Previous Page Next Page 
జీవనయానం పేజి 15


    మంచి గంధపు చెక్క మా ఊరు - గూడూరు
    చూడవస్తిర మీకు శుభము పలికేము
    మనసీయ వస్తిరా మరచిపోతారు
    మనువాడ వస్తిరా మరలిపోలేరు

 

    ఆనాడు బండ్లు వచ్చి ఇంటిముందు నిలిచాయి. బండ్లను దించారు. ఎడ్లను విప్పారు.

 

    ఏదో సానుతాప వాతావరణం కమ్ముకున్నది.

 

    ఒకరొకరుగా జనం కూడుతున్నారు. వింత వాతావరణాన్ని చూస్తున్నారు. వ్రేళ్లు ఊడ పీక్కొని ఊరు వదిలి పోవడం ఇదే తొలి అనుభవం ఊరికి!

 

    మా నాయన అడావుడిగా ఉన్నారు. మనుషులు మంచాలు, పెట్టెలు, మనుండిగలు, పాత్రలు పరపులు ఇంట్లోంచి తెస్తున్నారు. బండ్లలో నింపుతున్నారు.

 

    మా తాతయ్య, వడ్లకుంట సాయెబు సహితంగా చింతచెట్ల కింద కూర్చున్నాడు. వసిష్ఠుని ఆశ్రమం నుంచి విశ్వామిత్రుడు లాక్కుపోతున్న శబళలా ఉన్నారు వారు. మళ్ళీ కలుస్తామో లేదో అన్నట్లు మిత్రులు ఇద్దరూ మనసులు ఒలకపోసుకుంటున్నారు.   

 

    మా అమ్మ పెరట్లో - బావిదగ్గరి నారింజ చెట్టుకింద - శింశుప క్రింది సీతలా కూర్చుని ఉంది. నేను కాస్సేపు ఆమె వడిలో, కాసేపు అటూ ఇటూ తిరుగుతున్నాను. మా అన్నయ్య గ్లాసులు, చెంబులు అందిస్తున్నాడు.

 

    వీదిసాంతం జనంతో నిండిపోయింది.

 

    బండ్లకు ఎడ్లను కట్టారు. మా నాయనమ్మ బండి ఎక్కింది.

 

    మా అమ్మను బండి ఎక్కించారు. నన్నూ మా అన్నయ్యనూ ఎక్కించారు.

 

    మా తాతయ్య - సాయెబు చేయి పట్టుకొని సాగాడు. ఇంటిముందరి అరుగుల మీద కూలబడ్డాడు. దర్వాజ చూచాడు. తాళం కనిపించింది. దుఃఖం పొంగివచ్చింది. పెద్దగా ఏడ్చాడు!

 

    కూడిన జనం సాంతం కంటతడి పెట్టుకుంది. కళ్లు తుడుచుకుంది.

 

    ఊరిమీద దుఃఖపుమేఘాలు కమ్ముకున్నాయి.

 

    బాష్పవర్షం కురువనున్నది. కురువలేదు.

 

    సాయెబు మా తాతయ్యను ఓదార్చాడు. తన కండువాతో మా తాతయ్య కళ్లు తుడిచాడు. ఇద్దరూ బండ్లవెంట సాగారు.

 

    బండ్లు మలుపుకు చేరుకున్నాయి.

 

    మా అమ్మమ్మ - తాతయ్య కన్నీటి పచ్చికుండలు తలమీద పెట్టుకుని నుంచున్నారు.

 

    మా అమ్మ వారిని చూచింది. ఓర్చుకోలేకపోయింది. భోరుమని ఏడ్చింది.   

 

    దూరంగా మా అమ్మమ్మ తాతయ్యల తలలమీది పచ్చికుండలు పగిలాయి!

 

    తల్లిదగ్గరకు పోనున్న బిడ్డను లాక్కుపోతున్నట్లు బండ్లు కదిలాయి.

 

    తాతయ్యకు అమ్మ, అమ్మకు తాతయ్యా దూరం అయినారు. మసకమారారు, మాయం అయినారు.

 

    దారికి ఇరుపక్కలా ఆడా, మగా, పిల్లలూ బారులు తీరి నిలిచారు.

 

    గడీ ముందు రంగారెడ్డి గారు కనిపించారు. తాతయ్య దుఃఖం మళ్లీ పొంగింది. మళ్ల చూస్తనో లేనో అని భళ్లు మన్నారు. దొరవారు ఓదార్చారు. కొంతదూరం అడుగులు వేశారు నిలిచిపోయారు.

 

    ఊరు దాటింది. జనం పల్చబడ్డారు. బండ్ల వెనుక తాతయ్య - సాయెబు వస్తున్నారు.

 

    ఆకేరు అడ్డం వచ్చింది. మౌనంగా పారుతున్నది.

 

    "ఓద కాస్తం స్నిగ్ధోజనో అనుగన్తవ్య" - ఆత్మీయులను నీటివరకే సాగనంపాలి.

 

    మర్రిచెట్టు కింద తాతయ్య - సాయెబు కౌగిలించుకొని ఏడ్చిన దృశ్యం ఈనాటికీ మనసును కలతపెట్తుంది.

 

    వారి ఆర్తనాదానికి ఏరు నిశ్చిలమై నిలిచింది.

 

    చెట్లు - పుట్టలు, జంతువులు - పక్షులు, కొండలు - కోనలు కో అంటే కో అన్నాయి. గుండెలు చెమర్చాయి. కన్నులు కొలకులు అయినాయి.

 

    కాలం కరకుది. అది దేనికోసమూ ఆగదు.

 

    ఏటి వడ్డున సాయెబు.

 

    తాతయ్య సాగిపోతున్నాడు.

 

    ఈ ఒడ్డున తాతయ్య.

 

    ఆ ఒడ్డున సాయెబు.

 

    ఇద్దరు కర్రలు ఊపి శలవుతీసుకున్నారు.

 

    ఇద్దరూ వెనుదిరిగి సాగిపోయారు.

 

    స్నేహానికి కులాలు, మతాలు, దేశాలు, ప్రాంతాలు అడ్డుకావు. స్నేహం మానసికం అయింది. మనసుకు కులమతాలు లేవు.

 

    సాయేబు గౌండ్లు - మా తాతయ్య బ్రహ్మణుడు! ఒక్క భోజనం దగ్గర తప్ప వారిలో భేదం కనిపించలేదు.

 

    ప్రణయానికి అవసరం ఉంది. స్వార్థం ఉంది.
    స్నేహానికి అవసరం లేదు. స్వార్థం లేదు.
    మంచి స్నేహితుడే - మనిషికి మహాసంపద!

 

    మిత్రుడు లభించడం కన్న మహాభాగ్యం జీవితంలో మరొకటి లేదు.

 

    బండ్లు సాగిపోతున్నాయి. ఎల్లంపేట దగ్గర వరంగల్లు - ఖమ్మం రోడ్డు ఎక్కాయి.

 

    అది కంకర రోడ్డు. ఆ రోడ్డు మీద ఆరోజుల్లో రోజుకు ఒకటి రెండు చిన్న సైజు బస్సులు నడిచేవి. లారీ అనే పేరు ఆనాటికి తెలియదు. ప్రైవేటు వాహనాలు అరుదు. బస్సు ఎంతో దూరంలో ఉండగా రొద వచ్చేది. ఆ రొదకు రక్కసిని చూచినట్లు - ఎడ్లు బెదిరేవి! బండ్లవాళ్లు దిగి - వాటిముందు నుంచునేవారు. బస్సు దాటిపోయి, దాని రొద దూరం అయ్యేవరకు అదే విధంగా నుంచునే వాళ్లు! అంత జాగ్రత్త పడినా ఒక్కొక్కసారి ఎడ్లు బెదిరి - బండిని లాక్కొని పోయి బోల్తాపడేసేవి!

 

    దుఃఖం సుఖం ఏదీ శాశ్వతం కాదు.
    కాలం అన్ని గాయాలను మాన్పగల మందు!
    గూడూరుతోపాటే దుఃఖం దూరం అయింది.
    మధ్యన వంటలు - భోజనాలూ అయినాయి.
    మా బండ్లు ఖమ్మంమెట్టు చేరుకున్నాయి.

 

                                            నాలుగు

 

    వెలుగు వాకిలి:

 

    అంగీరస 1932లో మేము ఖమ్మం చేరాం. అప్పటికి నాకు నాలుగేండ్లు.

 

    బండ్లు ఖమ్మంమెట్టు వంతెన వద్దకు చేరుకున్నాయి. బండిముందున్నారు మా నాయన. నేను లోన ఉన్నాను. నాయన నన్ను బయటికి తెచ్చారు. రెండు చేతులతో ఎత్తారు. నాకు కారును చూపారు. అది ఎర్రగా ఉంది. దాని కప్పు కాన్వాసుది. చూస్తుండగానే అది మమ్ములను దూసుకొనిపోయింది. దుమ్ములేపిపోయింది. జీవితంలో కారు చూడడం అదే తొలిసారి.

 

    అయితే ఆ కారు నామీద అంత ప్రభావం వేసినట్లు కనిపించడం. మున్నేరు - దాని మీద వంతెన నన్ను ఎంత ప్రభావితుణ్ణి చేశాయో! నేను గూడూరులో ఆకేరు చూచాను. దాని ప్రవాహం చూచాను. కానివంతెన - వారధి చూడలేదు. అది నాకు ఎంతో నచ్చింది. దిగువ పారుతున్న నది. దాని మీద వంతెన. వంతెన మీద సాగుతున్న బండి. ఏదో వింత! ఆశ్చర్యం! అబ్బురం! నాయన వడిలో కూర్చుని బండి వంతెనమీద నుంచి ఏరు దాటడాన్ని ఎంతో ఆసక్తిగా చూచాను.

 

    ఆశ్చర్యం నా మనోఫలకం మీద చెరగని ముద్ర వేసింది. ఈ నాటికీ - అరవై ఐదు ఏళ్ల తరువాత - ఆ దృశ్యం తడి తడిగా నిత్య నూతనంగా కనిపిస్తూనే ఉంది. కనిపిస్తూనే ఉంటుంది.

 

    జీవితంలో మిగిలేవి గుర్తులే - అవి తీపివి అయినా చేదువి అయినా! ఆ గుర్తుల సంపదను మించింది ఎవరూ అర్జించలేరు!!

 

    మా నాయన విద్వాంసులు. అఖండ పాండిత్యం గలవారు. మంచి వక్త. వేదాంతంలో ఎంత కఠిన విషయాన్నయినా ఎంతో తేలిగ్గా బోధించగలరు. వారు ఎంతటి వారినైనా తనను వాక్పటిమతో వశం చేసుకోగలరు. అది మా కుల వృత్తి. అయినా మా నాయన దగ్గర ఉన్న శక్తి అపారం!

 

    వారు అప్పటికే మా కోసం ఒక ఇల్లు సిద్ధం చేసి ఉంచారు. అది గుంటమల్లన్న బజారులో, చాకలి బజారుకు వెళ్లే సందు పక్కది. అది విశాలమయిన ఇల్లు. ఆ రోజులే విశాలములు. ఇరుకులు కావు. ఆరు పెద్ద గదులు. ముందరి వసారాకు  ఇనుపసీకులు - వెనుక చాకలి బజారు వరకు దొడ్డి. ఇంటిముందు మురికి పోయేందుకు రాతితో కట్టిన కాలువ. విశాలమయిన రోడ్డు!                 

 Previous Page Next Page