Previous Page Next Page 
ప్రేమ తరంగం పేజి 14

"వస్తానండి! సీ యూ లవ్!" అంటూ నల్లటి మెర్సిడిస్ కారు ఎక్కి వెళ్ళిపోయింది సుధ.
"మీరూ సినిమా కెళ్ళలేకపోయారు? చాలా ఆదుర్దాగా దానికోసం ఎదురు చూసినట్లున్నారు."
"ఎదురు చూశాను- పాస్ట్ టెన్స్- ఇప్పుడు ఎదురు చూడ్డం లేదు."
ఇద్దరూ క్లబ్బు హాల్లోకి వచ్చారు.
"హలో లవ్! సారీ....ఐ మీన్ - లావణ్యా!" అన్నాడు ఒకతను.
తలతిప్పి చూశాడు శ్రీహర్ష.
అతను తెల్లగా పొడుగ్గా ఉన్నాడు. బద్దకంగా చూసే కళ్ళు. జుట్టుకి నూనే రాసుకునే అలవాటు లేడేమో, మెత్తగా రాగి రంగులో మొహం మీద పడుతోంది. స్టెప్ కటింగ్ క్రాపు మెట్లు మెట్లుగా ఉండి, కణతల దాకా ఒక లెవెలు, చెవుల దాకా ఒక లెవెలు, మేడమీద ఇంకో లెవలు, గ్రే కలరు టెర్రీ వుల్ బెల్ బాటమ్స్ వేసుకున్నాడు. ముప్పయి అయిదు అంగుళాల బాటమ్ ఉండొచ్చు డానికి. కాటన్ స్పోర్ట్స్ బనీను వేసుకున్నాడు. చేతిలో స్టేట్ ఎక్స్ ప్రెస్ సిగరెట్ పాకెట్టు , కాళ్ళకి ఆకూ చెప్పులూ- అందంగా నాజుగ్గా ఉన్నాడు.
అతనిలో ప్రత్యేకత అతని చూపు.
బద్దకంగా, నిర్లక్ష్యంగా , ఎవర్ని లెఖ్ఖ చెయ్యనట్లు చూసే చూపు.
"నా పేరు లవ్ కాదు. లావణ్య. జాగ్రత్తగా గుర్తుంచుకో. ఇతను రాజేష్. సుధావాళ్ళ అన్నయ్య. ఈయన శ్రీహర్ష" అంటూ పరిచయం చేసింది లావణ్య.
"శ్రీహర్ష......" అంటూ పరీక్షగా చూశాడు రాజేష్. ఎవరు? నీకెలా పరిచయం? ఎంత పరిచయం? ఎప్పటి నుండి?" లాంటి ప్రశ్నలు అతని మోహంలో కనబడ్డాయి.  మాట్లాడకుండా చెయ్యి జాపాడు.
"నైస్ మీటింగ్ యూ!" అంటూ చెయ్యి కలిపాడు శ్రీహర్ష. రాజేష్ తనని ఏదో వింత జంతువునో, చిత్రమైన పురుగునో చూసినట్లు పట్టి పట్టి చూడడం అతనికి ఇబ్బందిగా ఉంది. పైగా లావణ్యతో కలిసి తను రావడం అతని కంత ఇష్టంగా వున్నట్లు లేదు.
"అక్కడే ఆగిపోయావేమిటోయ్? రా! రా!" అంటూ కుటుంబరావుగారు వచ్చి చెయ్యి పట్టుకుని శ్రీహర్షని ఒక టేబుల్ దగ్గరికి లాక్కెళ్ళారు. రాజేష్ కూడా వెంటనే వచ్చాడు. లావణ్య పక్క గదిలోకి వెళ్ళిపోయింది.
వాళ్ళని చూసి బేరర్లు వినయంగా పక్కకి తప్పుకున్నారు. ఎత్తైన సీలింగ్ ఉన్న రూం అది. నాలుగు మూలలా నాలుగు టేబుల్స్ వేసి ఉన్నాయి. కూర్చోబోతుంటే బేరర్లు వచ్చి, కుర్చీలు కాస్త వెనక్కి లాగి, వాళ్ళకి సౌకర్యంగా అమర్చారు.
"ఏం తీసుకుంటారు?" అని "అమ్మాయి వెళ్ళిపోయింది కదా?" అని అటూ ఇటూ చూశారు కుటుంబరావుగారు.
శ్రీహర్ష మొహమాటంగా కుర్చోలో కదిలాడు.
రాజేష్ బేరర్ తో "షివాస్" అన్నాడు.
బేరర్ నెమ్మదిగా తల పంకించి లోపలికి నడిచాడు.
"నేను డ్రింక్ చెయ్యను. అలవాటు లేదు" అన్నాడు శ్రీహర్ష ఇబ్బందిగా.
"బీర్?"
"అది కూడా లేదు."
"మిస్టర్ శ్రీహర్ష! విస్కీ బ్రాంది జిన్ను ద్రవలయితే బీర్ ఉపద్రవం. డానికి మీరు భయపడనఖ్ఖర్లేదు."
"ఉపద్రవం అంటూ భయపడొద్దంటారేమిటి?" అన్నాడు శ్రీహర్ష చనువుగా మాటలు కలిపేస్తూ.
రాజేష్ బద్దకంగా వెనక్కి జేరగిలబడి నవ్వాడు.
"బావుంది మీ జోక్! కూల్ డ్రింక్ ఏదన్నా తాగుతారా? దాన్లో షాక్రిన్ కలుస్తుందేమో! మీ కభ్యంతరం ఉండదా?"
"కాఫీ" అన్నాడు శ్రీహర్ష బెరర్ తో.
"కాఫీ విత్ శాండ్ విచెస్" అని కరెక్టు చేశాడు రాజేష్.
"రాజేష్! మీ ఎక్స్ పోర్టు బిజినెస్ కి చాలా లైన్స్ ఉంటాయి. ఒకటి శ్రీహర్షకి అప్పగించకూడదు? ట్రాన్స్ పోర్టో, మరేదేనో" అన్నాడు కుటుంబరావుగారు.
'చూద్దాం' అన్నట్లు నిదానంగా తల ఊపాడు రాజేష్.
సన్నటి గాజుకి కాడకి పూచిన పూలల్లాంటి గ్లాసులో షివాస్ రీగల్" లేత బంగారం రంగులో మెరిసిపోతుంది. గ్లాసుల్ని ముందర పెట్టి, బాటిల్ పక్కన పెట్టి నెమ్మదిగా వెళ్లిపోయాడు బెరర్.
టెన్నిస్ రాకెట్ పట్టుకుని గదిలోకి తొంగి చూసిన లావణ్య "శ్రీహర్షా! రెండు సెట్లు టెన్నిస్ ఆడదాం వస్తారా?" అంది.
"ఒక్క అరగంట ఉండి వస్తాడు" అన్నాడు కుటుంబరావుగారు చటుక్కున విస్కీగ్లాసు కింద పెట్టేస్తూ.
"దెన్ డూ మీ ఏ ఫేవర్! నాన్నగారు ఆ ఒక్క గ్లాసూ తప్ప ఇంక తాగకుండా చూడండి. రాజేష్ ఆ ఒక్క సీసా తప్ప తాగకుండా చూడండి. మిరోక్క కాఫీ అన్నా తాగండి" అని ఆజ్ఞలు జారి చేసి వెళ్ళిపోయింది.
బెరర్ శ్రీహర్షకి కాఫీ తెచ్చాడు. పెద్ద కప్పులో సువాసనలు వెదజల్లుతున్న కాఫీ, ప్రత్యేకంగా దాన్లో వేసిన చిక్కటి మీగడ, ప్లేట్లో నాలుగు శాండ్ విచెస్.
ఇంతలో జడ్జిగారు వచ్చి కుర్చీలో కూర్చుని కుటుంబరావుగారితో ఏదో మాట్లాడారు. శ్రీహర్షని ఇంట్రడ్యుస్ చేశారు కుటుంబరావుగారు.
తర్వాత అరగంటలో అయిదు మంది పెద్దమనుష్యుల్ని పరిచయం చేశారు. "అందుకే చెప్పాను గుర్తుందా? పెద్ద క్లబ్బులో చేరితే గానీ పెద్ద పరిచయాలు కావు. నీవు బంగారు బాటలో నడిచి బాగుపడాలన్నా, భారీ ఎత్తున స్మగ్లింగ్ చెయ్యాలన్నా కూడా తగిన కనెక్షన్స్ దొరుకుతాయి యిక్కడ."
  

 Previous Page Next Page