అడిగినవాడు లేడు. అదే మంచిదనుకున్నాడు. ఒక నిర్ణయానికి వచ్చేశాడు. కాని అప్పటికే సూర్యుడు గుట్ట చాటున చేరాడు.
    రాముడికి ఆ రాత్రి నిద్రపట్టలేదు. తెల్లవారింతరువాత పల్లెలో నిలవలేదు. ఇద్దరు పోలీసులను వెంట పెట్టుకొని స్టేషను చేరాడు. పోలీసులను సంతోష పెట్టాడు. వారికి డబ్బిచ్చాడు. రైలెక్కాడు. పట్నంలో దిగాడు.
    రాముడికి పట్నం అందంగా కనిపించింది. కొత్త అందాలు గోచరించాయి. అతడు బలరామయ్య ఇంటికి వెళ్ళలేదు. హోటల్లో బస చేశాడు. ముందు వేషం మార్చుకోవాలనుకున్నాడు. మంచి దుస్తులు ధరించాలనుకున్నాడు. బజారుకు బయలుదేరాడు. అతనికి ఖద్దరు దుస్తులు నచ్చాయి. వాటిలో ఏదో ఖదర్ గోచరించింది. కొన్నాడు. హోటలుకి వచ్చి దుస్తులు ధరించాడు. టోపీ పెట్టుకున్నాడు. అద్దం చూచుకున్నాడు. అచ్చు బలరామయ్యలాగే ఉన్నాడు తను. ఖద్దరు బట్టలు కొత్త ఠీవి తెచ్చి పెట్టాయి. కొత్త గౌరవాన్ని తెచ్చి పెట్టాయి. చిరునవ్వు నవ్వాడు రాముడు. ఎన్ని పాపలనైనా కట్టి పెట్టగలననుకున్నాడు. ఈ బట్టలు. అందుకే గాంధిజీని గొప్పవాడంటారేమో! అనుకున్నాడు.
    రాముడికి కొత్త ఉత్సాహం ఇచ్చింది . కొత్త ధైర్యం వచ్చింది. అసలు కొత్త జన్మ వచ్చింది. పాత జన్మ తాలుకువి ఏవీ ఉంచదలచుకోలేదు. నగలు బ్యాగులో వేసుకొని బయలుదేరాడు.డబ్బుగా మార్చాడు. హోటలు కు వచ్చి హాయిగా నిద్రపోయాడు. పల్లెలో పట్టుకున్న గుబులు వదిలిపోయింది. పట్నపు గాలి సోకింది. నిద్రలో ఏవేవో కలలు గన్నాడు. అవి అతనికి గిలిగింతలు పెట్టాయి. ఆకాశానికి ఎత్తాయి.
    రాముడు బలరామయ్య ఇంటికి వెళ్ళాడు. బలరామయ్య రాముణ్ణి చూశాడు. పాదాల నుండి తలదాకా కొలచాడు. మండిపోయాడు లోపల్లోపల. తన రోజులే అవుతే అడబాపబిడ్డ ఇంత ధైర్యం చేసేవాడా? ఈ వేషంలో తన ముందుకి వచ్చి బతుకేవాడా?  కాలం మారిపోయింది. ఎంత ధైర్యంగా వచ్చాడు రాముడు! అనుకున్నాడు.
    రాముణ్ణి మరొకసారి చూశాడు బలరామయ్య. రాముడు నంచునే ఉన్నాడు. చేతులో పత్రిక ఉంది. ఇంకా కూర్చోలేదు. కుర్చుంటాడెమో! "ఎప్పుడొచ్చినావ్?" నుంచోపెట్టె ప్రశ్నించాడు బలరామయ్య.
    "వస్తనే ఉంటిని"
    "ఈడికి కాదు ఊర్నించి" కాస్త కరుకుగా అడిగాడు బలరామయ్య. కళ్ళు కొద్దికొద్దిగా ఎర్ర బడుతున్నాయి.
    "నాలుగొద్దులాయే" వినయంగా జవాబు  చెప్పాడు రాముడు.
    "యాడున్నావ్?"
    "హోటల్ల"
    'అంతాదాకా వచ్చినాది? ఈ వేషమేంది?"
    "బట్టలు మంచిగనిపిస్తే ...." తడబడ్డాడు రాముడు.
    "లీడరు వైతవ?"
    "మేమేమైతముండి. దొరలూ కావాలె గాని పట్కాపోతరేమోనని గీ గుడ్డలు కొన్న"
    "బాగానే ఉన్నది బాగోతులేశం" బలరామయ్య కాస్త తగ్గాడు. తనవాడనే వాడు ఈ ఒక్కడే ఆ ఊళ్ళో. వాణ్ణీ దూరం చేసుకోవటం మంచిది కాదనుకున్నాడు . "సరలే లోపలికి పో. హోటల్లెందుకుంటావ్? ఈన్నే దిగు" అన్నాడు.
    రాముడు తల వంచుకొని వెళ్లిపోతుంటే చూచాడు బలరామయ్య. అచ్చం తనలాగే ఉన్నాడు రాముడు. నడక కూడా తనదే. మనసులో ఏవేవో మధుర స్మృతులు మసిలాయి. అమృతవాణి గుర్తుకువచ్చింది. పోయిన దొరసాని, తన కొడుకూ గుర్తుకు వచ్చారు. కళ్ళు చెమర్చాయి. ధోవతి అంచుతో కళ్ళు తుడుచుకుంటుండగా శివరావు వచ్చి నమస్కరించాడు.
    "గాంధీజీ విగ్రహం తయారైందండీ' శివరావు విన్నవించాడు.
    "అయినాది> యాడున్నది చూస్త" ఆతురత వ్యక్త పరిచాడు బలరామయ్య.
    "ఇంకా రాలేదు. వారం రోజుల్లో వస్తుంది. ఊళ్ళో ఏర్పాట్లన్నీ జరగాలి"
    'అదీ సర్లే గానీ ఎప్పుడు పెడదామంటావ్?"
    "గాంధీ జయంతి దగ్గరలోనే ఉంది కదండీ. ఆరోజు అయితే బాగుంటుంది"
    "మంచిమాట చెప్పినవ్. సుందర్రావేమన్నాడు. వస్తాడటనా?"
    "అక్కడకు వచ్చి ఏం పేచీలు పెడతాడో నని నేను అడగలేదండీ . అడుగుతే వస్తాడే అనుకుంటా. కాని ....' అని నసిగాడు శివరావు.
    "ఏందయ్యా చెప్పెడిది ఎన్నడు చక్కంగ చెప్పినవుగనక , సంగతేందో చెప్పు."
    "ఏదో భూదానం, గీదానం అంటున్నాడండి.'
    "అదేంటి? ఏమో కొత్త మాట పట్టుకోస్తివి"
    "అవునండి కొత్త మాటేనండి.అసలు హింసా కండకంతటికీ భూమి ప్రధాన కారణమని అయన సిద్దాంతం. అయితే ఎవరినీ బలవంతం చేయవద్దంటాడాయన. భూమిని మీలాంటి వారినుంచి దానం అడిగి తీసుకుంటాడట.
    "తీసుకొని యావసాయం పెడ్తాడా?"
    "బాగానే ఉంది, తుంటదించి మొద్దు ఎత్తుకున్నట్లున్నది దానాలు గీనాలు శాన చేసినం ఇక చేసేది లేదు"
    "సరే అది మీ యిష్టం. కాని రిపోర్టు నాకు వ్యతిరేకంగా తయారవుతుందని ....'
    'అవ్వయ్యా చూస్తున్నాలే గాని వాళ్ళేమో అంగ్రేజల రాస్తాండిరి. నాకేమో తెల్వదాయే. నీకేంకాకుండ చూస్తలే. బేఫికర్ గుండు నీకెందుకు? అన్నట్లు మరిచిన మీటింగుకు పోవాలె. అగొ పధైంది. జర డ్రైవర్ను పిలువ్."
    శివరావు డ్రైవర్ను పిలవడానికి వెళ్తే రాముణ్ణి పిలిచాడు బలరామయ్య. ఇంట్లోంచి రాముడు, బయట నుంచి శివరావు, డ్రైవరూ ఒకేసారి వచ్చారు.
    శివరావు రాముణ్ణి చూచి ఆశ్చర్యపోయాడు.
    "రామయ్యగారా?" అన్నాడు.
    రాముడు నమస్కరించాడు.
    "ఇల్లిడిచి యాడికి పోకు" అని చెప్పి వెళ్ళిపోయాడు బలరామయ్య.
    రాముడు సోఫాలో కూర్చున్నాడు. అతని బుర్రలో ఏవేవో ఆలోచనలు ముసిరాయి. అనుకోని విధంగా డబ్బు అందింది. అమాంతంగా ధనికుడు అయిపోయాడు. కాని డబ్బుతో ఏం చేయాలి? తానెం కావాలి? ఇంకా ఎంత సంపాదించాలి. ఎలా సంపాదించాలి? తానూ పెరగాలి  పెద్దవాడు కావాలి? తాను మీటింగులకు వెళ్ళాలా? వెళ్ళాలి. అందుకేం చేయాలి? ఏవేవో ఆలోచనలు వచ్చాయి. అంతులేని ఆలోచనలు ముసిరాయి. జేబులోంచి సిగరెట్టు తీశాడు. వెలిగించాడు. పొగతో సహా ఏదో భారం తగ్గు తున్నట్టు అనిపించింది. ఇంకా పీల్చాడు, ఇంకా పీల్చాడు. గట్టిగా దమ్ములు లాగాడు. వంటరితనం భరించలేకుండా ఉన్నాడు. తన ఆలోచనలు ఎవరితో చెప్పుకోవాలి? ఎవరున్నారు తనకు? ఉన్న తల్లి పోయింది. అమృతవాణి పోయింది. ఆ ఆలోచనే ఏదో గుండెలో భారం కలిగించింది. తల్లి ఉంటె ఎంత సంతోషించేదో ! అసలు సంతోషించేదా? మళ్ళీ ఒక ఆలోచనల తంపర. చాయ్ తాగాలనిపించింది. వంట వాణ్ణి పిలిచాడు. వాడు వచ్చి వినయంగా ముందు నుంచున్నాడు. నవ్వు వచ్చింది రాముడికి. తానూ అలాగే నుంచున్నాడు నిన్నటి దాకా. ఎంత మార్పు!
    'చాయ్ చేస్కరా" అజ్ఞాపించాడు.
    వంటమనిషి వెళ్ళిపోయాడు. క్షణంలో తీ తెచ్చి టీపాయ్ మీద పెట్టాడు. వెళ్ళిపోతుంటే పిలిచాడు రాముడు!
    "ఏం సంగతులు?" అడిగాడు . ఎందుకడిగాడో అతనికే తెలియదు.
    "నాకేం తెసుస్తాయ్ దొరా- వండి పెట్టుకునేవాణ్ణి."
    'అంతేగాని నువ్వాన్నుంచి వచ్చినావ్" అదే ఉబుసుపోకకే అడిగాడు.
    "ఇమలమ్మ దొర్సాని పంపింది."
    రాముడి మెదట్లో ఏదో మెరుపు మెరిసింది.

 Previous Page Next Page