ఎటూ తేల్చుకోలేక అయోమయంగా చూస్తూ నిలబడ్డాడు దేశింగ్. అతన్ని ఆ స్థితిలో వుంచేసి నిబ్బరంగా గూడెం వైపు సాగిపోయాడు హరీన్.
గూడెం చేరగానే అతని కళ్ళు ఆదుర్దాగా కరుణకోసం వెదికాయి. కొంతమంది కొండజాతి యువతుల మధ్య కూర్చొని వుంది కరుణ. కొండమల్లెల మధ్య క్రోటన్ మొక్కలా ప్రత్యేకంగా కనబడుతోంది ఆమె. భీతహరిణేక్షణలా తన విశాల నయనాలతో ఆదుర్దాగా అటు ఇటూ చూస్తోంది. హరీన్ కనబడగానే చెప్పలేనంత రిలీఫ్ కలిగింది ఆమెకి. ఒక్క వుదుటులో వచ్చి అతన్ని చేరుకొని, అతని చేతిని గట్టిగా పట్టేసుకుంది.
"హరీన్........." అంది వణుకుతున్న గొంతుతో.
మృదువుగా ఆమె వెన్ను నిమిరాడు హరీన్.
"భయపడ్డావా కరుణా?"
"చాలా భయపడిపోయాను హరీన్! కానీ ఆ భయం నాకోసం కాదు - మీకోసం!"
ఆప్యాయంగా ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని వత్తాడు హరీన్.
"ష్ష్ ష్ష్ ష్ష్........" అని మందలింపు వినబడింది. తిరిగి చూశాడు హరీన్.
అక్కడ చిక్ లీ నిలబడి వుంది. తెనేరంగులో వున్న ఆమె కళ్ళు విషం కక్కుతూ కరుణని చూస్తున్నాయి. హరీన్ తో అంది ఆమె -
"కొత్త ప్రేయసిని చూడగానే మైమరిచిపోయావా హరీన్! మీ నాయనమ్మ అంత్యక్రియలు జరుగుతున్నాయి. మీ పూర్వికుల వేషాలలో వున్న పెద్దలు ఆమె శవం చుట్టూ తిరుగుతూ నిశ్శబ్దనృత్యం చేస్తున్నారు అని మర్చిపోయావా?"
వెంటనే సైలెంటుగా అయిపోయాడు హరీన్. నాయకుడి ఇంటివైపు చూశాడు. ఇంటిముందు భాగంలో నాయకుడి తల్లి శవం వుంది. కొంతమంది ఆటవికులు నక్కలు, ఏనుబోతుల మాస్కులు తగిలించుకుని ఒంటికంతా చిత్రవిచిత్రమైన రంగులు పులుముకుని నిశ్శబ్దంగా నృత్యం చేస్తున్నారు. ఒక మనిషి ముఖానికి మాత్రం పక్షితల మాస్కువుంది. ముసలమ్మ శవం ఆకుపచ్చగా కనబడుతోంది. ఏవో అకుపసరులు పిండి పూసినట్లున్నారు ఆమె శరీరానికి.
ఆ నృత్యం పూర్తీ అయ్యేదాకా కదలకుండా, మెదలకుండా అక్కడే నిలబడిపోయారు హరీన్, కరుణా.
నృత్యం ముగిశాక నాయకుడు వాళ్ళ దగ్గరికి వచ్చాడు. హరీన్ భుజం మీద చెయ్యి వేసి పక్కకి నడిపించుకెళ్ళాడు.
"అయిపొయింది హరీన్! నాకు జన్మనిచ్చిన తల్లి తాను జన్మ చాలించింది. నేను కన్నకొడుకు నా కళ్ళముందే కాలం చేశాడు. కాని నాకు ఒకటే తృప్తి హరీన్! మనవడికోసం తల్లడిల్లిపోయిన నా తల్లి అంతిమక్షణాల్లో నిన్ను చూసి తన మనవాణ్ణీ చూసుకున్నానన్న భ్రమతో తృప్తిగా మరణించింది. తల్లి చివరి కోరిక తీర్చడం తనయుడి భాద్యత హరీన్. మాలో అది ఆచారం కూడా! నా తల్లి కోరిక నీవల్ల తీరింది. అందుకని నీకు ఏంకావాలో కోరుకో........తప్పకుండా తీరుస్తాను."
"మీ అభిమానానికి కృతజ్ఞుడిని" అన్నాడు హరీన్. "ఇందులో నేను చేసింది ఏమీ లేదు. యాదృచ్చికంగా మనం కలిశాం. నావల్ల ఒక పని జరిగింది........అది చాలు. మీరు నాకు ఏమైనా సాయం చేయదలచుకుంటే, మేము ఈలోయలో నుంచి బయటపడేమార్గం చెప్పండి" అన్నాడు.
సంతోషం లేకుండా నవ్వాడు నాయకుడు.
"ఈ లోయనుంచి బయటపడే మార్గమా! అష్టభైరవ కట్టులో వున్నట్లు అన్ని దిక్కులా కొండలే వున్నాయి ఈ లోయకి. ఈ లోయ వేరేలోకం అనుకో! ఇక్కడ పుట్టినవాళ్ళు ఇక్కడే గిట్టాలి!"
సూటిగా నాయకుడి కళ్ళలోకి చూశాడు హరీన్.
అతని చూపులని ఎదుర్కోలేక మొహం పక్కకి తిప్పుకున్నాడు నాయకుడు.
నెమ్మదిగా అన్నాడు హరీన్ -
"మీరు ఎందుకో గానీ పూర్తీ నిజం చెప్పడంలేదు."
"అట్లా ఎందుకనుకుంటున్నావు?" అన్నాడు నాయకుడు.
"ఎందుకంటే మీ అందరికి తెలుగు అర్ధం అవుతోంది గనక. మీరందరూ మీ బాషతో పాటు తెలుగు కూడా మాట్లాడగలుగుతున్నారు కాబట్టి. బయటి ప్రపంచంతో సంబంధం లేకపోతే తెలుగు ఎలా తెలుస్తుంది మీకు? దుర్భేధ్యమైన కోటగోడల్లాంటి కొండలు ఈ లోయని అన్నివైపులా ఆవరించి వున్నా, బయటకు వెళ్ళడానికి నిశ్చయంగా మరేదో మార్గం వుండి తీరాలి."
చాలా తెలివిగా తన వాదనని చెబుతున్న హరీన్ వైపు మెరిసే కళ్ళతో చూశాడు నాయకుడు. తర్వాత రుద్దమైన గొంతుతో అన్నాడు "ఎంత చురుకైన బుర్రనీది హరీన్! నా జింబురూ కూడా అచ్చం నీలాగే ఆలోచించేవాడు. అకాలమరణం పాలైనాడు గానీ లేకపోతే నా తర్వాత నాయకుడై, ఈ అడవికి రాజై ప్రజల్ని కనుపాపల్లా చూసుకునేవాడు. నిన్ను చూస్తుంటే నా కొడుకే గుర్తుకు వస్తున్నాడు హరీన్! నిన్ను దూరం చేసుకోలేను"
'అందుకేనా మీకు బయటపడే రహస్యమార్గం తెలిసినా చెప్పంది?" అన్నాడు హరీన్.
అపరాధిలా తలవంచుకున్నాడు నాయకుడు.
"ఇది మీకు న్యాయం కాదు. నేను పెరిగిన ప్రపంచం వేరు. అక్కడ నాకూ ఒక తల్లి వుంది. తండ్రి ఉన్నాడు. నామీద ఆధారపడ్డ పనుషులు ఎంతో మంది వున్నారు. నేను వెంటనే తిరిగి వెళ్ళిపోవలసిన అవసరం ఎంతో వుంది. పైగా ఈ అమ్మాయి కరుణ. ఆమె ఎవరో ఇంతవరకూ నాకు తెలియదు. ప్రమాదవశాత్తు మేమిద్దరం నదిలోపడి -"
అతను చెబుతున్న మాటల్లో ఒకటే నాయకుడి తలకి ఎక్కింది."
"నాకూ తల్లి వుంది."
తెప్పరిల్లుకొని అన్నాడు నాయకుడు -
"అవును హరీన్.........నీకూ ఒక తల్లి వుంటుంది కదూ! తల్లి ప్రేమ ఎలాంటిదో నాకు తెలుసు! ఆమె నీకోసం ఎంత కలవరించిపోతూ వుంటుందో నేను అర్ధం చేసుకోగలను. ఇంక ఆలస్యం చెయ్యను హరీన్! నిన్ను తక్షణం మీ అమ్మ దగ్గరికి పంపెస్తాను. ఈ లోయలో నుంచి బయటపడే రహస్యమార్గం ఎక్కడుందో చెబుతాను" అన్నాడు.
నాయకుడు తన మాటలు పూర్తి చెయ్యకముందే కొండలు పగులుతున్నట్లు భేరినాదం వినబడింది - చాలాదూరం నుంచి.
మాట్లాడటం ఆపి, చెవి ఒగ్గి విన్నాడు నాయకుడు.
"ఏమిటది?" అన్నాడు హరీన్.
"కొండదేవత దగ్గర వుండే భేరీని మోగిస్తున్నారు ఎవరో! అంటే ఎవరికో అన్యాయం జరిగిందన్నమాట. న్యాయం కోరేవాళ్ళు కొండదేవత దగ్గరికెళ్ళి ఆ భేరిని మోగించడం ఆనవాయితీ. నేను వెళ్ళి చూసివస్తాను హరీన్" అని త్వరత్వరగా కొండదేవత విగ్రహంవైపు నడిచాడు నాయకుడు. అందరూ వడివడిగా అతనితోబాటు అడుగులు వేశారు.
హరీన్, కరుణ కూడా వాళ్ళ వెనుక నడిచారు.
కొండదేవత విగ్రహం ముందు వుంది బ్రహ్మండమైన ఆ భేరీ. శివమెత్తినట్లు ఉగిపోతూ దాన్ని మోగిస్తుంది చిక్ లీ.
ఒకరి తర్వాత ఒకరుగా ఆటవికులందరూ అక్కడికి చేరుకున్నారు. ఆ బయలు ప్రదేశమంతా జనంతో నిండిపోయింది.
నాయకుడు హుందాగా వెళ్ళి చిక్ లీ ముందు నిలిచాడు.
"చిక్ లీ........అగు. ఏం అన్యాయం జరిగింది నీకు? ఎవరు చేశారు?" అని ప్రశ్నించాడు.
భేరీని మోగించడం ఆపింది చిక్ లీ. ఉపిరి అందాక అన్నది. అదొక రకం నవ్వు కనబడుతోంది ఆమె మోహంలో.
"వేరెవరో చేస్తే నాకెందుకీ దుఖం నాయకా! నీ కొడుకే చేశాడు కొండంత అన్యాయం - కోనంత అవమానం!"
"చిక్ లీ..........ఏం జరిగింది? వివరంగా చెప్పు!"
కన్నీళ్ళతో బుడిబుడి దీర్ఘాలు తీస్తూ చెప్పుంది చిక్ లీ - జింబూరూ తను అసలు జింబురూనే కాదంటూన్నాడనీ, హరీన్ ని అని చెప్పుకుంటున్నాడని, పట్నం పిల్ల మోజులోపడి పిచ్చిపట్టినట్లు ప్రవర్తిస్తూన్నాడనీనూ.
చీమ చిటుక్కుమంటే వినబడేంత నిశ్శబ్దం ఆవరించింది అక్కడ.
అంతా చెప్పి చివర్లో చిక్ లీ -
"నాయకా! పోయినపున్నమినాడు నిశ్చితార్ధం చేశావు నాకూ, జింబురూకీ, మళ్ళీ నెలవంక పోడిచేనాటికి మా ఇద్దరికీ మనువు చేస్తానన్నావు. మాట నిలుపుకో నాయకా! మారుమాట మాట్లాడి నన్ను అన్యాయం చెయ్యకు."
గాలి ఘనీభవించిపోయినట్లు భ్రాంతి కలిగింది నాయకుడికి.
అతను తన తల్లిని తృప్తిపరిచే తొందరలో ఈ చిక్ లీ విషయం మర్చిపోయాడు.
అవును.....చిక్ లీకీ, జింబురూకీ దగ్గరుండి నిశ్చితార్ధం జరిపించి తనే. హరీన్ ని తన కొడుకుగా అందరికి పరిచయం చేశాడు తను. ఇప్పుడు కాదంటే, తను అసత్యం చెప్పినవాడవుతాడు.
అసత్యం చెప్పినవాడు నాయకుడి స్థానంలో వుండటానికి తగడు. ఉండనివ్వరు. ఉరికే వదలరు.......చిత్రవధ చేసి చంపుతారు.
అలాకాక ఇతనే జింబురూ అని చెబితే -
అప్పుడు హరీన్ కి చిక్ లీని ఇచ్చి పెళ్ళి చెయ్యవలసి వస్తుంది.
చిక్ లితో హరీన్ కి పెళ్ళి జరిగితే, అతను ఇంక ఇక్కడే చిక్కుకుపోతాడు. పట్నానికి తిరిగి వెళ్ళలేడు. తన తల్లిని చూడలేడు.
ఏం చెయ్యాలి ఇప్పుడు?
స్థాణువులా అక్కడే నిలబడిపోయాడు నాయకుడు.
13
విశ్వప్రయత్నం చేసి కళ్ళు తెరవగలిగాడు విశ్వనాధం.
కళ్ళు తెరవగానే అతనికి కనబడింది అతనికి తన రెండో భార్య ప్రియంవద మొహం.
ఆ వెంటనే గమనానికి వచ్చింది. తన మెడని చల్లగా తాకుతున్న పదునైన కత్తి! ఇదేమిటి.....తన ప్రియంవద తనని చంపేస్తోందా?
"ప్రియా!" అన్నాడు వెర్రిగా చూస్తూ.
వెంటనే అతని మెడని తాకుతూ వున్న కత్తి దూరమైపోయింది. కత్తి పట్టుకొని వున్న ఒక వ్యక్తీ నిటారుగా, నిర్వికారంగా నిలబడ్డాడు. అతనివైపు ఒకసారి భయంగా చూసి, తర్వాత ప్రియంవదతో అన్నాడు విశ్వనాధం.
"ప్రియా! ఏమిటిదంతా? ఎక్కడున్నాను నేను?"
తన అరచేత్తో మృదువుగా అతని నుదిటికి రాసింది ప్రియంవద. "భయపడకండి! మనం గార్డెన్ లో కూర్చుని వున్నప్పుడు మీకు చిన్న స్ట్రోక్ లాగా వచ్చింది. మన ఫామిలి డాక్టర్ చెకప్ చేసి, చిన్న చిన్న కాంప్లికేషన్స్ కొన్ని డెవలప్ అయ్యాయని, ఆపరేషన్ చేస్తే అంతా సరయిపోతుందనీ చెప్పారు."
"ఈ కత్తి.........ఇతనేవరు?"
చిన్నగా నవ్వింది ప్రియంవద.
"అతను బార్బరు! ఆపరేషన్ థియేటర్ లోకి తీసుకెళ్ళేముందు షేవ్ చెయ్యాలి కదా.......అందుకని......"
తేరుకున్నట్లు చూశాడు విశ్వనాధం.
తనకు ప్రాణభయం పట్టుకుంది. తన నీడని చూసి తనే దడుచుకునే స్థితికి వచ్చేశాడు.
ఎందుకని?