Previous Page Next Page 
నరుడా ఏమి నీ కోరిక పేజి 14

 

    అమాంతం సత్తిపండు కాళ్ళు పైకెత్తి నీళ్ళలోకి నెట్టబోయాడు. సత్తిపండు గట్టిగా "రక్షించండి....రక్షించండి...." అని కేకలు చేసాడు.


    భయపడి వదిలేశాడు శ్రీచంద్ర.


    టాంక్ బండ్ పై అటుగా వెళ్ళేవాళ్ళు వచ్చారు. "ఏమైంది బాబూ...." అని అడిగారు సత్తిపండు వైపు చూసి.


    "ఏం కాలేదు బాబూ....." అన్నాడు సత్తిపండు వాళ్ళ వైపు చూస్తూ. వాళ్ళు కామ్ గా వెళ్ళిపోయారు.


    "ఒరే పండు...ఎందుకురా....ఇలా చంపుతావ్...." ఆనందు వళ్ళు మండి శ్రీచంద్ర.


    "ఓ ఫైవుంటే కొట్టించు గురూ....హాయిగా కామత్ లో కర్డ్ రైస్ తిని ఇంటికేల్తా...." అన్నాడు సత్తిపండు. శ్రీచంద్ర ఏదో అనబోయెంతలో సమీర హ్యాండ్ బ్యాగ్ లో నుంచి పది రూపాయల నోటు తీసి సత్తిపండుకు ఇచ్చింది.


    సత్తిపండు శ్రీచంద్ర వైపు చూసి....


    "నేర్చుకో గురూ....వదినా.....నూరేళ్ళు నువ్వు హేపిగా వుండాలి....యిదే నా దీవెన.....ఛ...ఛ...నా కోరిక.... నువ్వు వున్నావు ఎందుకు. ఎప్పుడైనా ఫైవిచ్చావా?...వదినా అబ్బబ్బ.....ఎంతమంది కనిపిస్తున్నారు......సైడ్ యాంగిల్ లో 'రోజా' మధుబాల, నడుమైతే మాధురీదిక్షితే....నువ్వేంటి వదినా.....రోజాలా....నిన్ను చేసుకునే అదృష్టవంతుడు ఎక్కడున్నాడో....." అంటూ ఆకాశంలోకి చూసాడు.


    "సత్తిపండు....ఓవరేక్షన్ వద్దు....మీ వదినకి కాబోయే మొగుడ్ని ఇక్కడే వున్నాను...నువ్వు ఇక తగలడు...." కోపంగా అన్నాడు శ్రీచంద్ర.


    సత్తిపండు శ్రీచంద్ర వైపు ఓ లుక్కేసి ....."నువ్వా గురూ.....కనీసం ఓ ఫైవయినా ఇవ్వలేదు....అబ్బే....నీ ఫేస్ లో ఆ రియాక్షన్స్...." అప్పటికే శ్రీచంద్ర కిందనే వున్న రాయి అందుకున్నాడు.


    "హమ్మో....గురువు యాక్షన్ లో నుంచి రియాక్షన్ లోకి దిగాడు....." అంటూనే పరుగందుకున్నాడు ఇద్దరికీ గుడ్ నైట్ చెప్పి.


    
                                                   * * *


    "ఇంతకీ నీకు ఉద్యోగం దొరికే ఛాన్స్ వుందా? లేదా?" సత్తిపండు వెళ్ళాక సీరియస్ గా అడిగింది సమీర.


    "దొరుకుతుంది.....ఈ శ్రీచంద్ర తలచుకుంటే దొరక్కపోవడమేమిటి? నా శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తున్నా....." అన్నాడు.


    "ప్రయత్నించి.....ప్రయత్నించి.....నీ నడుం వంగి నా అవయవాలు ఉడిగిపోతాయి. అప్పుడు నువ్వు పాకుతూ, నేను దేకుతూ....ఈ ట్యాంక్ బండ్ దగ్గర కలుసుకోవాలి...." అంది కోపంగా సమీర.


    "కోపమెందుకు సమ్మీ....చూస్తూ వుండు.....ఆరు నెలలల్లోనే ఉద్యోగం సంపాదిస్తాను.....మనది యమజాతకం...." అన్నాడు శ్రీచంద్ర ఇంటికెళ్ళాడనికి సిద్దమవుతూ.


    సరిగ్గా అప్పుడే పైనున్న తధాస్తు దేవతలు అనుకోకుండా , అసంకల్పితంగా అప్రయత్నంగా 'తధాస్తు' అన్నారు.

 

                                                  * * *


    త్రిలోకం....ఊహాజిస్టు.....


    ఆన్న బోర్డు ఆ ఇంటిముందు వేలాడుతోంది. ఆ ఇంటి యజమాని త్రిలోకంది అదో టైప్ క్యారెక్టర్, చాలా విచిత్రమైన పాత్ర అది.


    అతనెప్పుడు ఊహల్లో, బ్రతుకుతూ, వాటిని నిజం చేసుకుంటూ వుండే ప్రయత్నం చేస్తుంటాడు. అతనికి రకరకాల ఆలోచనలు వస్తూంటాయి.


    ఆరోజు ఓ విచిత్రమైన ఆలోచన వచ్చింది. 'తను కాసేపలా జాగింగ్ చేసేస్తే....." అన్న ఆలోచన అది! అంతే......యింకేమి ఆలోచించలేదు. అది రాత్రివేళ అని....ఇప్పుడు తను జాగింగ్ చేస్తే బావోదని కూడా ఆలోచించలేదు.


    యాభైయ్యేళ్ళ వయసు, బట్టతల వున్న త్రిలోకం, జాగింగ్ డ్రెస్ వేసుకొని జాగింగ్ కు బయల్ద్రేరాడు. అలా జాగింగ్ చేసే ఆ కాసేపూ అతను ఉహాల్లో బ్రతికేస్తాడు!


    ఇప్పుడిక అతను యాభయ్యేళ్ళ త్రిలోకం కాదు, పాతికేళ్ళ యువకుడు త్రిలోకం.


    అతనికేలాంటి ఆలోచన వస్తే అలానే జివించేస్తాడు. అతనికేవరైనా ఎదురై....పలకరిస్తే...తను పాతికేళ్ళ త్రిలోకం అంటాడే గానీ, యాభైయ్యేళ్ళ త్రిలోకం అంటే ఒప్పుకోడు.


    ముందు ముందు అతని వన్నెల చిన్నెలు చాలా చదవొచ్చు.


    త్రిలోకం బయటకు వచ్చి జాగింగ్ మొదలెట్టాడు.

 

                                                         * * *


    ఇంటి మూల మలుపు తిరిగిన సమీరకు తండ్రి పరుగెత్తుకుంటూ రావడం చూసింది.


    "అదేంటి నాన్నా....ఇప్పుడు జాగింగ్ చేస్తున్నారు" అడిగింది సమీర తండ్రిని ఆపి.


    "ఎవరమ్మాయ్ నువ్వు....చూడబోతే అందంగా ఉన్నావు. నేనా వయసులో వున్న కుర్రాడిని...." అన్నాడు.


    "నాన్నా ...మీకు రోజురోజుకి పిచ్చి ముదురుతోంది. నేను మీ కూతుర్ని...."


    "ఛ....తప్పండి....పాతికేళ్ల కుర్రాడ్ని పట్టుకుని....నాన్నా' అంటారా.....నాకింకా పెళ్ళి కానిదే...." అన్నాడు సిగ్గులోలకపోస్తూ త్రిలోకం.


    నుదురు మీద కొట్టుకుంది సమీర.


    "ఒక్కసారి మీ నెత్తిమీద వెంట్రుకలు వున్నాయో, లేవో చూసుకోండి" అంది కోపంగా.


    త్రిలోకం తల మీద చేత్తో రాసుకుంటూ....."ఏదో వెంట్రుకలు రాలిపోయినంత మాత్రాన....నేను ముసలి వాడినైపోతానా? అయినా జాగ్రత్త....ఏదో నేను మంచివాడిని కనుక సరిపోయింది....." అంటూ జాగింగ్ చేస్తూ వెళ్లిపోయాడు.


    నుదురు మీద కొట్టుకుంటూ "ఖర్మ.....ఖర్మ....." అనుకుంది సమీర.


    ఇంటికెళ్ళేసరికి....లోపల పూజగదిలో లైటు వెలుగుతూ వుంది.


    తల పట్టుకుంది సమీర....

 

                                                         * * *


    సమీర తల్లి పూజగదిలో దేవుడికి హారతి ఇస్తోంది.


    "అమ్మా.....ఎవరైనా పూజ ఉదయాన చేస్తారు. నువ్వెంటే....రాత్రిపూట....అయినా ఈ ఇంట్లో ఒక్కొక్కరు ఒక్కో టైప్......నన్నేమో ఎప్పుడూ, ఏదో ఉహలో బ్రతకేస్తు, అలా రోడ్ల మీద తిరిగేస్తారు. నువ్వెంటే....."


    "అబ్బ....నన్ను డిస్ట్రబ్ చేయకే....నేను ఈ పతివ్రతావ్రతం చేస్తున్నాను."


    సమీర తల్లి భువనకు భక్తీ ఎక్కువ మోతాదులో వుంటుంది. ఎప్పుడూ ఏదో ప్రయోగం చేస్తూనే ఉంటుంది.


    తానో గొప్ప పతివ్రతగా చరిత్రలో నిలిచిపోవాలనుకునే టైప్.


    ఎప్పుడూ పూజలూ, వ్రతాలు అంటూ రకరకాల ప్రయోగాలు చేస్తూ వుంటుంది. అర్ధరాత్రి పూట మహాపతివ్రత వ్రతం అంటుంది.


    అప్పటికప్పుడు మొగుడ్ని లేపి హారతి తీసుకోమంటుంది.


    "అమ్మా....నిన్ననే ఏం చేస్తున్నావే?" అడిగింది సమీర.

 Previous Page Next Page