"అవునవును...అప్పటికేదో మీ యమ్మకు బుద్ది, మీకు సిగ్గూ వున్నట్లు...." అంటూ సర్రుమంటూ పెరట్లోకి మిస్సయిల్లా దూసుకు వచ్చింది శ్రీచంద్ర తల్లి.
"ఇలాంటి దేభ్యపు మొహాన్ని కని, పైగా నన్నూ, మా అమ్మని అంటావే......అసలు నీయమ్మననాలి....నిన్ను కని, నాకు అంటగట్టినందుకు...." కస్సుమన్నాడు గరుడాచలం.
"అబ్బో! మీ అమ్మేమో కన్నాంబ, మీరో రమణారెడ్డి...." మూతి విరుస్తూ అంది తల్లి.
"అలాగా! మీ అమ్మ శాంతకుమారి....నువ్వో యస్ వరలక్ష్మి....సరేనా?" అన్నాడు తండ్రి.
"మరి నీ నాన్న ఎవరో....ఎస్వీ రంగారావా?"
"మరే....మీ నాన్న రేలంగా?"
"మరి మీ ముత్తాత....నాగభూషణమా?"
"చెవులు మూసుకున్నాడు శ్రీచంద్ర.
"ఒసే ముసలి బామ్మా...." బామ్మని పిలుస్తూ కోపంగా "అసలు నువ్వెందుకు కన్నావే మా నాన్నని. కన్నా, ఈ అమ్మను కోడలిగా ఎందుకు చేసుకున్నవే" నెత్తి నోరు కొట్టుకున్నాడు శ్రీచంద్ర.
"ఇక్కడున్నాన్రా.....మీ అమ్మానాన్నల కురుక్షేత్ర యుద్ధం చూస్తున్నాను.....సినిమా యాక్టర్లందరు అయిపోయే వరకూ చూద్దామని ...." జామచెట్టు చాటున నిలబడిన శ్రీచంద్ర బామ్మ మెల్లగా అంది.
"నాన్నా....అర్ధరాత్రి మద్దెల దరువులా ఏంటిది, సినిమా వాళ్ళందర్నీ మీరే వరసలు కలిపెసుకుంటే , మిగతా వాళ్ళేమైపోవాలి పాపం....అన్నాడు జుట్టుపిక్కుంటూ శ్రీచంద్ర.
"నోర్ముయ్యరా స్టాంపుల్లేని వుత్తరం వెధవ....పెళ్ళి చూపుల్నాడే మీ అమ్మ దేభ్యపు మొహాన్ని చూసి, 'స్టాంపు ల్లేని ఆ బోడి మొహం నా కొద్దు" అని వుంటే నాకి చండాలం తప్పేది" అంటూ కయ్ మన్నాడు గరుడాచలం.
"అమ్మా.....నువ్వయినా వుర్కోవే....." శ్రీచంద్ర పిచ్చెక్కి అన్నాడు తల్లినయినా కన్విస్ చేయాలని!
"ముస్తావా....అసలు పెళ్ళి చూపులకొచ్చినప్పుడే సినిమా పోస్టర్లంటించే మొహంలా వున్న మీ నాన్నని....చీ....నాకి మొహం వద్దు.....అని వుంటే నాకీ బాధ తప్పేది" అంది తనూ రేచ్చిపోతూ తల్లి.
రెండు చేతులతో తల పట్టుకున్నాడు శ్రీచంద్ర. "వీళ్ళిద్దర్ని మార్చడం నా వల్లకాదు: అనుకున్నాడు మనసులో.
బామ్మ శ్రీచంద్ర భుజం తట్టి.....
"హాయిగా సెకండ్ షో 'ఆమె యవ్వన రాత్రులు' సినిమాకు వెళ్ళినా బావుండేది. ఆ హరికధ చెప్పే హరిదాసుని.....టిక్కెట్లు తెచ్చి పెట్టమంటే , తెచ్చి పెట్టి చావలేదు" అని గొణుగుతూ లోపలికి వెళ్లింది.
మరో పది నిమిషాలపాటు తల్లి, తండ్రి సుహ్రుద్భావ వాతావరణంలో ఒకరికొకరు రెచ్చిపోయి తిట్టుకుని అలసిపోయి అరుగుమీద చెరో పక్కన కూర్చున్నాడు.
"హమ్మయ్యా గాలివాన వచ్చిపోయింది" అనుకుని పడుకోబోతుండగా వచ్చాడు తండ్రి.
"నా కడుపున పుట్టిన దిక్కుమాలిన కుంకా.....నీకిదే చెబుతున్నా.....నువ్వు అర్ధరాత్రి లేచి, కలొచ్చింది. నా శ్రద్ధమొచ్చింది...అని అరిస్తే వుర్కునేది లేదు. ఇదిగో ఈ నైలాను తాడుతో కాళ్ళు చేతులు కట్టిపారేస్తా......ఈ ప్లాస్టిక్ బకెట్ లోని నీళ్ళు నీ మీద గుమ్మరించేస్త్రా....." అంటూ ఘోరమైన వార్నింగ్ ఒకటి ఇచ్చి, ప్లాస్టిక్ బకెట్ తో నీళ్ళు తెచ్చి శ్రీచంద్ర కాళ్ళ దగ్గర ఓ స్టూలు పెట్టి ఆ స్టూలు మీద ప్లాస్టిక్ బకెట్ పెట్టి స్టూలుకు అవతల తనో మంచమేసుకుని పడుకున్నాడు.
* * *
రాత్రి ఒంటిగంట అవుతుండగా నిద్ర పట్టేసింది శ్రీచంద్రకు.
సమీర తో తిరిగి బాగా అలసిపోవడం వల్ల నిద్ర పట్టేసింది. నిద్రలో సత్తిపండు, సమీరే కనిపించారు.
సత్తిపండు తనని విస్మరించినట్టు, సమీర "నువ్వు నన్ను పెళ్ళి చేసుకుంటావా? లేదా" అని తనని నిలదీసి.
"నువ్వు చేసుకోకపోతే ఎవడ్నో చేసుకుంటానన్నట్టు" ఇలా కలలు కంటిన్యూగా వస్తూనే వున్నాయి.
కలలోనే అనిజీగా అనిపించింది.
"ఛ....ఛ.....నా బ్రతుకేంటి? ఇలా తగలబడింది అనుకున్నాడు.
కలలో సేన్ మారిపోయింది. ఎవరో తనని ఇంటర్యూ చేస్తున్నారు. తను వాళ్ళకి సమాధానం చెబుతున్నాడు. వాళ్లు పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేస్తున్నారు. తనకు ఒళ్ళు మండింది. వెంటనే ఆ ఇంటర్ వ్యూ బోర్డు మెంబర్ కాలర్ పట్టుకుని బయటవరకూ లాక్కెళ్ళడు.
ఆ తర్వాతేమైంది!
ఆ కలలోనే నెక్స్ ట్ సీన్ కనిపించింది.
* * *
"నడువు....నడవరా బయటకు.....ఇంటర్ వ్యూ కు వచ్చే వాళ్ళంటే నీకింత చులకనా....." అంటూ అతని కలర్ పట్టుకున్నాడు.
ఆ క్షణంలో తనో అంకుశంలో రాజశేఖర్ లా, అతనో రామిరెడ్డి లా అనిపించాడు.
"ఏయ్ మ్యాన్....వాటిజ్ దిస్....నా కలర్ .....వదిలేయ్.....ఇస్త్రీ నలిగిపోతుంది" అన్నాడు తన కాలర్ పట్టుకున్న శ్రీచంద్రని సీరియస్ గా చూస్తూ ఆ బోర్డు మెంబర్!
"చంపేస్తాన్రోయ్....నీ డిప్పకాయ్ పుచ్చకాయలా పగిలిపోద్ది....ఏంట్రా.....పర్వతాలు ఎన్ని వున్నాయో చెప్పాలా? పదహారో ఎక్కం అప్పచేప్పాలా? నీ ఫేసెంట్రా.....ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? నీ నెత్తిమీద ఒక్క వెంట్రుకైనా వుందా? అదేంట్రా? భూమి గుండ్రంగా ఎందుకుంది....అని నువ్వడిగితే నేను చెప్పాలా? భూమి ఎలా వుంటే నికేంట్రా? అసలు నిన్ను మా 'అబ్బ' దగ్గరకు తీసుకెళ్ళాలి. ప్రపంచంలోని తిట్లన్నీ జాతీయ భాషలో తిట్టి వినిపిస్తాడు." నాన్ స్టాఫ్ గా తిట్టి తిట్టి అలిసిపోయాడు శ్రీచంద్ర.
"ఇలా అయితే నువ్వు ఉద్యోగానికి పనికిరావంతే....." బుంగమూతి పెట్టి అన్నాడు ఇంటర్వ్యూ బోర్డు మెంబర్.
ఇంటర్ వ్యూ బోర్డు మెంబర్ నెత్తి మీద వున్న అతి తక్కువ వెంట్రుకల్లోంచి ఓ వెంట్రుక పీకాడు శ్రీచంద్ర.
"హబ్బా....." అని అరిచాడు అతడు.
ఆ వెంట్రుకను అతని కళ్ళ ముందూ అటు ఇటూ తిప్పాడు "నువ్విచ్చే ఉద్యోగం ఈ బొచ్చుతో సమానంరా. బొచ్చేతో లంచాలు ముష్టేత్తుకునే మొహం నువ్వునూ....." ఇంకా కసిదిరక అన్నాడు శ్రీచంద్ర.
ఇంటర్ వ్యూకు వచ్చిన అభ్యర్దులంతా చప్పట్లు చరిచారు.
శ్రీచంద్ర చాతి రెండు అంగుళాలు పెరిగింది.
ఎవరో ఓ దండ తీసుకొచ్చి శ్రీచంద్ర మెడలో వేశారు.
"నిరుద్యోగ సోదరుల ఆశా జ్యోతి....శ్రీచంద్రకు జై....." అరిచారు అభ్యర్ధులు .