"ముఫ్ఫయ్ అయిదు వేలు మేడమ్!"
వజ్రాలని వెలుగుకి అడ్డంగా పెట్టి తీక్షణంగా చూసింది వైశాలి. "ఏం సేఠ్జీ? మళ్ళీ మీ దుకాణానికి రావద్దా ఏమిటీ?"
చేతులు నులుముకుంటూ అన్నాడు సేఠ్ బదరీ నారాయణ్.
"అట్లా అనకండి మేం సాబ్! సరే! మీకోసం స్పెషల్ రేటు ముఫ్ఫయ్ వేలు!"
నవ్వింది వైశాలి. "నువ్వు చేస్తోంది వ్యాపారం కాదు! దోపిడీ!" అని హ్యాండ్ బ్యాగ్ లోనుంచి వంద రూపాయల కట్టలు తీసి, మూడు అతనికి అందించింది.
"గంగారాం అమ్మగారి నగలని ప్యాక్ చెయ్!" అన్నాడు సేఠ్ బదరీ నారాయణ్ నోట్లు లెక్కపెట్టుకుంటూ. "అమ్మగారికి కాంప్లిమెంట్స్ ఇవ్వు. పర్సు, కాలెండర్, కీ చెయిన్! కూల్ డ్రింక్సు చెప్పావా లేదా? మేం సాబ్! వేరే నగలేమన్నా చూస్తారా?"
"ఇప్పుడు టైమ్ లేదు. మళ్ళీ ఇంకోసారి వచ్చినప్పుడు..." అని ఆగి, సేల్స్ మాన్ తో అంది వైశాలి. "ఇదిగో! అవి ఇప్పుడే ప్యాక్ చెయ్యొద్దు! ఇక్కడే ఉండనీ! రేపొచ్చినప్పుడు తీసుకుంటాను" అని
సేల్స్ మాన్ సందిగ్ధంగా సేఠ్ వైపు చూశాడు.
సేఠ్ కి బ్రహ్మానందంగా వుంది. ఇలా విచ్చలవిడిగా, కేర్ లెస్ గా ఖర్చుపెట్టే కస్టమర్ దొరికినందుకు.
"ఎంత మాట మేం సాబ్! దీనికోసం మీరు మళ్ళీ శ్రమపడి ఇంత దూరం పనికట్టుకు రావాలా? నేనే స్వయంగా తీసుకువచ్చి ఇస్తాను. వచ్చేటప్పుడు ఇంకేమన్నా నగలు తీసుకురమ్మంటారా? మీరు తీరిగ్గా చూడొచ్చు"
"తీసుకొస్తే తీసుకురండి! టైముంటే చూద్దాం!" అంది వైశాలి.
"మీ అడ్రస్ మేడమ్?"
చెప్పింది వైశాలి.
ఆమె వెళ్ళిపోతుంటే, ఆమె వైపూ ఇంపోర్టెడ్ ఎయిర్ కండిషన్డ్ కారు వైపూ మర్చి మార్చి చూశాడు సేఠ్ బదరీ నారాయణ్.
ఆమె ఇచ్చిన అడ్రస్ బిజినెస్ మాగ్నెట్ మహాజన్ తాలూకు బిజినెస్ ఎంపైర్ లో ఒక ఆర్గనైజేషన్ గెస్ట్ హౌస్ ది!
ఆ కంపెనీ ఇండియాలో వున్న అతి పెద్ద కంపెనీలలో ఒకటని సేఠ్ బదరీ నారాయణ్ కి తెలుసు.
మర్నాడు అతను గెస్ట్ హౌస్ కి వెళ్ళేసరికి చాలా బిజీగా వుంది వైశాలి. ఆమె లేడీ సెక్రటరీ ఆమెకి ఎదురుగా కూర్చుని డిక్టేషన్ తీసుకుంటోంది. ఆమెకి కొంచెం దూరంలో వినయంగా కూర్చుని వున్నాడు ఒక వ్యక్తి.
అతను సేఠ్ మాణిక్ లాల్!
అతను సేఠ్ బదరీ నారాయణ్ కి వ్యాపారంలో ప్రత్యర్ధి!
"వీడు కూడా ఇక్కడికెందుకు తగలడ్డాడు?" అనుకున్నాడు సేఠ్ బదరీ నారాయణ్ మనసులోనే, మంటగా.
సేఠ్ మాణిక్ లాల్ కూడా సేఠ్ బదరీ నారాయణ్ ని చూసి అలాగే అనుకుంటున్నట్లు అతని మొహం చూస్తే అర్ధమయిపోతోంది.
వైశాలి మొహం మాత్రం అదో విధమైన ఎగ్జయిట్ మెంట్ తో వెలిగిపోతున్నట్లు అనిపించింది సేఠ్ బదరీ నారాయణ్ కి.
ఒక అందమైన అమ్మాయికి అంత ఎగ్జయిట్ మెంట్ ఎందుకు కలుగుతుంది!
ఓ అందమైన కుర్రాడితో మనసు కలిసినప్పుడు.
లేదా-
అపారమయిన లాభం ఏదన్నా కలిసి రాబోతున్నప్పుడు -
సేఠ్ బదరీ నారాయణ్ కి మనసూ గినసూ లాంటి సున్నితమైన భావాల మీద అట్టే నమ్మకం లేదు.
అతనికి అర్ధమయ్యేదల్లా డబ్బు - ఇంకా డబ్బు - మరింత డబ్బు!
అంతే!
తన పరిధిలో తాను ఆలోచించి, వైశాలి ఏదో బ్రహ్మాండమయిన ఆర్ధిక విజయాన్ని సాధించిందనో, లేకపోతే సాధించబోతుందనో అనుకున్నాడు సేఠ్ బదరీ నారాయణ్.
కానీ -
ఏమిటది? కుతూహలం కలిగింది అతనికి.
హఠాత్తుగా, ఎదుట వున్న మనిషిని అప్పుడే గమనించినట్లు తల ఎత్తి "ఎవరు నువ్వు?" అన్నట్లు చూసింది ఆమె.
"నేను మేం సాబ్! సేఠ్ బదరీ నారాయణ్ ని! నిన్న మీరు కొన్న నగలు అప్పగించడానికి వచ్చాను."
"ఓహ్!" అంది ఆమె గుర్తొచ్చినట్లు.
"కాసేపు వెయిట్ చేస్తారా? నేను చాలా బిజీగా వున్నాను."
"అరే రాంరాం! ఎంత మాట! మీ పని అయ్యేదాకా కాచుకొని వుంటాడు ఈ నౌఖరు!" అన్నాడు బదరీ నారాయణ్, అతి వినయాన్ని ప్రదర్శిస్తూ.
ఇంతలో రెండో సేఠ్ మాణిక్ లాల్ లేచి నిలబడ్డాడు.
"మీరు శెలవిప్పిస్తే మళ్ళీ వచ్చి దర్శనం చేసుకుంటాను మేంసాబ్!"
"రేపు రండి! ఏ సంగతి చెబుతాను" అంది ఆమె.
సేఠ్ మాణిక్ లాల్ వెళ్ళిపోయాక బదరీ నారాయణ్ తో నవ్వుతూ అంది ఆమె "వాళ్ళబ్బాయికి సికింద్రాబాద్ లో వున్న ఏదో కాన్వెంటులో ఎల్.కేజీ సీటు కావాలిట! కనుక్కుంటానని చెప్పాను."
"అలాగా!" అని చిరునవ్వు నవ్వాడుగానీ ఆమె మాటలు నమ్మలేదు బదరీ నారాయణ్. నగలు అంటగట్టటానికే వచ్చి వుంటాడు మాణిక్ లాల్! తనకి తెలుసు! తను ఎక్కడికి వెళ్తే ఈ శనిగాడు కూడా అక్కడే దాపురిస్తాడు. కాంపిటీషన్ తనకి! ప్రతి విషయంలో!
అరగంట సేపు సహనంగా వేచి కూర్చున్నాడు సేఠ్ బదరీ నారాయణ్. అరగంట తర్వాత ఒక లాయరు వచ్చాడు ఆమె దగ్గరికి.
లాయరు రాగానే బాదరీ నారాయణ్ తో అంది వైశాలి "ఇవాళ తీరిక కుదిరేటట్లు లేదు. నా నగలు ఇక్కడ వుంచెయ్యండి. మీరు తెచ్చిన నగలు పట్టుకెళ్ళిపోయి మళ్ళీ రేపు తీసుకురండి. చూస్తాను."
తల ఊపి, నమస్కరించి వెళ్ళిపోయాడు బదరీ నారాయణ్.
అతను వెళ్ళిపోగానే తన లాయరు వంక చూసి అర్ధవంతంగా నవ్వింది ఆమె.
మర్నాడు అదే టైమ్ కి వచ్చాడు సేఠ్ బదరీ నారాయణ్, నగల పెట్టెతో సహా! అతనికి ఎలాగైనా సరే హీనపక్షం ఓ పదిలక్షల రూపాయల నగలు ఆమె చేత కొనిపించెయ్యాలని తపనగా వుంది.
అతను వచ్చేసరికి అక్కడ సేఠ్ మాణిక్ లాల్ కూడా వున్నాడు. వాళ్ళతోబాటు లాయర్ కూడా వున్నాడు.
"వంద ఎకరాలంటే లాండ్ సీలింగ్ లోకి రాదా?" అంటోంది ఆమె లాయర్ తో.
ఏదో చెప్పబోయి, అడుగుల చప్పుడు విని తిరిగి చూసి బదరీ నారాయణ్ కనబడగానే మాట్లాడడం మానేశాడు లాయరు.
సేఠ్ బదరీ నారాయణ్ వచ్చిన అయిదు నిమిషాల్లోగా వెళ్ళిపోయాడు సేటు మాణిక్ లాల్. ఆ తర్వాత మరో అయిదు నిమిషాలలో లాయరు కూడా వెళ్ళిపోయాడు.
వాళ్ళిద్దరూ వెళ్ళీ వెళ్ళకముందే నాటకంలో తెరచాటున నిలబడి, సరిగ్గా సమయానికి రంగ ప్రవేశం చేసిన పాత్రధారిలా లోపలికి అడుగుపెట్టాడు ఒక వ్యక్తి.
అతనెవరో సేఠ్ బదరీ నారాయణ్ కి తెలుసు!
అతనొక రియల్ ఎస్టేట్ ఏజెంటు!
స్థలాలు కొని అమ్ముతూ వుంటాడు.
రియల్ ఎస్టేట్ ఏజెంట్ లోపలికి రాగానే ఇబ్బందిగా సేఠ్ బదరీ నారాయణ్ వైపు చూసింది ఆమె.
"క్షమించండి సేఠ్ జీ! ఇవాళ కూడా మనకి కుదిరేటట్టు లేదు. పోనీ రేపు నేనే మీ షాపుకి వస్తాను లెండి!" అంది.
"ఎంత మాట మేడమ్! నేనే వస్తాను మళ్ళీ!" అని శెలవు తీసుకొని వెళ్ళిపోయాడు సేఠ్ బదరీ నారాయణ్.
మర్నాడు అతను వచ్చేసరికి అక్కడ మాణిక్ లాల్, లయరూ, రియల్ ఎస్టేట్ ఏజెంటూ - వీళ్ళెవరూ లేరు.
కానీ మరో కొత్త వ్యక్తి వున్నాడు. బట్టతలా - పిల్లిగెడ్డం!
బదరీ నారాయణ్ ని చూడగానే "అరెరే!" అంది ఆమె నొచ్చుకుంటున్నట్లు. మిమ్మల్ని కూడా ఇవాళే రమ్మన్నాను కదూ! ఈలోగా ఈయన కూడా ఒచ్చేశారు. ఈయన తెలుసుకదా! ఫేమస్ జియాలజిస్టు! మిస్టర్ రాధేశ్యాం!" అంది.
నగల పెట్టెతో సహా పైకెత్తి అతనికి నమస్కారం పెట్టాడు బదరీ నారాయణ్. తర్వాత అన్నాడు "వెళ్లి మళ్ళీ రమ్మంటారా మేడమ్!"