"వచ్చే జన్మలో మంచి మొగుడు దొరకాలని పతివ్రతా వ్రతం చేస్తున్నానే...." అంది పూజగదిలో నుంచే భువన.
అవాక్కయిపోయింది సమీర.
"వచ్చే జన్మలో మంచి మొగుడి కోసం పతివ్రతం ఎంటే?" యింక ఏమనాలో. అడగాలో తేలిక అంది సమీర.
భువన గ్యాస్ స్టవ్ మీద వేడినీళ్ళు మరగబెడుతోంది.
"అమ్మా.....తల పగిలిపోతుందే, కాస్త వేడి కాఫీ చేసి పెట్టావు...." అంది సమీర సోఫాలో వెనక్కి వాలి.
"నువ్వు చేసుకోకూడదటే....నేను ఈ వ్రతం వ్యర్జ్యం వచ్చేలోగా పూర్తిచేయాలి. ఇవ్వాళే రాత్రి పడి గంటలకు మంచిదట. ఇవాళ్టి నుంచి ఏడు వారాలు ఏడు రకాల పాద పూజ మీ నాన్నగారికి చేయాలట.....అప్పుడు ముక్కోటి దేవతలు నేను పతివ్రతనని సర్టిఫికేట్ ఇచ్చి, వచ్చే జన్మలో నాకు మంచి మొగుడు దొరికేలా ఆశిర్వదిస్తారట."
తల్లి మాటలు విని తల బాదుకుంది సమీర. తనే లేచి వెళ్లింది కిచెన్ రూమ్ లోకి.
స్టవ్ మీద వేడినీళ్ళు మరుగుతున్నాయి.
"ఈ నీళ్ళేందుకమ్మా....." అడిగింది సమీర.
"మీ నాన్న కోసమేనమ్మా...."
"అదేంటి.....నాన్న అర్ధరాత్రి స్నానం చేస్తాడా?" అడిగింది సమీర అర్ధం గాక. అర్ధమైతే ఠపిమని వెనక్కి విరుచుకు పడిపోయేదే......
కాసేపు టివీ చూసి, కట్టేసి పడుకోబోతుండగా, చెమట్లు కక్కుతూ వచ్చాడు తండ్రి. వస్తూనే తల పట్టుకుని కాసేపు అలాగే వుండిపోయి తన డ్రెస్ వంక చూసుకొని "ఛ....ఛా......నేను ఈ డ్రెస్ వేసుకున్నానేంటి?" అనుకున్నాడు స్వగతంలో త్రిలోకం.
సోఫాలో కూచున్న కూతురి వంక చూసి "అదేంటమ్మా....ఎప్పుడొచ్చావు?" అడిగాడు త్రిలోకం కూతుర్ని.
"వచ్చేటప్పుడు నీకు కలిసానుగా" అంది సమీర.
"నాకెపుడు కలిసానమ్మా....." అడిగాడు ఆశ్చర్యంగా త్రిలోకం.
తల పట్టుకుంది సమీర.
త్రిలోకం జాగింగ్ డ్రెస్ విడిచేసి , లుంగీ కట్టుకుని వచ్చి సోఫాలో కూచున్నాడు. అలసటగా వుంది త్రిలోకానికి, తనింత క్రితం ఏం చేసాడో గుర్తులేదు.
సమీర వెళ్లి తన గదిలో పడుకుంది. కన్నులు మూతపడుతుండగా అలాగే.
సోఫాలో వెనక్కి అలాడు త్రిలోకం.
అప్పుడు వచ్చింది భువన.
చేతిలో పెద్ద బేసిన్....అందులో వేడినీళ్ళు మరుగుతున్నాయి. .....పెద్ద గుడ్డతో పట్టుకొని తెచ్చి నెల మీద త్రిలోకం కాళ్ళ దగ్గర పెట్టింది.
"ఏవండి" పిలిచింది భువన.
"ఏంటి...." కళ్ళు తెరవకుండానే అడిగాడు.
"ఒక్కసారి కాళ్ళు ఈ బేసిన్ లో పెట్టి, నాచేత పాద పూజ చేయించుకొని ఆశీర్వదించరు...." అడిగింది భువన.
అసలే నిద్ర మత్తులో వున్నాడు త్రిలోకం. "అర్ధరాత్రి నీ మద్దెల దరువేంటి?"
"నాకు వచ్చే జన్మలో మంచి మొగుడు దొరకాలని , ఈ జన్మలో పతివ్రతా వ్రతం చేసుకుంటున్నా...." అంటూ అతని పాదాలను లాగి వేడివేడి నీళ్ళు వున్న బేసిన్ లో పెట్టేసి ....నన్నాశిర్వదించండి" అంది.
అంతే....కెవ్వున కేక పెట్టి ఆశీర్వదించాడు త్రిలోకం...."నీ మొహం మండ...నీ ప్రతివ్రత్యం సంతలోకి వెళ్ళ....." అంటూ.....
ఒక్కసారిగా స్టీరియో ఫోనిక్ సౌండ్ లో అరిచి లేచి, అటేన్షన్ లో నిలబడి ఎర్రగా కందగడ్డ కలర్ లోకి మారిపోయిన తన పాదాల వంక చూసుకున్నాడు త్రిలోకం.
ఇంకా ఆ వేడినీళ్ళ పొగలు సెగలు విర్రవిగుతూనే వున్నాయి. వేడినీళ్ళు పాదాలో నిండా మునిగిపోవడం వాళ్ళ పాదాల నుంచి పొగలు వస్తున్నాయి.
"ఓసి....నీ ప్రాతివ్రత్యాన్ని....దైనేజి కాలవలో కలుప....నిన్ను ఉల్పా తీవ్రవాదులేత్తుకుపోను. నా పాదాలనేంటే అలా....చికెన్ ప్రై చేసినట్టు చేశావు?" కళ్ళల్లో నీళ్ళు సుడులు తిరుగుతుండగా అడిగాడు విపరీతంగా కోపంతో ఊగిపోతూ త్రిలోకం.
"అర్ధరాత్రి పూట అవెం పాడు మాటలండీ....ఏదో నేను పతివ్రతను కాబట్టి....ఇలా మీకు పాద పూజ చేస్తున్నాను. ఒక్క నిమిషం....కొబ్బరికాయ కూడా కొట్టేస్తే ఓ పనైపోతుంది" అంటూ కొబ్బరికాయ తీసుకురావడానికి పూజగదిలోకి వెళ్ళబోతూ అంది.
"తిసుకురావే....తెచ్చి నా పాదాల మీద కొట్టు.....కొబ్బరికాయ రెండు ముక్కలై, నా పాదాలు నాలుగు చెక్కలవుతాయి....." కోపమగా అన్నాడు సోఫాలో కూలబడి మంటేక్కిన తన పాదాలను వుదుకుంటూ.....
"ఈ ఐడియా నాకు రాలేదు సుమండీ...." అంది అమాయకంగా భువన.
"ఒసే....ఎందుకు నన్నిలా చంపుకుతింటావు. నువ్వు పతివ్రతవేనని సర్టిపై చేస్తానే....ఈ పూజలు....పిచ్చిపనులు మానవే" మొత్తుకున్నాడు త్రిలోకం.
"అలా మానితే వచ్చే జన్మలో..."
"వచ్చే జన్మలో కూడా చచ్చినట్టు నేనే నీ మొగుడ్ని అవుతాను సరేనా...."
"సర్లెండి సంబడం....పండుగనాడు కూడా పాత మొగుడేనా? అన్నట్టు వచ్చే జన్మలో మంచి మొగుడు దొరకాలని ఆశిర్వదించండి చాలు" అంది భువన మూతి ముప్పయ్యారు వంకర్లు తిప్పుతూ.
బావురు కప్పలా నోరు తెరిచి....భార్య వంక చూసాడు త్రిలోకం.
భార్య పుజగదిలోకి వెళ్లగానే, తన గదిలోకి వెళ్లి తలుపు వేసి బోల్టు పెట్టుకుని, ఎయిర్ కూలర్ దగ్గరికి వెళ్లి 'అన్' చేసి తన పాదాలను కూలర్ ఎదురుగా పెట్టాడు 'ఉఫ్' మని వుదుకుంటూ.
అతని గుండెలు లబోదిబో మంటున్నాయి.
"వచ్చే జన్మలో మంచి మొగుడి కోసం ఈ జన్మలో పాద పూజలు చేస్తావా? హమ్మో....నువ్వు సామాన్యురాలివి కావే...." అనుకున్నాడు భార్య నుద్దేశించి స్వగతంగా త్రిలోకం.
పాదాల మంట ఇంకా తగ్గడం లేదు. కళ్ళు ముసుకుందామన్నా, పొరపాటున బోల్డు తీసి లోపలికి వచ్చి మళ్ళీ పాద పూజ అంటూ ఇకేం ప్రయోగం చేస్తుందేమోనని భయం.
ఆ రాత్రంతా ఆ భయంతోనే జాగారం చేశాడు.
అతని అదృష్టం బావుండి, అతని పాదాల మీద కొబ్బరికాయ కొట్టాలన్న ఆలోచన మరిచిపోయింది భువన!
* * *
పెరట్లో జామ చెట్టు కింద మంచం వేసుకున్నాడు శ్రీచంద్ర.
దిండు సరిచేసుకుని, పడుకోబోతుండగా వచ్చాడు తండ్రి. అతని చేతిలో నైలాను తాడు వుంది.
"ఏంటి నాన్నా...." అని అడగలేదు గానీ, "ఏంటి" అన్నట్టు చూసాడు.
"కొంపదీసి జామచెట్టుకి ఉరి గానీ వేసుకుంటాడా" అని స్వగతంగా అనుకున్నాడు. అతని అదృష్టం సైడయి, ఆ మాటలు గరుడాచలానికి వినిపించాయి.
ఆ ముక్క గరుడాచలం చెవిన పడనే పడింది.
"ఏంట్రా అక్కుపక్షి.....నేను జమాచెట్టుకి ఉరేసుకోవాలా? నువ్వు మాత్రం బలాదూర్ రోజంతా రోడ్లమీద తిరిగోస్తావా? చీ....చీ....నీ యమ్మకు బుద్ది లేదు, నీకు సిగ్గులేదు...." అన్నాడు కోపంగా కళ్ళెర్ర చేస్తూ.